గడ్కరీ గంగ ప్రక్షాళన కల

ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మక పథకం ‘గంగ ప్రక్షాళన’ను గడువులోగా పూర్తి చేయాలంటే కొత్తగా ఆ శాఖను చేపట్టిన మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రదండం వంటిది ఇవ్వాలి తప్ప మరోమార్గం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటె ఏడాది ముందు అంటే 2018నాటికి కాలుష్యంతో గంగానది అంతరించి పోకుండా పునరుజ్జీవింప చేయాలి. నదుల గురించిన పరిజ్ఞానం గడ్కరీకి తగు మాత్రమే ఉంది.నిష్ణాతులైన నిపుణుల బృందం తో కలిసి పనిచేయడానికి మంత్రి ఆసక్తి చూపటం లేదు. నదుల డెల్టా, పరిసరాలలో […]

ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మక పథకం ‘గంగ ప్రక్షాళన’ను గడువులోగా పూర్తి చేయాలంటే కొత్తగా ఆ శాఖను చేపట్టిన మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రదండం వంటిది ఇవ్వాలి తప్ప మరోమార్గం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటె ఏడాది ముందు అంటే 2018నాటికి కాలుష్యంతో గంగానది అంతరించి పోకుండా పునరుజ్జీవింప చేయాలి. నదుల గురించిన పరిజ్ఞానం గడ్కరీకి తగు మాత్రమే ఉంది.నిష్ణాతులైన నిపుణుల బృందం తో కలిసి పనిచేయడానికి మంత్రి ఆసక్తి చూపటం లేదు. నదుల డెల్టా, పరిసరాలలో జీవ వైవిధ్యం, ఇతర అంశాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వారికి ఆయన దూరం. 2014లో ఉమాభారతికి ఆ శాఖ బాధ్యత అప్పగించినపుడు అత్యున్నత స్థాయి అధికారులతో ‘గంగా మంథన్’ పేరిట లోతైన చర్చ జరిపారు. విధాన కర్తలు, పర్యావరణ నిపుణులు, మత నాయకులు సహా సంబంధితులందరూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. గంగానదిలో నిరంతర ప్రవాహాన్ని పునరుద్ధరించేలా, పరిశుద్ధత నెలకొనేలా చేయడం ఎలాగో వివరిస్తూ వారు సూచనలు చేశారు. గడ్కరీ కూడా ఆ సమావేశంలో ఆహ్వానంపై పాల్గొన్నారు. అప్పుడు ఆయన రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు. రవాణాను, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆంతరంగిక జల మార్గాలను అభివృద్ధి చేయాలని ఆయన ఉత్సాహంగా సూచించారు. గంగానదిపై ప్రతి 100 కి.మీ. దూరానికి ఒకటి చొప్పున వంతెనలు నిర్మించాలన్న సూచన చేశారు. అందుకు ఒక ప్రతిపాదన ఆ సరికే ప్రపంచబ్యాంకుకు పంపడం జరిగింది. తరువాత గడ్కరీ తన ప్రతిపాదనలో వంతెనల మధ్య దూరాన్ని 100 నుంచి 50 కి.మీ.కి తగ్గించారు.
అటువంటి వంతెనల నిర్మాణం నది ప్రవాహాన్ని దిగలాగుతుందని ప్రపంచవ్యాప్తంగా బలమైన అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమౌతోంది. అంతేకాకుండా వంతెనలవల్ల చౌటు పేరుకోవడంతోబాటు వరదల సమస్య కూడా తీవ్రమౌతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గంగానదిలో భారీగా పూడిక పేరుకోడానికి పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజి కారణమని వారు అంటున్నారు. అలాగే బీహార్‌లో పదేపదే వరదలు రావడానికి కూడా అదే కారణమంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజీని మూసివేయాలని కేంద్రాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోరారు. ఆ రాష్ట్రానికి చెందిన చాలామంది ఎంపిలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గంగానదిలో మంచి ఏదైనా మిగిలి ఉందంటే అది అన్ని వంతెన లు నిర్మిస్తే కొట్టుకుపోతుందని నదుల నిపుణులు హిమాంశు ఠాకూర్ అన్నారు. ఆయన దక్షిణాసియా నదులు, డ్యామ్‌ల వ్యవస్థ సమన్వయ కర్త. గతంలో చేసిన వంతెనల ప్రతిపాదనపై గడ్కరీనుంచి ఇంత
వరకూ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. నదుల శాఖను ఆయనకు అప్పగించిన తరువాత స్వరాష్ట్రం మహారాష్ట్రలో సాగునీటి పారుదలను పెంచడానికి రూ.60,000 కోట్లు కేటాయిస్తూ మొదటి నిర్ణ్ణయం ఆయన తీసుకొన్నారు. మహారాష్ట్రలో ఈ సరికే దేశంలోకెల్ల పెద్ద సంఖ్యలో డ్యామ్‌లు ఉన్నాయని కేంద్ర జలసంఘం తెలిపింది.
ఆ రాష్ట్రంలో మొత్తం 910 డ్యామ్‌లు ఉన్నాయి. అవి కేవలం
10శాతం భూమికే సాగునీరు అందిస్తున్నాయి. ఆ రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి కోసం కేటాయించిన రూ.70,000 కోట్ల నిధుల్లో రూ. 35 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. దీనిపై స్వయంగా అప్పటి చీఫ్ ఇంజనీర్ విజయ్ పంధారే రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ 15 పేజీల లేఖ రాశారు. శివసేన- బిజెపి ప్రభుత్వ పాలనలోనే ఈ దుర్వినియోగం చోటు చేసుకొంది. దేశంలో వ్యవసాయానికి 80శాతం నదుల నీరు మళ్లిస్తున్నట్లు జలవనరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిపుణులు చెప్పిన దాని ప్రకారం మన సాగునీటి సామర్ధం 15-20 శాతం మాత్రమే. ఇది ఇజ్రాయల్‌లో 70 శాతం, చైనాలో 60 శాతం ఉంది. సాగునీటికి అందాల్సిన 75శాతం వృథా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. గత 10నెలల్లో గంగ ప్రక్షాళన పనిలో కొంతవేగం చోటుచేసుకొంది. చెత్త చెదారం శుద్ధి చేసి వాడే కర్మాగారాలు (ఎస్‌టిపిలు)నెలకొల్పడానికి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం రోజుకు 10 బిలియన్ లీటర్ల చెత్త , మురికి గంగలోకి చేరుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. అందులో 60శాతం 15 ప్రధాన
నగరాలలో పేరుకొంటున్నదే. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి పారిశ్రామిక వ్యర్థాలు భారీగా గంగలో కలుస్తున్నాయి.
ప్రస్తుతం గడ్కరీ దృష్టి ఆర్థిక, సాంకేతిక, మౌలిక సౌకర్యాల కల్పనపై వుంది. అటువంటి దృక్పథం రోడ్ల నిర్మాణంలో పనికి వస్తుంది తప్ప నదులను అంతరించకుండా పునరుజ్జీవింప చేయడంలో కాదు. మన నదులలో 70శాతం అంతరించాయని, వచ్చే రెండేళ్లలో మిగిలినవి కూడా అంతరిస్తాయని ‘యమున జియే అభియాన్’ కన్వీనర్ మనోజ్ మిశ్రా హెచ్చరించారు. ‘హరిద్వార్, అలహాబాద్ మధ్య గంగా నదిలో నీరు లేదు. కేవలం వర్ష రుతువులోనే అక్కడ నీరు ఆశించగలం. గంగానది ఉపనదులలో ఎన్నో డ్యామ్‌లను నిర్మించడంతో వాటి సహజ ప్రవాహం ధ్వంసం అయింది. దేశంలో ప్రస్తుతం ఏ ఒక్క నది సముద్రంలోకి ప్రవహించడం లేదు. అయినా సరే ఇంజినీరింగ్ పరిష్కారాలపైనే మన ప్రభుత్వాలు ఆధారపడడం తగ్గలేదు’ అని కూడా మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు.
నదుల అనుసంధానం అంటూ గడ్కరీ మరో ప్రమాదకరమైన ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు. దీనికి రూ.5.57లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపు కేంద్రం చేసింది. కేన్- బెట్వా, డామన్ గంగా – పింజాల్, పార్ -తాపి – నర్మదా ప్రాజెక్టుల పని వచ్చే డిసెంబర్ నాటికి మొదలవుతుందని గడ్కరీ తెలిపారు. జార్ఖండ్‌లో ఉత్తర కోయిల్, ఉత్తరాఖండ్‌లో పంచేశ్వర్ ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నారు. ఆ రెండు ప్రాజెక్టులను రూ.50,000 కోట్ల ఖర్చుతో నిర్మిస్తారు. నదుల అనుసంధానం పనికిరాని పథకమని మరో సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత రాజీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ నదుల్లో నీరు లేకపోవడం అసలు సమస్య అని ఆయన గుర్తు చేశారు. సమృద్ధి గా నీరు ప్రవహిస్తున్నట్లు అధికార్లు తప్పుడు లెక్కలు చూపుతున్న విషయం అందరికి తెలుసని కూడా చెప్పారు. గతంలో గంగా కార్యాచరణ ప్రణాళిక 1,2దశల కింద ఎంతోడబ్బు వృథా అయిందని ఆయన గుర్తుచేశారు. సమగ్రదృష్టి కొరవడడమే కారణమని చెప్పారు. సమస్యలకు సత్వర పరిష్కారం వెతకడంలోనే తప్పున్నట్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో గంగ ప్రక్షాళనను 2019 నాటికి గడ్కరీ సాధించడం గగనమే!

– రేష్మి సెహగల్