కామన్ పరీక్షపై నీలినీడలు

Engineering

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నీట్ తరహాలో నిర్వహించాలనుకున్న ఒకే కామన్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంజనీరింగ్‌కు దేశవ్యాప్తంగా కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఏడాది ఎంసెట్ ఉంటుందా..?లేదా..? అనే సందేహాలు వెలువడ్డాయి. జాతీయ స్థాయిలో నిర్వహించనున్న జెఇఇ మెయిన్, నీట్ తదితర పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఇంజనీరింగ్ కామన్ పరీక్ష ఉండే అవకాశం ఉండదు. అయితే భవిష్యత్తులో కూడా ఇంజనీరింగ్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష జరుగకపోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటి,ఎన్‌ఐటిలతోపాటు రాష్ట్రాల వర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వివిధ రకాల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంజనీరింగ్‌కు ఒకే పరీక్ష నిర్వహిస్తే ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్‌ఐటి ప్రవేశాలకు నిర్వహించే జెఇఇని కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే సిబిఎస్‌ఇ సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నలు ఉండాలి. ఈ ప్రశ్నలు కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ వరకు రాష్ట్రాల సిలబస్‌లో చదువుకుని రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించే విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షను ఏ విధంగా ఎదుర్కొంటారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు జాతీయస్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సుమారు గత పదేళ్లుగా కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి, ఇంటర్ సిలబస్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో ఒకే పరీక్ష పెడితే ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇబ్బంది పడతారని, ఇతర రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఉండదని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయి.
ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఇంటర్ రెండవ సంవత్సరం నుంచే ప్రవేశ పరీక్షల టెన్షన్ మొదలవుతోంది. ఒక్కో విద్యార్థి కనీసం ఐదారు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఒక్కో పరీక్షకు ఒక్కో రకమైన సిలబస్ ఉంటుండంతో ఏ పరీక్షపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించడం లేదన్న భావనతో వేలాదిమంది విద్యార్థులు కనీసం 34 డీమ్డ్ వర్సిటీల ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. అలాగే ఎన్‌ఐటి, ఐఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌తో పాటు తెలంగాణ, ఎపి ఎంసెట్ పరీక్షలకూ హాజరవుతున్నారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నీట్ తరహాలో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న కేంద్ర ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ ప్రవేశ పరీక్షలకు ఫీజులు చెల్లించేందుకే కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. కొన్ని డీమ్డ్ వర్సిటీలు మినహా అన్ని ఎంట్రన్స్ టెస్టులు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలే జరుగుతున్నాయి. దీనికి ప్రశ్నపత్రాలు ముద్రించాల్సిన అవసరం ఉండదు. వర్సిటీలు రూ.1000 నుంచి రూ.2,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని ప్రముఖ డీమ్డ్ వర్సిటీలు కేవలం దరఖాస్తుల ఫీజుల ద్వారానే రూ.లక్షలు వెనుకేసుకుంటున్నాయి. వీటితో పాటు జెఇఇ మెయిన్స్, రాష్ట్ర ఎంసెట్‌కు రూ.800 ఫీజు ఉండగా, ఎపి ఎంసెట్‌కు రూ.500 ఫీజు చెల్లిస్తున్నారు.

Nationwide Common Entrance Exam for Engineering

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కామన్ పరీక్షపై నీలినీడలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.