సంగీతం పుట్టినూరు తిరువారూరు

తమిళనాట పుణ్యమూర్తులకు పురిటిగడ్డ తిరువారూరు. ఇక్కడే కర్నాటక సంగీతానికి ఊపిరులూదిన త్రిమూర్తులు త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు జన్మించారు. ఇక్కడ 7వ శతాబ్దానికి చెందిన పురాతన శివాలయం ఉంది. ఇందులో పూజలందుకుంటున్న మరకత లింగాకార స్వామివారిని త్యాగరాజరు అని పిలుస్తారు. ఇక్కడ పార్వతి కొండి అనే పేరుతో పూజలందుకుంటోంది. శివకవులు నయనార్లు రచించిన తేవరం శైవసాహిత్యం (గీతమాలిక)లో ఈ ఆలయాన్ని గొప్పగా కీర్తించారు. నయనార్లు దర్శించి సాహిత్యామృతంతో కీర్తించిన ఆలయాలను ‘పాదల్ పేత్ర కోవిల’లని అంటారు. అలా […]

తమిళనాట పుణ్యమూర్తులకు పురిటిగడ్డ తిరువారూరు. ఇక్కడే కర్నాటక సంగీతానికి ఊపిరులూదిన త్రిమూర్తులు త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు జన్మించారు. ఇక్కడ 7వ శతాబ్దానికి చెందిన పురాతన శివాలయం ఉంది. ఇందులో పూజలందుకుంటున్న మరకత లింగాకార స్వామివారిని త్యాగరాజరు అని పిలుస్తారు. ఇక్కడ పార్వతి కొండి అనే పేరుతో పూజలందుకుంటోంది. శివకవులు నయనార్లు రచించిన తేవరం శైవసాహిత్యం (గీతమాలిక)లో ఈ ఆలయాన్ని గొప్పగా కీర్తించారు. నయనార్లు దర్శించి సాహిత్యామృతంతో కీర్తించిన ఆలయాలను ‘పాదల్ పేత్ర కోవిల’లని అంటారు. అలా నయనార్ల పాదస్పర్శ పొందిన ఆలయాలలో తిరువారూరు ఒకటి.

ఈ ఆలయం ఉన్న ఊరిని గతంలో ఆరూరు అని పిలిచేవారు. స్వామివారి ఆలయం సుప్రసిద్ధం కావడంతో ఊరిపేరుకు తిరు(పవిత్రమైన) అనే పదం కలిసి తిరువారూరు అయింది. తిరువారూరును సంస్కృతంలో కమలాలయ క్షేత్రమంటారు. ఇక్కడ కమలాంబిక పేరుతో కూడా అమ్మవారు పూజలందుకోవడం వల్ల ఈ ఊరికి కమలాలయ క్షేత్రం అనే పేరు వచ్చింది. ఆలయానికి పడమటి దిక్కున కమలాలయం పేరుతో కోనేరు ఉంది. ఇంగ్లీషువారి హయాంలో దీన్ని తిరువాలూరు అని పిలిచేవారు. స్థలపురాణం ప్రకారం ముచికుందుడు అనే చోళరాజు ఒకసారి ఇంద్రుని మెప్పించి విష్ణువక్షస్థలంపై ఉండే త్యాగరాజస్వామి మూర్తిని ఇమ్మని కోరాడు. ఇంద్రుడు చోళరాజుకు పరీక్షపెట్టడానికని ఒకే రకంగా ఉండే ఆరు త్యాగరాజ మూర్తులను సృష్టించి అసలైన మూర్తిని తీసుకోమన్నాడు. రాజు సిసలైన త్యాగరాజరును సరిగా గుర్తించి తీసుకున్నాడు. మిగిలిన శివలింగాలను తిరుక్కువలై, నాగపట్టినం, తిరుకరయిల్, తిరుకోలిల్, తిరుమారైక్కాడు ఆలయాలలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయాలన్నీ కావేరీ తీరంలోనే ఉండడం విశేషం.
మన దేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఇదీ ఒకటి. దీని విస్తీర్ణం 30ఎకరాలు. నాలుగు వైపులా నాలుగు గోపురాలు, 3 ప్రాకారాలు ఉన్నాయి. నాలుగు గోపురాలలో పడమటి గోపురం అతిపెద్దది. నాలుగు అంతస్తులు, 98 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటుంది. ఆలయ ప్రాకారాల లోపల ఉన్నన్ని ఉపాలయాలు మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. వీటిలో త్యాగరాజర్, నీలోత్తబాలాంబాళ్ ఆలయాలు ప్రధానమైనవి. ఇది కాక వన్మీకినాథర్ అనే మరో ఆలయం ఉంది. త్యాగరాజర్ ఆలయం కన్నా ఈ వన్మీకినాథర్ ఆలయం మరింత పాతది. ఈ లింగం చీమల పుట్ట నుంచి ఉద్భవించింది. 7వ శతాబ్దపు శైవభక్తుడు అప్పర్ తన పుట్రిట్రుకొండన్ గేయంలో ఈ శివుని గురించి కీర్తించాడు.
అనుక్కియార్ పరవై నంగయ్యార్ అనే రాజు ఆలయాన్ని నిర్మించగా ఆతని భార్య గర్భాలయగోపురానికి బంగారుపూత పూయించింది. ప్రస్తుతం మనం దర్శిస్తున్నఆలయం 9వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించింది. దీనికి అనేక అనుబంధ నిర్మాణాలు చేపట్టి ఆలయాన్ని విస్తరించిన ఘనత విజయనగర రాజులకు దక్కుతుంది. సంగమ, సాళువ, తుళువ రాజవంశీకులు ఈ ఆలయంపై ప్రత్యేక దృష్టిపెట్టి విస్తరించారు. ఈ ఆలయాన్ని విస్తరించడానికి ఎందరో కృషి చేసినా కుళోత్తుంగచోళుడు చేసిన కృషి విశేషమైనది. ఆయన హయాంలో 56 రకాల సేవలు, ఉత్సవాలు జరిగేవి. ప్రస్తుతం ఈ ఆలయంలో నెలకొక్కటి చొప్పున యేటా 12 ఉత్సవాలు జరుగుతున్నాయి.


ఈ ఆలయానికి తమిళనాడులో మరెక్కడా లేనంత పెద్ద రథం ఉంది. భక్తగణాలను విశేషంగా ఆకర్షించే స్వామివారి రథోత్సవం ఏప్రిల్‌మే మాసాలలో జరుగుతుంది. దేశంలోని అతిపెద్ద ఆలయ రథాలలో స్వామివారి రథం ఒకటి. ఇది 90 అడుగుల ఎత్తు, 300 టన్నుల బరువు ఉంటుంది. ఈ ఉత్సవం తర్వాత ఘనంగా జరిగేది స్వామివారి తెప్పోత్సవం. రథోత్సవం జరిగే రోజున ‘అజప తానం’ పేరుతో కనువిందుచేసే నాట్యోత్సవం జరుగుతుంది.
తంజావూరులోని బృహదీశ్వరాలయంలాగే ఈ ఆలయం కూడా సుప్రసిద్ధ కళాకేంద్రంగా వర్థిల్లింది. మొదటి రాజరాజచోళుడి కాలంలో చిదంబరం నుంచి కళాకారులను తెప్పించి ప్రదర్శనలు ఇప్పించాడు. 13, 14 శతాబ్దాలలో తిరువారూరు అన్ని వర్గాల శైవులకు ఆటపట్టుగా ఉండేది. త్యాగరాజ స్వామివారి పాదాలను యేడాదిలో రెండుసార్లు మాత్రమే (ఫంగుణి తీర్థంనాడు ఎడమపాదాన్ని, తిరువతిరాయ్ ఉత్సవంనాడు కుడిపాదాన్ని) భక్తుల దర్శనానికి ఉంచుతారు. మిగతా రోజులలో వీటిని పూలతో కప్పి ఉంచుతారు. ఆలయాన్ని ఉదయం 5.30 గం.లకు తెరిచి రాత్రి 10 గం.లకు మూసివేస్తారు.

ఎలా చేరుకోవాలి? 

హైదరాబాద్ నుంచి చెన్నయ్ స్టేషన్‌కు, అక్కడి నుంచి ఎగ్మోర్ స్టేషన్‌కు రైల్లో  చేరుకుంటే అక్కడి నుంచి తిరువారూరు చేరుకోవడానికి దాదాపు 52 రైళ్ళు ఉంటాయి. ఎగ్మోర్ నుంచి తిరువారూర్‌కు దాదాపు 3 గంటల ప్రయాణం. విమానంలో తిరువారూరు చేరుకోదలచుకున్నవారు చెన్నయ్‌కి చేరి అక్కడి నుంచి మరో విమానం పట్టుకుని తిరువారూర్‌కు వెళ్ళవచ్చు.

Comments

comments