గోపి కవిత్వ ‘మైలురాయి’

  ఓడలో ప్రయాణించేటప్పుడు సముద్రాన్ని చూసి ముచ్చట పడతాము. గోపి గారు మాత్రం నీళ్ళేమనుకుంటున్నాయో ఓడకు తెలుసా అని ప్రశ్నిస్తారు? నీటి గుండెలు చీలితేనే ఓడకు గమ్యం అన్నారు. ఇక్కడ ఓడ మనిషి, నీరు వ్యవస్థ. మనం ప్రయాణించడానికి వ్యవస్థలను ఎలా నాశనం చేస్తున్నామో కవి ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. కవిత్వం రాయడమే కవి వంతు రాసిన తర్వాత రీడర్ తనకు నచ్చిన విధంగా ఆ కవితను అన్వయించుకుంటాడు. అన్వయింపు సరిగా ఉంటే కవిత్వం […] The post గోపి కవిత్వ ‘మైలురాయి’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఓడలో ప్రయాణించేటప్పుడు సముద్రాన్ని చూసి ముచ్చట పడతాము. గోపి గారు మాత్రం నీళ్ళేమనుకుంటున్నాయో ఓడకు తెలుసా అని ప్రశ్నిస్తారు? నీటి గుండెలు చీలితేనే ఓడకు గమ్యం అన్నారు. ఇక్కడ ఓడ మనిషి, నీరు వ్యవస్థ. మనం ప్రయాణించడానికి వ్యవస్థలను ఎలా నాశనం చేస్తున్నామో కవి ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. కవిత్వం రాయడమే కవి వంతు రాసిన తర్వాత రీడర్ తనకు నచ్చిన విధంగా ఆ కవితను అన్వయించుకుంటాడు. అన్వయింపు సరిగా ఉంటే కవిత్వం ఫలించినట్టేనని నా అభిప్రాయం. గోపి గారి కవిత్వాన్ని ఎన్నో రకాలుగా అన్వయింపు చేసుకోవచ్చు. అంటే వస్తువు ఒకటే అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంది.

కవి రెండు కవితలు రాసిన తర్వాత పక్క పక్కనే పెట్టుకొని చదివినప్పుడు రెండు కవితలు భిన్న ధృవాలుగా ఉండాలంటారు శివారెడ్డి. ఈ వాక్య ఎందుకు చేశారంటే కవితకి కవితకి డిఫరెన్స్ ఉండాలని. అలా కాకుండా ఒకే ధోరణిలో రాసుకుంటూ పోతే ఎంత కవిత్వం రాసిన ఎన్ని పుస్తకాలు వేసిన ప్రయోజనం ఉండదు. రెండు కవితలే కాదు కవి మొదటి పుస్తకానికి రెండవ పుస్తకానికి కూడా మార్పు స్పష్టంగా కనపడాలి. ఎన్. గోపి రెండవ పుస్తకం మైలురాయి. 1976 లో వారి మొదటి కవిత్వ సంపుటి తంగెడు పూలు సాహిత్యలోకానికి అందించారు. ఆ తర్వాత ఆరు సంవత్సరాలు సమయం తీసుకొని రెండవ కవితా సంపుటి 1982లో ముద్రణ చేశారు.

మొదటి పుస్తకంలోని కవితా వస్తువులు ఎక్కువగా సొంత జీవితంలో నుండి తీసుకున్నట్టు కనపడినప్పటికీ సొంత వస్తువును సమాజానికి ఎలా ఆపాదించాలో గోపికి బాగా తెలుసు అందుకే వారి కవిత్వంలో వస్తు వైవి ధ్యం ఎక్కువగా కనపడుతుంది. మైలురాయి కవితా సంపుటిలో 34 కవితలు ఉన్నాయి. ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణం చేస్తున్నప్పుడు గమ్యానికి చేరడానికి ఎంత దూరం ప్రయాణం చేశామో, ఇంకెంత దూరం ప్రయాణం చేయాలో లాంటి వివరాలు మైలురాయిపై ఉంటాయి.
మైలురాయంటే నాకిష్టం ఎందుకంటే గతానికి వర్తమానానికి పునాది లాంటిది ఈ మైలురాయి కనుక. మైలురాయి వస్తువు అయితే వర్తమానం ప్రతీకగా తీసుకున్న గోపి గారు భవిష్యత్తును అందంగా స్మరించుకున్నారు.

ఉదాహరణకు 0km దగ్గర మనం మొదలైయ్యామనుకోండి 10km ప్రయాణించిన తర్వాత 10km అని మరో మైలురాయి వస్తుంది. అప్పుడు 0km గతం అనుకుంటే 10km వర్తమానం అవుతుంది. మన గమ్యం 50km అనుకుంటే అది భవిష్యత్ అవుతుంది. ఇక్కడ గోపి మైలురాయిని వస్తువుగా తీసుకొని గతంలోని జ్ఞాపకాలు నెమరేసుకుంటారు కుదురుగా ఉన్న వర్తమానాన్ని ఇచ్చిన గతానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. భవిష్యత్తులో నవ్వులు ఉన్నాయి కనుక ఈ రాయంటే నాకిష్టం(మైలురాయి) అని భవిష్యత్తు గురించి పాజిటివ్ గా ఆలోచిస్తారు.

పొద్దుటిపూట/అసెంబ్లీముందు/ఊడ్చేవాళ్ళకు/నిన్నటినినాదాలుకనపడతాయి/కుప్పను/గంపలకెత్తేటప్పుడు గాజు పెంకుల్లా హామీ లు గుచ్చుకుంటాయి. గోపి రెండవ పుస్తకంలో వచ్చిన విశేషమైన మార్పు. ఇది ప్రభుత్వానికి వేసిన ప్రశ్న, ఉన్న స్థితిని తెలియజేసిన కవిత. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన కవిత. చిన్న కవితలో అనంతమైన సారాన్ని నింపిన కవిత. దోపిడీ వ్యవస్థ తీరును నగ్న పరిచిన కవిత. 1980 లో రాసిన ఈ కవిత నేటికి కూడా సరిపోతుంది. భవిష్యత్తులో కూడా వాడబడుతుంది. జనం కోసం అది చేస్తాము ఇది చేస్తామని నినాదాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోవడం మనం చూస్తూనే ఉన్నాము.

ఇక ముందు కూడా చూస్తాము. ఇలాంటి కవితలకు జీవిత కాలం చాలా పెద్దగా ఉంటుంది. అందుకే కవి ఒక వస్తువుపై కవిత్వం రాసేటప్పుడు ఆ వస్తువులో ఏది ప్రతిపాదిస్తున్నామన్నది చాలా ముఖ్యమైనది. కవి ప్రతిపాదన, నినాదం, విమర్శే కవిత జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది. కవిత్వం రాయ డం ముఖ్యం కాదు రాసిన కవిత్వం ఎంత మందికి చేరింది, ఎన్ని రోజులు నిలబడింది అన్నది చాలా ముఖ్యమైనది. శ్రీశ్రీ కవిత్వం నేటికి విశేషమైన ఆదరణ ఉండటానికి కారణం వారి కవితా వస్తువులే. అదే కోవలో గోపి కూడా తప్పకుండా ఉంటారు.

నగరంలో జీవించడానికి డబ్బులు లేకపోతే కుదరదని చెప్పడానికి నక్షత్రాలు లేని నగరం అనే శీర్షికతో ఒక కవిత రాశారు. ఇక్కడ నక్షత్రాలు ప్రతీకగా తీసుకున్నారు. నక్షత్రాలు అంటే డబ్బులని అర్థం. జేబులో నక్షత్రాలు లేకుంటే ఈ నగరం నీ మొగమైనా చూడదు కవిత్వానికి ప్రతీకలు మరింత గాఢతను పెంచుతాయి. రీడర్ చదవడానికి ప్రేరణ కలిగిస్తాయి. ప్రతీకలు అందరికీ అర్థమయ్యేలా రాయగలిగినప్పుడే కవిత్వం పచ్చగా చిగురిస్తుంది. ఇక్కడ కవి డబ్బులను నక్షత్రాలుగా వాడటానికి గల కారణం స్థితిని తెలుపడమే.

నక్షత్రాలు అందనంత ఎత్తులో ఉంటాయి కనుక వాటిని వాడి ఉంటారు. చౌరస్తాలో శిలా విగ్రహాలు సైతం వేళ్ళు చూపిస్తూ వెళ్లగొడతాయి మహా నగరాల్లో అనుబంధాలు, ఆప్యాయతలు కనపడవు. డబ్బు ఉంటే జీవనం సాగించడం కుదురుతుంది. లేదంటే వచ్చిన బాటే వెళ్ళవలసి ఉంటుంది. ఈ కవితలో కవి నగరానికి వ్యతిరేకి కాదు కాకపోతే నగర జీవన శైలిని, దుస్థితిని తెలియజేశారు. గోపి సైకిల్ గీతం పేరుతో రాసిన కవితలో నా సైకిలంటే నాకిష్టం/దీని/పుల్ల పుల్లకూ నా కష్టా లు తెలుసు/ అంటూ ఒక నాస్టాల్జియా కవిత రాసుకున్నారు.

వస్తువులను ప్రేమించే గుణం మొదటి పుస్తకం నుండి గోపిలో కనపడుతుంది. ఈ పుస్తకంలో కూడా తెలంగాణ యాసలో రెండు కవితలు రాశారు. గోపి రాసిన యాస కవితల్లో ఎక్కువగా పేద ప్రజల దీన చిత్రాలు కనపడతాయి. దోపిడీ వర్గం శ్రామిక వరాన్ని ఎలా దోచుకుంటుందో రాశారు. కారణం నాడు వారు చూసిన దొరల, పటేల్ పాలనే కారణం అనుకుంటాను. పల్లెను అమితంగా ఇష్టపడే గోపి నగరీకరణను తట్టుకోలేకపోయారు. నా కళ్ళు పాపిష్టి కళ్ళు అని చెప్పుకున్నారు. దీని అర్థం నగరీకరణను చూస్తూ ఏమి చేయలేని స్థితిలో తనను తాను నిందించుకున్నారు.

నగరంలో నా కళ్ళు అని రాసిన కవితలో తీవ్రమైన బాధను వ్యక్తపరిచారు. కాసేపు ఆగు వాన ఏ అనాథ వీధిలో నడుస్తున్నడో, నీడ లేని బిచ్చగాళ్లు గోడవారన ముడుచుకుంటే నాగుబాముల్లా నడిసొచ్చే కాలువలు అంటూ నగరంలో కురిసే వాన గురించి కవిత రాశారు. నగరంలో నీడలేని బిచ్చగాళ్లు వర్షం పడినప్పుడు ఒక గోడవారన ఉన్నా కూడా పొంగిన కాలువలు వారిని ముంచేస్తాయి. ఆ కాలువలను నాగు పాములతో పోల్చారు గోపి. ఇది వైఫల్యం చెందిన మనిషికి ప్రశ్నిస్తున్న కవిత. స్వాత్రంత్యం వచ్చి 70 సంవత్సరాలు దాటిన నేటికి నీడలేని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. 1979లో రాసిన ఈ కవిత నేటికి వాస్తవ చిత్రనే.

ఇదే కవితలో వర్షం వస్తే భయం ఒంటరి ఆడపిల్ల వెంట /పరిగెత్తే గుండాలా ఉంటుంది అన్నారు. భయం అనేది చాలా రకాలుగా ఉంటుంది. రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మారుతూ ఉంటుంది. పిల్లవాడు హోం వర్క్ చేయకపోతే టీచర్ కొడుతుంది; అదొక భయం. కుర్రవాడు సిగరెట్ తాగుతూ తండ్రికి పట్టుబడినప్పుడు కలిగే భయం వేరు. ఇలా భయం సందర్భాన్ని, సంఘటనను, మనిషి దశను బట్టి మారుతూ ఉంటుంది. ఎమోషన్స్ గురించి కవిత్వంలో రాస్తున్నప్పుడు ఆ ఎమోషన్ ఎలాంటిది ఎందుకు కలుగుతుందో చెప్పినప్పుడు రీడర్ కి కవిత సులభంగా అర్థం అవుతుంది. ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు ఎలాంటి భయం కలుగుతుందో రాశారు.

ఒంటరి ఆడపిల్ల అంటే ఎవరూ లేని, కనీసం నీడలేని అనాథలని అర్థం, గుండా అంటే వాన. కవి చెప్పదల్చుకున్నది గుండా లాంటి వర్షం పడుతుంటే అనాథల భయం ఒంటరి ఆడపిల్ల లాగా ఉంటుందని చెప్పడం. 1976 తంగేడు పూలు కవిత రాసిన గోపి 1979లో ప్రయాణం అనే కవిత రాశారు. ఈ కవిత రాసిన తర్వాత నా కవిత్వం చిక్క బడటం మొదలైందని అన్నారు. దాదాపు నాలుగు సంవత్సరాలు తర్వాత ఈ మాట అన్నారు. కొత్తగా కవిత్వం రాస్తున్న వారిని కొంతమంది సీనియర్ కవులు గుర్తించాల్సిన వాక్యం ఇది. ఎందుకంటే కొత్తగా కవిత్వం రాస్తున్న వారికి ఎక్కువగా ప్రోత్సాహం, సూచనలు సీనియర్లు ఇవ్వడం లేదనే ఆరోపణ ఉన్నది. ఇందులో కాస్త వాస్తవం ఉన్నది.

కొత్తగా రాస్తున్న వారికి సరైన సూచనలు ఇచ్చినట్లు అయితే తప్పకుండా చాలా బాగా కవిత్వం రాయగలరు. అనవసరమైన కవి సమ్మేళనాలకన్నా అర్థవంతమైన చర్చలు, ఉపన్యాసాల కొత్తగా సాహిత్యంలోకి అడుగుపెట్టిన వారికి ఉపయోగపడతాయి. కవి సమ్మేళనాలు మాత్రం కవులను కలుసుకోడానికి బాగా ఉపకరిస్తాయి. లారీలు దూసుకెళ్తే ధూళి నిండిపోయి/ గాలి కళ్ళు నులుముకుంది. కాలుష్యం గురించి దాదాపు ప్రతి ఒక్క కవి కవిత్వం రాసి ఉంటారు. కాలుష్యం వల్ల మనిషికి ఎలాంటి నష్టం కలుగుతుందో చెప్పి ఉంటారు. లారీని మనిషి అనుకుంటే తను దూసుకుపోడానికి దుమ్ము ధూళిని ప్రకృతిలో నింపుతున్నాడు.

గాలి కళ్ళు నులుముకుంటోంది అనడంలో మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నారో గోపి వాడిన ప్రయోగం గాలి కళ్ళు నులుముకుంటోందని. మరొక కవితలో కిటికీ జాలీల గుండా వీచే గాలికి ఒంటి నిండా చిల్లులు అన్నారు. దోమలు రాకూడదని కిటికీలకు జాలి వేసుకుంటూ ఉంటాము. అందులో నుండి వచ్చే గాలి స్పర్శతో ఆనందిస్తాము కానీ గోపి ఆ గాలికి చిల్లులు పడ్డాయని బాధను వ్యక్త పరుస్తారు. గోపి కవిత్వం, వారి ఆలోచనలు, వస్తువులు చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే వారు అత్యంత ప్రజాదరణ పొందిన నేటితరం కవిగా ప్రసిద్ధి చెందారు.

వచన కవిత్వాన్ని పిచ్చి పిచ్చి ఊహల వైపు నడుస్తున్న నేటి కాలంలో సిసలైన వచన కవిత్వాన్ని రాస్తున్న ఏకైక కవి గోపి. అందుకే వారి కవిత్వం భారతీయ అన్ని భాషలలోకి అనువాదం అయ్యింది. కవిత్వం రాయడం వేరు అందరికీ అర్థమయ్యేలా రాయడం వేరు. గోపి కవిత్వం ప్రజల నాలుకలపై నానుతూనే ఉంటుంది. ఓడలో ప్రయాణించేటప్పుడు సముద్రాన్ని చూసి ముచ్చట పడతాము. గోపి మాత్రం నీళ్ళేమనుకుంటున్నాయో ఓడకు తెలుసా అని ప్రశ్నిస్తారు? నీటి గుండెలు చీలితేనే ఓడకు గమ్యం అన్నారు. ఇక్కడ ఓడ మనిషి, నీరు వ్యవస్థ. మనం ప్రయాణించడానికి వ్యవస్థలను ఎలా నాశనం చేస్తున్నామో కవి ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. కవిత్వం రాయడమే కవి వంతు రాసిన తర్వాత రీడర్ తనకు నచ్చిన విధంగా ఆ కవితను అన్వయించుకుంటాడు. అన్వయింపు సరిగా ఉంటే కవిత్వం ఫలించినట్టేనని నా అభిప్రాయం. గోపి కవిత్వాన్ని ఎన్నో రకాలుగా అన్వయింపు చేసుకోవచ్చు. అంటే వస్తువు ఒకటే అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంది.

గోపిలో ఉన్న స్పష్టమైన అవగాహన ఏంటంటే? తను రాస్తున్న కవిత్వం ఎవరికీ అన్నది వారికి తెలుసు తన రీడర్స్ ఎవరన్నది గ్రహించారు. అదే ఈ పుస్తకంలోని కవితల్లో కనపడుతుంది. గోపి లక్ష్యం ప్రజాకవి కావడమే ఎంతో మంది కవులున్న శ్రీశ్రీ ప్రజాకవిగా స్థిరపడిపోయారు. శ్రీశ్రీ కవిత్వానికి గోపి కవిత్వానికి చాలా వ్యత్యాసం ఉన్నది. కానీ ఇద్దరి లక్ష్యం సామాన్య ప్రజలే వారి పక్షానే కవిత్వం నిలబడాలి. శ్రీశ్రీ బీదవాడికి ఇరు వైపులా కవిత్వం నిలబడాలి అన్నారు. గోపి కవిత్వం చేస్తున్నది కూడా అదే. ఆ విధంగా ఉండాలనే తపన, ఆరాటం తన రెండవ పుస్తకంలోని కవితలు చదివినప్పుడు కనపడింది.

N. Gopi Written by Milestone book

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గోపి కవిత్వ ‘మైలురాయి’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: