బంగ్లాదేశ్‌లో మతోన్మాదం

బంగ్లాదేశ్‌లో హేతువాదుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. పాకిస్థాన్, ఇరాన్‌లాంటి మత భూమికపై సాగుతున్న దేశాలకన్నా బంగ్లాదేశ్‌లో మతోన్మాద తీవ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయని అక్కడి పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత అయిదేళ్లుగా సుమారు 50 మంది సామాజిక మేధావుల ప్రాణాలు గాలిలో కలిసాయంటే మత దురహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అభ్యుదయ ఆలోచనాపరులు దేశం విడిచిపోయే పరిస్థితి కూడా వచ్చింది. దాడిలో ప్రాణాలతో బయటపడ్డవారు తూర్పు ఆసియా దేశాలకు వలస వెళుతున్నారు. జూన్ 11 నాడు రచయిత […]

బంగ్లాదేశ్‌లో హేతువాదుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. పాకిస్థాన్, ఇరాన్‌లాంటి మత భూమికపై సాగుతున్న దేశాలకన్నా బంగ్లాదేశ్‌లో మతోన్మాద తీవ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయని అక్కడి పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.
గత అయిదేళ్లుగా సుమారు 50 మంది సామాజిక మేధావుల ప్రాణాలు గాలిలో కలిసాయంటే మత దురహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అభ్యుదయ ఆలోచనాపరులు దేశం విడిచిపోయే పరిస్థితి కూడా వచ్చింది. దాడిలో ప్రాణాలతో బయటపడ్డవారు తూర్పు ఆసియా దేశాలకు వలస వెళుతున్నారు.
జూన్ 11 నాడు రచయిత హేతువాది అయిన షాజహాన్ బచ్చును గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై కాల్చివేసి పారిపోయారు. మున్షిగంజ్ జిల్లాలోని కకాల్ది అనే ఊర్లో మందుల దుకాణం వద్ద నిలబడిన బచ్చును రోడ్డుపైకి ఈడ్చుకొని సమీపం నుండి తుపాకితో కాల్చివేశారు.
స్వయాన కవి అయిన షాజహాన్ బచ్చు బిశాఖ ప్రకాషన్ అనే ప్రచురణ సంస్థను స్థాపించి వందకుపైగా ప్రగతి శీల భావాల కవితా సంపుటాలను వెలువరించాడు. బంగ్లాలో ప్రముఖ కవులైన నిర్మలేందు గుణ్, మహాదేవ్ సాహు లాంటి వారి రచనలను ఈ సంస్థ ప్రచురించింది. బచ్చు కవితా సంకలనం ‘రాంగ్ డాంగ్ తమాషా’ కూడా వీటిలో ఒకటి.
షాజహాన్ హేతువాద దృక్పథంతో నడిచే అమదేర్ విక్రంపూర్ అనే పత్రికకు నిర్వాహక సంపాదకుడుగా పని చేస్తున్నారు. బంగ్లా రచయితలకు బ్లాగుల ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా తమ ఆలోచనలను ప్రజల ముందుంచడం అలవాటుగా మారింది. దానివల్ల మతపర తీవ్రవాద సంస్థలు బ్లాగులపై కన్నేసి తమకు విరుద్ధమైన భావజాలాన్ని ప్రచారం చేస్తున్నవారిని వరుసగా హతమారుస్తున్నారు. బచ్చు కూడా తనకున్న విజ్ఞాన, శాస్త్రీయ అవగాహనను తర్కాన్ని బ్లాగుల్లో పెట్టేవాడు. మత స్వేచ్ఛాప్రియుడైన షాజహాన్ ఎలాంటి విమర్శలనైనా నిర్మొహమాటంగా, నిర్భయంగా వెల్లడించేవాడు. దాంతో ఆయనకు తీవ్రవాదుల నుండి బెదిరింపులు మొదలయ్యాయి.
ఆయన, ఆయన కూతురు ఆంచల్ జహాన్ పేర్లు 2013లోనే హిట్ లిస్టులో చేరిపోయాయి. దాంతో వాళ్లు ఊర్లు మారుస్తూ తమ సొంత గ్రామమైన కకాల్దిలో గడుపుతున్నారు. అయినా బెదిరింపులు వెంటాడుతూనే ఉన్నాయి.
తీవ్రవాదుల బెదింపుల వల్ల స్థల మార్పుల కారణంగా ఢాకాలోని ప్రచురణ సంస్థను నిలిపివేయక తప్పలేదు. అయితే దేశ వ్యాప్తంగా లౌకికవాద అధ్యయన కేంద్రాలను నెలకొల్పాలనే సంకల్పంతో ఆయన ఆ పనిలో ఉన్నారు. త్వరలోనే తుతులియాలో ‘శుద్ధ చర్చ’ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసి ఉంది. దాని కోసం అవసరమైన స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడు. చాటుమాటుగా తిరుగుతున్నందువల్ల వాటి స్థాపన ఆలస్యమవుతుందనే ఆవేదన ఆయనలో ఉండేదని ఆయన కూతురు ఆంచల్ చెప్పినట్లు పత్రికల్లో వచ్చింది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో బంగ్లా దేశీయులు హేతువాద శిఖరాన్ని కోల్పోయారు.
60 ఏళ్ల వయసులో అసువులు బాసిన షాజహాన్ బచ్చు, దీర్ఘకాలం బంగ్లా కమ్యూనిస్టు పార్టీలో కొనసాగారు. మున్షిగంజ్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. అయితే హేతువాద దృష్టితో, శాస్త్ర పరిజ్ఞానంతో ప్రజల్లో ఉన్న మతపర మూఢ విశ్వాసాలను రూపుమాపాలన్న ఆలోచనతో పూర్తి కాలం హేతువాద కార్యకర్తగా మారారు. హేతువాద రచనలను ప్రాచుర్యంలోకి తేవాలని ఢాకాలో బైశాఖ ప్రకాశన్ పేరిట కవిత్వాన్ని ప్రజల్లోకి తీసికెళ్లారు.
గత రెండేళ్లుగా బచ్చు తన బ్లాగు ద్వారా మతపరమైన విశ్వాసాలపై తీవ్రమైన దాడి, చర్చ కొనసాగించారు. తనకన్నా ముందు బ్లాగుల ద్వారా మతతత్వ శక్తులను వ్యతిరేకించిన వారు ప్రాణ త్యాగాలు చేయక తప్పలేదని తెలిసినా తన దారి మార్చుకోలేదు. ప్రాంతాలు మారుస్తున్నా తన భావజాల వ్యాప్తిని కొనసాగించాడు. ఆయన ఆశయానికి తోడుగా కూతురు ఆంచల్ నిలిచి తండ్రి వెన్నంటి ఉన్నారు. గత రెండేళ్లుగా ఆమె తమ గ్రామంలోనే తండ్రితోపాటు ఉంటూ ఆయన ఆలనపాలన చూసుకుంటోంది. దానికి ప్రతిఫలంగా ఆమె పేరు కూడా తీవ్రవాదుల చిట్టాలో చేరిపోయింది. తమ బ్లాగుల ద్వారా మతవాద శక్తులను వ్యతిరేకించిన వివిధ సామాజిక వేత్తలు, మేధావులు తీవ్రవాదుల చేతిలో హతమయ్యారు. నీలాద్రి నిలాయ్, అనంత్ బిజయ్ దాస్, వసీకర్ బాబు ఇలా హతులయిన వారే. న్యూస్ వెబ్‌సైట్ ‘ముక్తోమోనా’ వ్యవస్థాపకుడు అవిజిత్ రాయ్ ఫిబ్రవరి 2015లో హత్యకాబడ్డాడు. ఆయన స్మృత్యర్థం ఆ బ్లాగు ఆయన అనుచరుల ద్వారా కొనసాగుతుండడం గమనార్హం. 2015లోనే జగ్‌జిత్ ప్రకాశన్ స్థాపకుడు, రచయిత అయిన ఫైజల్ అరెఫిన్ దీపన్ తన ప్రచురణ సంస్థ ద్వారా మత వ్యతిరేక సాహిత్యం వెలువరిస్తున్న కారణంగా హతుడయ్యాడు. 31 అక్టోబర్ రోజున తన ఆఫీసులోనే దాడికి గురయ్యాడు. అప్పటికే ఫిబ్రవరిలో చంపబడిన అవిజిత్ రాయ్ కవిత్వాన్ని దీపన్ పుస్తక రూపంలో తేవడమే ఆయనకు ప్రాణాంతకమైంది. అదే సంవత్సరం సామాజికవేత్త అహ్మద్జ్రిబ్ హైదర్ తన తార్కిక ఉపన్యాసాల కారణంగా మతవాదుల చేతిలో బలి అయ్యారు.
రాజ్‌షాహి యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎఎఫ్‌ఎమ్ రజ్వల్ కరీం ఫిబ్రవరి 2016లో విద్యాలయ ప్రాంగణంలోనే చంపబడ్డాడు. ఆయనపై దాడి చేసిన వారిలో ఒకరు తన వద్ద చదివే విద్యార్థి కావడం అదుపుదప్పిన పరిస్థితిని తెలియజేస్తోంది.
ఇలా బంగ్లాదేశ్ ముస్లిం తీవ్రవాదుల చేతిలో కోల్పోతున్న మేధావుల, సామాజిక శాస్త్రవేత్తల్లో డా.మహ్మద్ జాఫర్, ఇక్బాల్, డా.హుమాయిన్ ఆజాద్, రండిపాం బసు తదితరులున్నారు.
2013 నుండి జమాయత్ ముజాహిదీన్ అనే నిషేధిత సంస్థ చేతిలో నాస్తికవాదులు, రచయితలు, ప్రచురణ కర్తలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు చనిపోతున్నా ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు వాటిని ఆపలేకపోతున్నాయి. పదుల సంఖ్యలో మిలిటెంట్లను మట్టుపెట్టినా, వందల మందిని అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటు న్నా హత్యాకాండ మాత్రం అదుపులోకి రావడం లేదు.
ఈ సందర్భంలో బంగ్లా రచయిత్రి తస్లీమానస్రీన్ గుర్తుకురాక మానదు. 1984లో మెడిసిన్ పూర్తి చేసిన తస్లీమా వైద్య వృత్తితోపాటు 1982 నుండి 1993 దాకా కవిత్వం రాసింది. ఆ సంకలనాలు వెలువడ్డాయి. హిందూ కుటుంబం ముస్లింల దాడికి గురయ్యే నేపథ్యంతో రాసిన నవల ‘లజ్జ’తో ఈ రచయిత్రి తీవ్రమైన ఇబ్బందులనెదుర్కొంది. ఆమెపై వివిధ ప్రాంతాల్లో భౌతిక దాడులు కూడా జరిగాయి. అక్టోబర్ 1993లోనే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఆమె తలకు వెల కట్టింది. 1994లో దేశం నుండి బయటపడి పదేళ్లపాటు వివిధ దేశాల్లో తలదాచుకుంది. చివరకు స్వీడన్ దేశ పౌరసత్వంతో రచయిత్రిగా కొనసాగుతోంది. ముస్లింలు అధిక జనాభా ఉన్న కారణంగా రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్‌లోని ప్రభుత్వాలు ఏవీ ఆమెకు బాసటగా నిలువలేదు.
ప్రజాస్వామ్యవాదులకు మతపరశక్తులతో యే నేలపైనైనా ప్రమాదమే పొంచి ఉంది. ప్రభుత్వాలు వాటిపట్ల అనుకూల, ఉదారవాద వైఖరితో ఉన్నంత కాలం ఈ కష్టాలు తప్పవు.

Comments

comments