కాలుదువ్వుతున్న అంకుల్ శ్యామ్…

  ఇరాన్ నుంచి ఎదురయ్యే దాడులను తిప్పికొట్టడానికి ఆ పరిసరాల్లో సైన్యాన్ని మోహరించినట్లు అమెరికా చెబుతోంది. ఇరాన్ దాడులు చేయబోతున్న సూచనలు, సాక్ష్యాధారాలు ఏవీ లేవు. ఇరాన్ అమెరికాల మధ్య మాటల యుద్ధం మాత్రం పెద్ద స్థాయిలో నడుస్తోంది. అమెరికాతో యుద్ధానికి పూనుకుంటే ఇరాన్ ఇక అంతటితో నాశనమైపోతుందని ట్రంప్ అన్నాడు. నిద్రిస్తున్న సింహాన్ని లేపవద్దని ఇరాన్ అధ్యక్షుడన్నాడు. మాటల్లో వేడి, వాడి పెరుగుతున్నది. ఇది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీయవచ్చని చాలా మంది భయపడుతున్నారు. కాని […] The post కాలుదువ్వుతున్న అంకుల్ శ్యామ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇరాన్ నుంచి ఎదురయ్యే దాడులను తిప్పికొట్టడానికి ఆ పరిసరాల్లో సైన్యాన్ని మోహరించినట్లు అమెరికా చెబుతోంది. ఇరాన్ దాడులు చేయబోతున్న సూచనలు, సాక్ష్యాధారాలు ఏవీ లేవు. ఇరాన్ అమెరికాల మధ్య మాటల యుద్ధం మాత్రం పెద్ద స్థాయిలో నడుస్తోంది. అమెరికాతో యుద్ధానికి పూనుకుంటే ఇరాన్ ఇక అంతటితో నాశనమైపోతుందని ట్రంప్ అన్నాడు. నిద్రిస్తున్న సింహాన్ని లేపవద్దని ఇరాన్ అధ్యక్షుడన్నాడు. మాటల్లో వేడి, వాడి పెరుగుతున్నది. ఇది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీయవచ్చని చాలా మంది భయపడుతున్నారు. కాని వాస్తవానికి అమెరికా ఇప్పటికే ఇరాన్‌తో యుద్ధంలో ఉంది. కొత్తగా యుద్ధం ప్రారంభమయ్యేది ఏదీ లేదు. ఇది కంటికి కనిపించే యుద్ధం కాదు. సైనిక దళాలు పోట్లాడే యుద్ధం కాదు. దశాబ్దాలుగా అమెరికా ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం చేస్తోంది. ఆంక్షలతో అమెరికా చేస్తున్న ఈ ఆర్ధిక యుద్ధం గత సంవత్సర కాలంగా మరింత తీవ్రమైంది. అత్యంత అమానుషంగా అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలు యుద్ధం కన్నా తీవ్రమైన పిరికి చర్యలు.

ఈ చర్యల వల్ల అమాయక ఇరాన్ ప్రజలు కష్టాలపాలవుతున్నారు. వారి బతుకు దుర్భరమవుతోంది. ఇరాన్ మెడలు వంచడానికి, గల్ఫ్ ప్రాంతంలో మిగిలిన దేశాల మాదిరిగా తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ సహకారం, దౌత్యసంబంధాల నియమాలకు సంబంధించి కూడా అమెరికా అనేక ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఆర్ధిక ఆంక్షలు ఏమన్నా సాధిస్తాయా? ఆర్ధిక ఆంక్షలను ఒక శిక్షగా విధిస్తే అవి ఫలితాలివ్వడం సాధ్యం కాదు. నచ్చచెప్పే ప్రక్రియలో భాగంగా ఆర్థిక ఆంక్షలు అమలైతే కొంత విజయం సాధించవచ్చు. కాని అమెరికా మాత్రం ఇరాన్‌ను అణచేయాలని, శిక్షించాలనే ఉద్దేశాన్ని దాచుకోవడం లేదు. ఆర్ధిక ఆంక్షల వల్ల ఒక దేశం తన ప్రవర్తన మార్చుకున్న దాఖలా ఒక్కటి కూడా లేదు. కాని ఈ ఆంక్షల వల్ల ప్రజలు నానా కష్టాలపాలవుతారు. అయితే ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితులు ఏర్పడవచ్చు. అమెరికా కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడితే అక్కడ తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ఆలోచిస్తున్నది.

దౌత్యపరమైన చర్చలు, శాంతి ప్రయత్నాలు జరిగినప్పుడే ఈ ఆంక్షల వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది. దౌత్యపరమైన చర్చల్లో ఆర్ధిక ఆంక్షలను తొలగించడానికి ఏం చేయాలన్న డిమాండ్‌పై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒబామా కాలంలో జరిగింది ఇదే. 2015 ఇరాన్ అణు ఒప్పందం ఇలాగే కుదిరింది. ఈ ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకున్నందువల్ల, బదులుగా ఇరాన్‌పై ఆర్ధిక ఆంక్షలను తొలగించారు. ఇరాన్ తన అణు ఉత్పాదక సామర్థ్యాన్ని చాలా వరకు తగ్గించుకుంది. కాని ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగారు. పాత ఆంక్షలతో పాటు మరికొన్ని కొత్త ఆంక్షలను ఇరాన్‌పై విధించారు. ఇప్పుడు ఇరాన్ చమురు దిగుమతి చేసుకునే దేశాలపై కూడా అమెరికా ఆంక్షల కొరడా ఝళిపించింది. కాని ప్రపంచీకరణ విస్తరించిన నేటి కాలంలో ఇలా వెలివేత విధానాలు ఎంతవరకు సాధ్యం. నేడు ఒక దేశం మరో దేశంపై ఆధారపడి ఉంది.

అమెరికా పెత్తనం చెలాయించినా చాలా దేశాలు ఈ మాటలను ఒప్పుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇలా ఏకపక్షంగా మరొక దేశంపై ఆంక్షలను విధించాలని చేసే ప్రయత్నాలు సఫలం కావడం చాలా కష్టం. ఇలా అనేక దేశాలను ఆంక్షల పరిధిలోకి తీసుకుని వస్తూ ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకునే ఆంక్షల వల్ల ఆ దేశం తీవ్రంగా నష్టపోతుంది. ఇరాన్ చమురు ఎవరు కొనకుండా చేయడం వల్ల ఇరాన్ ఆర్ధికంగా దివాలా తీస్తుంది. ఐక్యరాజ్యసమితి 2006లో ఇరాన్ పై కొన్ని ఆంక్షలు విధించింది. అణు కార్యకలాపాలపై ఈ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల ఒత్తిడి తర్వాత చర్చలు జరిగాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరింది. అనేక దేశాలతో కలిసి అమెరికా చేసుకున్న ఈ ఒప్పందం నుంచి ఇప్పుడు ఏకపక్షంగా తప్పుకున్న అమెరికా, తన ఇష్టారాజ్యంగా ఇరాన్‌పై ఆంక్షలు విధించడం ఇరాన్‌తో యుద్ధానికి దిగడమే.

ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అమెరికా వైఖరిని విమర్శిస్తున్నాయి. ఆంక్షలను తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాని అమెరికాతో వైరం తెచ్చుకుని, డాలర్ ఫైనాన్సింగ్ పోగొట్టుకోవడానికి చాలా దేశాలు భయపడుతున్నాయి. ఈ ఆర్ధిక ఆంక్షల వల్ల జరుగుతున్నదేమిటంటే, ఇరాన్‌లో ధరలు ఆకాశానికంటాయి. సాధారణ ప్రజల జీవితాలు నరకమవుతున్నాయి. అక్కడి సైన్యంపై కాని, పాలకులపై కాని ఎలాంటి ప్రభావమూ ఉండదు. కష్టాలు సాధారణ ప్రజలకే. ప్రజల బతుకు దుర్భరం చేస్తే తిరగబడి పాలకులను పడగొడతారన్న వ్యూహం కూడా ఈ ఆర్ధిక ఆంక్షల వెనుక ఉంది. అమెరికా అనుకున్నట్లే ఇరాన్‌లో ఆందోళనలు, ప్రతిఘటనలు కూడా జరుగుతున్నాయి. కాని ఆర్ధిక ఆంక్షల వల్ల ప్రజలు తమ ప్రభుత్వాలపై ఆగ్రహం తీర్చుకుంటారని భావించడం కూడా పొరబాటు. చాలా మంది ప్రజలు ప్రభుత్వానికి బాసటగా నిలబడడం కూడా గతంలో జరిగింది. ప్రభుత్వాన్ని విమర్శించేవారు కూడా తమ కష్టాలకు అమెరికా ఆంక్షలే కారణం కాబట్టి ప్రభుత్వాన్ని సమర్థించేవారుగా మారుతున్నారు.

నిజానికి ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ప్రభుత్వానికి మరింత ప్రజామద్దతు లభిస్తుంది. తమ కష్టాలకు అసలు కారకుడు ట్రంప్ అని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వ లోపాలు, తప్పులను కూడా క్షమించే వాతావరణం ఏర్పడింది. ఈ వాతావారణం ఏర్పడిన తర్వాత ప్రజలు అమెరికా ఆంక్షల వల్ల ఎదురయ్యే కష్టాలను భరించడానికి సిద్ధపడతారు. అమెరికాను ఎదిరించే ప్రభుత్వాన్నే కోరుకుంటారు. ఇప్పుడు అదే ఇరాన్‌లో జరుగుతోంది. అమెరికా ఆంక్షలకు ప్రతిగా ఇరాన్ సైన్యానికి మరింత స్వేచ్ఛ ఇస్తుంది. ముఖ్యంగా సైన్యంతో సంబంధాలున్న కంపెనీలకు మరింత స్వేచ్ఛ ఇస్తుంది. అమెరికా ఏ శక్తులను వ్యతిరేకిస్తుందో ఆ శక్తులే మరింత బలపడతాయి. ఇరాక్‌పై యుద్ధం చేసి అమెరికా సాధించిందేమిటి? ఇరాక్‌లో అమెరికా సైన్యాలున్నాయి. ఇరాక్‌ను అమెరికా జయించలేకపోయింది.

యుద్ధ మొస్తే ఇరాన్‌కు మద్దతుగా నిలబడతామని ఇరాక్ నేతలు ప్రకటించారు. అమెరికా ఈ వాస్తవాలను మరిచిపోతోంది. కఠినమైన ఆంక్షలతో వాణిజ్యాన్ని దెబ్బతీస్తే ఎవరైనా దిగి వస్తారన్న భ్రమల్లోనే ఉంది. చైనాను కూడా ఇలాగే భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అటు చైనా కాని, ఇటు ఇరాన్ కాని అమెరికా బెదిరింపులను లక్ష్యపెట్టడం లేదు. ఇరాన్ చమురు విషయంలో భారతదేశం చాలా వరకు అమెరికాకు అనుకూలంగానే వ్యవహరించింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చాలా వరకు తగ్గించుకుంది. అత్యంత కీలకమైన చాబహార్ పోర్టులో భారీ పెట్టుబడులుపెట్టినప్పటికీ తప్పుకుంది.

ఇరాన్‌తో భారత్ సంబంధాలు దిగజారాయనే చెప్పాలి. కాని అమెరికా మాత్రం ఇండియాపై ఇంకా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌కు ఇన్నాళ్లూ కల్పించిన వాణిజ్య ప్రాధాన్యత హోదా రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నెల 5వ తేదీ నుంచి అది అమలులోకి వస్తుంది. ఇన్నాళ్లూ భారత వస్తువులకు అమెరికాలో ప్రత్యేక పన్నులు ఉండేవి కావు. తమ వస్తువులకు సమాన హోదా ఇచ్చే అంశంపై భారత్ ఇంతవరకు ఎటువంటి హామీ ఇవ్వలేదని, అందుకే జూన్ 5వ తేదీ నుంచి ప్రిఫరెన్షియల్ బెనిఫిషియరీ హోదాను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

Mutual differences between Iran and the United States

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాలుదువ్వుతున్న అంకుల్ శ్యామ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.