గడ్క మాడిశెక్కలు గంజిబువ్వ, నూకలన్నం

ఇప్పుడంటే తిందామంటే అన్నం ఎవలకైనా దొరుకుతంది గాని ఎన్కటి కాలం తెల్లని అన్నం మెతుకులు దొరకని కాలం. అన్నం తినుడు అంటే ఏదైనా పండుగవస్తేనో లేదా పెండ్లిల్లకు పోతెనో తినేవాల్లు. ఊర్లల్ల లేనోల్లు కూలి కైకిలి చేసికునేటోల్లకు ఆహారం అంత గడ్కమాడిశెక్కలు లేదంటే వంచిన గంజిల వచ్చిన బువ్వ మెతుకులు తిని మహాభాగ్యం అనుకునే రోజులు. ఈ కాలంల పంటలు బాగా పండి మిగులు ధాన్యం ఉత్పత్తి అయి ప్రభుత్వాలు బియ్యం సరఫరా చేయడం వల్ల ఇంటింటికీ […]

ఇప్పుడంటే తిందామంటే అన్నం ఎవలకైనా దొరుకుతంది గాని ఎన్కటి కాలం తెల్లని అన్నం మెతుకులు దొరకని కాలం. అన్నం తినుడు అంటే ఏదైనా పండుగవస్తేనో లేదా పెండ్లిల్లకు పోతెనో తినేవాల్లు. ఊర్లల్ల లేనోల్లు కూలి కైకిలి చేసికునేటోల్లకు ఆహారం అంత గడ్కమాడిశెక్కలు లేదంటే వంచిన గంజిల వచ్చిన బువ్వ మెతుకులు తిని మహాభాగ్యం అనుకునే రోజులు. ఈ కాలంల పంటలు బాగా పండి మిగులు ధాన్యం ఉత్పత్తి అయి ప్రభుత్వాలు బియ్యం సరఫరా చేయడం వల్ల ఇంటింటికీ అన్నం అయితే తింటుండ్రు గాని యాభై ఏండ్ల కింద పరిస్థితి ఇట్ల లేదు.

మక్కజొన్నలు అగ్గువకు దొరికేది. జొన్నలు తెచ్చి ఇసుర్రవుతుల ఇసిరి పిండిచేసి ఆ పిండిని ఉడుకబెడితే మక్క గడ్క అయితది. ఆ గడ్కల తొక్కేసుకొని తినుడు లేదంటే ఏదన్నా వంకాయ కూర తమాటల కూరో ఏసుకొని తినేటోల్లు, పాడి బాగ ఉన్నోల్లు సల్లపోసుకుంటరు లేదా నీళ్లు పోసికొని జుర్రుకుంట తిందురు. అట్లనే మక్కగడ్కల నీళ్లు పోసికోని ఓ పచ్చి మిరపకాయ యెండాకాలమైతే ఉల్లిగడ్డ కొరుక్కుంట తింటరు. ఈ గడ్కను దూపకుబుడ్డిల పోసుకొని ఎడ్లకాడికి గొర్లకాడికి ఎవుసాలకాడికి పోయేటోల్లు పట్టుక పోతుంటిరి. అక్కడ పగటిపూట తిందురు.

కుండలు ఉడుక బెట్టిన గడ్క ఇంటి మొగోల్లకు సరిపోతె ఇండ్ల ఉన్నవాల్లకు అడుగున ఉన్న మాడును కశ్కెతోని గీక్కొని తినేది. దీన్నే గడ్కమాడి శెక్కలు అంటరు. ఇదే మాడిశెక్కలను ఇంటి ముందటికి వచ్చే బిచ్చగాండ్లకు సుత చేస్తుంటిరి. ఇప్పుడైతే అసలు అన్నమే తీసికపోతలేరు. రానురాను కొందరు అన్నం వండుకుంటే అండ్ల గంజి వార్చేది. ఆ వార్చిన గంజిల సుత కొన్ని మెతుకులు వస్తే వాటిని గంజి కలిపి ఇంత ఉప్పురాయి ఏసుకొని కడుపు నిండ తిన్నకాలం ఆనాటిది. బియ్యం దొరకని కాలం. అట్లనే గిర్నికాడికి పోయి వడ్లు పట్టిచ్చుకు రాంగా బియ్యంల కెల్లి నూకలు ఎల్లేది. ఆ నూకలతోని అన్నం వండుకుంటరు. ఆ అన్నం అంత మెరిగెలు మెరిగెలు సన్నగ ఇరిగెనట్టు ఉండేది.

నూకలబువ్వ అందురు. ఇంకా అంతకు ముందు వడిపిల్లు వండుకోని తిందురు. వరి చేన్లనే వడిపిలి అని ఉంటది. అది గడ్డి చెట్టే. ఆ గడ్డి చెట్లల్ల గెల్లి గసాల లెక్క వడిపిల గింజలు ఎల్లుతాయి. వాటిని కూడా ఏరుకచ్చుకొని దంచి చిన్నగ నూకల బువ్వ లెక్కచేసి తిన్నకాలంకూడా ఉన్నది. ఆకలికి ఏవన్న తిని కాలం ఎల్లదీసిన కాలం. ఈ కాలంల తినుడు తక్కువ వృధా చేసుడు ఎక్కువ అయ్యింది. పని తక్కువ సుఖం ఎక్కువ పైస ప్రవాహం ఉన్నోనికే ఉంటంది. లేనోనికి లేదు. పూర్వకాలంల కష్టపడి కలోగంజో తాగి సాది సంసారాలను సవరించుకున్న కాలం నుంచి మానవ నాగరికతా వికాసం బహువిధాలుగా రెట్టింపు అయ్యింది. అయితే ఇదంతా మైదాన ప్రాంతాల్లోని పోరాటాలు ప్రభుత్వాల విధానాల ద్వారా శాస్త్రజ్ఞులు పంటలు పండించడంలో మెలకువల ద్వారా సాధ్యం అయ్యింది. ఇంకా ఆదివాసి గ్రామాల్లో ఈ తీరు రాలేదు. ఇప్పుడు తినే అన్నంకు పూర్వరంగం ఒక పురా జ్ఞాపకం.

అన్నవరం దేవేందర్ 94407 63479