చరిత్రకు దర్పణం ‘చిల్లర దేవుళ్లు’

ప్రముఖ కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వర రావు గారు డాక్టర్ దాశరథి రంగాచార్యగారిని “ఆంధ్ర గోర్కీ” గా పేర్కొన్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని చినగూడూరులో సనాతన సంప్రదాయ కుటుంబంలో ఆగస్టు 24, 1928న జన్మించారు. రంగాచార్య గారు చిన్నప్పటి నుంచే వామ పక్షం వైపుకు మొగ్గి ఉన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటం ఆయుధాలను చేత బూనడం వలన వారు పోలీసు యాక్షన్ తర్వాత బయటికి వచ్చారు. 1951లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 1957లో అనువాదకులుగా సికింద్రాబాద్ మునిసిపల్ […]

ప్రముఖ కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వర రావు గారు డాక్టర్ దాశరథి రంగాచార్యగారిని “ఆంధ్ర గోర్కీ” గా పేర్కొన్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని చినగూడూరులో సనాతన సంప్రదాయ కుటుంబంలో ఆగస్టు 24, 1928న జన్మించారు.
రంగాచార్య గారు చిన్నప్పటి నుంచే వామ పక్షం వైపుకు మొగ్గి ఉన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటం ఆయుధాలను చేత బూనడం వలన వారు పోలీసు యాక్షన్ తర్వాత బయటికి వచ్చారు.

1951లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 1957లో అనువాదకులుగా సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో చేరారు. రంగాచార్య మొత్తం 9 నవలలు రాశారు. “చిల్లర దేవుళ్లు” , మోదుగు పూలు” , “మాయ జలతారు”, “జనపదం”, “రానున్నది ఏది నిజం”, “మానవత” , “శరతల్పం”, “పావని” , “అమృతంగమయ”.
తెలంగాణ గురించి రాయబడిన దాశరథి రంగాచార్య గారి తొలి నవల “చిల్లర దేవుళ్లు”. దీన్ని ఐదు వారాలలో పూర్తి చేశారు. ఇది 1969లో వెలువరించబడింది. వారి మొదటి నవలే సాహితీ రంగంలో ఓ మైలు రాయి. ప్రగతి వార పత్రికలో 13 వారాలు (21.03.1969 13.06.1969 ) సీరియల్‌గా వచ్చింది.
1971 లో ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. ఆకాశవాణి కేంద్రం హైదరాబాద్, 1971లో జులై 19న నాటకంగా ప్రసారం చేసింది. మార్చ్ 11, 1977న సినిమాగా విడుదలైంది కాకతీయ పిక్చర్స్ వారి ద్వారా. హిందీలోకి “ఘాట్ కీ దేవత’ శీర్షికతో ప్రొఫెసర్ భీంసేన్ నిర్మల్ అనువదించారు. ‘లోక్ రాజ్’ హిందీ పక్ష పత్రిక దాన్ని సీరియల్‌గా వేసుకుంది. ఇంగ్లీష్‌లో ‘లెస్సర్ డైటీస్’ పేరుతో చక్రవర్తుల శేషాచార్యులు అనువదించారు.

చిల్లర దేవుళ్లు నవల నేపథ్యం మనకు స్వాతంత్య్రం రాకపూర్వం హైదరాబాద్ నవాబు పరిపాలన కాలంలోని తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక జీవితానికి, దొరల విలాస, నిరంకుశత్వానికి అద్దం పట్టింది. దొర అధికారానికి, కరణం కుట్రకు భయపడి బ్రతుకుతుంటారు ఆ ఊరి జనం. ఆనాటి కరణం మనస్తత్వాలు గల గ్రామాధికారులు ఈ రోజులలో కూడా లేకపోలేదు.
దొంగలు దొంగలు ఊర్లు పంచుకొన్నట్లు దేశ్‌ముఖ్ రామారెడ్డి మరియు కరణం గారు ఒకరిని ఒకరు బ్లాక్ మేల్ చేసుకుంటూ చివరికి ఓ ఒప్పందానికొస్తారు. చింతకాయలు దొంగతనం చేసిన వాడిని (పీరి గాడు) చంపినందుకు రెడ్డి గారికీ, లంబాడీల ప్రాణాలు తీసిన కరణం మధ్య ఒప్పందం కుదిరింది.

ఊరి రాజకీయం ఇలా ఉంటుంది మరి! ఆ ఊరి దొర రామారెడ్డి గారి ముద్దుల కూతురు మంజరిని సంగీత మాస్టారు సారంగ పాణితో పెండ్లి చేయించమని కోరుతాడు కరణం. ఇది జరగని విషయం అని తెలిసి ఉండి, మరో సందర్భంలో దొర గత్యంతరం లేక సంగీత మాస్టారును కరణం గారి అమ్మాయిని వివాహమాడమని వేడుకొంటాడు. అప్పుడు అతని సమాధానం, ‘పెళ్లి జీవితానికి సంబంధించింది. ప్రేమ శరీరానికి సంబంధించింది కాదు. ప్రేమకు రూపానికి సంబంధం లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కక్క రకమైన ఆకర్షణ ఉంటుంది. అందమైన భార్యల్ని వదలి అనాకారులైన వారి వెంబడి తమ సర్వస్వం అర్పించే వారుంటారు.. ప్రేమ వైయక్తికమైంది. సంఘంతోనూ, రాజకీయాలతోనూ దానికి సంబంధం లేదు. ఎవరిని ఆకర్షిస్తారో చెప్పలేం. మనకు ఎంత అధికారం ఉన్నప్పటికీ సూర్యుడు లేనప్పుడు తామరలను వికసింపజేయలేం. చకోరం వెన్నెల కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. కాని అన్యం భక్షించదు. ప్రేమ కోసం రాజ్యాలను త్యజించినవారున్నారు ’ అని తాయరును పెండ్లి చేసుకోడానికి నిరాకరిస్తూ కరణం గారి ఆస్తి అవసరం లేదంటాడు. విషం తింటే లక్ష రూపాయలిస్తామంటే తింటామా?’ అని చెప్తాడు సంగీత మాస్టారు పాణి.

మరో పాత్ర వనజ. ఆడ బాపన. ఆమె అందాన్ని వాడుకునే వారు, ఆమె అందంగా ఉండేది. ఆట బొమ్మలా అందరికీ ఆట వస్తువు అయింది. దొర ఇంటికి వచ్చి అతిథులందరికీ సర్వం సమర్పించింది. మామిడి పళ్లు పల్లెంలోపెట్టినట్లు అందించేది తనను అందరికీ. రసం తాగి తొక్క పారేసినట్లు పారేశారెందరో. మగవారంటే ఆడదాన్ని పళ్లరసం లాగానో, పాయసం లాగానో, సారాయిలాగానో తాగేవారనుకున్నది.

ఉత్తమ సాహిత్యానికి వారసులు రంగాచార్యులుగారు. ధన మదాంధులకు నీతులు చెప్పరాదు. వంతపాడాలి. ధనం, అధికారం ఉన్నవాడు తాను తలచేది, చెప్పేది, చేసేది సరియైనదనుకుంటాడు. అది సరికాదని చెప్పేవాన్ని పిచ్చివాడనుకోవడమో, వాడిమీద పగ తీర్చుకోవడమో చేస్తారన్న నగ్న సత్యాన్ని చెప్పారు. చిల్లర దేవుళ్లు నవల అయిదు ముద్రణలకు నోచుకుంది. అందులోని అన్నిముఖ్యమైన పాత్రలు సజీవాలే! సారంగపాణి సంగీత మాస్టారు. రెడ్డిగారి దగ్గరకి బ్రిటీష్ ఆంధ్ర నుండి కడుపు చేతిలో పెట్టుకొని వచ్చాడు. తనోసారి ఆలోచిస్తాడు “రాజ్యమంతా తురకల్ని చేస్తాడేమో నిజాం నవాబు. పోల్చి చూస్తే ఇంగ్లీషు వాళ్లే దేవతల్లా కనిపిస్తున్నారు.” అని … అలాగే వనజ, ఆడబాపన కూడా గుర్తుకొస్తుంది అతడికి. శృంగార దేవతగా; మనిషి ఆలోచనలకు పరిధులు లేవు అనే సందర్భమది.

కరణం వెంకట్రావు వర్సెస్ దొర రామారెడ్డి. వారిద్దరికీ ఎప్పుడూ పడేది కాదు. ఆ ఊరిలోకి స్వామీజీ వస్తారు. స్వామీజీ తాయారుతో శృంగార రస కేళిలో నిమగ్నుడై వుండగా కరణం గారు ఆ సీనులో ఉండగా చూసి పిచ్చెక్కిపోతారు. కరణం గారి కర్మకు సరియైన పదం చూపారు దాశరథి రంగాచార్య గారు. చేసిన పాపం ఊరికేపోదంటారు మరి. దుష్కృత్యాలు చేయించడానికే సంపద, అధికారం అని తేల్చి చెబుతాడు నవలలో రచయిత.

దేవుల పల్లి రామానుజరావు గారు చిల్లర దేవుళ్లు నవల ప్రథమ ముద్రణకు తొలి పలుకులో రాస్తూ “నాకు ఎలాంటి సందు దొరకనివ్వలేదు, రెండు వాక్యాలు రాద్దామని ప్రయత్నించగా!” అని పేర్కొన్నారు. రంగాచార్యగారు సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్‌గా 1988లో పదవీ విరమణ చేశారు. తన జీవితాన్ని మానవత కోసం పోరాడిన తెలంగాణ బిడ్డ దాశరథి రంగాచార్యగారు. వారు జూన్ 8, 2015న కీర్తిశేషులయ్యారు.

అమ్జద్

Comments

comments