తిరుగుబాటు కవి కాజీ నజ్రుల్

కాజీ తలవంచని తిరుగుబాటు దారుడు. దౌర్జన్యం, అణిచివేత, ఫాసిజాలపై తీవ్రమైన వ్యతిరేకత ఆయన రాసిన అక్షరాల్లో మిల మిలమెరుస్తుంది. ఒక ఆధ్యాత్మిక దార్శనికుడు. అనేకమంది ఆయన పై విమర్శల వర్షం కురిపించినా చలించని ధీరుడు. ఆయన కవిత ఒక తుఫాను. ఆ కవిత్వం బ్రిటీషు పాలకులను గడగడలా డించింది. నిర్భీతి, నిక్కచ్చి, నిష్కర్ష ఆయన అభివ్యక్తిలో తొణికిసలాడేవి. దేశం పట్ల సాటిలేని ప్రేమ, జాతి పట్ల ఆయన ఆవేదన, ఆవేశం, ఆగ్రహాలు బ్రిటీషు పాలకులను బెంబేలెత్తించాయి. ఆయన […]

కాజీ తలవంచని తిరుగుబాటు దారుడు. దౌర్జన్యం, అణిచివేత, ఫాసిజాలపై తీవ్రమైన వ్యతిరేకత ఆయన రాసిన అక్షరాల్లో మిల మిలమెరుస్తుంది. ఒక ఆధ్యాత్మిక దార్శనికుడు. అనేకమంది ఆయన పై విమర్శల వర్షం కురిపించినా చలించని ధీరుడు. ఆయన కవిత ఒక తుఫాను. ఆ కవిత్వం బ్రిటీషు పాలకులను గడగడలా డించింది. నిర్భీతి, నిక్కచ్చి, నిష్కర్ష ఆయన అభివ్యక్తిలో తొణికిసలాడేవి. దేశం పట్ల సాటిలేని ప్రేమ, జాతి పట్ల ఆయన ఆవేదన, ఆవేశం, ఆగ్రహాలు బ్రిటీషు పాలకులను బెంబేలెత్తించాయి. ఆయన కవితల్లోని ఆధ్యాత్మిక విప్లవ సందేశాలు పాఠకులను, శ్రోతలను నాడు, ఈనాడు కూడా మంత్రము గ్దుయ్యే లా చేసాయి.
రక్తసిక్త రణరంగం శోకతప్త నాదం
అంతమైతే గాని లేదు నా మనసుకు శాంతం
………………
నేనే భృగువును… మహాతీవ్రవాదిని
సతత తీవ్రవాదిని
నిత్యగర్విని, ఎత్తిన తలదించక
లోకాన్ని అధిగమించి నిలబడిన ఒంటరిని
అంటూ నిర్భయంగా ప్రకటించిన కవి కాజీ నజ్రుల్ ఇస్లామ్
బెంగాల్లో తిరుగుబాటు కవి (బిద్రోహి కొబి) కాజీ నజ్రుల్ ఇస్లామ్ 1922లో రాసిన “బిద్రోహి” (తిరుగుబాటుదారుడు) కవిత అచ్చయిన వెంటనే అప్పటి యువతరంలో తీవ్ర జాతీయవాద మహాజ్వాలను రగిలిం చింది. బ్రిటీషు వారి గుండెలు భయభీతుల వరదల్లో మునిగిపోయాయి. అప్పటి నుంచి ఆయన బిద్రోహి కవిగా గుర్తింపు పొందాడు. మనకు తెలిసిన ప్రముఖ బెంగాలీ కవి, నోబెల్ బహుమతి గ్రహిత రవీంద్రనాథ్ ఠాగూర్ కన్నా కాజీ నజ్రుల్ ఇస్లామ్ చిన్నవాడు. బెంగాలీ సాహిత్యంలోనే కాదు భారతదేశంలో ఈ ఇద్దరు కవులకు సాటి కనబడదు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 5000 కవిత కన్నా కాజీ నజ్రుల్ ఇస్లామ్ రాసిన 4000 కవితలు ఏవిధంగాను తక్కువ కాదు. కాని, కాజీ కవితకు, రవీంద్రనాథ్ ఠాగూర్ కవితకు మధ్య చాలా తేడా ఉంది. వారి కవితా స్వరం వేరు, కవితా రూపం వేరు, కవితల్లోని సందేశం వేరు. వారిద్దరు రాసింది బెంగాలీ లోనే అయినా ఇద్దరి శైలిలో ఎక్కడా సామ్యం లేదు. నజ్రుల్ దృక్పథం, ఆయన విలువలు పరిశీలిస్తే స్త్రీపురుష సమానత్వానికి ఆయన పెద్దపీట వేశాడని అర్ధమవుతుంది. దేశంలో మొదటి ఫెమినిస్టు ఆయనలో కనబడతాడు. “నారి“ అనే కవితలో
”స్త్రీ పురుషుల మధ్య నాకు తేడా కనబడడం లేదు
ప్రపంచంలోని అత్యుత్తమ, మహోన్నత విజయాలు అన్నీ
సగం స్త్రీలు సాధించినవి, సగం పురుషులు సాధించినవి
అబల అని నిన్ను చిన్న చూపు చూసేదెవరు
నరకాగ్నితో నీకు సంబంధం కలిపేదెవరు
వాళ్ళందరితో చెప్పు, మొదటి పాపం చేసింది
స్త్రీ కాదు, పురుషుడిదే ఆ పాపానికి బాధ్యత
ఆ పాపం చేయించింది దుష్టశక్తి సైతానైతే
సైతానుకు లింగభేదం లేదు. ఆడ కాదు, మగ కాదు
కాబట్టి పాపం చేసింది స్త్రీ పురుషులిద్దరు సమానంగానే”

పురుషాధిక్యత, పురుషాహంకారం రాజ్యం చేస్తున్న కాలంలో, స్త్రీలను పురుషులకు సహాయకులుగా మాత్రమే భావిస్తున్న కాలంలో కాజీ ఈ మాటలు రాశాడన్నది గుర్తించాలి. హృదయంలో జ్వాలలు రేగుతున్నప్పుడు కవిత్వంగా ప్రజ్వర్లిల్లుతాయి. నజ్రుల్ కవితల్లోని ఆ అగ్నిజ్వాలలు బ్రిటీషు పాలకుల కలలను కకావికలం చేశాయి. ఆయన్ను తెల్లదొరలు అరెస్టు చేశారు. జైల్లో పెట్టారు. ఆయన కవిత్వాన్ని నిషేధించారు. ఈ అణిచి వేతలు నజ్రుల్ హృదయంలోని జ్వాలపై చమురును చల్లాయే కాని చల్లార్చలేదు. రాజకీయ అణిచివేతపైనే కాదు, సామాజిక అణిచివేతపై కూడా ఆయన గొంతు విప్పాడు. పడుపువృత్తిలో ఉన్న స్త్రీని ఉద్దేశించి ఆయన రాసిన కవిత “బరంగానా“ (వేశ్య)లో …
”నిన్ను వేశ్య అన్నదెవరు తల్లీ
ఎవరు నీపై ఉమ్మేశారు
బహుశా సీత లాంటి పవిత్ర స్త్రీ
నీకు పాలు తాపి ఉంటుంది
నీవు పవిత్రవు కాకపోవచ్చు
అయినా ఇది నీ కుటుంబమే
మా తల్లులు, చెల్లెళ్ళ కుటుంబమే నీది కూడా
నీ కుమారులు కూడా మా కుమారుల వంటివారే
గౌరవమర్యాదలు పొందే పూర్తి హక్కుదారులే
స్వర్గంలో ప్రవేశించే పూర్తి యోగ్యత ఉన్నవారే
……………..
ఒక అపవిత్ర స్త్రీ కుమారుడు అక్రమసంతానమైతే
అపవిత్రుడైన పురుషుడి కుమారుడు కూడా అంతే”
కాజీ నజ్రుల్ ప్రగతిశీల భావాలకు మరో నిదర్శనం అవసరమా? కాని అనేకసార్లు ఆయన గొంతు నొక్కడం జరిగింది. ఆయన కవిత్వాన్ని అనేకసార్లు నిషేధించడం జరిగింది. కాని ఆ స్వరం నిషేధాల మంచు పర్వతాలపై అగ్నిశిఖలా వెలిగింది. కాజీ నజ్రుల్ ఇస్లామ్ వంటి కవికి లభించ వలసిన గుర్తింపు ఆయన అనారోగ్యం పాలైన తర్వాత దొరకడం దురదృష్టం. బ్రిటీషు పాలకులు కుట్రపూరితంగా స్లోపాయిజన్ కు గురిచేయడమే ఆయన అనారోగ్యానికి కారణమని చాలా మంది నమ్ముతున్నారు. నజ్రుల్ వంటి శిఖరసమాన కవి యావజ్జీవితం భారతదేశంలో గడిపిన కవి తన చివరి రోజులను బంగ్లాదేశ్‌లో గడిపాడు. 1972లో ఆయన బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. 1976లో మరణించాడు. నజ్రుల్ ఎన్నడూ ఛాందసవాదాన్ని సమర్ధించలేదు. ఆయన కవిత్వంలో సెక్యులర్ భావాలు తొణికిసలాడతాయి. హిందూ ముస్లిముల మధ్య సయోధ్యకు, సామరస్యానికి ఆయన కవితలు గొంతెత్తి పిలుపిస్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభావంలో మునిగిపోయి ఉన్న బెంగాలీ సాహిత్యాన్ని కొత్త మలుపు తిప్పినవాడు నజ్రుల్. బిద్రోహి కవిత గురించి రాస్తూ సాజిద్ కమాల్, నిస్సహాయ, నిర్భాగ్య, బాధిత, అణగారిన ప్రతి ఒక్క “నేను“ లోని ప్రతి గుండెలో తిరుగుబాటు జ్వాల రగిలించే ప్రేరణగా, ప్రతి మనిషిలోని “నేను“ ను నిద్రలేపే శక్తిగా, ఒక విశ్వజనీన ప్రకటనగా అభివర్ణించాడు. “బిద్రోహి“ కవితలో క్రింది పంక్తులు చదివితే ఆ విషయం మనకు అర్ధమవుతుంది.
”నేను…
ఖండించి విశాల విశ్వనీలాంబరాన్ని
దాటి చంద్రసూర్య గ్రహ తారా గోళాలు అన్నీ
భేదించి భూ నభో దిగ్మండలాలు అన్నీ
ఛేదించి మహా దివ్య సింహాసనాన్ని
తల ఎత్తిన విశ్వవిఖ్యాత విరాట్ స్వరూపాన్ని
నా నుదుట మండే రుద్రకాలుడి ఉగ్రచిహ్నం
జైత్రయాత్ర విజయకేతన వెలుగు తిలకం”
అంతేకాదు. ప్రతి మనిషిని తానే యోధుడిగా ప్రకటించాలని ప్రోత్సహించి, నరనరాన విద్యుదావేశాన్ని రగిలించింది “బిద్రోహీ”
చెప్పు …యోధుడా
నేను మహా యోధుడనని
నా శిరమత్యున్నతమని
మరుగుజ్జయి వంగుతుంది హిమశిఖరం నా ముందని…
అని ప్రతి ఒక్కరు గర్జించే ఉద్వేగాన్ని బిద్రోహి కవితలో మూటగట్టి అందించాడు. బిద్రోహి కవితలో ప్రతి పంక్తి పాఠకుడిని ఉర్రూతలూగి స్తుంది. స్వతంత్ర సాధన కోసం మడమతిప్పని పోరాటానికి సమాయత్తం చేస్తుంది.
నేను
వసుధ ఒడిలొ మండుతున్న అగ్నిపర్వతాన్ని
అతల వితల సుతల తలాతల అగ్ని కోలాహాలాన్ని
మెరుపుతీగ రెక్కను ఒక్కుదుటున పట్టుకునే వేగాన్ని
బీభత్సపు విషాదాలు విరజిమ్మే భీకర భూకంపాన్ని
నాగరాజు వాసుకీ పడగపై నాట్యాన్ని
అద్భుతమైన కవిత్వం అంతకన్నా అద్భుతమైన విప్లవనినాదం బిద్రోహిలో ప్రతిధ్వనిస్తుంది.
నేను …
పల్లెపడుచు నల్లని వాల్జడ సౌందర్యాన్ని
కన్నియ కన్నుల కణకణలాడే అగ్నికణాన్ని
పదహారేళ్ళ పడుచు గుండెలో ప్రేమసుమాన్ని
అనంత మహానందాన్ని
ఏకాంత చింతాగ్రస్త చిత్త విభ్రమాన్ని
వితంతు విషాద నిశ్వాసను నేనే
హతాశ ఆగ్రహఘోషను నేనే

తిరుగుబాటుకు మరోపేరు కాజీ నజ్రుల్ ఇస్లామ్ 1899లో అప్పటి అవిభక్త బెంగాల్లోని బుర్ధాన్ జిల్లా చురులియా గ్రామంలో పుట్టాడు. బాల్యం కష్టాల్లోనే గడిచింది. తండ్రిని చిన్నవయసులోనే కోల్పోయిన కాజీ తొమ్మిదేళ్ళ వయసులోనే ఒక ఇస్లామిక్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. స్ధానిక మస్జిదులో ముఅజ్జన్ (అజాన్ ఇచ్చేపని)గా పనిచేశాడు. ఆయన చదివింది కూడా పదవ తరగతి మాత్రమే. అయితే ఆ తర్వాత అరబిక్, పర్షియన్ భాషల అధ్యయనాన్ని కొనసాగించాడు. బాల్యంలోనే పర్షియన్ గజళ్ళు, అరబిక్ రచనను బెంగాలీలోకి అనువదించేవాడు. కీట్స్, షెల్లీ, విట్మాన్ ఇంగ్లీషు కవితలను చాలా ఇష్టపడేవాడు. భారతదేశంలో బ్రిటీషు వారి దమననీతికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. స్వదేశీ, ఖిలాఫత్ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ధూమకేతు పేరుతో ఆయన పత్రిక నడిపాడు. ఆ పత్రికలో ఆయన రాతలు చూసి బ్రిటీషు ప్రభువులు గడగడలాడారు. ప్రజా ఉద్యమాలకు ఈ రాతలు దారితీస్తాయని భయపడి ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. తీవ్రమైన తిరుగుబాటు స్వరం వినిపించిన కాజీ నజ్రుల్ ఇస్లామ్ ను రవీంద్రనాథ్ ఠాగూర్ ధూమకేతు అని పిలిచేవారు. మహాత్మా గాంధీ ఆయన కవితలను గిరగిరతిరిగే చక్రాల పాటగా అభివర్ణించారు. ఆయన నరనరాల్లో స్వతంత్ర కాంక్ష ప్రవహించేది. నజ్రుల్ కవితలు, పాటల పుస్తకాలు 50 రాశారు. ఆరు కధల పుస్తకాలు, నవలలు రాశారు. మూడు అనువాద గ్రంథాలు రాశాడు. 53 నాటకాలు, కవితా నాటకాలు రచించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయన్ను జాతీయకవిగా సన్మానించింది. 1945లోనే కలకత్తా విశ్వవిద్యాలయం ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన జగత్తరిణి అవార్డుతో సత్కరించింది. సుత్తి కొడవలి చిహ్నాన్ని మొదటిసారిగా పత్రికలో ప్రచురించిన ఘనత కూడా కాజీ నజ్రుల్ ఇస్లామ్దే. రవీంద్రనాథ్ ఠాగూర్ 1941లో మరణించారు. ఠాగూర్ మరణంపై ప్రతిస్పందిస్తూ ఆయనకు నివాళుర్పిస్తూ కాజీ రెండు కవితలు రాశాడు. గ్రామ్ ఫోన్ కంపెనీ అందులో ఒక గేయాన్ని రికార్డు చేసింది. తర్వాతి సంవత్సరమే నజ్రుల్ కూడా తీవ్రంగా జబ్బుపడ్డాడు. క్రమేణా మాట్లాడే శక్తి పోయింది. 1942 నుంచి 1976 వరకు ఈ మహాకవి మౌనం వహించాడు. ఆగష్టు 1976లో ఆయన తుదిశ్వాస వదిలాడు. ఇటు భారతదేశంలోను, అటు బంగ్లాదేశ్ లోను అత్యున్నత పురస్కారాలు పొందిన మహా కవి కాజీ నజ్రుల్ ఇస్లామ్.

– వాహెద్
7093788843

Comments

comments