బాపు బొమ్మరో…!

బుడుగు బొమ్మ వున్న కార్టూన్ కనిపించినా, వివిధ రచయితల పుస్తకాల మీదున్న ఆకర్ణణీయమైన కవర్ పేజీ మీదున్న బొమ్మను చూసినా, పదారణాల తెలుగమ్మాయి సంప్రదాయరీతిలో మూమూలుగా కనిపించినా, లేదా వెండితెరపై అగుపించినా ‘బాపు బొమ్మరో’ అంటారు అభిమానులు. కొన్ని సినిమాలు చూడగానే వాటిలోని ప్రత్యేకతలు ఇది బాపు మార్క్ చిత్రం అనిపింపజేస్తాయి. పిల్లలను ఆకట్టుకునేలా వీడియో పాఠాలు, అందరినీ ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా, ప్రత్యేక తరహాలో దర్శకుడుగా సినిమాలు తీయడం బాపుకే చెల్లు. గోదావరి అందాలు చూపుతూ ఊరి […]

బుడుగు బొమ్మ వున్న కార్టూన్ కనిపించినా, వివిధ రచయితల పుస్తకాల మీదున్న ఆకర్ణణీయమైన కవర్ పేజీ మీదున్న బొమ్మను చూసినా, పదారణాల తెలుగమ్మాయి సంప్రదాయరీతిలో మూమూలుగా కనిపించినా, లేదా వెండితెరపై అగుపించినా ‘బాపు బొమ్మరో’ అంటారు అభిమానులు. కొన్ని సినిమాలు చూడగానే వాటిలోని ప్రత్యేకతలు ఇది బాపు మార్క్ చిత్రం అనిపింపజేస్తాయి. పిల్లలను ఆకట్టుకునేలా వీడియో పాఠాలు, అందరినీ ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా, ప్రత్యేక తరహాలో దర్శకుడుగా సినిమాలు తీయడం బాపుకే చెల్లు.

గోదావరి అందాలు చూపుతూ ఊరి రౌడీకి భయపడే అమాయకుడి కథను వివరించే ‘సాక్షి’, గోదావరి నది అందాలు, రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు వెన్నెల్లో పడవల మీద చూపిస్తూ, రామభక్తిని, ఆకలి బాధను, తీతా (తీసేసిన తాసిల్దారు ప్రహసనం) జోక్‌లతో ‘అందాల రాముడు’, భక్తితత్పరత, సామాజిక వర్తనను వివరించే బుద్ధిమంతుడు, రామాయణకథ ఆధారంగా రూపొందిన పౌరాణిక చిత్రాలు, ఉత్తర రామాయణ కథతో తీసిన ‘ముత్యాల ముగ్గు’, సతూకోమంటూ మారాం చేసి యజమాని కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న ‘రాంబంటు’, ఉద్యోగం కోసం అబద్దాలు చెప్పి, ఒకే చోట ఉద్యోగంలో చేరిన దంపతుల అల్లరి తెలిపే‘పెళ్లి పుస్తకం’, భారతాన్ని సోషలైజ్ చేస్తూ యువకులతో తీసిన ‘మనవూరి పాండవులు’ ఇవన్నీ బాపులోని కళాకారుణ్ణి, సృజనశీలిని, ఆయనలోని వైవిధ్యాన్ని వివరిస్తాయి. ఇందుకు కారణం చిన్నతనంలోనే మద్రాసులో పరిచయమై చిన్ననాటి స్నేహంలోనే ఇడ్లీ పచ్చడిలా మెప్పించడానికి, పెద్దయ్యాక దర్శకుడు, అవడానికి కారకుడై చివరి వరకు ‘స్నేహం’ మాధుర్యాన్ని చాటిన ముళ్లపూడి వెంకటరమణ. ఇది ఎంతవరకు అంటే బాపు అనగానే ముళ్లపూడి, ముళ్ల్లపూడి అనగానే బాపు గుర్తువచ్చేంత వరకు. అంతేకాదు బాపు సినిమా అంటే ముళ్లపూడి కథ, డైలాగ్స్‌లో విరుపులు, హాస్యం తప్పనిసరి అనేంతవరకు. మరో విషయం వీరిలో ఎవరి గురించి రాయాలన్నా రెండో వారు ఆటోమేటిగ్గా దూరిపోతారు. దూరిపోయేంత గాఢమైన మైత్రీబంధం అన్నమాట. ప.గో-తూ.గో (పశ్చిగోదావరి బాపుది, తూర్పు గోదావరి ముళ్లపూడిది) బంధం చెన్నపట్నంలో సిసలైన తుమ్మజిగురుగా ఇప్పటి ఫెవికాల్ మాదిరిగా అంటుకు పోయేలా చేసిందంటే అది ఎన్ని జన్మల బొమ్మమాటల (పత్రికా )బంధమో మరి!

తెలుగమ్మాయి (విజయనిర్మల, వాణిశ్రీ, జయప్రద, సంగీత, ఆమని, దివ్యవాణి వగైరా) పరాయి భాష, పర రాష్ట్ర అమ్మాయి (లత , స్నేహ, పూర్ణిమా జయరాం, సుహాసిని, నయనతార) అయినా కట్టుబొట్టులో, జడ విసురుడులో, ముగ్ధలా కనిపించడంలో అసలు సిసలు పదారణాల ‘తెలుగమ్మాయి’అయిపోయి మంచి అనుభూతిని కలిగిస్తారు.

సత్తిరాజు సూర్యకాంతం, వేణుగోపాలరావు దంపతులకు నర్సాపురంలో 1933, డిసెంబర్ 15-న జన్మించాక పెట్టిన పేరు లక్ష్మీనారాయణ. తరువాత తల్లిదండ్రులతో మద్రాసుకు మకాం మార్చారు. మళ్లీ 19421948 మధ్య నర్సాపురంలో చదివారు. తరువాత మద్రాసుకు మకాం. చిన్నతనం నుంచే బొమ్మలు వేయడం అలవాటు. ముళ్లపూడి వెంకటరమణ రాసిన కథకు 12వ ఏట బాపు వేసిన బొమ్మతో ‘బాల’ అనే పిల్లల పత్రికలో ప్రచురణ అయింది. అది కొనసాగుతూ వచ్చింది. ఆ వయసులోనే బాపు వేసిన బొమ్మతో తన కథ పట్టుకుని ఎడిటర్ విద్వాన్ విశ్వం దగ్గరకు ముళ్లపూడి వెడితే ఇడ్లీ కంటే చట్నీ బాగుందనడం విశేషమే. బాపు బి.కాం డిగ్రీ తీసుకున్నాక బి.ఎల్. కూడా చదివారు. ముళ్లపూడి పత్రికలో చేరి కథలు గట్రా రాస్తుంటే వాటికి బొమ్మలు వేయడమే కాక, ఆంధ్రపత్రికకు, పుస్తకాలకు బొమ్మలు , కార్టూన్లు వేసేవారు బాపు. ముళ్లపూడి సినీ రచయిత అయి విజృంభించాక, దర్శకులకి సంబంధించి ఎలాంటి శిక్షణా ఎవరి దగ్గర తీసుకోకుండానే కృష్ణ, విజయనిర్మల, విజయలలిత ప్రభృతులతో ‘సాక్షి’ చిత్రానికి దర్శకుడయ్యారు. ఆ సినిమా 1967లో విడుదలయ్యాక, ఇది ‘సాక్షి’నామ సంవత్సరం అని ప్రకటనలు గుప్పించినపుడు చాలా మంది తెలుగులోని 60 సంవత్సరాల లిస్టుని పదే పదే చూసి సాక్షినామ సంవత్సరం లేదే, కనిపించడం లేదే అనుకోవడం చిత్రమే. పెయింటర్‌గా, కార్టూనిస్టుగా, డిజైనర్‌గాను గుర్తింపు పొందారు సంగీత ప్రియుడు. ఆయన ఇంటి నిండా రికార్డులే.

సినిమా స్క్రిప్ట్ తయారయ్యాక పాత్రధారుల నటనకి సంబంధించి బాపు వేసే బొమ్మలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయా నటీనటులు పాత్రలోకి సులువుగా పరకాయ ప్రవేశం చేయవచ్చు.అక్కినేని ఒక సందర్భంలో మాట్లాడుతూ “ బాపు ప్రతిషాట్‌కి బొమ్మలు వేస్తారు. వాటిని ఫాలో అయితే పాత్రలో మమేకం అయిపోవచ్చు. ‘బుద్దిమంతుడు’ ఇతివృత్తం విని రెండు పాత్రలూ ఇష్టపడి చేసాను. అందాల రాముడు కూడా అంతే. నయనతారకు ‘శ్రీరామరాజ్యం’లో సీతగా అంత గుర్తింపు వచ్చిందంటే బాపు వేసిన బొమ్మలను ఆమె అవగాహన చేసుకున్నందుననే. బాపు తీసేవి దృశ్య కావ్యాలు. రావలసినంత పేరు ఆయనకు రాలేదు“ అన్నారు.

‘సీతా కల్యాణం’లోని గంగావతరణం దృశ్యాలు, ‘బాలరాజు కథ’లో మహాబలిపురం దృశ్యాలు, పాటలు, బాలుడి నటన , ‘రాజాధిరాజు’ చిత్రంలో కొత్త దేవుడు (నూతన్ ప్రసాద్) గెటప్ డైలాగ్స్, ‘ముత్యాల ముగ్గు’, ‘కలియుగ రావణాసుడు’లో రావు గోపాలరావు డైలాగ్స్, ‘మనవూరి పాండవులు’ చిత్రంలో చిరంజీవి, మురళీమోహన్, నేటి కృష్ణుడుగా కృష్ణంరాజు, ‘అందాల రాముడు’లో తీతాగా అల్లు, ఆకలికి అలమటించిన జమిందార్‌గా నాగభూషణం, ‘పెళ్ళి పుస్తకం’, ‘మిస్టర్ పెళ్ళాం’, ‘రాంబంటు’ చిత్రాలలో రాజేంద్రప్రసాద్ ప్రభు ృతుల నటన, చిత్రీకరణ, దృశ్య సౌందర్యం వర్ణనాతీతం. పాటలు, పాటల్లోని సాహిత్యం వాటిని చిత్రీకరించిన తీరు అద్భుతం.

రామభక్తుడైన బాపు, హనుమంతుడునే ఆరాధిస్తారు. ఆయన చాలా చిత్రాల్లోని కథలు, పాత్రలు రామాయణంలోంచి వచ్చినవే.బాపు సాధారణంగా ఉచితంగానే రచయితలు అడిగితే వారి పుస్తకాలకు కవర్ పేజీ బొమ్మ వేసేవారు. ఒక జోక్ కూడా వుంది“ బాపు నా పుస్తకానికి బొమ్మ వేస్తానన్నారు. మూడు వేలు తీసుకున్నారు” అని ఓ రచయిత చెప్పాడు.” బొమ్మ వేయడానికా” అని మిత్రుడు అడిగితే “ కాదు పుస్తకం చదవడానికి” అని వినీవినబడకుండా బదులిచ్చాడు. రామాయణ విషవృక్షం రచించిన ముప్పాళ్ల రంగనాయకమ్మ ముఖ చిత్రం వేయమని కోరుతూ బ్లాంక్ చెక్ పంపారట. బ్లాంక్ చెక్ అంటే ఆయన దాని మీద ఎంత డబ్బు అయినా రాసుకోవచ్చు, మార్చుకుని తీసుకోవచ్చు. కొంత కాలం తర్వాత పోస్టులో రంగనాయకమ్మకు కవరు చేరింది. బొమ్మ కోసం ఆత్రంగా విప్పితే ముఖ చిత్రం లేదు గానీ, చెక్కు వెనుక ‘ రామ రామ రామ రామ’ అని రాసిన బాపు మాటలు ఉన్నాయట.

‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని శోభన్‌బాబు, చంద్రకళ ప్రభృతులతో తీసిన తర్వాత ఎన్.టి.రామారావు బాపు రమణ, శోభన్‌లపై అలిగారు. కొంత కాలం తరువాత ప్రింట్ తెప్పించుకుని చూసి ఆనందించారు. ఆయనే ముఖ్యమంత్రి అయ్యాక పిల్లలకు వీడియో పాఠాలు తీయడానికి ఎందరు అభ్యంతర పెట్టినా బాపు రమణ బెస్ట్ అని ఆ ప్రాజెక్ట్ వారికి అప్పగించారు. అంతేకాదు తాను నిర్మించే ‘శ్రీనాథ కవిసార్వభౌమ‘ చిత్రానికి రచన, దర్శకత్వ బాధ్యతలను రమణ బాపులకు కల్చించారు.

‘సీతా కళ్యాణం’ చిత్రం అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడమే కాకుండా బ్రిటిష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఆ చిత్రాన్ని ఒక కోర్సుగా పెట్టారు. 10 హిందీ చిత్రాలు, 1 తమిళ చిత్రం, 37 తెలుగు చిత్రాలకు దర్శకత్వం నెరిపారు.‘ శ్రీరామరాజ్యం’ ఆయన దర్వకత్వం వహించిన చివరి చిత్రం. ‘బాలరాజుకథ’, ‘అందాలరాముడు’, ‘ముత్యాల ముగు’్గ, ‘పెళ్లి పుస్తకం’, ’మిస్టర్ పెళ్ళాం’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాలకు ఉత్తమ చిత్ర దర్శకుడిగా నంది అవార్డులు లభించాయి. 2014 ఆగష్టు 31న పరమపదించారు.

Comments

comments