ఇంజనీరింగ్ జాతీయ పరీక్షపై నీలినీడలు

ప్రవేశాలకు ఐదారు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తుల ఫీజులకే రూ.10-15 వేల వ్యయం   మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైద్య విద్యలో ప్రవేశాలకు ‘నీట్’ను నిర్వహిస్తున్న విధంగానే ఇంజనీరింగ్ ప్రవేశాలకు సైతం జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించించింది. 201920 విద్యాసంవత్సరానికి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎంసెట్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఈ ఏడాది జాతీయ పరీక్ష లేనట్లేనని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో కూడా […]

ప్రవేశాలకు ఐదారు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
దరఖాస్తుల ఫీజులకే రూ.10-15 వేల వ్యయం

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైద్య విద్యలో ప్రవేశాలకు ‘నీట్’ను నిర్వహిస్తున్న విధంగానే ఇంజనీరింగ్ ప్రవేశాలకు సైతం జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించించింది. 201920 విద్యాసంవత్సరానికి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎంసెట్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఈ ఏడాది జాతీయ పరీక్ష లేనట్లేనని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో కూడా ఇంజనీరింగ్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష జరుగకపోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటి,ఎన్‌ఐటిలతోపాటు రాష్ట్రాల వర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వివిధ రకాల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంజనీరింగ్‌కు ఒకే పరీక్ష నిర్వహిస్తే ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్‌ఐటి ప్రవేశాలకు నిర్వహించే ‘జెఇఇ’ పరీక్షను కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే సిబిఎస్‌ఇ సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నలు ఉండాలి. ఇంటర్ వరకు రాష్ట్రాల సిలబస్‌లో చదువుకుని రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించే విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షలో పోటీ పడడం మన రాష్ట్ర విద్యార్థులకు కాస్త కష్టమేనని ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మరోవైపు ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే జాతీయస్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేస్తున్నాయి. సుమారు గత పదేళ్లుగా కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి, ఇంటర్ సిలబస్‌లో ఎలాంటి మార్పులూ జరగలేదు. ఈ నేపథ్యంలో ఒకే పరీక్ష పెడితే ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇబ్బంది పడతారని, ఇతర రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఉండదని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయి.

ఐదారు ప్రవేశ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఇంటర్ రెండవ సంవత్సరం నుంచే ప్రవేశ పరీక్షల టెన్షన్ మొదలవుతోంది. ఒక్కో విద్యార్థి కనీసం ఐదు ఆరు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఒక్కో పరీక్షకు ఒక్కో రకమైన సిలబస్ ఉంటుండంతో వత్తిడి పెరుగుతోంది. అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే జెఇఇ ప్రకటనతో పాటు దేశంలోని కొన్ని ప్రముఖ డీమ్డ్ యూనివర్సిటీలు ప్రవేశాల కోసం ప్రకటన ఇచ్చేయగా, మరికొన్ని వర్సిటీలు మరో నెల రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించడం లేదన్న భావనతో వేలాదిమంది విద్యార్థులు కనీసం మూడు నుంచి ఐదు డీమ్డ్ వర్సిటీల ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. అలాగే ఎన్‌ఐటి, ఐఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌తో పాటు తెలంగాణ, ఎపి ఎంసెట్ పరీక్షలకూ హాజరవుతున్నారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నీట్ తరహాలో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న కేంద్ర ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రవేశ పరీక్షలకే రూ.వేలల్లో ఫీజులు

ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ ప్రవేశ పరీక్షలకు ఫీజులు చెల్లించేందుకే కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది.. ప్రస్తుతం జెఇఇ, ఎంసెట్ సహా డీమ్డ్ వర్సిటీలు అన్నీ ఎంట్రన్స్ టెస్టులు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలే జరుగుతున్నాయి. దీనికి ప్రశ్నపత్రాలు ముద్రించాల్సిన అవసరం ఉండదు. వర్సిటీలు రూ.1000 నుంచి రూ.2,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని ప్రముఖ డీమ్డ్ వర్సిటీలు కేవలం దరఖాస్తుల ఫీజుల ద్వారానే రూ.లక్షలు వెనుకేసుకుంటున్నాయి. వీటితో పాటు జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, రెండు రాష్ట్రాల ఎంసెట్ పరీక్షలకు సుమారు రూ.2 వేల నుంచి రూ.4 వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది.

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: