జోరుమీదున్న శ్రీలంక

*నేడు బంగ్లాతో పోరు, ముక్కోణపు టోర్నీ కొలంబో: తొలి మ్యాచ్‌లో పటిష్టమైన టీమిండియాను ఓడించి జోరుమీదున్న ఆతిథ్య శ్రీలంక జట్టు శనివారం బంగ్లాదేశ్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. నిదహాస్ ముక్కోణపు టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న ట్వంటీ20 మ్యాచ్‌లో శ్రీలంక విజయమే లక్షంగా పెట్టుకుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఫైనల్ రేసులో నిలువాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి బంగ్లాకు నెలకొంది. ఇక సొంత […]

*నేడు బంగ్లాతో పోరు, ముక్కోణపు టోర్నీ

కొలంబో: తొలి మ్యాచ్‌లో పటిష్టమైన టీమిండియాను ఓడించి జోరుమీదున్న ఆతిథ్య శ్రీలంక జట్టు శనివారం బంగ్లాదేశ్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. నిదహాస్ ముక్కోణపు టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న ట్వంటీ20 మ్యాచ్‌లో శ్రీలంక విజయమే లక్షంగా పెట్టుకుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఫైనల్ రేసులో నిలువాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి బంగ్లాకు నెలకొంది. ఇక సొంత గడ్డపై శ్రీలంక జోరుమీదుంది. మొదటి మ్యాచ్‌లోనే బలమైన భారత్‌ను చిత్తు చేసి దూకుడు మీద ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన లంక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. కుశాల్ పెరీరా అద్భుత ఫాంలో ఉండడం లంకకు కలిసి వచ్చే అంశం. భారత్‌కు కుశాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు తహతహలాడుతున్నాడు. గుణతిలక, ఉపుల్ తరంగ, కుశాల్ మెండిస్, జీవన్ మెండిన్, కెప్టెన్ చండీమల్, ఆల్‌రౌండర్ తిసార పెరీరాలతో లంక చాలా బలంగా ఉంది. ఈ మ్యాచ్‌లోనూ లంక భారీ విజయంపై కన్నేసింది. ఇక, బౌలింగ్‌లో కూడా లంక చాలా పటిష్టంగా కనిపిస్తోంది. లక్మల్, జీవన్, శనక, అకిల ధనంజయ, నువాన్ ప్రదీప్, తిసార పెరీరా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో లంకను ఓడించడం బంగ్లాదేశ్‌కు అంత తేలిక కాదనే చెప్పాలి.
చావోరేవో: మరోవైపు బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనే అంతు బట్టకుండా మారింది. కీలక ఆటగాడు సాకిబ్ అల్ హసన్ గాయం వల్ల దూరం కావడంతో బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసం దెబ్బతింది. అతను లేని లోటు మొదటి మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. అయితే లంకతో జరిగే పోరులో మాత్రం చెలరేగి ఆడాలనే పట్టుదలతో బంగ్లా ఉంది. తొలి మ్యాచ్‌లో చేసిన పొరపాట్లకు తావు లేకుండా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. మహ్మదుల్లా, రహీం, తమీమ్, సౌమ్య సర్కార్, లిటన్ దాస్, ముస్తఫిజుర్ రహెమాన్ తదితరులతో బంగ్లా చాలా పటిష్టంగా ఉంది. కానీ, నిలకడలేమి జట్టుకు ప్రధాన అవరోధంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌లో నిలువాలనే పట్టుదలతో బంగ్లాదేశ్ సమరానికి సిద్ధమైంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో సమరం హోరాహోరీగా సాగడం ఖాయం.
శ్రీలంక: దినేష్ చండీమల్ (కెప్టెన్), ఉపుల్ తరంగ, దనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, దాసున్ శనక, కుశాల్ పెరీరా, జీవన్ మెండిస్, సురంగ లక్మల్, ఇసురు ఉడనా, అకిల ధనంజయ, అమిలా అపొన్సొ, నువాన్ ప్రదీప్, దుష్మంత చమీరా, ధనంజయ డిసిల్వా, తిసారా పెరీరా.
బంగ్లాదేశ్: మహ్మదుల్లా, తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, ముష్ఫికుర్ రహీం, షబ్బీర్ రహెమాన్, ముస్తఫిజుర్ రహెమాన్, రుబేల్ హుస్సేన్, అబు జయ్యద్, తస్కిన్ అహ్మద్, ఇమ్రూల్ కైస్, నూరుల్ హసన్, మెహది హసన్, ఆరిఫుల్ హక్, నజ్ముల్ హక్, అబు హైదర్ రోని, లిటన్ దాస్.

Comments

comments

Related Stories: