అమెరికా చైనా వాణిజ్య యుద్ధం

ఈ సంవత్సరం ప్రారంభం నుంచే అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమైంది. ఈ క్రమంలో భారతదేశంపై కూడా అమెరికా విధించే సుంకాల ప్రభావంపడింది. స్టీలు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా పన్నులు విధించింది. స్థానిక పరిశ్రమల ప్రయోజనాలు కాపాడ్డానికి ఈ చర్యలు తీసుకున్నానని అమెరికా చెప్పింది. దానికి బదులుగా చైనా కూడా పన్నులు విధించింది. అమెరికా దాదాపు 3 బిలియన్ డాలర్ల వ్యవసాయోత్పత్తులను ఎగుమతులు చేస్తుంది. వాటిపై చైనా సుంకం విధించింది. ఈ వాణిజ్య యుద్ధం నానాటికి […]

ఈ సంవత్సరం ప్రారంభం నుంచే అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమైంది. ఈ క్రమంలో భారతదేశంపై కూడా అమెరికా విధించే సుంకాల ప్రభావంపడింది. స్టీలు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా పన్నులు విధించింది. స్థానిక పరిశ్రమల ప్రయోజనాలు కాపాడ్డానికి ఈ చర్యలు తీసుకున్నానని అమెరికా చెప్పింది. దానికి బదులుగా చైనా కూడా పన్నులు విధించింది. అమెరికా దాదాపు 3 బిలియన్ డాలర్ల వ్యవసాయోత్పత్తులను ఎగుమతులు చేస్తుంది. వాటిపై చైనా సుంకం విధించింది. ఈ వాణిజ్య యుద్ధం నానాటికి తీవ్రమవుతోంది.
అమెరికా ట్రేడ్ రిప్రజంటేటివ్స్ రిపోర్టు చైనాకు సంబంధించిన వివరాలు ప్రచురించిన తర్వాత చైనా నుంచి దిగుమతయ్యే 1300 ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్ విధించింది. ఈ జాబితా ఏప్రిల్ 13న విడుదల చేశారు. ఇది చైనా నుంచి దిగుమతయ్యే 46 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల వ్యాపారంపై పడిన ప్రభావం. ఆ మర్నాడే చైనా తరఫు నుంచి జవాబు వచ్చింది. తాను దిగుమతి చేసుకునే 106 అమెరికా ఉత్పత్తులపై చైనా అదేస్థాయిలో టారిఫ్ విధించింది. ఈ వ్యాపారం విలువ 50 బిలియన్ డాలర్లు.
ఇది అంతటితో ఆగలేదు. ఏప్రిల్ నెలలో రెండు దేశాలు మరి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాయి. చైనాలోని టెలికామ్ పరికరాలు తయారు చేసే జడ్‌టి యి కంపెనీ అమెరికానుంచి విడిభాగాలు దిగుమతి చేసుకుంటుంది. ఈ కంపెనీకి ఏడేళ్ళపాటు విడిభాగాలు సరఫరా చేయరాదంటూ అమెరికా నిషేధం విధించింది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఉల్లంఘించారన్న కారణం చూపించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే జొన్నలపై చైనా కొరడా ఝళిపించింది. అమెరికా ఏకపక్ష నిర్ణయాలకు తగిన జవాబు తాము ఇవ్వగలమంటూ చైనా ఎలాంటి సంకోచాలు లేకుండా స్పష్టమైన సంకేతాలు పంపించింది. అమెరికా జొన్నలకు చైనా పెద్ద మార్కెట్టు. ఆ తర్వాత అమెరికా మరో 100 బిలియన్ డాలర్ల దిగుమతి టారిఫ్‌ను చైనా ఉత్పత్తులపై విధిస్తామని హెచ్చరించింది.
ప్రపంచంలో అత్యధికంగా దిగుమతులు చేసుకునే దేశం అమెరికా. దాదాపు 2.2 ట్రిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అలాగే అమెరికాయే ప్రపంచంలో అత్యధికంగా ఎగుమతులు కూడా చేసే రెండవ దేశం. దాదాపు 1.4 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తుంది. ప్రపంచంలో ఎగుమతులు అత్యధికంగా చేసే మొదటి దేశం చైనా. ఏటా 2.1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతు చేస్తుంది. దిగుమతులు అత్యధికంగా చేసుకునే రెండవ అతిపెద్ద దేశం చైనా. ఏటా 1.4 ట్రిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంటుంది. 2017లో ఈ రెండు దేశాల మధ్య 637 బిలియన్ డాలర్ల వస్తు ఉత్పత్తుల వాణిజ్యం జరిగింది. సేవలను కూడా కలుపుకుంటే ఈ వాణిజ్యం విలువ 711 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ.
అమెరికాకు, చైనాకు మధ్య నడుస్తున్న ఈ వాణిజ్య యుద్ధం నిజానికి టెక్నాలజీపై అదుపు కోసం జరుగుతున్న యుద్ధం. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీల్లో చైనా పెట్టుబడులపై కూడా నిఘా ఉంది. టెక్నాలజీ రంగంలో దూసుకుపోవడం అమెరికా ఆందోళనకు కారణం.
భారతదేశానికి సంబంధించి ఎగుమతుల విషయంలో అమెరికా అతిపెద్ద మార్కెట్టు. రెండుదేశాల మధ్య వాణిజ్యం 66 బిలియన్ డాలర్లు. భారత ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్టయితే, భారతదేశానికి కావలసిన దిగుమతులు అత్యధికంగా చైనా నుంచే వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 70 బిలియన్ డాలర్ల దిగుమతులను మన దేశం చైనా నుంచి చేసుకొన్నట్లు తెలుస్తోంది. భారతదేశం చైనాకు చేసే ఎగుమతుల విలువ 12 బిలియన్ డాలర్లు. ఇప్పుడు చైనా అమెరికాల మధ్య వాణిజ్యయుద్ధం కొనసాగితే ఈ రెండు దేశాలు తమకు దిగుమతుల కోసం మూడో దేశం వైపు చూడవచ్చు. ఆ విధంగా చూస్తే భారతదేశం నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. బీజింగ్‌లో చర్చల సందర్భంగా భారతదేశం పంచ దార, సోయాబీన్స్ చైనాకు ఎగుమతి చేయడానికి మాట్లాడినట్లు తెలుస్తోంది.
అమెరికా విధించిన సుంకాల వల్ల చైనా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే 1300 ఉత్పత్తుల్లో మెషినరీ, యంత్ర, ఎలక్ట్రికల్ పరికరాలు దాదాపు 34.2 బిలియన్ డాలర్లు. ఈ వస్తు ఉత్పత్తులను అమెరికా మార్కెట్ డిమాండ్ ప్రకారం ఇండియా వెంటనే ఎగుమతి చేయడమన్నది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. అలాగే చైనా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో రవాణాకు సంబంధించినవి, కూరగాయలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులున్నాయి. చైనాకు మనదేశం నుంచి ఎగుమతులు చాలా చాలా తక్కువ. చైనా మార్కెట్టు డిమాండ్ మేరకు వెంటనే ఇక్కడి నుంచి ఎగుమతులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. కాబట్టి అటు అమెరికా కాని, ఇటు చైనా కాని తమ దిగుమతి అవసరాల కోసం ఇండియావైపు చూసే అవకాశాలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్యయుద్ధం వల్ల ఇతరదేశాలకు వాణిజ్య అవకాశాలు పెరిగాయి, భారతదేశానికి కూడా ఎగుమతులు పెంచుకునే అవకాశం ఉంది, కాని అమెరికా, చైనాల్లో మార్కెట్ డిమాండ్ స్థాయికి ఎగుమతులు చేసే స్థితి ప్రస్తుతం మన దేశం కనబడడం లేదు.
ఎలక్ట్రికల్ పరికరాలు, మెషినరీ వగైరాఉత్పత్తుల విషయంలో ఎగుమతి, ఉత్పత్తి సామర్థాలు రెండూ పెంచుకుంటే తప్ప మార్కెట్టు డిమాండ్‌ను తట్టుకోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు జొన్నల ఎగుమతి విషయంలోనూ చైనా విధించే దిగుమతి నియమాల వల్ల చైనా మార్కెట్టులో ప్రవేశించడం కష్టమే.
అమెరికా ఇప్పుడు భారతదేశంపై కూడా నిఘా ఉంచింది. యు.ఎస్.టి.ఆర్. నివేదిక భారతదేశాన్ని కూడా వాచ్ లిస్టులో ఉంచింది. విదేశీ మారకద్రవ్య విధానాలను కూడా నిఘాలో ఉంచింది. హెచ్ 1 బి వీసా నిబంధనలను కఠినం చేసింది. తమ ఉత్పత్తులపై ఇండియా భారీ సుంకాలు విధిస్తుందన్న విమర్శలు అమెరికా చేస్తోంది. మరో విషయమేమంటే, వస్త్రాలు, వజ్రాలు, ఆభరణాల వంటి భారత ఉత్పత్తులపై ఇప్పటి వరకు అమెరికా జీరో టారిఫ్ విధానం పాటిస్తోంది. దాన్ని కూడా సమీక్షిస్తామని ఇప్పుడు చెబుతోంది. దీనివల్ల ఇండియా ఎగుమతి చేసే 5.6 బిలియన్ ఉత్పత్తులపై ప్రభావం పడవచ్చు. ఇటు చైనా కూడా భారతదేశం నుంచి ఎగుమతులను పెంచుకునే విషయమై సానుకూలంగా స్పందిస్తున్న సూచనలు కనబడడం లేదు. అమెరికాలో చైనా ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు 2017లో బాగా తగ్గిపోయాయి.
ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ రెండు దేశాల నుంచి పెంచడానికి అవకాశాలున్నాయిప్పుడు. ఈ దిశగా ప్రయత్నింవలసిన అవసరం ఉంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్యయుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము. ఆర్ధికంగా ఎదురయ్యే నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు దేశాలు నెమ్మదిగా వెనక్కి తగ్గనూ వచ్చు, లేదా అమెరికాలో ప్రజామద్దతు కోసం ట్రంప్ మరింత కఠినంగా స్వీయ రక్షణ విధానాలను పాటిస్తూ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. పారిశ్రామిక పురోగతి, పరిశోధన, ఎగుమతి సామర్థ్యం పెంచుకోవడంపై ఇప్పటికైనా భారతదేశం దృష్టిపెట్టవలసిన అవసరం ఉంది. ప్రపంచ మార్కెట్టులో బలమైన ఎగుమతి సామర్థ్యం ఉన్న దేశంగా నిలబడితేనే ఇలాంటి అవకాశాలను వెంటనే అందిపుచ్చుకునే స్థితిని సాధించగలం.