రాక్షసులు నిర్మించిన నాగుల గుడి

ప్రాచీన ఆలయాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కాకతీయులు నిర్మించిన ఆలయాలు, కృష్ణదేవరాయలు ఏర్పాటుచేసిన ఆలయాల శిల్పకళల గురించి చూశాం. కానీ రాక్షసులు నిర్మించిన శివాలయాన్ని ఎక్కడైనా చూసి ఉంటారా… మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామ శివారులో రాక్షసులు నాగుల గుడిని నిర్మించినట్లుగా పూర్వీకులు చెబుతారు. ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఒకే రాత్రిలో రాక్షసులు ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం పెద్ద పెద్ద బండరాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి […]

ప్రాచీన ఆలయాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కాకతీయులు నిర్మించిన ఆలయాలు, కృష్ణదేవరాయలు ఏర్పాటుచేసిన ఆలయాల శిల్పకళల గురించి చూశాం. కానీ రాక్షసులు నిర్మించిన శివాలయాన్ని ఎక్కడైనా చూసి ఉంటారా… మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామ శివారులో రాక్షసులు నాగుల గుడిని నిర్మించినట్లుగా పూర్వీకులు చెబుతారు. ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది.

ఒకే రాత్రిలో రాక్షసులు ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం పెద్ద పెద్ద బండరాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఏడాదిలో ఒకరోజు మాత్రమే పూజలు నిర్వహించే ఈ నాగుల గుడి రాతి బండల అల్లికలతో నిర్మితమై ఉంది. గుడి నిర్మాణ స్థాయి మొదలు కొని గర్భగుడిలోని దేవుని లింగం వరకు అన్నీ భిన్నంగా ఉన్నాయి. అత్యంత పురాతనమైన ఆలయం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. గ్రామస్థులు ఈ గుడిని నాగుల గుడిగా పిలుచుకుంటారు. ఈ గుడిలో ప్రతీదీ విశేషమే. లోపల నిర్మించిన నిర్మాణానికి వినియోగించిన బండరాళ్లు, లోపల శివలింగం లేకుండా పానపట్టంతో ఉన్న శివలింగం దర్శనమిస్తుండటం మరో ప్రత్యేకత. ఆలయం ముందుగా ఆంజనేయస్వామి శిలా రూపంలో కొలువై ఉండడం కనిపిస్తుంది. ఈ ఆలయం చెక్కుచెదరకుండా చరిత్రకు సజీవ సాక్షంగా నిలుస్తోంది. దాదాపు 16వ శతాబ్దంలో ఈ ఆలయంలో కేవలం శ్రావణ శుద్ద పంచమి రోజున వచ్చే నాగపంచమి, కార్తీక శుద్ద చవితి రోజున వచ్చే నాగుల చవితి రోజు మాత్రమే శివునికి, నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ రెండు రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివలింగం కనిపించే చోట ఖాళీగానే కనిపిస్తుంది. ఆలయంలో గర్భగుడిని చక్కగా నిర్మించారు. ఈ గుడి రేచిని శివారులోని పంట పొలాల్లో నెలకొల్పారు. నిర్మాణానికి ఉపయోగించిన బండరాళ్లను చూస్తే మోయడానికి వీలు లేనంతా పెద్దగా ఉండడం వల్ల రాక్షసులు నిర్మించిన గుడిగా పేరొందింది. ఈ ఆలయం ఇప్పటి వరకు చెక్కు చెదర కుండా ఉండగా, సరైన ఆదరణ లేక చెత్తచెదారం నిండి నిర్మానుష్యంగా మారింది. పురావస్తుశాఖ వారు వచ్చి పరిశీలించినట్లయితే ఆలయంలోని మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆలయాన్ని పట్టించుకుని చర్యలు చేపడితే పురావస్తు శిల్ప కళతో నిర్మించిన ఈ ఆలయం అభివృద్ధి చెంది బాహ్యప్రపంచానికి తెలిసే అవకాశాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు.