మూక హత్యపై మెతక వైఖరి!

Sampadakiyam        జార్ఖండ్‌లో తబ్రెజ్ అన్సారీ అనే నవ వరుడిని ఒక రాత్రంతా పది మందీ కలిసి చితకబాది చంపేసిన మూక (లించింగ్) హత్య కేసును పోలీసులు నీరుగార్పించ దలచడంలో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. రంగు మార్చకుండా దిక్కు మార్చే రీతిలో స్వరూపాన్ని చెదరనీయకుండా ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిపూర్ణంగా హరిస్తున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇటువంటివి వింత అనిపించవు. పెళ్లయి నెల రోజులైనా దాటని తబ్రెజ్ అన్సారీ అనే 24 ఏళ్ల యువకుడుని గత జూన్ 17న జార్ఖండ్‌లో మూక దాడి చేసి చంపేసిన ఘటనపై మారిన పోలీసుల తీరు పట్ల హతుడి కుటుంబం నిరసన ప్రకటించింది. నిందితులపై ఉరి శిక్షకు ఆస్కారమిచ్చే ఐపిసి 320 కింద కేసు పెట్టాలని మొదట్లో చార్జిషీట్ రూపొందించిన జిల్లా పోలీసులు అనంతరం అంతకంటే బలహీనమైన ఐపిసి 304 సెక్షన్‌ను ప్రయోగించడాన్ని కుటుంబ సభ్యులు ఆక్షేపిస్తున్నారు.

వాస్తవానికి ఎటువంటి ఘాతుక నేరస్థులనైనా ఉరి తీయడమనేది హర్షించదగినది కాదు. హత్యకు శిక్షగా సమాజమే ఆయా వ్యక్తుల ప్రాణాలను హరించడం నాగరక లక్షణం కాదు. వ్యక్తిగత, సామాజిక పరివర్తన ద్వారా హత్య వంటి దారుణాలను తగ్గించి అంతిమంగా తొలగించవలసి ఉండగా హంతకులను ఉరి తీయడం వల్ల ప్రయోజనం శూన్యమనే అభిప్రాయాన్ని కొట్టి పారేయలేము. చంపిన వాడిని చంపడమే న్యాయమనే భావనకు తక్షణ ఆవేశపూరిత వాతావరణంలో ఆస్కారం కలుగుతుంది. కాని అది అభిలషణీయం కాదు. హత్యా నేరానికి సమాజ అపసవ్యతల నుంచి ఉత్పన్నమయ్యే కారణాలు కూడా దోహదం చేస్తాయి. అయితే ప్రస్తుత కేసులో మాత్రం పోలీసులు చట్టంలో గరిష్ఠంగా అవకాశమున్న ఉరి శిక్షకు ఆస్కారమిచ్చే సెక్షన్ కింద కేసు పెట్టడానికి నిర్ణయించుకొని ఆచరణలో దానిని తగ్గించడం ప్రశ్నించదగినది.

జరిగిన నేరం సామాన్యమైనది కాదు. దొంగతనం నెపం పెట్టి హతుడిని ఒక మూక ఆ రాత్రంతా దారుణంగా హింసించింది. అంతేకాదు అతడి మత విశ్వాసాలకు విరుద్ధంగా బలవంతంగా ‘జై హనుమాన్, జై శ్రీరామ్’ నామ జపం చేయించారని వార్తలు వెల్లడించాయి. ఇది పూర్తి స్థాయి మత దురహంకార, విద్వేష పూరిత మూక హత్యేనని స్పష్టపడుతున్నది. వారు ఉరి శిక్షకు అర్హులా, అనర్హులా అనేది వేరు మాట. దానిని న్యాయ స్థానాలు నిర్ణయిస్తాయి. కాని పోలీసులే కేసును నీరుగార్పించవలసిన అవసరం ఎందుకు కలిగిందనేది కీలకం. అధికారంలో ఉన్న శక్తుల ఒత్తిడి మేరకే ఇది జరిగి ఉంటుందనే అనుమానానికి అవకాశం కల్పించారు. కేంద్రంలోనూ, జార్ఖండ్‌లోనూ హిందుత్వ శక్తుల అండ నిలిచే బిజెపి అధికారంలో ఉన్న నేపథ్యం మూక దాడుల నిందితులపై మెతకగా వ్యవహరించే ధోరణులను సహజంగానే ప్రోత్సహిస్తుంది. నిజానికి మూక దాడుల, హత్యల అమానుష పద్ధతి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతనే తీవ్ర రూపం ధరించింది.

ఈ ఒక్క కేసులో నెపం దొంగతనం ఆరోపణ అయింది గాని 2015లో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ అనే చోట జరిగిన అఖ్లాక్ హత్య దురంతం నుంచి ఇప్పటి వరకూ సంభవించిన మూక దాడులు, హత్యలన్నీ గో మాంసం కలిగి ఉన్నారనో, గోవులను కబేళాలకు తరలిస్తున్నారనో మున్నగు గో మూలక కారణాలపైనే జరిగాయి. ఈ కేసులో కఠినాతి కఠిన ఉరి శిక్షకు దారి తీసే సెక్షన్‌కు బదులు యావజ్జీవ శిక్షతో సరిపుచ్చడానికి దోహదపడే తక్కువ స్థాయి సెక్షన్‌ను ప్రయోగించడానికి పోలీసులు ఒక వింత కారణం చెబుతున్నారు. తబ్రేజ్ అన్సారీ చనిపోయింది కేవలం మూక దాడి వల్లనే కాదని గుండె పోటు కూడా ఒక కారణమని అందుకే ఐపిసి సెక్షన్‌ను మార్చామని వారంటున్నారు. ఆ గుండె పోటు లేదా మరో తీవ్రమైన శారీరక పరిస్థితి కూడా ఒక రాత్రంతా హింసించి మానసికంగా కూడా బాధించినందువల్లనే కలిగి ఉండడానికి ఆస్కారమున్నది.

అన్నింటికీ మించి మూకలు చట్టాన్ని ఉల్లంఘించి దానిని బొత్తిగా ఖాతరు చేయకుండా ఇటువంటి నేరాలకు దిగడమనేది దేశంలో, సమాజంలో చట్టబద్ధ స్థితిని రూపు మాపడంగానే పరిగణించాలి. ఇది అలాగే కొనసాగితే సామాజిక కల్లోలమే తలెత్తే ప్రమాదముంది. ఈ దృష్టితో చూసినప్పుడు జరిగిన నేరం ఎంత మాత్రం చిన్నది కాదు. వీటన్నింటినీ గాలికి వదిలేసి పని కట్టుకొని కేసు తీవ్రతను పోలీసులు తగ్గించబోడం ప్రశ్నించదగినది. ఒక వైపు మూక దాడులను సహించబోమని హెచ్చరిస్తున్న పాలకులే ఇంకొక వైపు ఇటువంటి కేసుల నీరుగార్పుడు చర్యలకు పాల్పడుతూ ఉంటే అది ఎంత మాత్రం క్షమించరానిది. ఈ కేసులో కూడా అంతిమంగా న్యాయ స్థానాల వల్లనైనా తగిన న్యాయం జరగాలి.

Murder Charge Dropped in Tabrez Ansari Lynching Case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మూక హత్యపై మెతక వైఖరి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.