నిజాం దాహం తీర్చిన దూద్‌బావి

నిజాం నవాబుకు గుర్రాలపై ఇక్కడి నుంచే మంచినీరు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని దూద్‌బావి నీటి గురించి ఇలా ఎంతగా వర్ణించి చెప్పినా తక్కువే. స్వేచ్ఛ విపణిలో శుద్ధజల వ్యాపారం చేస్తున్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షణీయమైన బ్రాండ్ల పేరుతో మార్కెట్‌ను ముంచెత్తుతున్న నీరు కూడా ఈ దూద్‌బావి నీటి ముందు దిగదుడుపే అన్నది ఈ ప్రాంత ప్రజల గట్టి విశ్వాసం. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వ్యాపారంలో ఉన్న బడా సంస్థలు భూగర్భం నుండి తీసిన […]

నిజాం నవాబుకు గుర్రాలపై ఇక్కడి నుంచే మంచినీరు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని దూద్‌బావి నీటి గురించి ఇలా ఎంతగా వర్ణించి చెప్పినా తక్కువే. స్వేచ్ఛ విపణిలో శుద్ధజల వ్యాపారం చేస్తున్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షణీయమైన బ్రాండ్ల పేరుతో మార్కెట్‌ను ముంచెత్తుతున్న నీరు కూడా ఈ దూద్‌బావి నీటి ముందు దిగదుడుపే అన్నది ఈ ప్రాంత ప్రజల గట్టి విశ్వాసం. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వ్యాపారంలో ఉన్న బడా సంస్థలు భూగర్భం నుండి తీసిన నీటిని శుద్ది చేసి ప్యాకెట్లు, బాటిళ్ళ రూపకంగా మార్కెట్‌లో ప్రవేశపెట్టి విక్రయాలను కొనసాగిస్తుండగా, ప్రకృతి సిద్దమైన దూద్‌బావి నీరు అంతకన్న శ్రేష్టంగా ఉందని భూగర్భ జలశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేటతెల్లమైంది. వెయ్యి సంవత్సరాల క్రితం కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో మొలంగూర్ కోట నిర్మాణం పూర్తి చేసుకోగా, ఆ కోట ప్రవేశద్వారం ఎదురుగా పూర్తి రాతి కట్టడంతో నిర్మితమైన దూద్‌బావి ఇప్పటికీ ప్రజలకు, చరిత్రకారులకు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. పాలు, నీళ్ళు కలిపిన రీతిలో తెల్లగా ఉండే ఈ బావి నీటిని ఒకనాడు నిజాం నవాబు తన తాగునీటి అవసరాల కోసం గుర్రాలపై ఇక్కడి నుండి తెప్పించుకునే వాడని చరిత్ర చెబుతుంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేసి వెళ్ళిన కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికీ ఈ బావి నీటిని తెప్పించుకుని తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అడుగు మొదలు పై భాగం వరకు రాతి కట్టడంతో ఉన్న దూద్‌బావి నీటిలో నాణెం వేసినా అది స్పష్టంగా కనిపించడం ఈ బావిలో ఉన్న నీటి పారదర్శకతకు నిదర్శనం. దూద్‌బావి నీటిని తాగితే ఏలాంటి రుగ్మతలు దరిచేరవని గట్టిగా విశ్వసించే మొలంగూరు తోపాటు రాజాపూర్, ఆముదాలపల్లి, మెట్‌పల్లి, చింతలపల్లి, గద్దపాక, కాచాపూర్, కన్నాపూర్, మఖ్త, కేశవపట్నం, కొత్తగట్టు, చింతలపల్లె, లింగాపూర్ తదితర గ్రామాల ప్రజలు ఈ బావి నీటినే, తమ తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. బావిలో ఊటనీరు చేరుకోగానే తోడుకుని వెళ్ళేందుకు వీలుగా రాత్రి మొదలు తెల్లవార్లు ప్రజలు ఈ బావి వద్ద జాగరణ చేసే దృశ్యాలు నిత్యకృత్యం. అయితే యేళ్ళ తరబడి చరిత్రగానే మిగిలిపోయిన దూద్‌బావిని, ఆ బావిలోని నీటి విశిష్ఠతను పరీక్షించాలన్న ఆలోచనకు పర్యాటక శాఖ అధికారుల చొరవ, జిల్లా కలెక్టర్ మౌఖిక అదేశాలు తోడయ్యాయి. దీంతో రంగంలోనికి దిగిన భూగర్భ జలశాఖ అధికారులు ఈ బావి నీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పరీక్షించి చూసి మార్కెట్‌లో లభించే మినరల్ వాటర్ కన్న దూద్‌బావి నీరు అత్యద్భుతంగా ఉన్నాయని నివేదించారు.

జిల్లాల విభజన అనంతరం అలయాలు, పర్యాటక స్థలాలను కోల్పోయిన కరీంనగర్ జిల్లాకు ఆ లోటును తీర్చే ప్రయత్నాల్లో భాగంగా అటు మొలంగూరు కోట, ఇటు దూద్‌బాబి పరిసరాలను పర్యాటకంగా గుర్తింపు తేవడానికి ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలు దూద్‌బావి నీటి నాణ్యతను నిర్ధారించాలన్న వైపుసాగి ఆశ్చర్యకరమైన ఫలితాలను అధికారుల ముందు ఉంచాయి. మొలంగూరు గ్రామంలోని తాగునీటి బావులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి ప్రవాహ ప్రాంతాల బావుల నుండి భూగర్భ జలశాఖ అధికారులు నీటి నమూనాలు సేకరించి, ఆ నమూనాలను భూగర్భ జల పరిశోధన కార్యాలయంలో విశ్లేషించారు. వీటితో పాటు కరీంనగర్ పట్టణంలో పురపాలక సంఘం సరఫరా చేస్తున్న మంచినీరు, మార్కెట్‌లో లభిస్తున్న కెన్లీ, ఆక్వాస్యూర్ కంపెనీల నీటి నమూనాలను కూడా అధికారులు దూద్‌బావి నీటితో పోల్చి చూడటానికి విశ్లేషించారు. ఈ విశ్లేషణలో దూద్‌బావి నీరు ఎంతో స్వచ్చంగా, తియ్యగా, తేలికగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా దూద్‌బావి నీళ్ళలో ఖనిజ లవణాల సాంద్రత తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ బావి నీళ్ళు సహజంగా వర్షపు నీటి మాదిరిగా, యంత్రాల ద్వారా శుద్ది చేసిన నీటి మాదిరిగా స్వచ్ఛంగా ఉన్నట్లు భూగర్భ జలశాఖ అధికారుల విశ్లేషణ తేల్చి చెప్పింది.

మొలంగూరు గ్రామంలోని ఇతర బావుల్లో ఉన్న నీరు దూద్‌బావి నీళ్ళతో పోల్చిచూస్తే కఠినంగా ఉన్నట్లు విశ్లేషణ తేల్చింది. కరీంనగర్ పురపాలక సంఘం సరఫరా చేస్తున్న తాగునీరు, కెన్లీ, ఆక్వాస్యూర్ కంపెనీల నీళ్ళు..దూద్‌బావి నీళ్ళు దాదాపు ఒకేరకంగా స్వచ్ఛంగా తాగడానికి అనువుగా ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. అయితే కఠిన శిలల పొరల ద్వారా వడకట్టినట్లుగా దూద్‌బావిలోనికి ఊటగా చేరుకుంటున్న వర్షపు నీరు కారణంగా ఈ బావినీటిలో ఖనిజ లవణాల సాంద్రత కొంత తక్కువగా ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం సాగు, మంచినీటిలో తగు పరిణామంలో ఖనిజ లవణాలు ఉండాల్సి ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ కూడా దూద్‌బావి నీటిని పరీక్షించింది. ఈ నీరు మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నిర్ధారించాల్సిన అవసరం ఉందని భూగర్భ జలశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.

తాడూరు కరుణాకర్, మన తెలంగాణ ప్రతినిధి /కరీంనగర్
సెల్ : 9989920534

Comments

comments