తెలుగును బతికించుకున్నతెలంగాణం

తెలుగు మహాసభల సందర్భంగా భాషా నిలయాల్లో (హైద్రాబాద్, హన్మకొండలతోపాటు కొన్ని మాత్రమే మనుగడలో ఉన్నాయి) సమావేశాలు నిర్వహించి ఆనాటి భాషాసేవకుల గురించి ఉపన్యాసాలు చేయించాలి. భాషా సేవకుల పేర్లతో వేదికలు, ద్వారాలు నిర్మించాలి. మరుగున పడ్డ భాషా ప్రక్రియావిష్కర్తల ఘనతను వెలికి తేవడంతో పాటు మనుగడ కోల్పోయే ప్రమాదములోనున్న తెలుగు భాషకు జవజీవాలూదిన భాషా సేవకుల త్యాగాలను స్మరించుకొని భావితరాలకు తెలియజెప్పడం అంతే అవసరం. తెలుగు మహాసభలు 2017ను ప్రకటిస్తూ తెలంగాణలో రూపొందిన పలు భాషాప్రక్రియలు, వాటి […]

తెలుగు మహాసభల సందర్భంగా భాషా నిలయాల్లో (హైద్రాబాద్, హన్మకొండలతోపాటు కొన్ని మాత్రమే మనుగడలో ఉన్నాయి) సమావేశాలు నిర్వహించి ఆనాటి భాషాసేవకుల గురించి ఉపన్యాసాలు చేయించాలి. భాషా సేవకుల పేర్లతో వేదికలు, ద్వారాలు నిర్మించాలి. మరుగున పడ్డ భాషా ప్రక్రియావిష్కర్తల ఘనతను వెలికి తేవడంతో పాటు మనుగడ కోల్పోయే ప్రమాదములోనున్న తెలుగు భాషకు జవజీవాలూదిన భాషా సేవకుల త్యాగాలను స్మరించుకొని భావితరాలకు తెలియజెప్పడం అంతే అవసరం.

తెలుగు మహాసభలు 2017ను ప్రకటిస్తూ తెలంగాణలో రూపొందిన పలు భాషాప్రక్రియలు, వాటి ఆవిష్కర్తల గురించి ముఖ్యమంత్రి వివరించిన తీరు అద్భుతం. ఆయన మాతృభాషా రసజ్ఞతకు తెలంగాణా బిడ్డలతోపాటు తెలుగు వారందరూ జోహార్లు చెప్పాల్సిందే.వంద సంవత్సరాల క్రితం తెలంగాణకున్న పరిస్థితులు వేరు. బ్రిటీషాంధ్రలో భాషావ్యాప్తి, విద్యావ్యాప్తి, గ్రంథాలయా ల స్థాపనకు బ్రిటీష్ ప్రభుత్వం నుండి ప్రతికూలతలేదు. బ్రిటీషాంధ్రలోని మునగాల, చల్లపల్లి, పెద్దాపురం, బొబ్బిలి, గజపతినగరం వంటి సంస్థానాధీశులెందరో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకారం అందించారు.

తెలంగాణలో తెలుగుభాషదొక ప్రత్యేక పరిస్థితి. ప్రజల భాషపై పాలకుల అప్రకటిత నిషేధం, తల్లి భాషపట్ల పాలితుల నిరాసక్తతలతో మాతృభాష ‘మృతభాష’గా మారే ప్రమాదం వాటిల్లింది. తెలుగు మాతృభాషగాగల అనేక కులీన కుటుంబా లు ఇంట్లో సైతం స్త్రీ పురుష బేధం లేకుండా ఉర్దూలోనే మాట్లాడుకునేవారు. దర్బారు వేషధారణనే అనుకరించేవారు. దీంతో, తెలుగుభాష మనుగడకే ముప్పు వాటిల్లింది. భాషలో ఎంతటి గొప్పసాహిత్యమున్నప్పటికీ పాలన, విద్యాబోధనలలో ఆ భాష లేకపోతే క్రమంగా మృతభాషగా మారుతుంది. ‘సర్కారీ వ్యవహారమంతా ఉర్దూలో కొనసాగు తుండగా చచ్చిపోయిన తెలుగును బయటకు గుంజవలసిన పనిలేదు’ అని సిరిసిల్ల తాశీల్దార్ పేర్కొన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నేడు పాలివాడు (దాయాది)మనది భాషే కాదం టే నాడు పాలకుడు మనకు భాషే లేదన్నాడు. మునగాల రాజా నాయని వెంకట రంగారావు, ఆయన దీవాన్ కొమర్రాజు లక్ష్మణరావు, జాగీర్దార్ రావిచెట్టు రంగారావు కలిసి సెప్టెంబర్ 1,1901న రావిచెట్టు రంగారావుగారి బంగళాలో శ్రీకృష్ణదేవ రాయాంధ్రభాషానిలయం ప్రారంభించారు. ‘కానీ భాషా నిలయ నిర్వాహకులాశించినంతగా పౌరుల స్పందన లేదు.

సంస్కారమన్న భయపడు మనవారికిట్టు క్రొత్త పద్ధతి మొట్టమొదలు రుచించలేదు. పూర్వాచరణపరాయణులిది సంస్కారోద్యమమని భయపడిరి. ఇంగ్లీషు, ఉర్దూ భాషల వ్యామోహాలలో బడిన మహా శయులు తెలుగుభాషనే వగించుచుండిరి. ఇట్టి పరిస్థితులలో భాషోద్యమ తత్త్వమును బోధించి, అభిప్రాయబేధములు మాన్పి, నిలయపు అభివృద్ధికై పాటుపడిన మహనీయుల శ్రమనూహించాల్సిందేకాని వ్రాయుటకలవికాదు’ అని బూర్గుల రామకృష్ణారావు రాశారు. తదుపరి హన్మకొండలో 1904లో శ్రీరాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయ వ్యవస్థాపనతో మొదలైన భాషానిలయోద్యమం 1927 వరకు 60కిపైగా భాషానిలయాలుగా వికసించింది. భాషావికాసంతోపాటు విజ్ఞాన విస్తరణ సేవలందించిన భాషానిలయాలు నిజాం పోలీసుల నిఘా మొదలు రజాకార్ల దాడులవరకు ఎన్నెన్నో ప్రతికూలతలను ఎదుర్కొన్నాయి. విధిలేని పరిస్థితుల్లో కొన్ని మూతబడితే, మరికొన్ని రహస్యంగా కొనసాగాయి. రావిచెట్టు రంగారావు, మాదిరాజు రామకోటీశ్వరరావు, కాళోజీ వంటి ఉద్యమ కారులు పోలీసు నిఘాను ఎదుర్కొన్నా రు.

భాషానిలయాల సైద్ధాంతిక పునాదిని సురవరం వారు చక్కగా వివరించారు. దీనికి గ్రంథాలయమని పేరిడక ‘భాషా నిలయమని’ విపులనామకరణం చేయుటలో రహస్యం మనం తెలుసుకొనుట మంచిది. ఈ సంస్థ యందు కేవలం పుస్తకములు సేకరించుటయే స్థాపకుల యుద్దేశమైనట్లు కనిపించదు. ఈ భాషానిలయం ద్వారా ఆంధ్ర భాషామతల్లికి విపులమైన సేవజేసి పోతనాదుల జన్మస్థలమైన ఈ తెలంగాణ గడ్డమీద తిరిగి పోతనాదులవతరించుటకు అనుకూలమైన పరిస్థితులు కల్పించుట ధ్యేయంగా నిలయపు పూర్వనిర్వాహకులు భాషానిలయము యొక్క గ్రంథాలయ భాగమును అత్యంత శ్రద్ధతో వృద్ధినొందించిరి” అని గోల్కొండ పత్రిక తన 07.10. 1937వ తేదీ సంపాదకీయంలో పేర్కొంది.తెలంగాణలో వ్యవస్థీకృత విద్యాబోధన పాదుకోనికాలం లో ఉదర పోషణార్థం ఐనప్పటికీ తెలుగులో విద్యావ్యాప్తికి కృషిచేసిన సాతాని గురువులు నిత్యస్మరణీయులు. శ్రీకృష్ణదేవ రాయాంధ్ర భాషానిలయ వ్యవస్థాపకులు మాతృభాషలో విద్యాబోధనకుగాను భాషానిలయానికి అనుబంధంగా ఒక పాఠశాలను నెలకొల్పారు.

భాషానిలయాలు ఆంధ్ర జన సంఘం(1921), ఆంధ్రమహాసభ (1931)లకు నిర్మాణా నికి కావలసిన పూర్వరంగాన్నీ, ప్రజాచైతన్యాన్ని సిద్ధం చేశాయి. ‘సంఘవిద్రోహులకు, తాబేదార్లకూ దొరల గడీలు స్థావరమైతే, సామాజిక మార్పుకోరేవారికి భాషానిలయాలు వేదికలయ్యా యని’ ప్రముఖ కవి, సాహిత్య విమర్శకులు వరవరరావు రాశారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి అను బంధంగా పుస్తక ప్రచురణకోసం విజ్ఞాన చంద్రికా మండలి ఏర్పడింది. ఈ సంస్థ బ్రిటీషాంధ్ర(ప్రస్తుత ఆంధ్రప్రదేశ్), నైజామాంధ్ర (ప్రస్తుత తెలంగాణ) ప్రాంతాల సంయుక్త సంస్థ. “మున్ముందు రూపొందబోయే తెలంగాణ ఆకాంక్షలకు చాలా ముందుగానే ప్రాతినిధ్యం వహించింది రావిచెట్టు రంగారావు. కేవలం గ్రంథాలయాల స్థాపన, విజ్ఞాన చంద్రిక నిర్వహణల్లో భాగస్వామ్యం- మాత్రమే అయితే రావిచెట్టు రంగారావు ప్రాధాన్యం అంతవరకే ఉండేది.

ఈ మొత్తం కార్యాచరణలో ఆయన వైఖరి, దీక్ష, సామాజిక దృష్టి ఇక్కడ కీలకమయినవి. ఆయన స్వయంగా ఏమీ రాయకపోయినా ఆయన జీవితమే గొప్ప చారిత్రక సాక్ష్యంగా నిలిచి ఉంది” అని కె. శ్రీనివాస్ తన ‘తెలంగాణ సాహిత్య వికాసం’లో పేర్కొ న్నారు. తెలంగాణలో నెలకొన్న భాషానిలయాలకు అనుబంధంగా పలు యువజన సంఘాలు, మహిళా సంఘాలు, రచయితలు, సాహిత్య, సాంస్కృతిక, నాటక సంఘాలు ఏర్పడ్డాయి. తెలంగాణ చరిత్రకారులు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని తెలంగాణ పునర్వికాస కేంద్రంగా పేర్కొన్నారు. నాడు పాలకులు మాతృభాషను ప్రజల నుండి బలవంతంగా దూరం చేయాలని ప్రయత్నిస్తే, నేడు యల్‌పిజి (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) ప్రభావంతో ప్రజానీకం స్వచ్ఛందంగా తమ మాతృభాషను దూరం చేసుకుంటున్నది. వాస్తవానికి మాతృభాష ఇతర భాషలకు వ్యతిరేకం కాదు.

మాతృభాషలో ప్రావీణ్యతగలవారు ఇతర భాషలను సులభం గా నేర్చుకోగలుగుతారు. “బతుకు దెరువు కోసం భాషలెన్ని నేర్చినా అమ్మ భాషనదేల మానవలయు” అన్నారు ఆదిపూడి సోమనాధరావు. తమ మాతృభాషను తెలంగాణ ప్రజలు కాపాడుకున్న తీరు సైతం ప్రత్యేకం. ఇటువంటి ప్రయోగం దేశంలో గానీ, ఇతర దేశాల్లో గానీ జరగలేదంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మ తీరుగనే భాషానిలయం తెలంగాణ సొంతం. మాతృభాష మనుగడ కోసం భాషానిలయాలు చేసిన సేవ నభూతో న భవిష్యతి.“సంవత్సరకాలపు జీవితం కోసం పథకాలు రచిస్తే వరిపండించు, పదేళ్ళకోసం పథకాలు రాస్తే పండ్లతోటలు పెంచు, శతాబ్దం కోసం ఆలోచిస్తే చిన్నారులకు విద్య నేర్పించు” అన్నారు చైనా తత్వవేత్త కన్ఫూషియస్. తెలంగాణ ప్రభుత్వం తన ప్రజల మౌలికావసరాలైన మంచినీరు, సాగునీరు వంటి ప్రాథమిక సమస్యలను అధిగమించింది. దశాబ్దాల కాలంపాటు ఉపాధికల్పించే పరిశ్రమల నిర్మాణాన్ని పట్టాలెక్కించింది. భావితరాల భవిష్యత్ కోసం వందలాదిగా ఆవాస పాఠశాలలను నెలకొల్పింది. సమాజానికి మాతృభాష, విజ్ఞానార్జన జీవన విధానం కావాలంటే భాషానిలయాలు ఏకైక మార్గం. దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం మాతృభాషా నిలయాలను నెలకొల్పడం ద్వారా ప్రపంచానికి మాతృభాష, విజ్ఞానార్జనలను జంటగా అభివృద్ధి చేసే మార్గాన్ని చూపించవచ్చు.

తెలుగు మహాసభల సందర్భంగా భాషా నిలయాల్లో (హైద్రాబాద్, హన్మకొండలతోపాటు కొన్ని మాత్రమే మనుగడ లో ఉన్నాయి) సమావేశాలు నిర్వహించి ఆనాటి భాషాసేవకుల గురించి ఉపన్యాసాలు చేయించాలి. భాషా సేవకుల పేర్ల తో వేదికలు, ద్వారాలు నిర్మించాలి. మరుగున పడ్డ భాషా
ప్రక్రియావిష్కర్తల ఘనతను వెలికి తేవడంతో పాటు మనుగడ కోల్పోయే ప్రమాదములోనున్న తెలుగు భాషకు జవజీవాలూదిన భాషాసేవకుల త్యాగాలను స్మరించుకొని భావితరాలకు తెలియజెప్పడం అంతే అవసరం. మహాసభల నిర్వాహకులు ఈ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.
* రావిచెట్టు రాజేశ్వరరావు

Comments

comments