పేద విద్యార్థుల భవితను మింగే డిటెన్షన్ కొండచిలువ

ఒకే తరగతిలో, ఒకే వయసుగల పిల్లలకు ఒకే అధ్యాపకురాలు ఒకే విధంగా పాఠాలు చెబుతున్నప్పుడు ఎందువలన అందరు పిల్లలు ఒకే తీరుగా దానిని అర్థం చేసుకోలేకపోతారు? ఎందుకు కొందరు మంచి మార్కులు సంపాదించి ఇంకొందరు తక్కువ మార్కులు సాధిస్తున్నారు? ఎందుకు అందరికీ సమానమైన విషయ అవగాహన ఉండడం లేదు? ఒక విద్యార్థి చదువులో మంచి ఫలితాలు సాధించాలంటే అందుకు విద్యార్థి కృషి మాత్రమే సరిపోదు. ఎన్నో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు విద్యార్థుల ప్రగతిపై ప్రభావం చూపుతాయి […]

ఒకే తరగతిలో, ఒకే వయసుగల పిల్లలకు ఒకే అధ్యాపకురాలు ఒకే విధంగా పాఠాలు చెబుతున్నప్పుడు ఎందువలన అందరు పిల్లలు ఒకే తీరుగా దానిని అర్థం చేసుకోలేకపోతారు? ఎందుకు కొందరు మంచి మార్కులు సంపాదించి ఇంకొందరు తక్కువ మార్కులు సాధిస్తున్నారు? ఎందుకు అందరికీ సమానమైన విషయ అవగాహన ఉండడం లేదు? ఒక విద్యార్థి చదువులో మంచి ఫలితాలు సాధించాలంటే అందుకు విద్యార్థి కృషి మాత్రమే సరిపోదు. ఎన్నో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు విద్యార్థుల ప్రగతిపై ప్రభావం చూపుతాయి అనేది నిరూపించబడిన సత్యం. విద్యా బోధనా విధానం, పాఠశాలలో వాతావరణం, కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆ విద్యార్థి నివసిస్తున్న సమూహం స్థితిగతులు వంటి ఎన్నో అంశాలు విద్యార్థి చదువుపై, ఫలితాలపై ప్రభావం చూపుతాయి అనేది కాదనలేని వాస్తవం. విషయ పరిజ్ఞానం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అబ్బుతుంది. కొంతమంది చెప్పడం ద్వారా నేర్చుకోగలుగుతారు, కొంతమంది చూసి నేర్చుకుంటారు, మరి కొంత మంది స్వయంగా పని చేయడం ద్వారా అనుభవపూర్వకంగా నేర్చుకోగలుగుతారు. కానీ మన బోధనా విధానాలలో మాత్రం ఇలా రకరకాలుగా నేర్చుకునే అవకాశం ఉందా? తరగతి గది అంటే ఒక నల్లబల్లపై టీచర్ పాఠం చెప్పడం విద్యార్థి నోరెత్తకుండా వినడం అనే మూస పద్ధతి తప్ప బోధనలో వినూత్న విధానాలను, విద్యార్థికి ఆసక్తి రేకెత్తించేలా కృత్యాధార బోధనా పద్ధతులు అమలు చేయడం ఎక్కడైనా చూస్తున్నామా?

దినేష్ ఒక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి. నువ్వు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నావు అని నేను అడిగితే తనకు పోలీస్ కావాలని ఉంది అని చెప్పాడు. మా నాన్న అనారోగ్యంతో ఏ పని చేయలేక మంచాన పడ్డాడు. మా అమ్మ కూరగాయలు అమ్మి ఇల్లు నెట్టుకొస్తోంది. నేను చదువు పూర్తికాగానే ఉద్యోగం సంపాదించి అమ్మకి సహాయ పడాలి అని చెప్పుకొచ్చాడు.

ఇటీవల విద్యాహక్కు చట్టం 2009 లో చేసిన మార్పులను లోక్ సభలో ఆమోదించడం జరిగింది అని తెలియగానే నాకు దినేష్ గుర్తుకు వచ్చాడు. ఈ చట్ట సవరణ ప్రకారం ఎవరైనా పిల్లవాడు వార్షిక పరీక్షలలో నిర్దేశిత మార్కుల కన్నా తక్కువ మార్కులు పొందినట్లైతే ఆ పిల్లవాడిని తరువాత తరగతికి పంపకుండా అదే తరగతి లో డిటైన్ చేసేలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కలుగుతుంది.

దినేష్‌కి అర్ధ వార్షిక పరీక్షలో మ్యాథ్స్ లో 100 కి 12 మార్కులు, సైన్స్ లో 23 మార్కులు వచ్చాయి. ఇంత తక్కువ మార్కులతో పదవ తరగతి ఎలా పాస్ అవుతావు, ఏమిటి నీ సమస్య, పోనీ నీకు స్కూల్ లో చెప్పినది అర్ధం కాకున్నట్లైతే ట్యూషన్ క్లాసులకు వెళతావా అని అడిగితే ఆ అబ్బాయి ఇలా చెప్పుకొచ్చాడు.

వాళ్ళ అమ్మ కూరగాయలు అమ్మడానికి పొద్దున్న మార్కెట్ కి వెళితే రాత్రి పొద్దు పోయాకే ఇంటికి వస్తుంది. సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్ళగానే దినేష్ తన బట్టలు, తన తమ్ముడి బట్టలు ఉతికి, అన్నం వండి వాళ్ళ నాన్నకి, తమ్ముడికి పెట్టి తాను కూడా తినేసరికి బాగా పొద్దు పోతుంది. వాడికి ఇక చదువుకునేందుకు సమయం కానీ, ఓపిక కానీ ఉండవు. అసలు వారి కుటుంబానికి ఉన్న ఆర్ధిక సమస్యల దృష్ట్యా ఆ పిల్లవాడు స్కూల్ కి వెళ్లి చదువుకోవడమే ఎక్కువ అన్నట్లు ఉంది వాళ్ళ పరిస్థితి. ఇక చదువుపై అదనపు శ్రద్ధ పెట్టేందుకు అవకాశమేది? చదువు రాని తల్లి తండ్రులకు వాడు రోజు స్కూల్ కి వెళ్తున్నాడా లేదా అనేది మాత్రం అర్ధం అవుతుంది కానీ స్కూల్ లో చెబుతున్న పాఠాలను, విషయాలను ఎంత వరకు గ్రహించగలుగుతున్నాడు, పరీక్షలలో ఎలా తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడనేది అర్ధంకాని విషయం.

నేను అసలు దినేష్ కి గణితంపై ఎంత వరకు అవగాహన ఉంది అనేది పరీక్షించేందుకు కొన్ని చిన్న చిన్న లెక్కలు ఇచ్చి చేయమంటే మూడంకెల గుణకారాలు, భాగహారాలు కూడా సరిగా చేయలేక పోయాడు ఆ అబ్బాయి. ఐదవ తరగతి పిల్లలు చేయగలిగే గుణకారాలు, భాగహారాలు చేయలేని పిల్లవాడికి బీజగణితం, త్రికోణమితి లు అర్ధం అవుతాయా అంటే ప్రశ్నార్థకమే? మరి ఎలా ఆ పిల్లవాడు పరీక్షలో విజయం సాధించేది? అసలు ఐదవ తరగతి స్థాయి సమస్యలే సాధించలేని పిల్లవాడు పదవ తరగతి దాకా ఎలా వచ్చేసాడు?

ప్రభుత్వం 2009 లో ప్రవేశ పెట్టిన విద్యాహక్కు చట్టం 14 సంవత్సరాల లోపు బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను కల్పించవల్సిందిగా సూచించడంతో పాటు వార్షిక పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా అదే తరగతిలో ఎవరినీ డిటైన్ చేయడానికి వీలు లేకుండా చేసింది. డిటెన్షన్ విధానం వలన పిల్లలు ఆత్మా న్యూనతా భావంతో, అదే తరగతిలో కొనసాగలేక స్కూల్ నుండి డ్రాప్ అవుట్ అవుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వాలు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ చట్టం లోని 16 వ సెక్షన్ ప్రకారం ఒకసారి పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న పిల్లవాడిని ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఏదేని తరగతిలో డిటైన్ చేయడం కానీ, పాఠశాల నుండి తొలగించడానికి కానీ అవకాశం లేదు.

సంవత్సరం చివరిలో ఒక పరీక్ష నిర్వహించి అందులో సాధించిన మార్కుల ఆధారంగా పిల్లలను డిటైన్ చేసే పద్ధతిని నిషేధించి దాని స్థానంలో పిల్లల పురోగతిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నిరంతర సమగ్ర మూల్యంకన (Continuous Comprehensive Evaluation) విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్దతి వలన పిల్లలను ఏ తరగతిలోనూ డిటైన్ చేయడానికి అవకాశం లేకపోవడంతో దినేష్ లాంటి పిల్లలు ఎందరో తమ తరగతికి, వయసుకు తగిన విషయ అవగాహన లేకుండానే పై తరగతులకు చేరుకుంటున్నారు.

అయితే గత నెలలో ప్రభుత్వం ఈ చట్టంలో చేసిన సవరణల ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐదవ, ఎనిమిదవ తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహించి ఆ పరీక్షలలో తగిన ప్రతిభ చూపలేనివారిని అవే తరగతులలో డిటైన్ చేసే విధంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కలిపించింది. ఆయా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు రెండు నెలల సమయం ఇచ్చి తిరిగి వారికి పరీక్ష నిర్వహించేందుకు కూడా అవకాశం కల్పించింది.

ఒక విధంగా చూస్తే దినేష్ లాంటి విద్యార్థులు వయసుకు, తరగతి కి తగిన విషయ పరిజ్ఞానం లేకుండా ఇలా పై తరగతులకు వచ్చి అక్కడ ఉత్తీర్ణత సాధించలేక ఇబ్బంది పడే బదులు వారిని కింద తరగతులలోనే డిటైన్ చేసి వారు కొన్ని తరగతులు మళ్ళీ చదివేలా చేసినట్లయితే కొంతవరకు వారు పై తరగతులలో ప్రతిభ చూపించే అవకాశం ఉంది అనిపిస్తుంది. ప్రతి తరగతి చివర పరీక్షలు నిర్వహించి సమగ్రమైన మూల్యాంకనం జరిపినట్లయితే పిల్లల లెర్నింగ్ లెవెల్స్ పై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టడానికి వీలవుతుంది అనేది కొంతమంది నిపుణుల వాదన.

విద్యా హక్కు చట్టం, సర్వ శిక్షా అభియాన్ వంటి కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరగడం, డ్రాప్ అవుట్ శాతం తగ్గడం వంటి సత్ఫలితాలు సాధించినప్పటికీ విద్యా ప్రమాణాలు మెరుగుపడలేదని, డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన పిల్లలు ఆశించిన ప్రమాణాలు సాధిస్తారని ఈ సవరణను సమర్ధించే వారు అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు కూడా తాము అదే తరగతిలో తిరిగి కొనసాగాల్సి వస్తుంది అనే భయం ఉన్నట్లయితే శ్రద్ధగా చదువుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా వీరి వాదన.

అయితే ఇందుకు ముందుగా మనం లెర్నింగ్ (నేర్చుకోవడం లేదా విషయం పరిజ్ఞానం సంపాదించడం) అనేది ఏ విధంగా జరుగుతుందో, అందుకు దోహద పడే అంశాలు ఏమిటో అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఒకే తరగతిలో, ఒకే వయసుగల పిల్లలకు ఒకే అధ్యాపకురాలు ఒకే విధంగా పాఠాలు చెబుతున్నప్పుడు ఎందువలన అందరు పిల్లలు ఒకే తీరుగా దానిని అర్ధం చేసుకో లేకపోతారు? ఎందుకు కొందరు మంచి మార్కులు సంపాదించి ఇంకొందరు తక్కువ మార్కులు సాధిస్తున్నారు? ఎందుకు అందరికీ సమానమైన విషయ అవగాహన ఉండడం లేదు?

ఒక విద్యార్థి చదువులో మంచి ఫలితాలు సాధించాలంటే అందుకు విద్యార్థి కృషి మాత్రమే సరిపోదు. ఎన్నో సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలు విద్యార్థుల ప్రగతిపై ప్రభావం చూపుతాయి అనేది నిరూపించబడిన సత్యం. విద్యా బోధనా విధానం, పాఠశాలలో వాతావరణం, కుటుంబ నేపధ్యం, తల్లి తండ్రుల ప్రోత్సాహం, ఆ విద్యార్థి నివసిస్తున్న సమూహం స్థితిగతులు వంటి ఎన్నో అంశాలు విద్యార్థి చదువుపై, ఫలితాలపై ప్రభావం చూపుతాయి అనేది కాదనలేని వాస్తవం.

విషయ పరిజ్ఞానం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అబ్బుతుంది. కొంతమంది చెప్పడం ద్వారా నేర్చుకోగలుగుతారు, కొంతమంది చూసి నేర్చుకుంటారు, మరి కొంత మంది స్వయంగా పని చేయడం ద్వారా అనుభవపూర్వకంగా నేర్చుకోగలుగుతారు. కానీ మన బోధనా విధానాలలో మాత్రం ఇలా రకరకాలుగా నేర్చుకునే అవకాశం ఉందా? తరగతి గది అంటే ఒక నల్లబల్ల పై టీచర్ పాఠం చెప్పడం విద్యార్థి నోరెత్తకుండా వినడం అనే మూస పద్దతి తప్ప బోధనలో వినూత్న విధానాలను, విద్యార్థికి ఆసక్తి రేకెత్తించేలా కృత్యాధార బోధనా పద్ధతులు అమలు చేయడం ఎక్కడైనా చూస్తున్నామా?

ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే (కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా) బోధనకు తగిన మౌలిక సదుపాయాలు, పిల్లలు నేర్చుకునేందుకు తగిన వాతావరణం ఆయా పాఠశాలల్లో ఉన్నాయా అంటే సమాధానం దొరకదు. తగినంత మంది టీచర్లు లేక, మౌలిక సదుపాయాలు లేక సమస్యలతో సతమతమవుతున్న పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం ఎలా జరుగుతుంది? ఈ ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యేది ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు మాత్రమే. ఏ మాత్రం స్థోమత కలిగిన తల్లి తండ్రులైనా ఈ నాడు తమ పిల్లలను ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ కి పంపాలని ఆలోచిస్తున్నారే తప్ప ప్రభుత్వ పాఠశాల గురించి ఆలోచన కూడా చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యా బోధన నాణ్యత గురించి, అక్కడ మౌలిక సదుపాయాల గురించి ఉన్న వ్యతిరేక అభిప్రాయమే ఇందుకు కారణం.

ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యే పేద, నిస్సహాయ కుటుంబాల పిల్లలు ప్రతి నిత్యం ఎదురుకునే సామాజిక, ఆర్ధిక ఇబ్బందులు కూడా వారు చదువులో వెనకబడేలా చేస్తున్నాయి. నేను ఒక పాఠశాలలో ఐదవ తరగతి పిల్లలతో మాట్లాడుతూ మధ్యలో ఏదో ఒక సందర్భంలో మీరు ఉదయం ఏమి తిని పాఠశాలకు వచ్చారు అని అడగడం జరిగింది. అందులో సగానికి పైగా పిల్లలు తాము ఏమీ తినలేదు, స్కూల్ లో మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడే తాము భోజనం చేస్తాం అని చెప్పారు. ఉదయం ఏమి తినకుండా ఖాళీ కడుపుతో ఆకలితో ఉన్న బిడ్డలకు పాఠాలు ఎంత మాత్రం అర్ధం అవుతాయి? అసలే అంతంత మాత్రం బోధన. ఒకవేళ మంచి ఉపాధ్యాయులు ఉండి మంచి పద్ధతులలో బోధన చేసినా ఆకలి, అనారోగ్యం, కుటుంబ ఆర్ధిక ఇబ్బందులు, తల్లి తండ్రుల తగాదాలు వంటి ఎన్నో సమస్యలతో సహవాసం చేసే పేద విద్యార్థులు ఆ బోధించిన విషయాలపై ఏ మాత్రం దృష్టి పెట్టగలుగుతారు?

ఇటువంటి విద్యార్థులు చదువులో రాణించలేక వార్షిక పరీక్షలలో ఫెయిల్ అయ్యారనే కారణంతో వారిని అదే తరగతిలో మరొక సంవత్సరం కొనసాగించడం సరిఅయిన నిర్ణయమేనా? అలా కొనసాగించి అదే విధమైన బోధనా పద్ధతులు, అదే విధమైన కుటుంబ, సామాజిక, ఆర్ధిక నేపధ్యాల మధ్య పిల్లవాడిని మళ్ళీ మరొక సంవత్సరం పాటు అదే తరగతి చదివించినట్లైతే ఆ విద్యార్థి మరింత మెరుగైన ఫలితాలు సాధించగలిగే అవకాశం ఉందా? ఈ డిటెన్షన్ విధానం వల్ల బాగా నష్టపోయేది ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కాదా?

దీనికి తోడు ఈ డిటెన్షన్ వలన విద్యార్థులు న్యూనతా భావానికి గురికాబడతారు. దీనితో పాఠశాల పట్ల ఆసక్తి లోపించి, సరిగా హాజరు కాకపోవడం, చివరకు పాఠశాలకు దూరం (dropout) కావడం జరుగుతుంది. ఇలా పాఠశాలకు దూరం అయిన విద్యార్థులు అసలే ఆర్ధికంగా వెనుకబడి ఉన్న తమ కుటుంబాలకు ఆసరాగా చిన్న, చితక పనులు చేస్తూ తన మూర్తిమత్వం నిర్మించుకోలేక బలమైన సంఘ విద్రోహ శక్తుల చేతిలో దోపిడీకి గురికాబడతారు. ఇది డిటెన్షన్ వలన జరిగే అతి పెద్ద ప్రమాదం.
మరి పరీక్షలు, మూల్యాంకనం లేకుండా పిల్లలను ఇలా పై తరగతులకు పంపిస్తుంటే వారు ఎలా చదువులో రాణించగలుగుతారు? దీనికి ఒకటే పరిష్కారం కనిపిస్తుంది. పరీక్షలు, మూల్యాంకనం జరగాల్సిందే. విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో అర్ధం చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయి. ఎవరైతే విద్యలో వెనుకబడి ఉన్నారో ఆ పిల్లలను డిటైన్ చేయకుండా పై తరగతులకు పంపించి ప్రత్యేక శిక్షణను ఇప్పించి వారు తమ తరగతికి తగిన సామర్ధ్యాలు సాధించేలా చేయవచ్చు.

అంతేకానీ ఏ పరిస్థితుల మధ్య, ఎటువంటి వాతావరణంలో, ఎటువంటి బోధన ద్వారా విద్యార్థులు వికాసం చెందుతున్నారు అనేదానిని సమగ్రంగా మూల్యాంకనం చేయకుండా చదువులో రాణించలేకపోవడానికి విద్యార్థిని మాత్రమే బాధ్యుడిని చేస్తూ పిల్లవాడిని అదే తరగతిలో కొనసాగించడమే తగిన పరిష్కారం అని నిర్ణయించడం ఎంత మాత్రం సమంజసం కాదు. అదే బోధన, అదే వాతావరణం, అదే సామాజిక, ఆర్ధిక నేపథ్యం లో పిల్లవాడిని అదే తరగతిలో ఉంచడం వలన భిన్నమైన, మెరుగైన ఫలితం సాధించడం ఎలా సాధ్యం అవుతుంది?
ఇటువంటి నిర్ణయాల వలన నష్టపోయేది దినేష్ వంటి నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే.

                                                                                                                                                             భారతి కోడె

Related Stories: