గత చరిత్రకు ఘనమైన ఆనవాళ్లు

ఘనత వహించిన చరిత్రకు, చారిత్రక అవశేషాలకు, ప్రాచీన కట్టడాలకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న మహనీయ క్షేత్రం తెలంగాణ. క్రీస్తుపూర్వం నుంచే చరిత్రను పొదవిపట్టుకొని ఎందరో మహారాజులకు మహావీరులకు రణక్షేత్రంగా నిలిచిన కీర్తి ఈ గడ్డది. తెలుగు శౌర్యానికి నిలువుటద్దంగా నిలిచిన ఎందరో ఈ పవిత్ర సీమను వేసంగి సెలవుల్లో దర్శించి ఇక్కడి కీర్తిని భావితరాలకు తెలియజెప్పేందుకే ఈ ప్రయత్నం. కోటలు,గడీలు ఒకటి కావు. రాజుల నివాసాలను కోటలని, దొరల నివాసాలని గడీలని అంటారు. కొన్ని చోట్ల ఈ తేడా […]

ఘనత వహించిన చరిత్రకు, చారిత్రక అవశేషాలకు, ప్రాచీన కట్టడాలకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న మహనీయ క్షేత్రం తెలంగాణ. క్రీస్తుపూర్వం నుంచే చరిత్రను పొదవిపట్టుకొని ఎందరో మహారాజులకు మహావీరులకు రణక్షేత్రంగా నిలిచిన కీర్తి ఈ గడ్డది. తెలుగు శౌర్యానికి నిలువుటద్దంగా నిలిచిన ఎందరో ఈ పవిత్ర సీమను వేసంగి సెలవుల్లో దర్శించి ఇక్కడి కీర్తిని భావితరాలకు తెలియజెప్పేందుకే ఈ ప్రయత్నం.

కోటలు,గడీలు ఒకటి కావు. రాజుల నివాసాలను కోటలని, దొరల నివాసాలని గడీలని అంటారు. కొన్ని చోట్ల ఈ తేడా కనిపించటం లేదు. దోమకొండ కోట అని, దోమకొండ గడీ అని పిలుస్తారు. రాజుల కొలువులోని దొరలు గడీ నిర్మించడం వల్ల ఇలా పిలుస్తున్నారు. గడీ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే మహారాష్ర్టలో ఘడ్ అంటే కోట అని అర్థం. గడీ అనే పదం అక్కడి నుండే వచ్చింది. మహారాష్ర్ట పద్ధతుల నిర్మాణాలు తెలంగాణా ప్రాంతంలో నిజాం నవాబు కాలంలో జరిగాయి. ఈ విధంగా తెలంగాణాలో కోటలు, గడీలు ఉన్నాయి.

శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల. కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాలలో గోదావరి నది ప్రవాహానికి పక్కనే సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. దాని ఆనవాళ్లు మనకు కన్పిస్తాయి. శాతవాహనుల కంటె పూర్వమే “రణ్ణో గోభద, రణ్ణో సిరికంవాయ, రణ్ణో నారణ, రణ్ణో సమగోప” వంటి రాజులు అచ్చట పరిపాలించినట్లుగా ఆనాడు వారు రూపొందించిన నాణెముల ఆధారాలు లభించాయి. వీరి తర్వాత సిరిశాతవాహన, సిరిశాతకణ్ణి, సిరిచిముక శాతవాహన నాణేలు లభ్యమయ్యాయి. ఈ విధంగా మనదేశంలో లిఖితనాణేలు లభించడం ఇదే ప్రథమం అని తెలుస్తున్నది. పంచ్‌మార్క్‌డ్ (నొక్కులున్న), వెండినాణేలు ఇచ్చట లభించడం విశేషంగా భావించవచ్చు. ఇవి క్రీ॥పూర్వం 43 శతాబ్దానికి చెందినవిగా తెలుస్తున్నది. కోటిలింగాల ప్రాంతంలో అప్పటి గృహనిర్మాణాలు, బావులు, కోటనిర్మాణం, బురుజులు ఆనాడు వారు వాడిన మట్టి పాత్రలు వంటివి లభిస్తున్నాయి. కోటిలింగాల మౌర్యసామ్రాజ్య పతనానంతరం స్థానిక రాజులచే పాలించబడి క్రీ॥పూర్వం 21 శతాబ్ది మధ్య, తదుపరి మూడు వందల ఏళ్ళపాటు తొలి శాతవాహనుల రాజధానిగా ఉంది. ఆజ్ఞేయమూల దీర్ఘచతురస్రంగా నిర్మించిన 11.65 మీటర్లు పొడవు, తూర్పు, పశ్చిమం 10.55 మీటర్ల వెడల్పు, ఉత్తర దక్షిణం దిక్కులు రెండింట బురుజు లభించడం రెండు రాష్ట్రాల చరిత్రలోనే ప్రథమం. మట్టి కోట దిగువన 21 వరుసలు గలిగి 180 మీటర్ల వెడల్పు 120 మీటర్ల ఎత్తు గలిగిన ఇటుక గోడ నిర్మాణం కోట రక్షణను తెలియజేస్తుంది. ఈ కోట మెగస్తనీసు చెప్పిన ఆంధ్రుల 30 నగరాలలో ఒకటి కావచ్చునని చరిత్రకారుల అభిప్రాయం. బౌద్ధసాహిత్యంలో కనపడే మహాజనపదాలలో ఇది ఒకటి. దీనికి ఎగువన అస్సక (అశ్మక), అళక (ముళక) జనపదాలున్నాయి. ఇదే ప్రాంతంలో గుట్టపై బుద్ధుని సమకాలికుడు భావరీపండితుడు నివసించినట్లుగా ఆనవాళ్లు లభిస్తున్నాయి. ఈ ప్రాంతం “అంధక రఠ్ఠ గాను, ఇచ్చటి రాజులు ఆంధ్రులుగాను పిలువబడ్డారు. కవిట అనేది కపిథ్థకు పర్యాయపదం. అంటే తెలుగులో వెలగపండు. ఈ కవిత వనం నేడు కోటిలింగాలకు సమీపంలో ఉన్న ఎల్కటూరు, నేడు దీనిని వెల గటూ రుగా పిలు స్తున్నారు. ఇదే ప్రాంతంలో బౌద్ధస్థూపం వంటి అవశేషాలు లభిస్తున్నాయి.

కోటిలింగాల ప్రాం తంలోగల మొక్కర్రా వుపేటలో శాతవాహనుల సైనికశిబిరాలు బయ టపడ్డాయి. కోటి లింగాలలో కోటేశ్వర స్వామి ఆలయం ఇప్పటికీ ధూపదీప నైవేద్యాలతో పూజలందుకుంటున్నది.

కీసరగుట్ట: హైదరాబాద్ నగరానికి తూర్పున సుమారు 40 కి.మీ. ల దూరంలో ఉన్న కీసరగుట్ట ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ గుట్టచుట్టూ పురాతత్వ పరిశోధన వల్ల మూడు నాలుగు కీ.మీ. ల పర్యంతం ఉన్న రాతి ప్రా కారం బయటపడింది. ఇది గులక రాళ్లు కంకరలు పునాదిగా కలిగి పైన ఇటుకలతో నిర్మించబడింది. దీనికి తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కులయందు మూడు ప్రధాన ద్వారాలు కలిగి ముందు మరొక ప్రాకారం కనిపిస్తుంది. శత్రువుల ఆకస్మిక దాడుల నుండి రక్షించుకోవడానికి ఇలా నిర్మించారని తెలుస్తుంది. ఒకరాతి బండపై చెక్కబడ్డ విష్ణుకుండినుల శాసనాలు లభించాయి. దానిపై సింహపు బొమ్మ ఉండటం వల్ల కేసరి అన్నారు. ఇది రానురాను కీసరగుట్టగా మారింది. దీనికాలం క్రీ॥శ॥ 5వ శతాబ్దిగా తెలుస్తున్నది.
ఎల్లందల్: కరీంనగర్ జిల్లా ప్రక్కనే గల ఈ కోట వెలిగందల, ఎలిగందల, ఎల్గందల గా మారింది. కీ॥శ. 13 వ శతాబ్దిలో షితాబ్ ఖాన్ ఆక్రమించిన కోటలలో ఇది ఒకటి. కాని కుతుబ్ ఉల్ ముల్క్ వాటిని స్వాధీనపరచుకున్నాడు.

బహ్మనీ సుల్తానుల చివరికాలంలో కివాత్ ఉల్ ముల్క్ తెలంగాణా లోని అనేక కోటలను జయిస్తూ ఎల్గందల్, ములంగూర్‌లను కూడా ఆక్రమించాడు. కుతుబ్ ఉల్ ముల్క్ హెచ్చరికను ఖాతరు చేయకపోవడం వల్ల అతడు ఎల్గందల్ ను ముట్టడించి కివాతో ఉల్ ముల్క్‌ను ఓడించాడు. ఇబ్రహీం కుతుబ్‌షా కీ॥శ.1555-65 కాలంలో జగ్దేవ్‌రావు సుల్తాన్‌పై తిరుగుబాటు చేశాడు. ఈ పోరాటంలో ఆయన ఓడిపోయాడు. ఎల్గందల కోట చిన్నగుట్టపై ఉన్నది. ఈ కోటపై జాఫర్ ఉద్దేవా నిర్మించిన మసీదు ఉంది. ఈ కోట చుట్టూ కందకం ఉన్నది. బురుజులు 42 అడుగుల ఎత్తు. కోటపైకి ప్రవేశం మలుపులతో ఉంటుంది. రెండవ ప్రాకారం 1000 గజాల చుట్టుకొలత కలిగి ఉంది. లోపల పైకి చేరడానికి మెట్ల వరస కలదు. కొండపైన కుతుబ్‌షాహీల శైలితో నిర్మింపబడ్డ మసీదు బారాదరీ ఉన్నాయి. ఈ కోట పరిపాలనా కేంద్రంగా విలసిల్లినది.

కౌలాస్‌కోట : తెలంగాణాలో కోట నిర్మాణరీతులలో హిందూ ముస్లిం సాంప్రదాయాలు కనిపిస్తాయి. కౌలాస్‌కోట నిజామాబాద్ జిల్లాలో ఉంది. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ముసునూరు నాయకులు, బహ్మనీ సుల్తానుల మధ్య జరిగిన సరిహద్దు యుద్దాలలో ఇది ప్రముఖపాత్ర వహించింది. ఇబ్రహీం కుతుబ్‌షా కీ॥శ. 1555-1580 కాలంలో నిజాంషాహీసేనలు కౌలాస్‌ను ముట్టడించగా కీ॥శ. 1573 లో జరిగిన యుద్ధంలో కుతుబ్‌షాహీలు ఓటమి పాలయ్యారు. ఈ కోట చిన్నరాతి గుట్టపై నిర్మించబడినది. అంతస్తులుగా నిర్మింపబడ్డ పిట్టగోడ ఉన్నది. చుట్టూ దట్టమైన అడవి, క్రింద నీటివంక కొండచుట్టూ ఉన్నాయి. కోటకు రెండు ద్వారాలున్నాయి. వెలుపలి ద్వారం ముస్లిం పద్దతుల, లోపలి ద్వారం కాకతీయ విధానాన్ని గుర్తుకు తెస్తుంది.

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ కోట కీ॥శ. 1416 బహ్మనీల కాలంలో ప్రారంభమైంది. అల్లాఉద్దీన్ బహ్మన్, అహ్మద్‌షా, జలాల్‌ఖాన్ వంటి వారు పరస్పర కలహాలతో దీనిని పరిపాలించినారు. బహ్మనీల ముట్టడితో ఈ కోట వారి వశమైంది.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ కోట రేచర్ల వెలమలకు ద్వితీయ రాజధానిగా ఉన్నది. ఆ తర్వాత ఇది పలు ముస్లిం రాజుల దాడులకు గురియైనది. కపిలేశ్వర గణపతి సహాయసహకారాలతో వారి నుండి రక్షించబడింది.
కొయిల్కొండ కోట : మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నది. విజయనగర రాజులు, కుతుబ్‌షాహీల మధ్య సరిహద్దుగా ఉన్నది. ఈ కోయిల్కొండ కోట 100 ఎత్తుగల చిన్నకొండపై ఉంది.

రాచకొండ: ఈ కోట మొదటి సింగమనా యకునిచే నిర్మించబడింది. ఇది కాకతీయుల తర్వాత ఎక్కువ ప్రాధాన్యతను పొందింది. ఈ కోట వెలమలకు చెందినది తెలంగాణాను సింగమ నాయకుడు మూడు ప్రాంతాలుగా విభజించినాడు. 1. వరంగల్, 2. రాచకొండ, 3. భువనగిరి అల్లాఉద్దీన్ అహ్మద్‌షా బహ్మన్ క్రీ॥శ. 1431-48 కాలంలో రేచర్ల నాయకులు కొల్పోయారు.
దొరలు, సంస్థానాధీశుల పరిపాలనా కాలంలో వారు నివసించే భవనాలు పరిపాలనా కేంద్రాలుగా విలసిల్లాయి. నిజాం రాజు కొందరు దొరలకు పాలకులుగా అవకాశం కల్పించినాడు. ఇందులో దొరలు పటేండ్లు, అవుసుల వాళ్లు, గిరిజనులు, కోమట్లు వంటి వారు రాచరికం చలాయించారు.

సిర్నాపల్లి గడీ: నిజామాబాద్ జిల్లాలోని ఈ గడీని జానకీభాయ్ అనే వనిత పరిపాలించింది.
కరీంనగర్ జిల్లాలోని బండలింగాపూర్ గడీకి రాజా అనంతకిషన్‌రావు పాలకుడుగా ఉండేవాడు.
దోమరకొండ గడీ నిజామాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచినది.
మెదక్ జిల్లాలోని సంజీవరావుపేట బ్రహ్మణ దొరల గడీ.
ఆదిలాబాద్ జిల్లాలోని తపాల్‌పూర్ గడీ,
గట్ల మల్యాల గడీ మెదక్ జిల్లాలోని సిద్ధిపేట నుంచి హుస్నాబాద్ వెళ్లేదారిలో ఉంది ఇది విశ్వబ్రాహ్మణ దొరల గడీ.
వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలో విస్నూరి గడీ ఉన్నది. ఇది తెలంగాణా సాయుధపోరాటానికి కారణమైనది. చాకలి ఐలమ్మ ఈ దొరల నిరంకుశత్వాన్ని ఎదిరించినది.
కరీంనగర్ జిల్లాలోని సిరికొండ వైశ్య దొరలు కోమటోల్ల గడీ. ఇదే జిల్లాలోని కమలాపూర్‌లో బ్రహ్మణ దొరల గడీ ఉంది.
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఇందారం గడీ అన్ని గడీలకంటే భిన్నంగా కనిపిస్తున్నది. బురుజుల నిర్మాణం కమాన్, ప్రహారీ గోడలు కనిపిస్తాయి.

కల్లెడ గడీ : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఉన్నది. ఇది వెలమదొరల గడీ.

గద్వాలగడీ: తెలంగాణాలో ప్రసిద్ధిగాంచిన ఈ గడీ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్‌లో ఉన్నది.
మదనపల్లి గడీ లంబాడీ దొరల గడీ, వరంగల్ జిల్లా ములుగు మండలంలో ఉన్నది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని అక్కన్నపేటలో గల ఈ గడీ బ్రహ్మణ దొరల గడీగా ప్రసిద్ధిచెందినది.
మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి గడీ సాహిత్యానికి రాచరిక పరిపాలనకు ఆనవాళ్లుగా మిగిలింది.
కరీంనగర్ జిల్లాలోని వంగర గడీ పి.వి. నరసింహారావు తాత తరాలకు చెందినది.
మెదక్ జిల్లా జిల్లెల్ల దుబ్బాక గడీ అతిపెద్ద సంస్థానంగా పేరుగాంచినది.

కరీంనగర్ జిల్లాలోని ఇటిక్యాల దొరల గడీ ఉన్నది. ఇది ప్రసిద్ధిగాంచినది. ఇదే జిల్లాలో దాచారం ఊరులో గడీ ఉన్నది. మద్దునూర్ గడీ దొరల గడీగా ప్రసిద్ధిగాంచినది.
జగిత్యాల సమీపములో చల్‌గల్ గడీ ఉన్నది. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండం బొల్లారం గ్రామంలో బొల్లారం గడీ ఉన్నది.

రామగిరి కోట: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల్, బేగంపేట గ్రామానికి అతి సమీపంలో ఎత్తైన గుట్టలపై రామగిరి కోట ఉన్నది. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిగా గుట్టలపై విస్తరించింది. అసఫ్‌జాహీ రాజుల కాలంలో ఈ కోట ఎంతో ప్రాముఖ్యతతో విలసిల్లినది. చారిత్రకంగా ఎంతో ఖ్యాతిని గడించిన ప్రాంతం, శ్రీరామచంద్రుడు, సీతమ్మతో కలిసి వనవాస సమయంలో కొంత కాలం ఈ గుట్టలపై నివసించినట్లుగా సాక్ష్యాలు లభించాయి. ఆ గుట్టలపై సీతమ్మ కొలను, సీతమ్మ స్నానవాటికలు, సీతమ్మ బొట్టుగా వాడినట్టు చెప్పే పసుపు కుంకుమల పరుపురాయి ఇప్పటికీ అక్కడ మనకు అగిపిస్తున్నాయి. ఇది ఎంతో అందమైన ప్రదేశం. ప్రాచీనకాలంలో ఇక్కడ మునులు ఔషధ మొక్కలు సేకరించేవారని చెప్పుకుంటారు. ఇప్పటికీ కోయలు, గోండులు, పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు ఆయుర్వేద వైద్యులు ఈ గుట్టలనుంచి ఔషధ మొక్కలు

సేకరిస్తారు. కోటిలింగాలకు ఇది సమీపంలోనే ఉంది. శాతవాహన రాజుల నిర్మాణాలకు ఆనవాళ్ళుగా నున్న పెద్ద బొంకూరు (రాక్షస గుళ్ళు) ధూళికట్ట (బౌద్ధ నిర్మాణం) 20 కి.మీ. దూరంలోనే, రామగిరికి సమీపంగానే వున్నాయి. శాతవాహన రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి శాతకర్ణి, ఇతరేతర రాజులు దీన్ని శక్తివంతంగా తీర్చిదిద్దారు. అనంతరం గుండరాజు (మంథని), ఎడరాజు (రామగుండం) కళ్యాణి చాళుక్యులు ఈ కోటను ఉపయోగించుకున్నారు. క్రీ.శ. 1138-1140లో కాకతి ప్రోలరాజు, రామగుండం, మంథని, రామగిరిలను ఆక్రమించుకున్నాడు. ఆయన హన్మకొండ నుండి తన పరిపాలన సాగించినాడు. కాకతీయ సామ్రాజ్యం అనంతరం రేచర్ల పద్మనాయక కుటుంబానికి చెందిన అనపోట నాయకుడు ఓరుగల్లు ఆక్రమించుకున్నాడు. తన ప్రతినిధిగా ముప్ప భూపాలుడిని నియమించాడు. ఇతడు సబ్బిసాయిరాము, సబ్బినాడు ప్రాంతాలకు ప్రధాన నగరంగా రామగిరిని ప్రకటించాడు. క్రీ॥శే॥ 14వ శతాబ్దంలో కేసన రామగిరికి మంత్రిగా ఉన్నాడు. ఇదే కాలంలో కందన ఎలగందుల పాలకునిగా ఉన్నాడు. పద్మపురాణోత్తర కందంను మడికి సింగన క్రీ.శ.1420లో కేసనకు అంకితమిచ్చినాడు. క్రీ॥శే॥ 1422-1436లో బహ్మనీ సుల్తాన్ అహ్మద్‌షా తెలంగాణాపై దండెత్తి రామగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. రామగిరి కోట ముస్లిం రాజుల దాడులకు గురియైనది. ఖివాముల్ ముల్క్ కొంతకాలం పాలించాడు. క్రీ॥శ॥ 1518-1583లో సుల్తాన్ కులీ కుతుబ్ ముల్ ముల్క్ దండెత్తి ఖివాముల్ ముల్క్ అతని బేరారీ సేనలను ఓడించి, రామగిరిని ఆక్రమించినాడు. రామగిరిపై ఉన్న కట్టడాలు ముస్లిం సాంప్రదాయాలతో పలు మార్పులకు గురియైనవి. గోల్కొండ పాలకుడు అబ్దుల్లా కుతుబ్‌షాను దక్కన్ సర్దార్ ఔరంగజేబు ఓడించినాడు. అబ్దుల్లా కుతుబ్‌షా తల్లి హయత్‌భక్షీ బేగవ్‌ు చొరవతో ఔరంగజేబ్ కుమారుడు మహ్మద్‌కు, అబ్ధుల్లా కుతుబ్‌షా కుమార్తెనిచ్చి క్రీ॥శ॥ 1656లో వివాహం గావించినారు. నూతన దంపతులకు వారి రాజ్యంలో భాగమైన రామగిరిని కట్నముగా ఇచ్చినారు. ఔరంగజేబ్ కాలంలో, అతని కుమారుని పాలనలో రామగిరిని వారు విడిది ప్రదేశముగా ఉపయోగించుకున్నారు. కవి పండితులు షేఖ్ మొహియొద్దీన్, నసీరొద్దీన్ వంటివారు ఇచటికి వచ్చి కవితా గానం చేశారు. ఈ చారిత్రిక ప్రదేశం వద్ద ప్రధాన గేటు ప్రక్కన తెలుగు శాసనములు లభిస్తున్నాయి. క్రీ॥శే॥ 1556లో కుతుబ్‌షాహీల పాలనలో శాసనం చేసినారు. ఇది ప్రధాన ద్వారంకు ముందు భాగమున ఉన్నది.

గోల్కొండ: ఈ కోట కీ॥శ॥ 14 వ శతాబ్దికి చెందినది. కాకతీయుల కాలంలో దీనిని గొల్లకొండగా వర్ణించారు. హైదరాబాదు నగరానికి సమీపములోనే గల ఈ కోట తెలంగాణ ప్రాంతానికి మకుటాయమానంగా నిలుస్తున్నది. కీ॥శ॥ 1364 లో కాపయనాయకుడు బహమనీ సుల్తానులకు స్వాధీనం చేశాడు. కీ॥శ॥ 1512 తర్వాత కులీకుతుబ్ ఉల్ ముల్క్ స్వతంత్రుడై దీనిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఈ కోటకు ముర్తుజా నగర్ అని ఆయన పేరు పెట్టాడు. అనంతరం ఆయన కుమారులు దౌలత్ కుతుబ్‌షా, ఇబ్రహీం కుతుబ్‌షాల వారసత్వ పోరు నడిచింది. చివరికి ఇబ్రహీం వశమైనది. ఆయన ఈ కోటకు మరమత్తులు చేయించి విస్తరించినాడు. కీ॥శ॥ 1656 లో ఔరంగజేబ్ కుమారుడు మహ్మద్ సుల్తాన్ , తెలంగాణ గవర్నర్ హడీదాద్ ఖాన్‌లు ముట్టడించారు. దాడి నెదుర్కొనలేక కోటలోనే అబ్దుల్లా కుతుబ్‌షా తలదాచుకున్నాడు. సుల్తాన్ తల్లి హయత్ బక్షీ బేగం చొరవతో రాయబారం కుదిరింది. ఆ తర్వాత ఔరంగజేబ్ గొల్కొండ పై దాడికి దిగి నిరంతరాయంగా పోరాటం చేసి సుల్తాన్ విశ్వాసపాత్రుడు అబ్దుల్లా ఖాన్ కుట్రతో వశపరచుకున్నాడు. గొల్కొండ కోట ఎత్తైన కొండ రాతిపై నిర్మించబడింది. ప్రవేశద్వారం వద్ద సాంకేతిక పరిజ్ఞానంతో పైకి వినిపించేలా టెలిఫోన్ వ్యవస్థ లాంటివి ఆనాడే అమర్చుకున్నారు. ఇక్కడ రామదాసు బందిఖానా, కోశాగారం, ఆయుధాగారం, రాజప్రాసాదాలు, రాణివాసాలు వంటివి ఉన్నాయి. గొట్టాల ద్వారా నీరును పంపే విధానం ఆనాడే ఉన్నది.

భువనగరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కోట మొదట కళ్యాణ చాళుక్య చక్రవర్తి ఆరవ విజయాదిత్యునికి చెందింది.  పలుశాసనాల వల్ల ఈ కోట పలువురు పరిపాలించినట్లుగా తెలుస్తున్నది.  భువనగిరి కోటకు అధికారిగా లక్ష్మణదండనాయకుడున్నాడు.   కుతుబ్‌షాహీల ఆధీనంలో ఈ కోట ప్రసిద్ధిగాంచింది. దౌలత్ కుతుబ్‌షా, ఇబ్రహీంల మధ్య దాడుల్లో జగ్దేవ్‌రావు జోక్యం కలిగించుకొని దౌలత్ ను విడిపించి అమీన్ ఉల్ ముల్క్ పైకి పోరుకు వెళ్లాడు.  జగ్దేవ్‌రావును అతడు బంధించినట్లుగా తెలుస్తున్నది.  ఈ కోట విశాలమైన పర్వతంపై నిర్మించబడినది.  అతినునుపైన రాయిపై నిర్మించిన తీరు అప్పటి శిల్పనిర్మాణరీతులను తెలియజేస్తున్నది.

Comments

comments