సమసమాజ స్థాపనే మా ధ్యేయం

వాళ్లిద్దరూ కుల మతాలు దాటి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా పుట్టారు. ఇక్కడిదాక అంతా బాగానే ఉంది. కాని పిల్లల పాఠశాల ప్రవేశ విషయంలో అసలు కథ మొదలైంది. అప్లికేషన్ ఫారంలో కులం మతం కాలమ్ నింపకుండా వెనక్కి తిరిగి ఇచ్చారు. కాని స్కూల్ వాళ్లు అవి కూడా నింపాలన్నప్పుడు, మాకు ఏ కులమతాల్లేవు అని చెప్పారు. అయితే ఏదైనా ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే తీసుకురమ్మన్నారు స్కూల్ యాజమాన్యం. దాంతో మాకు ఏ కులంమతం వద్దంటూ […]

వాళ్లిద్దరూ కుల మతాలు దాటి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా పుట్టారు. ఇక్కడిదాక అంతా బాగానే ఉంది. కాని పిల్లల పాఠశాల ప్రవేశ విషయంలో అసలు కథ మొదలైంది. అప్లికేషన్ ఫారంలో కులం మతం కాలమ్ నింపకుండా వెనక్కి తిరిగి ఇచ్చారు. కాని స్కూల్ వాళ్లు అవి కూడా నింపాలన్నప్పుడు, మాకు ఏ కులమతాల్లేవు అని చెప్పారు. అయితే ఏదైనా ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే తీసుకురమ్మన్నారు స్కూల్ యాజమాన్యం. దాంతో మాకు ఏ కులంమతం వద్దంటూ న్యాయస్థానాన్ని సంప్రదించిన ఆ కుంటుంబం మేము ఏ కులమతానికి చెందనివాళ్లం అని టిక్ పెట్టేందుకు మాకు ఒక ఆప్షన్ కావాలంటున్నారు. ఆ ఆదర్శ దంపతులే డి వి.రామకృష్ణారావు, క్లారెన్స్ కృపాళినిలతో సకుటుంబం ముచ్చట్లు…

మీరేం కోరుతున్నారు? ఇంకా మీలాంటి సమస్య ఉన్నవారున్నారా?
మన ప్రజాస్వామ్య దేశంలో అనేక అస్తిత్వాలను గుర్తించి గౌరవిస్తున్నాం. మాలాంటి వారి అస్తిత్వానికీ గుర్తింపు ఇవ్వాలని, ‘మత రహితం కుల రహితం’ అని ప్రకటించుకునే వారికి ఆ హక్కు ఉండాలని కోరుతున్నాం. మాతో పాటు చాలా మంది ఉన్నారు. మేము మొదలుపెట్టిన మా ఛేంజ్ డాట్ ఆర్గ్ పిటిషన్‌లో ఇప్పటికే 5881 సంతకాలు చేశారు. ‘మత రహితం కులరహితం’ అని ప్రకటించుకునే హక్కు కోరుకునే వారికి ఉండాలి కదా!

మీ నేపథ్యాలు…
మా ఇద్దరివి వేరు వేరు నేపథ్యాలు.
రామకృష్ణారావు: మా నాన్న రైల్వే ఉద్యోగి కావడం వల్ల మేము నలభై ఏళ్లు ఒరిస్సా రాష్ట్రంలో సుందర్‌గడ్ జిల్లా, రౌర్కేలా బండముండలో ఉండేవాళ్లం. నా బాల్యం అంతా వేరు వేరు భాషలు, మత విశ్వాస నేపథ్యాలున్న మిశ్రమ సంస్కృతి మధ్య గడిచింది. చదువుకోసం 1990లో హైదరాబాద్ వచ్చి బిఎస్‌సి చదివాను.
క్లారెన్స్ కృపాళిని: మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. మా అమ్మనాన్న ఇద్దరూ ఉద్యోగస్తులే. నేను ఎంఎస్‌సి అగ్రికల్చర్ చదువుకున్నాను. ఉద్యోగం కోసం 1998లో హైదరాబాద్ వచ్చాను.

మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది?
నా సహచరి క్రిష్టియన్ మత విశ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ మేము వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో నా సహ పిటిషనర్ గా మద్దతు ఇస్తున్నది. మా అమ్మ హిందూ మత విశ్వాసాలు కలిగి ఉన్నా, నేను అడుగుతున్న అంశం న్యాయమైనదిగా భావించి మా పిటిషన్‌లో సంతకం చేసింది. ఇప్పుడు మా కుటుంబసభ్యులంతా సహకరిస్తున్నారు. సంతోషంగా ఉంది.

మీ సమస్య ఎప్పుడు ప్రారంభమైంది?
మా చిన్న అమ్మాయి సహజను 2010 లో స్కూల్ లో జాయిన్ చేయడానికి వెళ్ళినపుడు అప్లికేషన్‌లో తల్లిదో, తండ్రిదో తప్పనిసరిగా ‘మతం’ రాయాలని అన్నపుడు మా సమస్య మొదలైంది. మా పాపకు మేము ఎటువంటి మత విశ్వాసాలు ఇవ్వడం లేదని, ఆమె పెద్దయ్యాక తనకిష్టమైన ‘మతం’ ఎంచుకుంటుందని చెప్పాం. స్కూల్ వారు అలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉంటే తీసుకరమ్మని అన్నారు. ప్రస్తుతం మనుషులను కుల, మతాలకు వెలుపల గుర్తించే పధ్ధతి మనకు లేదు. విదేశాలలో ‘దేనికి చెందని వారు’ అని గుర్తిస్తున్నారు. మన జనాభా లెక్కల్లో ‘మతం చెప్పని వారు’ అని గుర్తిస్తున్నారు తప్ప ఏ మతం లేనివారని గుర్తించడం లేదు. మన అప్లికేషన్ ఫారాలలో ప్రధానంగా ఆరు మతాలవారిని గుర్తిస్తూ 7వ కేటగిరీలో ‘ఇతరులు’ అని అంటున్నారు. మతం కాలం కింద ఇతరులు అంటే పై ఆరు మతాలు కాని ఇతర మతం అనే అర్థంలోనే కదా…

మీరు అడుగుతున్నది విజయం సాధిస్తారా ?
2010 లో మా చిన్న అమ్మాయి రిట్ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ ‘మతం నమ్మడానికి హక్కు ఉందంటే, నమ్మకుండా ఉండడానికీ హక్కు ఉన్నట్లేన’ ని మాకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఎవరినీ మతం చెప్పమని ఒత్తిడి చెయ్యొద్దని అన్నారు. తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది.

మీకు ప్రేరణ ఎవరు ?
మన దేశంలో కులం పేరిట ఉన్న అంటరానితనం, వివక్ష, హింస, అవమానం, అసమానతలకు వ్యతిరేకంగా మన చరిత్రలో అనేకమంది మహనీయులు పోరాడారు. డా॥బి.ఆర్. అంబేద్కర్, సావిత్రి బాయ్, జ్యోతిబా ఫూలే, పెరియార్, సుబ్రహ్మణ్య భారతి మన తెలుగు నేలపై పోతులూరి వీరబ్రహ్మం, అన్నమయ్య, వేమన, గురజాడ, జాషువా ఇలా అనేకమంది పోరాడారు. ఇలా ఆచరణలో కుల మత పరిధులు దాటి జీవిస్తున్న వారే మాకు ప్రేరణ. తమ ప్రేమలను నిజం చేసుకోవాలని తపించి, ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వారందరూ మాకు స్ఫూర్తి. పరువు హత్యలకు బలైనవారంతా మనం త్వరగా సాధించాల్సిన సామాజిక మార్పును, అభ్యున్నతిని నిరంతరం గుర్తుచేస్తున్నవారే. అలాంటి అనేకానేక ప్రయత్నాల్లో మాదో చిన్న ప్రయత్నం.

మన దేశంలో ప్రజలు కుల, మత భావనల నుంచి బయట పడతారా?
తప్పకుండా బయట పడతారు. ఇప్పటికే చాలా మార్పులు వస్తున్నాయి. పాత ఉత్పత్తి విధానాలు మారుతున్న క్రమంలో కుల ప్రాధాన్యత తగ్గిపోతోంది. వివిధ కుల నేపథ్యాలున్న ప్రజలు రకరకాల విద్య, ఉపాధులలోకి మారడం మనం చూస్తున్నాం. కులవృత్తితోనే బతుకుదెరువు గడుస్తున్న పరిస్థితి లేదు. గురజాడ అప్పారావు 135 ఏళ్ళ క్రితమే ‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును’ అని గొప్ప ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు..

ప్రపంచ వ్యాప్తంగా ఏ మతం ఆచరించని వారు ఎంతమంది ఉన్నారు ?
మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ‘మతం చెప్పని’ వాళ్ళ సంఖ్య 28.7 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ మతమూ ఆచరించని వారి సంఖ్య 120కోట్ల మంది ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ మొత్తం జనాభాలో ఏ మతమూ ఆచరించని వారు 16 శాతంగా 3వ స్థానం లో ఉన్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

మీకు మద్దతుగా ఎవరైనా ఉన్నారా ?
మా పిల్లల కేసును హైకోర్టు న్యాయవాది, మిత్రులు డి.సురేష్ చూస్తున్నారు. ఇంకా అనేకమంది మేధావులు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ, ప్రగతిశీల ప్రజా సంఘాల వారు, హేతువాద, నాస్తిక సంఘాల వారు మాతో ఉన్నారు. కుల నిర్మూలన సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, మానవ వికాస వేదిక, మానవ హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం వంటి అనేక సంస్థలు మాకు బాసటగా నిలిచాయి. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డి.టి.ఎఫ్ ) సంస్థ వారు మా కేసులో ఇంప్లీడ్ అయ్యారు. పౌరహక్కుల సంఘం వారి రాష్ట్ర మహాసభలలో మా సమస్యకు మద్దతుగా తీర్మానం చేశారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాక, వివిధ దేశాలలో ఉన్న మన వాళ్ళు, విదేశీయులు కూడా మా ఆకాంక్షను బలపరుస్తూ మా ‘నో రెలిజియన్ నో కాస్ట్ చేంజ్ డాట్ ఆర్గ్ పిటిషన్’ లో సంతకాలు చేశారు. మీతో సహా అనేక దినపత్రికలు, మాస పత్రికలు, న్యూస్ చానెల్స్, ఆన్‌లైన్ మాగజైన్స్ మా సమస్యకు విస్తృత ప్రచారం కల్పించాయి.

విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తున్నారా ?
మేము కోరుతున్నది రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. వేల సంవత్సరాల కుల అణిచివేతకు, అవమానాలకు ఒకానొక పరిష్కారంగా మన దేశంలో రిజర్వేషన్‌లు వచ్చాయి.. అవి చాలా న్యాయమైన విషయంగా భావిస్తాం, సమర్థిస్తాం. నా సహచరి విషయంలో మత విశ్వాసాలు మార్చుకున్నపుడు ప్రభుత్వం తన సామాజిక స్థితిని మార్చింది .. అలాగే ఇప్పుడు మేము మా పిల్లల విషయంలో ఏమీ ఆచరించనపుడు మాకు ఆ అవకాశం ఉండాలి కదా..

ఈ విషయంలో ప్రభుత్వ స్పందన ఎలా ఉంది?
2017 లో మా పెద్ద అమ్మాయి స్పందన 10వ తరగతి సందర్భంలోనూ ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మత ప్రస్తావనకు సంబంధించిన సమస్య ఎదురైనపుడు గత మార్చిలో మేము ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాం .. అప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభు త్వానికి 15 రోజులలో స్పందించమని నోటీసులు పంపారు. ఇప్పటికి 18నెలలు పూర్తయింది. ప్రభుత్వాలు మా సమస్య మీద స్పందిస్తాయని ఎదురుచూస్తున్నాం.

భవిష్యత్‌లో మీ పిల్లలు ఏదైనా మతవిశ్వాసం అనుసరిం చాలనుకుంటే? మీ తదుపరి కార్యక్రమం ఏంటి?
వారు మేజర్‌లు అయ్యాక వారికి నచ్చిన విశ్వాసాలను ఎంపిక చేసుకోవచ్చు అది వారి ఇష్టం. మాలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న తల్లిదండ్రులతో మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో పిటిషన్‌లు వేయించడం. ఈ విషయంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ పీపుల్స్ లాయర్స్ సంస్థ సహకరిస్తామని తెలిపింది. మా ఆన్‌లైన్ పిటిషన్‌లో సంతకాల సేకరణ కొనసాగిస్తాం.

                                                                                                                                                    – బొర్ర శ్రీనివాస్