సోలార్ సురేష్

ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ వైపు వెళుతున్న దేశాల సంఖ్య పెరుగుతోంది.  చైనా,జపాన్,జర్మనీ,అమెరికా వంటి దేశాలు నేడు సోలార్ పవర్ వైపు అడుగులు వేసి పర్యావరణానుకూలంగా మారుతున్నాయి. మన దేశం సోలార్ ఎనర్జీ పై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నది. ప్రభుత్వం పై ఆధారపడకుండా కొందరు సొంతంగా సోలార్ యూనిట్లను ఏర్పాటుచేసుకుంటున్నారు. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే విదేశాలలోనే ఇది సాధ్యమయినప్పుడు సంవత్సరం పొడవునా ఎండను పొందే మనదేశంలో సోలార్ ఎనర్జీ ఎందుకు సాధ్యం కాదన్న ఆలోచనే తమిళనాడుకు చెందిన ద్వారకాదాస్ […]

ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ వైపు వెళుతున్న దేశాల సంఖ్య పెరుగుతోంది.  చైనా,జపాన్,జర్మనీ,అమెరికా వంటి దేశాలు నేడు సోలార్ పవర్ వైపు అడుగులు వేసి పర్యావరణానుకూలంగా మారుతున్నాయి. మన దేశం సోలార్ ఎనర్జీ పై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నది. ప్రభుత్వం పై ఆధారపడకుండా కొందరు సొంతంగా సోలార్ యూనిట్లను ఏర్పాటుచేసుకుంటున్నారు. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే విదేశాలలోనే ఇది సాధ్యమయినప్పుడు సంవత్సరం పొడవునా ఎండను పొందే మనదేశంలో సోలార్ ఎనర్జీ ఎందుకు సాధ్యం కాదన్న ఆలోచనే తమిళనాడుకు చెందిన ద్వారకాదాస్ సురేష్‌కు కలిగింది. అంతే ఏమాత్రం సమయం వృథా చేయకుండా కార్యచరణ చేపట్టి,విజయం సాధించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క నిమిషం కూడా కోతలేని సోలార్‌పవర్‌ను వాడుకుంటున్నారు. దీంతోపాటే ప్రకృతికి దగ్గరగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. ఆలోచన,ఆచరణ గూర్చి సురేష్ ఈ విధంగా వివరిస్తున్నారు…

సోలార్ సురేష్‌గా పేరుగాంచిన తమిళనాడుకు చెందిన సురేష్ ద్వారకాదాస్ ఐఐటి మద్రాస్, ఐఐఎమ్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. టెక్స్‌టైల్ మార్కెటింగ్ ఇండస్ట్రీస్ లో వివిధ హోదాల్లో పనిచేసి నిర్వహణ సంబంధిత డైరెక్టర్‌గా 2015 లో పదవీ విరమణ చేశారు.ఉద్యోగంలో భాగంగా వివిధ దేశాల్లో పనిచేశారు సురేష్. జర్మనీ నివాసం స్ఫూర్తిని చ్చింది -జర్మనీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఇళ్ళపై ఏర్పాటుచేసుకున్న సోలార్ పవర్ ప్లాంట్‌లను గమనించాను.

తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే విదేశాల్లోనే సోలార్ పవర్ సాధ్యమయినప్పుడు, సంవత్సరంలో తొమ్మిది నెలలు ఎండ పుష్కలంగా లభించే ఇండియా వంటి దేశాల్లో ఎందుకు సాధ్యం కాదు అనే ఆలోచన ఇంట్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా చేసింది.ఇండియా వచ్చాక చాలామంది సోలార్ ప్లాంట్స్ అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగాను కాని ఎవరూ పెద్దగా ఆసక్తి కనబరచలేదు,పేరొందిన కార్పోరేట్ కంపెనీలు కూడా నా ప్రతిపాదనను నిరాకరించాయి.కొద్ది కాలానికి స్థానికంగా సోలార్ ప్లాంట్‌లు అమ్మే వ్యక్తి నా ఆలోచనలతో ఏకీభవించి,మా ఇంటికోసం సోలార్ పవర్ ప్లాంట్‌ను డిజైన్ చేశారు.

ఖరీదైనదేం కాదు – సాధారణంగా సోలార్ పవర్ అంటే ఖరీదైనదనే అపోహ ఉంటుంది,కాని ప్లాంట్ బిగించడానికి ఒక్కసారే మనం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.సంబంధిత సామాగ్రి 20 సంవత్సరాల వరకు ఉచితం.ప్యానెల్ల జీవితం కాలం 20 సంవత్సరాల పాటు విద్యుత్ ఉచితంగా పొందవచ్చు.ప్రత్యేకంగా ఎటువంటి వైరింగ్ చేయాల్సిన అవసరం లేదు.ఇంటిపైకప్పు భాగంలో ఏర్పాటుచేసుకున్న సోలార్ ప్లాంట్ స్థిరమైన,అనుకూలమైన ప్రాజెక్ట్,ప్రస్తుతం దీనిపై ఆరుశాతం ట్యాక్స్ ఫ్రీ రిటర్న్,బ్యాటరీ రిప్లేస్‌మెంట్ సౌకర్యం ఉన్నది.ప్లాంట్ అమర్చడం కూడా తేలికైన పని,కాకుంటే నీడ లేని ప్రదేశాన్ని ఎంచుకోవడం ముఖ్యం.దాదాపు 80 చదరపు అడుగుల స్థలంలో ఒక కిలో వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే ప్లాంట్‌ను ఏర్పాటుచేసుకోవచ్చు.

రోజుకు 12-16 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది – సోలార్ పవర్ ద్వారా ఇంట్లో ఒక ఎసి.మోటార్, రిఫ్రిజిరేటర్,ఫ్యాన్లు,లైట్లు,టివి,కంప్యూటర్ వంటి అన్ని గృహోపకరణాలు పనిచేస్తున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేదు,వార్థా సైక్లోన్ వచ్చినప్పుడు తప్ప,అదీ కేవలం ఒక్కరోజు మాత్రమే.రోజుకు 12-16 యూనిట్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతున్నది.మరీ ముఖ్యంగా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం.శిలాజ ఇంధనం వృథా కాకుండా చూడడం వల్ల మన దేశ విదేశీ మారకాన్ని ఆదా చేయొచ్చు అన్నది నా అభిప్రాయం.

ఇవే కాకుండా – ఇంట్లోనే బయోగ్యాస్ ప్లాంట్(ఒక్క క్యూబిక్ మీటర్ కు నాలుగు కిలోల ఆర్గానిక్ చెత్త ,నెలకు దాదాపు 20 కిలోల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది). దీనికి కూడా రోజూవారీ పర్యవేక్షణ అవసరముండదు.చెత్తతో రెండు లాభాలు పొందుతున్నాం 1- వంట గ్యాస్ 2- ఆర్గానిక్ మెన్యూర్(సేంద్రియ ఎరువు).చెత్తను ఇంతకంటే గొప్పగా వాడుకునే విధానం ఉంటుందా..?ప్రతి రోజు చెత్తను బయోగ్యాస్ ప్లాంట్‌లో వేయడం తప్ప ఎక్కువ పనేం ఉండదు,ఎటువంటి కాలుష్య కారకాలు ఉత్పత్తి కావు.

వాన నీటి నిర్వహణ – 20 సంవత్సరాల క్రితమే వాన నీటిని ఒడిసిపట్టడం మొదలుపెట్టాను.రెండు రకాల వాన నీటి నిర్వహణ చేస్తున్నాను. వాటిల్లో ఒకటి శుద్ధి అయి ఇంటి వాడకానికి ఉపయోగపడితే మరో రకం భూగర్భ జలాలను పరిరక్షించేది. గులకరాళ్ళు,చార్‌కోల్,ఇసుక వంటి వాటిని వాడి నీటి శుద్ధి ప్రక్రియ పూర్తిగా పర్యావరణహితంగా,పురాతన పద్ధతుల్లో చేస్తున్నాను.ఈ నీటిని వంటకు,తాగడానికి వాడతాం.రెండోదైన భూగర్భ జలాల పరిరక్షణకు…నిలిచిపోయిన వర్షపునీరు ఇంకడానికి ప్రతి ఆడుగు దూరంలో ఎనిమిది ఇంచుల చుట్టుకొలత,15 ఫీట్ల పొడవుతో ఉండే పైపులను అమర్చాను.దీంతో నిలువ నీరు వీటి గుండా ప్రయాణించి భూగర్భ జల మట్టాన్ని కాపాడుతుంది.

మిద్దె తోట – ఇంటి పైకప్పుపై మొదట కొన్ని కుండీలను ఏర్పాటుచేసి కిచెన్ గార్డెన్ ఏర్పాటుచేశాం,అప్పుడు నాకంతగా గార్డెనింగ్ పై అవగాహన లేదు.తర్వాత దాని గూర్చి తెలుసుకుని దాదాపు వందకు పైగా కుండీలు,విరిగిన ప్లాస్టిక్ బకెట్లు,బ్యాగుల్లో ఆర్గానిక్ గార్డెన్ పెంచుతున్నాను. ప్రస్తుతం 15 రకాల కూరగాయలు పండుతున్నాయి.మిద్దెతోటలో కూర్చుంటే అడవిలో ఉన్నట్లుగా ఉంటుంది.చుట్టూ ఉండే బిల్డింగ్‌లు కూడా కనిపించనంతగా గార్డెన్ ఎదిగింది.

-అనిత యెలిశెట్టి