ఫైనల్‌కు న్యూజిలాండ్

టీమిండియాకు ఓటమి కుప్పకూలిన టాప్ ఆర్డర్ జడేజా పోరాటం వృథా నేడు రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్, ఆసీస్ ఢీ మాంచెస్టర్: కోట్లాది మంది అభిమానుల ఆశలను నీరుగారుస్తూ టీమిండియా ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ సమరంలో భారత్ 18 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 240 పరుగుల లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కోహ్లి సేన కివీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక 221 పరుగులకే కుప్పకూలింది. […] The post ఫైనల్‌కు న్యూజిలాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టీమిండియాకు ఓటమి
కుప్పకూలిన టాప్ ఆర్డర్
జడేజా పోరాటం వృథా
నేడు రెండో సెమీస్‌లో
ఇంగ్లాండ్, ఆసీస్ ఢీ

మాంచెస్టర్: కోట్లాది మంది అభిమానుల ఆశలను నీరుగారుస్తూ టీమిండియా ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ సమరంలో భారత్ 18 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 240 పరుగుల లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కోహ్లి సేన కివీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక 221 పరుగులకే కుప్పకూలింది. లీగ్ దశలో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత టాప్ ఆర్టర్ కీలకమైన సెమీస్ సమరంలో చతికిలా పడింది. దీంతో ఊరిస్తున్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేక భారత్ అవమానకర రీతిలో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను బుధవారం రిజర్వ్‌డే రోజు కొనసాగించారు. 211 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కిందటి స్కోరుకు న్యూజిలాండ్ మరో 28 పరుగులు మాత్రమే జోడించింది. రాస్ టేలర్ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీశాడు.
ప్రారంభంలోనే..
కష్ట సాధ్యం కాని లక్షంతో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియాకు ప్రారంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. లీగ్ దశలో ఐదు శతకాలలతో అదరగొట్టిన డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ కీలకమైన సెమీఫైనల్లో సమరంలో ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం ఒక పరుగు మాత్రమే సాధించి మాట్ హెన్రీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక, జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా నిరాశే మిగిల్చాడు. కోహ్లి కూడా ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన అద్భుత బంతికి కోహ్లి వికెట్ల ముందు దొరికి పోయాడు. మరోవైపు లంకపై సెంచరీతో కదం తొక్కిన మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ కూడా ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. హెన్రీ అద్భుత బంతికి రాహుల్ బలయ్యాడు. దీంతో భారత్ ఐదు పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లు కాస్త సమన్వయంతో ఆడుతూ కివీస్ బౌలర్ల జోరును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇది కూడా ఎక్కువ సేపు ఫలించలేదు. నిలకడగా ఆడుతున్న కార్తీక్ (6)ను హెన్రీ వెనక్కి పంపాడు. దీంతో 24 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
ఆదుకున్న పంత్, హార్దిక్..
ఈ సమయంలో యువ ఆటగాడు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యలు సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేశారు. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అంతేగాక వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే హార్దిక్, రిషబ్‌లు సమన్వయంతో ఆడారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇద్దరు అసాధారణ పోరాట పటిమను కనబరుస్తూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ కుదురు కోవడంతో భారత్ మళ్లీ కోలుకున్నట్టేనని అందరూ భావించారు. అంత సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో రిషబ్ చేజేతులా వికెట్‌ను పారేసుకున్నాడు. సహనం కోల్పోయిన రిషబ్ చెత్త షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. సాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో 47 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కొద్ది సేపటికే హార్దిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పెను కష్టాల్లో చిక్కుకుంది.
ధోని, జడేజా పోరాటం
ఇక భారత్ ఇన్నింగ్స్ ముగియడం లాంఛనమే అని అందరూ భావిస్తున్నా సమయంలో రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని అసాధారణంగా రాణించారు. ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్నా ఇద్దరు అద్భుతంగా ఆడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ధోని డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వగా జడేజా దూకుడుగా ఆడాడు. కళ్లు చెదిరే సిక్సర్లతో జడేజా భారత్ ఆశలను మళ్లీ చిగురిపించ చేశాడు. జడేజా మెరుపులు మెరిపించడంతో భారత్ ఆశలు మళ్లీ చిగురించాయి. ఇదే క్రమంలో ఏడో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో జడేజా వికెట్‌ను చేజార్చుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా 59 బంతుల్లోనే 4 భారీ సిక్స్‌లు, మరో నాలుగు ఫోర్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ధోని కూడా వెనుదిరిగాడు. సమన్వయంతో ఆడిన ధోని 72 బంతుల్లో ఒక ఫోర్, మరో సిక్స్‌తో 50 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఇలా జడేజా, ధోని ఇద్దరు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో హెన్రీ మూడు వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, సాంట్నర్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. అసాధారణ బౌలింగ్‌తో చెలరేగిన హెన్రీకి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.

స్కోరు బోర్డు:
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 1, హెన్రీ నికోల్స్ (బి) రవీంద్ర జడేజా 28, కేన్ విలియమ్సన్ (సి) జడేజా (బి) చాహల్ 67, రాస్ టైలర్ రనౌట్ 74, జేమ్స్ నిషమ్ (సి) కార్తీక్ (బి) హార్దిక్ 12, గ్రాండోమ్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 16, టామ్ లాథమ్ (సి) జడేజా (బి) భువనేశ్వర్ 10, మిఛెల్ సాంట్నర్ నాటౌట్ 9, మాట్ హెన్రీ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 1, ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు 18, మొత్తం 50 ఓవర్లలో 239/8.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 101433, జస్‌ప్రిత్ బుమ్రా 101391, హార్దిక్ పాండ్య 101551, రవీంద్ర జడేజా 100341, చాహల్ 100631.
భారత్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) లాథమ్ (బి) మాట్ హెన్రీ 1, రోహిత్ శర్మ (సి) లాథమ్ (బి) మాట్ హెన్రీ 1, విరాట్ కోహ్లి ఎల్బీబి ట్రెంట్ బౌల్ట్ 1, రిషబ్ పంత్ (సి) గ్రాండోమ్ (బి) సాంట్నర్ 32, దినేశ్ కార్తీక్ (సి) నిషమ్ (బి) మాట్ హెన్రీ 6. హార్దిక్ పాండ్య (సి) విలియమ్సన్ ౯బి) సాంట్నర్ 32, మహేంద్ర సింగ్ ధోని రనౌట్ 50, జడేజా (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 77, భువనేశ్వర్ కుమార్ (బి) ఫెర్గుసన్ 0, చాహల్ (సి) లాథమ్ (బి) నిషమ్ 5, బుమ్రా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 16, మొత్తం 49.3 ఓవర్లలో 221 ఆలౌట్.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 102422, మాట్ హెన్రీ 101373, లొకి ఫెర్గుసన్ 100431, గ్రాండోమ్ 20130, నిషమ్ 7.30491, సాంట్నర్ 102342.

New Zealand beat India by 18 runs

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఫైనల్‌కు న్యూజిలాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: