ఇవ్వడం గొప్ప?.. తీసుకోవడం గోప్ప?

ఇది అనాదికాలంగా అందర్నీ వేధిస్తున్న సమస్య. ఇవ్వడం అంటే నీ దగ్గర ఉన్నదాన్ని మరొకరికి ఇచ్చేయడం. తీసుకోవడం అంటే ఎవరైనా ఇస్తే తీసుకోవడం. ఎవ్వరూ పట్టించుకోని వస్తువు ఏదైనా కనిపించినా దాన్ని తీసుకునే హక్కు నీకు ఉండదు. ఎందుకంటే అది నీది కాదు కనుక. ఏ వస్తువైనా పూర్తి హక్కుభుక్తాలతో నీ చేత పడితేనే నీదవుతుంది. ఈ వస్తువు నీ దగ్గర ఉంచు అని ఎవరైనా ఇచ్చిపోతే దాని సంరక్షణ బాధ్యతలు నీకు సంక్రమిస్తాయే తప్ప దాన్ని […]

ఇది అనాదికాలంగా అందర్నీ వేధిస్తున్న సమస్య. ఇవ్వడం అంటే నీ దగ్గర ఉన్నదాన్ని మరొకరికి ఇచ్చేయడం. తీసుకోవడం అంటే ఎవరైనా ఇస్తే తీసుకోవడం. ఎవ్వరూ పట్టించుకోని వస్తువు ఏదైనా కనిపించినా దాన్ని తీసుకునే హక్కు నీకు ఉండదు. ఎందుకంటే అది నీది కాదు కనుక. ఏ వస్తువైనా పూర్తి హక్కుభుక్తాలతో నీ చేత పడితేనే నీదవుతుంది. ఈ వస్తువు నీ దగ్గర ఉంచు అని ఎవరైనా ఇచ్చిపోతే దాని సంరక్షణ బాధ్యతలు నీకు సంక్రమిస్తాయే తప్ప దాన్ని వాడుకునే హక్కు..అధికారం నీకు రాదు. ఆ ఇచ్చేవాడు నీకు మీ ఆవిడకు కూడా అని షరతు విధిస్తే ఆ వస్తువు మీద అధికారం పూర్తిగా నీకు రాదు. నిజానికి అలా అనకపోయినా నీ చేతికందినదాన్ని నీ వారితో కలిసి పంచుకోవాలనే నైతిక ధర్మం నీడలా వెన్నంటే ఉంటుంది. ఈ మాట ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. ఏది దొరికినా దాన్ని స్వార్థంగా తినేయకుండా, తాగేయకుండా నీవారితో కలిసిపంచుకోవాలన్నదే మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇవ్వడమంటే ఏమిటో తెలిసింది..తీసుకోవడమంటే ఏమిటో తెలిసింది. ఈ రెండిటిలో ఏది గొప్పది? ఇవ్వడమా? తీసుకోవడమా? అంటే ఖచ్చితంగా ఇవ్వడమే గొప్పదని చెప్పాలి. ఇవ్వాలంటే ఏదైనా నీ దగ్గర ఉండాలి కదా..! ఏమిటి ఉండాలి? మణులా..మాణిక్యాలా? ధనమా? దస్కమా?… ఏదీకాదు.. ఏది ఉన్నా..ఎన్ని ఉన్నా.. ఎంత ఉన్నా.. సుఖంలేదు. ఇవ్వాలనే బుద్ధి లేకపోయినాక..ఎన్ని ఉన్నా సుఖంలేదు. ఇతరులకు ఇంతపెట్టాలనే గుణాన్నే దాతృత్వం అంటారు. ఆ గుణం కలిగిన బుద్ధిని వదాన్యత అంటారు. వదాన్యత ఉండాలంటే మనసులో ఔదార్యం ఉండాలి. ఇది ఉంటేనే ఇతరులకు ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆలోచన కలుగుతుంది. కంటిలో చెమ్మ, హృదయంలో ఆర్ద్రత ఉంటేనే ఈ బుద్ధి సారవంతంగా ఉంటుంది. ఇవ్వాలనే కోరిక ఉంటే ఆస్తులు అంతస్తులు లేకపోయినా, వందలు వేలు చేతిలో ఆడకపోయినా ఉన్నదాంట్లోంచే ఏదో ఒకటి ఇవ్వగలుగుతాం. అలా ఇవ్వడంలో ఉన్న తృప్తికి కొలమానంలేదు. ఒకసారి మదర్ థెరిసాకు తన ఆశ్రమం ముందే ఒక బిచ్చగాడు కనిపించాడు. ఆమె చేసే సేవలకు ముగ్ధుడై తాను కూడా ఏదో ఒకటి ఎంతో కొంత ఇవ్వాలనుకున్నాడు. కానీ కటికపేద. ఏమి ఇవ్వగలడు? ఒక రోజంతా కష్టపడి అడుక్కుంటే కనాకష్టంగా రూపాయిపోగైంది. అంత తక్కువ మొత్తం ఇవ్వడానికి సిగ్గేసింది. మదర్ తానిచ్చే రూపాయి తీసుకుంటుందా? అనే భయంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. మదర్ బైటికెళ్ళి వస్తుండగా తన మనసులో మాట ఆమెకి చెప్పాడు. మదర్ ధర్మంసకటంలో పడింది. రోజంతా కష్టపడితే వచ్చిన ఆ ఒక్క రూపాయే అతనికి ఆధారం. దాన్ని కూడా తీసేసుకుంటే అతను ఆ రోజు పస్తుతో మాడిపోతాడు. తీసుకోకపోతే నేను బిచ్చగాణ్ణి, ఏమీలేని వాణ్ణని కదా అమ్మ తీసుకోలేదు అని ఆత్మన్యూనతతో చితికి పోతాడు. తీసుకుంటే అమ్మకు నేను కూడా ఒక రూపాయి ఇవ్వగలిగాను కదా అని ఆనందపడతాడు. ఆ ఆనందం కోట్లిచ్చినా కొనలేనిది. ఆ సంబరంతో అతను జీవితకాలం బతికేస్తాడు. అతని ఆర్థికస్థితి చూసి జాలితో తిరస్కరించి బాధపెట్టేకన్నా దాన్ని తీసుకుని బతికించడమే మంచిపని అనుకున్న మదర్ ఆ రూపాయి తీసుకుంది. దానికి ఎంతగానో ఆనందపడ్డాడు ఆ బిచ్చగాడు. ఆ తర్వాత అతనికి మంచి బట్టలు, అన్నంపెట్టి ఎంతగానో ఆదరించింది. అదీ ఇవ్వడంలో ఉన్న పరమానందం. ఇవ్వడంలో ఆనందమేకాదు స్ట్రెస్‌తగ్గించే లక్షణం ఉంటుంది. అందువల్ల దాత హాయిగా ఉంటాడు. తీసుకున్న వాడికి అవసరం తీరుతుంది. అతనూ  హాయిగా ఉంటాడు. సాయం అందుకున్నవాడు ఆ తర్వాత ఎంతైనా సంపాదిస్తాడు కాని దాత మాత్రం గుండెమీద చేయివేసుకుని ఆరాంగా నిద్రపోగలుగుతాడు. సినీకవి ఆరుద్ర అన్నట్టు ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదు. కనుక ఇవ్వడం నేర్చుకోండి. అందువల్ల నలుగురితో ఆనందంగా కలిసి జీవించడానికి మార్గం సుగమమవుతుంది. చక్కని సాంఘిక జీవనం బాగుపడుతుంది. ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇవ్వకపోతారా అని ఎదురుచూసేవాడు స్వార్థపరుడు. మహా పిసినారి. ఎన్ని ఉన్నా  వాడికి ఇవ్వడానికి చేతులు రావు. ఒకసారి రాము, సోము పడవలో వెళ్తున్నారు. అనుకోకుండా పడవమునిగిపోయింది. ప్రాణాలతో బైటపడడమే ధ్యేయంగా ఇద్దరూ నీళ్ళలోకి దూకేశారు. కానీ ఇద్దరికీ ఈతరాదు. సోము మునిగిపోయేలా ఉన్నాడని దయతలచి రాము చెయ్యి ఇవ్వండి ఒడ్డుకు లాక్కుపోతానని తన చెయ్యి చాచాడు. ఇవ్వడం మా ఇంటా వంటా లేదని సోము చేయి ఇవ్వలేదు. ఆ వెంటనే విషయం అర్థమైన రాము తన చేయిని చాచి బాబూ నా చేయి అందుకో అన్నాడు. తీసుకో అన్న మాట వినబడిందే తడవుగా సోము రాము చేయి అందుకున్నాడు. తీసుకోవడమే లక్షంగా పెట్టుకుని బతికేవాడి తీరు ఇలా ఉంటుంది. కనుక దీన్ని మానుకోవాలి.

Comments

comments