బోణీ రూ.200 కోట్లు

స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టయిన తొలి రోజునే బాండ్ల ద్వారా బల్దియా సేకరణ మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో : బాండ్లతో మొదటి దశలో రూ.200 కోట్ల నిధులు సమీకరించిన మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) అధికారికంగా ముంబా యి స్టాక్ ఎక్చేంజ్ లిస్టింగ్‌లో గురువారం నమోదైంది. జిహెచ్‌ఎంసి కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించిన ఈ లిస్టింగ్ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణరావు, అరవింద్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ […]

స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టయిన తొలి రోజునే బాండ్ల ద్వారా బల్దియా సేకరణ

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో : బాండ్లతో మొదటి దశలో రూ.200 కోట్ల నిధులు సమీకరించిన మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) అధికారికంగా ముంబా యి స్టాక్ ఎక్చేంజ్ లిస్టింగ్‌లో గురువారం నమోదైంది. జిహెచ్‌ఎంసి కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించిన ఈ లిస్టింగ్ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణరావు, అరవింద్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవిలతో పాటు కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, ఖమ్మం మేయర్ రూపాలాల్, నిజామాబాద్ మేయర్ ఆకుల లలిత, బిఎస్‌ఈ, ఎస్‌బిఐ, జిహెచ్‌ఎంసితో సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

బాండ్ల సేకరణ చేపట్టిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌లో పాల్గొన్న జిహెచ్‌ఎంసికి ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. హైదరాబాద్‌ను సిగ్నల్ రహిత నగరంగా చేయడానికి చేపట్టిన వ్యూహత్మక రహదారుల పథకం(ఎస్‌ఆర్‌డిపి) కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, ఆధాయ మార్గాల స్థిరత్వం, అంతర్గత వనరుల వృద్ది, మిగులు నిధులు తదితర అంశాల్లో జిహెచ్‌ఎంసిపై నమ్మకమైన సంస్థగా ఏఏ స్టేబుల్ రేటింగ్ సాధించటంతో బాండ్ల జారీ సులువైంది. దశల వారిగా ఎస్‌ఆర్‌డిపి కోసం రూ.వెయ్యి కోట్లను బల్దియా బాండ్ల రూపంలో సేకరించాలని నిర్ణయించగా, మొదటి దశలో రూ.200 కోట్లను సేకరించింది.

మౌలిక వసతులకు బాండ్ల ద్వారా నిధులు : మేయర్

మౌళిక వసతుల కల్పన కోసం అప్పు తెచ్చుకోవటం తప్పు కాదని, అప్పు కట్టే సామర్థం, ఆర్థిక క్రమశిక్షణ ఉంది కనుకే అభివృద్ది కోసం నిధులు సేకరిస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. అధికారికంగా ముంబాయి స్టాక్ ఎక్చేంజ్‌లో జిహెచ్‌ఎంసి లిస్టింగ్‌ను ఉన్నతాధికారులతో కలిసి బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. దేశంలో నాలుగువేల మున్సిపాలిటీలు ఉంటే, కేవలం జిహెచ్‌ఎంసి మాత్రమే ఆర్థిక స్థిరత్యంలో డబుల్ ఏఏ స్టేబుల్ సాధించిందన్నారు. సేకరించిన నిధులతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎస్‌ఆర్‌డిపి పనులు ఇక నుంచి మరింత వేగం పుంజుకోన్నాయని మేయర్ అన్నారు. దేశంలోనే పూణే నగరం తర్యాత ముంబాయి స్టాక్ ఎక్చేంజ్ ద్వారా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌తో జిహెచ్‌ఎంసి బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకుంటోందని అన్నారు.

బాండ్ల ద్వారా నిధుల సేకరణతో దేశంలోనే జిహెచ్‌ఎంసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, స్థానిక సంస్థలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతగా నిధులు సమకుర్చుకోవటం మిగితా మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు ఆదర్శమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ప్రశంసించారు. ప్రస్తుతం రేటింగ్ సంస్థల అంచనా ప్రకారం డబుల్ ఏ స్టేబుల్ స్థాయిని సాధించిన జిహెచ్‌ఎంసికి భవిష్యత్‌లో త్రిబుల్ ఏ పాజిటివ్ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాండ్ల సేకరణ ద్వారా జిహెచ్‌ఎంసి ముంబాయి స్టాక్ ఎక్చేంజ్ లిస్టింగ్‌లో నమోదు కావడం చారిత్రాత్మక ఘట్టమని అభినందించారు.

Related Stories: