చర్లపల్లి జైలులో ఆరోగ్యకర పంటలు…

తప్పుచేసి జైలు కెళ్లి వచ్చిన ఖైదీలను చూస్తే ఎవరైనా చిన్నచూపు చూడటం సహజం. అయితే చర్లపల్లి ఖైదీలకు మాత్రం ప్రశంసల జల్లు కురుస్తోంది. వారు ఉత్పత్తి చేసే నాణ్యమైన ఆహార పదార్థాలు, కూరగాయలు, పాలు, పెట్రోల్ ఇతర చేతి వస్తువులే అందుకు కారణం. ఖైదీలు విక్రయించే వస్తువులను వినియోగదారులు ఎగబడి కొనడం గమనార్హం. కుటుంబాలకు, అయినవారికి దూరమై బాధను దిగమింగుకుని సేంద్రియ ఎరువులతో సాగు చేస్తూ మరో వైపు కమర్షియల్ వ్యాపారాలైన పెట్రోల్ బంకు నిర్వహణ, అధిక […]

తప్పుచేసి జైలు కెళ్లి వచ్చిన ఖైదీలను చూస్తే ఎవరైనా చిన్నచూపు చూడటం సహజం. అయితే చర్లపల్లి ఖైదీలకు మాత్రం ప్రశంసల జల్లు కురుస్తోంది. వారు ఉత్పత్తి చేసే నాణ్యమైన ఆహార పదార్థాలు, కూరగాయలు, పాలు, పెట్రోల్ ఇతర చేతి వస్తువులే అందుకు కారణం. ఖైదీలు విక్రయించే వస్తువులను వినియోగదారులు ఎగబడి కొనడం గమనార్హం. కుటుంబాలకు, అయినవారికి దూరమై బాధను దిగమింగుకుని సేంద్రియ ఎరువులతో సాగు చేస్తూ మరో వైపు కమర్షియల్ వ్యాపారాలైన పెట్రోల్ బంకు నిర్వహణ, అధిక పాల దిగుబడి సాధిస్తున్న చర్లపల్లి వ్యవసాయక్షేత్రంలోని ఖైదీలపై ప్రత్యేక కథనం…

ధర తక్కువ..నాణ్యత ఎక్కువ
జైలు ముందు క్యూ కడుతున్న వినియోగదారులు
ఖైదీల పనితీరుపై ప్రజల ప్రశంసలు

మనం నిత్యం ఆహారంలో పూర్తిగా రసాయనాలతో కూడిన హైబ్రిడ్ ఉత్పత్తులనే తీసుకుంటున్నాం. సేంద్రియ ఎరువులతో పండించే సహజమైన పంట ఉత్పత్తులు నగరంలో మనకు లభించడం లేదు….కానీ ఇందుకు పూర్తి భిన్నంగా చర్లపల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రజల ఆరోగ్యాన్ని సుభిక్షంగా ఉంచేందుకు ప్రకృతి నడుమ సేంద్రియ ఎరువులతో ఖైదీలు సహజమైన పంటలను పండిస్తున్నారు. ఖైదీలు అనగానే హత్యలు, నేరాలు చేసి క్రూరంగా ఉంటారు అనే భావనను పటాపంచలు చేస్తూ నేరాలు చేసిన చేతులతోనే పంటలు పండిస్తూ వ్యవసాయదారులుగా పలువురి మన్ననలతో పాటు ఉత్తమ వ్యవసాయ క్షేత్రంగా చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలుకు ఎన్నో అవార్డులు సాధించి పెట్టారు. సేంద్రియ ఎరువులతో సాగు చేస్తూ మరో వైపు కమర్షియల్ వ్యాపారాలైన పెట్రోల్ బంకు నిర్వహణ, అధిక పాల దిగుబడి సాధిస్తున్నారు ఇక్కడ ఖైదీలు.

జైలు పంటలకు విశేష ఆదరణ…..
సుమారు 130 ఎకరాల విస్తీర్ణంలోని చర్లపల్లి వ్యవసాయక్షేత్రంలో సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతోటలు, వరి, మొక్కజొన్నతో పాటు పలు తృణ ధాన్యాలు పండిస్తూ గ్రామీణ వ్యవసాయదారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జైల్లోనే ఖైదీలు తయారు చేసిన సేంద్రియ, వర్మి కంపోస్టు ఎరువులతో పంటలు పండిస్తుండటంతో ఇక్కడి పంటలకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో జైలు అధికారులు జైలు ఆవరణలోనే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కూరగాయలు, పాలు విక్రయిస్తున్నారు. ఉదయం ఐదు గంటలకే పాల కోసం జనం బారులు తీరుతున్నారంటే జైలు ఉత్పత్తులకు ఎలాంటి ఆదరణ ఉందో ఇట్టే అర్ధం అవుతోంది. పైగా మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే లభిస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అదే విధంగా నగరంలోని చంచల్‌గూడ, చర్లపల్లి కేంద్ర కారాగారాలకు కూరగాయలతో పాటు పాలు, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం చేస్తు ప్రతి ఆదివారం మటన్, చికెన్ సరఫరా చేస్తున్నారు. పలు ఎగ్జిబిషన్‌లలో స్టాల్స్‌లను ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా చర్లపల్లి జైలుకు పేరు తీసుకువచ్చిన ఘనత ఖైదీలకు దక్కింది. ఈ జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులో నాణ్యతతో పాటు ఉత్తమ ప్రమాణాలు పాటిస్తుండటంతో ఈ ప్రాంతంలోనే అత్యధికంగా పెట్రోల్, డిజీల్ విక్రయిస్తున్న పంపుగా పేరు తెచ్చుకుంది.

రసాయనాలు వాడని కోళ్లు…
ఇక్కడ జైలులో కోళ్లఫారాలు కూడా ఉన్నాయి. ఇక్కడి బాయిలర్ కోళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కోళ్ల పెంపకంలో వీరు ఎలాంటి రసాయన పదార్థాలు లేకుండా కోళ్లను పెంచడం ఇందుకు కారణం. ప్రతి 15 రోజులకు 550 కిలోల చికెన్‌ను సరఫరా చేస్తున్నారు. సంవత్సరంలో సుమారు 12 వేల కిలోల చికెన్ ఉత్పత్తి చేస్తున్నారు. జైళ్ళకు సరఫరా చేయగా మిగిలిన చికెన్‌ను చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు ఆవరణలో ప్రత్యేక కౌంటర్ ద్వారా ప్రజలకు విక్రయిస్తున్నారు.

నాణ్యమైన పచ్చడి మామిడికాయలు…
వేసవి రాగానే తెలుగు ఇండ్ల నుంచి పచ్చళ్ల ఘుమఘుమలు వస్తుంటాయి. అవకాయ, మమిడికాయ పచ్చడి అనగానే ప్రతి ఒక్కరికి నోట్లో నీరు ఊరుతుంటాయి. ఈ పచ్చళ్లకు నాణ్యమైన మామిడికాయలు కావాలి. నగర మార్కెట్‌లలో నాణ్యమైన మామిడికాయలు లభించక పచ్చళ్లు పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే పాడైపోతుంటాయి. నాణ్యమైన మామిడికాయలతో పాటు స్వయంగా మనము ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇస్తూ నగర ప్రజలకు చర్లపల్లి వ్యవసాయక్షేత్రం పచ్చడి మామిడికాయలను అందుబాటులోకి తెచ్చింది. చర్లపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఖైదీలు సేంద్రీయ ఎరువులతో సాగు చేస్తు ఎన్నో నాణ్యమైన పంటలను పండిస్తుంటారు. అందులో భాగంగా సుమరు 10 ఎకరాలలో మామిడికాయలను పండిస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే పచ్చడి మామిడికాయల కోసం చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం చేరుకుని నేరుగా మామిడి చెట్ల వద్దకు వెళ్లి తమకు నచ్చిన చెట్లను, మామిడికాయలను ఎంపిక చేసుకోవచ్చు. పైగా మనకు కావల్సిన సైజులలో ఖైదీలే కట్‌చేసి ఇస్తారు. ఇక్కడ లభించే మామిడికాయలు మర్కెట్ ధర కంటే తక్కువ ధరతో పాటు మేలు రకమైన మామిడికాయలు లభిస్తున్నాయి మరెందుకు ఆలస్యం పదండి చర్లపల్లి వ్యవసాయక్షేత్రానికి.

జైల్లోనే పచ్చళ్లు తయారు చేస్తాం …
వచ్చే సంవత్సరం జైళ్ల శాఖ ఉన్నతాధికారుల సహకారంతో జైల్లో లభించే మేలురకమైన మామిడి కాయలతో మార్కెట్‌లో పచ్చళ్ల తయారీదారులతో కలసి పచ్చళ్లు తయారుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వ్యవసాయ క్షేత్రం ఖైదీలు అందరు చాల చక్కగా పని చేస్తున్నారు. ఖైదీలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి జైల్లో మరింత ఎక్కువ పంటల దిగుబాడులు సాధిస్తున్నారు.

పూర్తి స్వేచ్ఛతో పని చేస్తుంటాం: ఖైదీ ప్రసాద్
ఊరికే కుర్చోకుండా తమకు తెలిసిన పనిలో కొత్త మెళకువలతో పని చేస్తూ అధిక ఉత్పత్తులు సాధించేందుకు ప్రయత్నిస్తాం. సేంద్రీయ ఎరువులతో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా ప్రజల నుంచి మంచి ఆదరణ పొందటం సంతోషంగా ఉందని ఖైదీ ప్రసాద్ అంటున్నాడు. జైలు అధికారుల సహకారంతో పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో పని చేస్తున్నాం. వ్యవసాయ సాగు వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మా శిక్షకాలాన్ని పూర్తి చేసుకుంటున్నాం.

సమాజంలో మంచి పౌరులుగా ఎదిగేందుకు మద్దతిస్తాం: ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్ రాజేష్
చర్లపల్లి ఓపెన్ జైల్లో ఖైదీలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ పనిలో మెళకువలు నేర్పించి వివిధ రంగాల్లో శిక్షణ కల్పిస్తున్నాం. విడుదల అనంతరం వారు జైల్లో నేర్చుకున్న పనిలో స్థిర పడేందుకు సమాజంలో మంచి పౌరులుగా ఎదిగేందుకు జైళ్లశాఖ ఉన్నతాధికారుల సహకారంతో విడుదలైన ఖైదీలకు ప్రభుత్వం నుంచి రుణాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. ఖైదీలు సాగు చేస్తున్న ఉత్పత్తులతో జైలుకు మంచి గుర్తింపుతో పాటు ఎన్నో అవార్డులు వస్తున్నాయి. జైల్లో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపుతో మంచి ఆదాయం వస్తుంది. జైల్లో ప్రత్యేకంగా మసాజ్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఉన్నతాధికారుల సహకారంతో పూర్తి స్ధాయిలో సాగుచేసేందుకు ఇటీవల మిషన్ కాకతీయలో భాగంగా ఓపెన్ జైల్లో చెరువును అభివృద్ధి చేశామని వ్యవసాయ క్షేత్రం సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు. ప్రస్తుతం ఓపెన్ ఎయిర్ జైలులో 82 మంది ఖైదీలు ఉన్నారు.

-బి.వాసుదేవరాజు క్రైమ్ రిపోర్టర్

Comments

comments