సంపాదకీయం: నర్సుల జీవితాలకు శుభోదయం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులతో సమాన వేతనాలు, పని పరిస్థితులు, ఇతర సౌకర్యాల కొరకు ప్రైవేటు నర్సులు దీర్ఘకాలంగా సాగిస్తున్న పోరాటం విజయతీరాన్ని చేరుతున్నది. కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం ఆమోదిస్తే లక్షలాదిమంది నర్సులకు ఎంతో ఉపశమనం చేకూరుతుంది. ప్రైవేటురంగంలో నర్సుల శ్రమదోపిడీ గూర్చి ‘శిక్షణ పొందిన నర్సుల అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ 2011లో న్యాయం కొరకు సుప్రీంకోర్టు తలుపుతట్టింది. ఈ సంఘంలో 3లక్షలమందికిపైగా ప్రైవేటు నర్సులు సభ్యులుగా ఉన్నారు. ప్రైవేటురంగంలో వైద్యం విస్తృతి […]

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులతో సమాన వేతనాలు, పని పరిస్థితులు, ఇతర సౌకర్యాల కొరకు ప్రైవేటు నర్సులు దీర్ఘకాలంగా సాగిస్తున్న పోరాటం విజయతీరాన్ని చేరుతున్నది. కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం ఆమోదిస్తే లక్షలాదిమంది నర్సులకు ఎంతో ఉపశమనం చేకూరుతుంది. ప్రైవేటురంగంలో నర్సుల శ్రమదోపిడీ గూర్చి ‘శిక్షణ పొందిన నర్సుల అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ 2011లో న్యాయం కొరకు సుప్రీంకోర్టు తలుపుతట్టింది. ఈ సంఘంలో 3లక్షలమందికిపైగా ప్రైవేటు నర్సులు సభ్యులుగా ఉన్నారు. ప్రైవేటురంగంలో వైద్యం విస్తృతి పెరిగినప్పటికీ, వైద్యసేవలో ముఖ్యపాత్ర పోషించే తమ జీవితాలు మెరుగు కాలేదన్నది వారి ప్రధాన ఫిర్యాదు. ప్రభుత్వ ఆసుపత్రులతో పోల్చితే ప్రైవేటు ఆసుపత్రుల నర్సుల జీతాలు చాలా తక్కువ-చాకిరీ ఎక్కువ. రవాణా సదుపాయాలు, నివాస వసతి, సెలవులు కూడా అరుదు. సుప్రీంకోర్టు ఆదేశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2016 జనవరి 29 న ఆరోగ్యసేవల డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ జగదీశ్ ప్రసాద్ ఛైర్మన్‌గా ఏర్పాటు చేసిన కమిటీ ‘ప్రైవేటు ఆసుపత్రుల్లోని నర్సుల పని పరిస్థితులు, వేతనం విచారకరంగా’ ఉన్నట్లు నిర్థారించింది. ఆ కమిటీ సిఫారసులను కేంద్రం లేదా రాష్ట్రాలు శాసనంగా మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో కేంద్రం వెంటనే స్పందించింది. లేకపోతే అనేక నివేదికల్లాగా అదీ దుమ్ముపట్టేదే. శాసనాన్ని రూపొందించి 2016 అక్టోబర్ 20లోగా తమకు సమాచారమివ్వాలని కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు వర్తమానం పంపింది.
కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 200 లకు పైగా పడకలు కలిగిన ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల్లో పనిచేసే నర్సులకు తత్సమాన గ్రేడ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులతో సమాన వేతనాన్ని శాసనం నిర్దేశించాలి.100 పడకలు పైగా ఉన్న ఆసుపత్రుల్లో అదే గ్రేడ్‌లోని ప్రభుత్వ నర్సుల వేతనంలో 10శాతంకన్నా తక్కువ కాని వేతనం చెల్లించాలి. 50-100 పడకలుగల ఆసుపత్రుల్లో అదేగ్రేడ్ ప్రభుత్వ నర్సుల వేతనంలో 25 శాతం కన్నా తక్కువ కాని వేతనం చెల్లించాలి. ఏదిఏమైనా, 50పడకలకు తక్కువ ఉన్న ఆసుపత్రుల్లో సైతం నర్సుల వేతనం రూ.20 వేలకు తగ్గరాదు. వైద్యసదుపాయాలు, రవాణా, వసతి తదితర సౌకర్యాలను ప్రభుత్వ నర్సులతో సమంగా కల్పించాలి.
ప్రైవేటు వైద్యం లాబీకి తలొగ్గకుండా, సందులు-గొందులు పెట్టకుండా రాష్ట్రాలు శాసనం రూపొందిస్తే లక్షలాది నర్సులకు మేలు జరుగుతుంది. వారికి మానవహక్కులు, పని హక్కులు సమకూరుతాయి. కేంద్రప్రభుత్వం ఆదేశపూర్వక వర్తమానంతో సరిపెట్టుకోకుండా నమూనా బిల్లును పంపి ఉంటే రాష్ట్రాలు ఆ స్థూల పరిధికి లోబడి శాసనం రూపొందించే వీలు కలిగేది. దేశమంతటికీ స్థూలంగా ఏకరూప చట్టం వచ్చేది.
నర్సింగ్ సేవల్లో అత్యధిక మెజారిటీ మహిళలు. వారికి కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. రాత్రిళ్లు సహా షిప్ట్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగంలో వైద్యం విస్తరించినంతగా, రోగులనుంచి వసూళ్లు పెరిగినంతగా నర్సుల వేతనాలు పెరగలేదు. ఆసుపత్రి యాజమాన్యాలే తాము ‘సహేతుకమని’ భావించినా వేతనాలు చెల్లిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వాలు కూడా వారి పని పరిస్థితులు, వేతనాల పట్ల దృష్టి పెట్టనందున వారు దీర్ఘకాలంగా వీధుల్లో, కోర్టులో పోరాటం చేయాల్సి వచ్చింది. ఇకనైనా వారి జీవితాలు మెరుగవుతాయని ఆశించుదాం.
నర్సింగ్ అనేది బతకటానికి ఉద్యోగమే అయినా సేవాదృక్పథంతో కూడినది. వారి సహకారం లేకుండా ఏ డాక్టరూ పనిచేయలేదు. రోగులకు సంతృప్తికరమైన సేవచేయటం, వారిని సంతోషంగా ఉంచటంపైనే నర్సులు గుర్తింపు పొందుతారు. అది ప్రభుత్వమైనా, ప్రైవేటు అయినా నర్సులు నమ్రతతోనే రాణింపు పొందుతారు. కేంద్రప్రభుత్వం చెప్పింది గదాని చట్టం చేయటంతో రాష్ట్రాలు సరిపెట్టుకోరాదు. దాని అమలును పర్యవేక్షించాలి. ఉల్లంఘనలకు పెనాల్టీలు, శిక్షలు ఉండాలి. లేకపోతే అనేక రంగాల్లో కనీస వేతనాలు, వేతన సంఘం సిఫారసుల్లాగే చట్టం కాగితం మీదే అమలు జరుగుతుంది.

Comments

comments