ఉర్దూకవుల స్వాతంత్య్రగానం

ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛల కోసం, హక్కుల కోసం వినిపించే నినాదాల్లో ”విషల్ ఓవర్ కం“ తప్పక వినిపిస్తుంది. అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ పౌరహక్కుల పోరాటాల్లో తప్పక వినిపించే పాట ఇది. ఉద్యమాలకు పాట ఊపిరులూదుతుంది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ”హమ్ దేఖేంగే“ గేయం కూడా అలాంటిదే. భారత ఉపఖండంలో అనేక ఉద్యమాల్లో ఈ కవితతో పాటు ”బోల్ కే లబ్ ఆజాద్ హై“ కవిత ప్రముఖంగా వినిపిస్తుంది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ కన్నా […]

ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛల కోసం, హక్కుల కోసం వినిపించే నినాదాల్లో ”విషల్ ఓవర్ కం“ తప్పక వినిపిస్తుంది. అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ పౌరహక్కుల పోరాటాల్లో తప్పక వినిపించే పాట ఇది. ఉద్యమాలకు పాట ఊపిరులూదుతుంది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ”హమ్ దేఖేంగే“ గేయం కూడా అలాంటిదే. భారత ఉపఖండంలో అనేక ఉద్యమాల్లో ఈ కవితతో పాటు ”బోల్ కే లబ్ ఆజాద్ హై“ కవిత ప్రముఖంగా వినిపిస్తుంది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ కన్నా ఈ విషయంలో మౌలానా హస్రత్ మొహానీ రాసిన రెండు పదాలు భారత ఉపఖండంలో 1921 నుంచి నేటి వరకు మారుమోగుతూనే ఉన్నాయి. ఆ రెండు పదాలు ”ఇంక్విలాబ్ జిందాబాద్‌“. భగత్ సింగ్ సగర్వంగా అసెంబ్లీ హాలు దాడి తర్వాత ఈ నినాదమే పలికాడు. మౌలానా హస్రత్ మొహానీ పేరు వినగానే అందమైన గజళ్ళు గుర్తొస్తాయి. నికా చిత్రంలో ఆయన రాసిన ”చుప్కే చుప్కే రాత్ దిన్‌“ పాట వాడుకున్నారు. అద్భుతమైన, అందమైన గజల్ అది. అలాంటి గజళ్ళు రాయడమే కాదు హస్రత్ మొహానీ విప్లవాత్మక కవితలు అల్లారు. దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని పిలుపిచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. 1921లోనే ఆయన ”ఆజాదియే కామిల్‌“ కావాలని డిమాండ్ చేశాడు.

‘రస్మ్ జఫా కామియాబ్ దేఖియే కబ్ తక్ రహే’ (నిరంకుశత్వం ఎంతకాలమో అదీ చూద్దాం) / ‘హుబ్బె వతన్ మస్త్ ఖాబ్ కబ్ తక్ రహేం’ (దేశప్రేమికులు స్వప్నాల్లో ఎంత కాలం ఉంటారో అదీ చూద్దాం)/ ‘దౌలతె హిందూస్తాన్ ఖబ్జాయే అగ్యార్ మేం’ (భారత సంపద పరుల చేతుల్లో ..)/ ‘బే అదద్ వ బే హిసాబ్ దేఖియే కబ్ తక్ రహేం’ (లెక్కా పత్రం లేకుండా ఎంతకాలమో అదీ చూద్దాం) స్వతంత్ర ఉద్యమాల్లో కళారూపాలు, ముఖ్యంగా కవిత్వం కీలకపాత్ర పోషిస్తుంది. బ్లాక్ పోయట్రీ ఒక ప్రత్యేక కవిత్వ అభివ్యక్తిగా గుర్తింపు పొందింది. భారత స్వతంత్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన ఉర్దూ కవుల గురించి ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోకపోవడం శోచనీయం. ఉర్దూ కవిత్వమంటే అద్భుతమైన ప్రేమ గజళ్ళుగానే భావించబడుతుంది. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించింది కూడా ఉర్దూ కవిత్వమే. సామాజిక సమస్యలపై, స్వతంత్రపోరాట స్ఫూర్తిని రగిలించిన అద్భుతమైన ఉర్దూ కవిత్వాన్ని నేడు ఎవ్వరూ స్మరించడం లేదు. నిజానికి అద్భుతమైన గజళ్ళు కూడా వచ్చాయి. ఉర్దూ కవిత్వం స్వతంత్ర పోరాటకాలంలో పోషించిన కీలకపాత్ర పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.

1857 తిరుగుబాటును కవిత్వంలో రికార్డు చేసింది ఉర్దూ కవిత్వమే. తిరుగుబాట వైఫల్యం తర్వాత షహర్ ఆషోబ్ (విషాదాలు) కవితలైనా, ఆ తర్వాత బ్రిటీషు వ్యతిరేక ప్రతిఘటనల్లో వచ్చిఃన కవిత్వము లోను ఉర్దూ కవులు నిరంకుశ పాలకులపై నిజాయితీగా గళమెత్తారు. ప్రజాకాంక్షలను తమ కవిత్వంలో ప్రతిబింబించారు. ఉర్దూ కవిత్వమంటే కేవలం ప్రేమ గజళ్ళు కాదు. ఫైజ్ మాటల్లో చెప్పాలంటే, ‘ఔర్ భీ దుఖ్ హై జమానే మేం ముహబ్బత్ కె సివా’ (ప్రపంచంలో ప్రేమే కాదు ఇంకా దుఃఖాలున్నాయి)/ ‘సర్ఫరోషీకి తమన్నా అబ్ హమారే దిల్ మేం హైం’ (ఆత్మత్యాగం చేయాలన్న కోరిక గుండెల్లో ఉంది)/ ‘దేఖ నా హై జోర్ కితనా బాజుయే ఖాతిల్ మేం హైం’ (హంతకుడి చేతిలో ఎంత బలం ఉందో చూద్దాం) బిస్మిల్ అజిమాబాదీ రాసిన ఈ గజల్ పంక్తులను పాడుకుంటూ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు ఉరికంబం వైపు నడిచారు. భారత స్వతంత్ర సంగ్రామంలో అల్లమా ఇక్బాల్ రాసిన ”సారే జహాం సే అచ్ఛా హిందూసితా హమారా“ స్వతంత్ర పోరాట కాలంలో అందరి నాలుకలపై నాట్యం చేసేది. స్వతంత్ర పోరాటంలో ఉర్దూ కవిత్వం కీలకపాత్ర పోషించింది. మౌలానా అల్తాఫ్ హుస్సేన్ హాలీ, బ్రిజ్ నారాయణ్ చక్ బస్త్, హస్రత్ మొహానీ, జఫర్ అలీ ఖాన్, ముహమ్మద్ అలీ జోహర్, షౌకత్ అలీ జోహర్, అల్లామా ఇక్బాల్, దుర్గా సహాయ్, సురూర్ జహానాబాదీ, త్రిలోక్ చంద్ మహ్రూమ్ ఇలాంటి అనేక పేర్లు మనకు కనబడతాయి.

కవిత్వం సామాజిక ప్రయోజనానికని నినదించినవాడు మౌలానా అల్తాఫ్ హుస్సేన్ హాలీ. 1837లో జన్మించిన మౌలానా 1857 ఘోరాలను కళ్ళారా చూశాడు. సామాజిక ప్రయోజనాలకే కవిత్వం రాయాలనేవాడు. ఆయన రాసిన హుబ్బె వతన్ (దేశప్రేమ) కవితకు అత్యంత ప్రజాదరణ లభించింది. మౌలానా 1914లో మరణించారు. ‘తెరీ ఏక్ ముష్త్ ఖాక్ కే బదలే’ (నీ ఒక్క గుప్పెడు మట్టికి బదులు)/ లూం నా హర్ గిజ్ అగర్ బహిష్త్ మిలే (స్వర్గం దొరికినా వద్దంటాను) ఈ పంక్తులు రాయడం మౌలానా హాలీకి మాత్రమే సాధ్యం. అక్బర్ అలహాబాదీ కూడా ఈ కాలంలో మేధావిగా పరిగణించబడిన కవి. కాని ఆయన చాలా వ్యంగ్యాత్మక ధ్వనితో రాసేవారు. అందువల్ల ఆయన కవితల్లోని తాత్విక భావాలను వ్యంగ్యం కప్పేసేది. అక్బర్ అలహాబాదీ చివరి దశలో గాంధీజీ తెరపైకి వచ్చారు. గాంధీయిజం పట్ల ఆకర్షితుడై అక్బర్ అలహాబాదీ హిందూ ముస్లిమ్ ఐక్యత కోసం చాలా కృషి చేశాడు. ఆయన కవితల్లో తీవ్రమైన హాస్యం తొణికే వ్యంగ్యం గమనించదగింది.

‘బుద్ధూ మియాం భీ హజ్రతె గాంధీకే సాథ్ హైం’ (ఈ మూర్ఖుడు కూడా గాంధీగారికి తోడయ్యాడు)/ ‘గో ఖాకె రాహ్ హైం, మగర్ ఆంధీకే సాథ్ హైం’ (స్వయంగా దుమ్ము ధూళి అయినా, సుడిగాలితో పాటున్నాడు) చాలా లోతైన తాత్వికత ఉన్న కవిత. గాంధీజీ వెంట నడవడం వల్ల సాధారణమైన వ్యక్తి కూడా అసాధారణ ఎత్తులకు చేరుకుంటాడని చెప్పే ఈ కవితలో తీవ్రమైన వ్యంగ్యం, తనపై తానే వేసుకున్న హాస్యం కవితలో తాత్వికతను లోతుగా అర్ధం చేసుకోనివ్వదు. తనలాంటి మూర్ఖుడు కూడా గాంధీజీకి తోడయ్యాడని చెప్పి, గాంధీజీని సుడిగాలితోను, తనను తాను దుమ్ముధూళితోను పోల్చుకున్నాడు. ఈ వ్యంగ్యం విన్నవెంటనే నవ్వు వస్తుంది. కాని సుడిగాలి, దుమ్ముకణాన్ని అసాధారణ ఎత్తులకు తీసుకెళుతుందన్న తాత్విక కోణాన్ని అర్ధం చేసుకోనీయదు. కాకోరి కుట్ర కేసులో శిక్షకు గురైన అష్ఫాఖుల్లా ఖాన్ గొప్ప కవి. అతను రాసిన చివరి కవిత ”షోరిషె జునూన్‌“లో అతను తాను ఎన్నుకున్న మార్గాన్ని ఇతరులకు స్ఫూర్తిదాయకంగా వివరించాడు.

‘సభీ సామానె ఇష్రత్ థే, మజే సే కటీ థీ’ (విలాస సామాగ్రి అంతా ఉండేది. హాయిగా గడిచేది) / ‘వతన్ కీ ఇష్క్ నే హమ్ కో హవా ఖిలాయీ జందాం కీ’ (దేశ ప్రేమ జైలు ఊచల వెనుకకు తెచ్చింది) రాంప్రసాద్ బిస్మిల్ రాసిన పంక్తులు కూడా గమనించదగినవి. ‘నవ్ జవానోం యహీ మోకా హై ఉఠో ఖుల్ ఖేలో’ (యువకుల్లారా ఇదే అవకాశం లేవండి .. ఉత్సాహంగా ) ‘ఖిద్మతె ఖౌమ్ మేం ఆయే జో బలాయేం ఝేలో’ (జాతి సేవలో ఏ కష్టం వచ్చినా తట్టుకోండి) బ్రజ్ నారాయణ్ చక్ బస్త్ కవిత్వంలో ఇవే భావాలు కాస్త సున్నితంగా ప్రకటించాడు. ‘యే ఖాకె హింద్ సే పైదా హై జోష్ కే ఆసార్’ (ఈ దేశం మట్టిలో పుడతాయి ఉత్సాహపు భావాలు)/ ‘హిమాలయ సే ఉఠే జైసే అబ్రె దర్యార్’ (హిమాలయాల నుంచి వర్షపు మబ్బులు జన్మించినట్లు) విప్లవకవుల గురించి రాస్తున్నప్పుడు జోష్ మలిహాబాది ప్రస్తావన తప్పనిసరి. ఆయన షాయరె ఇంక్విలాబ్ గా పేరుపడ్డాడు. ‘కామ్ హై మేరా తగ్యార్, నామ్ హై మేరా షబాబ్ ’(నా పేరు యవ్వనం, నా పని మార్పు తేవడం)/ ‘మేరా నారా ఇంక్విలాబొ ఇంక్విలాబో ఇంక్విలాబ్’ (నా నినాదం విప్లవం, విప్లవం, విప్లవం) అలీ సర్దార్ జాఫ్రీ కవి మాత్రమే కాదు, జాతీయ ఉద్యమంలో పాల్గొని జైళ్ళకు వెళ్ళాడు. జైల్లోనే అనేక కవితలు రాశాడు. ‘రక్స్ కరాయీ రూహె ఆజాదీ, కె రక్సామ్ హై హయాత్’ (స్వేచ్ఛా స్ఫూర్తి నృత్యం చేయించింది. జీవితమే నాట్యం)/ ‘ఘూమతీ హర్ వక్త్ కే మెహవర్ పర్ సారీ కాయనాత్’ (కాలం ఇరుసుపై విశ్వం నర్తిస్తుంది.)

ఉర్దూ కవిత్వం గురించి రాస్తున్నప్పుడు అంజుమనె తరఖ్కీ పసంద్ ముసన్నిఫీన్ (అభ్యుదయ రచయితల సంఘం) ప్రస్తావన లేకపోతే అసంపూర్ణమే. అభ్యుదయ రచయితలు ఒక ఉద్యమంగా వచ్చారు. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వచన కవిత్వం వంటి ప్రక్రియల్లో కవిత్వం రాస్తూ విప్లవగీతాలు ఆలపించారు. స్వతంత్ర పోరాటంలో తమదైన పాత్ర పోషించారు. అభ్యుదయ రచయితల సంఘంలో ప్రారంభంలో అత్యధికులు ఉర్దూలో రాసినవాళ్ళే. సామాజిక పరిస్థితుల పట్ల తమ నిరసన, దమననీతి పట్ల ప్రతిఘటన నిర్భయంగా రాశారు. స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. తమ కవిత్వం, కథలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్నిసృష్టించారు. మజ్నూ సుల్తాన్ పురి ముంబయికి 1944లో వచ్చాడు. అప్పటి వరకు సంప్రదాయిక గజళ్ళు మాత్రమే రాసిన మజ్రూ ఆ తర్వాత అభ్యుదయ రచయితలతో కలిసి ఆయన గొంతు మారిపోయింది. ‘దహ్ మేం మజ్రూ కోయీ జావిదాం మజ్మూన్ కహాం’ (ఈ లోకంలో శాశ్వతమైన అంశం నీకెక్కడ దొరుకుతుంది మజ్రూ)/ ‘మైం జిసే ఛూతా గయా వో జావిదాం బన్తా గయా’ (నేను కవిత్వంతో తాకిన ప్రతిదీ శాశ్వతమైంది) అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకడైన ఫైజ్ జైలు నుంచి రాసిన పంక్తులు కూడా గమనించదగినవి.

‘హమ్ నే జో తర్జె ఫుగాన్ కీ హై ఖఫస్ మేం ఈజాద్’ (మేం పంజరంలో కనిపెట్టిన దుఃఖించే పద్ధతి)/‘ఆజ్ గుల్షన్ మేం వహీ తర్జె బయాన్ ఠహరీ హై’ (నేడు ఉద్యానవనంలో అదే పలుకు శైలిగా మారింది)/ ఫైజ్ సమకాలీకుడు, అభ్యుదయ కవుల్లో ఒకడు మజాజ్ రాసిన పంక్తులు కూడా గమనించదగినవి. ‘ఇస్ మెహఫిలె కైఫొ మస్తీ మేం ఇస్ అంజుమనె ఇర్ఫానీ మేం’ (ఈ మత్తయిన, ఆనందపు గోష్టిలో, ఈ మేధోపరమైన సమావేశంలో)/ ‘సబ్ జామ్ బకఫ్ బైఠే హీ రహే, హమ్ పీ భీ గయే ఝల్కా భీ గయే’ (అంతా చేతుల్లో మధుపాత్రలతో కూర్చుని ఉన్నారు. నా తాగుతున్నాను. పాత్ర నుంచి తొణికేలా చేస్తున్నాను) మఖ్దూం రాసిన పంక్తులు చూడండి. ఈయన కూడా అభ్యుదయ రచయితల్లో ముఖ్యమైన కవి.

‘కోహె గమ్ ఔర్ గిరాం ఔర్ గిరాం ఔర్ గిరాం’ (కష్టాల కొండ మరింత బరువు అయిపోతోంది)/ ‘గమ్ జదోం తీషా చమ్కావ్ కె కుఛ్ రాత్ కటే’ (దుఃఖితులారా పారలకు పదునుపెట్టి మెరిపించండి. కాస్త రాత్రి గడుస్తుంది)ఈ కవిత్వం కల్లోలపరిస్థితుల్లో అప్పటి సమాజాన్ని ఉద్దేశించి రాసిన కొత్త అభివ్యక్తి. ఈ కవిత్వంలో పాత ప్రతీకలు మారిపోయాయి. మఖ్దూం రాసిన కవితలో తీషా (పార) సంప్రదాయక ప్రేమ కవితలో ఆత్మహత్య సాధనం. కాని మఖ్దూం దాన్ని కార్మికులకు వెలుగు అంటే విజయాన్ని సాధించే సాధనంగా ప్రతీకించాడు. నిజానికి ఇలా ప్రతీకల రీ డిఫైన్ చేయడం అన్నది ఇక్బాల్ ప్రారంభించాడు. అభ్యుదయ రచయితలు దాన్ని మరింత ముందుకు తీసుకుపోయారు. కొత్త కొత్త సింబల్స్ ఉపయోగించడం ప్రారంభించారు. ఉర్దూ కవులు, రచయితలు స్వతంత్రపోరాటంలో తమదైన పాత్ర పోషించడమే కాదు, సామాజిక ఉద్యమాల్లోను ఉర్దూ కవిత్వం కీలకపాత్ర పోషించింది. మొన్న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి ఆందోళనల్లోను ఫైజ్ రాసిన బోల్ కే లబ్ ఆజాద్ హై కవితయే ప్రతిధ్వనించింది.

-వాహెద్, 7396103556