ప్రేమకు ప్రతిరూపం అమ్మ

ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడూ మే రెండో ఆదివారం మదర్స్ డే ఒక సందర్భం మాత్రమే. అయినా అమ్మకు ఒకరోజు ఏంటి…? ప్రతి రోజూ అమ్మదే. అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవేమో… ఆమె గురించి చెప్పాలంటే మాటలు చాలవు. పసితనంలోనే కాదు ప్రతిసారీ కంటికి రెప్పలా చూసుకుంటుంది. బాల్యంలో మొదటి గురువు అమ్మే.. యవ్వనంలో మార్గదర్శకురాలు..మన ప్రతి అడుగులోనూ అమ్మ ఛాయలే ఉంటాయి. “కంటేనే అమ్మ అని అంటే ఎలా .. కరుణించే ప్రతిదేవతా […] The post ప్రేమకు ప్రతిరూపం అమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడూ మే రెండో ఆదివారం మదర్స్ డే ఒక సందర్భం మాత్రమే. అయినా అమ్మకు ఒకరోజు ఏంటి…? ప్రతి రోజూ అమ్మదే. అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవేమో… ఆమె గురించి చెప్పాలంటే మాటలు చాలవు. పసితనంలోనే కాదు ప్రతిసారీ కంటికి రెప్పలా చూసుకుంటుంది. బాల్యంలో మొదటి గురువు అమ్మే.. యవ్వనంలో మార్గదర్శకురాలు..మన ప్రతి అడుగులోనూ అమ్మ ఛాయలే ఉంటాయి. “కంటేనే అమ్మ అని అంటే ఎలా .. కరుణించే ప్రతిదేవతా అమ్మే కదా ” అని సినారె అన్నట్లుగా సొంత బిడ్డలతోపాటు సమానంగా అనాథల్నీ సాకే అమ్మలూ దేవతలే కదా. అమ్మ అవసరం ఉన్న ఏ బిడ్డయినా సరే ఆమెకు కన్నబిడ్డతో సమానం. అమ్మా అని పిలిస్తే చాలు కరిగిపోతుంది. నేనున్నా అంటూ అక్కున చేర్చుకుంటుంది. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి..ఆమెను ఎప్పుడూ ఆనందపరచడం తప్ప…

మాతృదేవోభవ అంటూ అమ్మకు అగ్ర తాంబూలం ఇచ్చిన సంస్కృతి మనది. నవమాసాలు మోసి, ప్రసవ వేదన భరించి, బిడ్డకు ఒక రూపం ఇస్తుంది తల్లి,. బిడ్డను చూడగానే అప్పటి వరకు తాను పడిన బాధను, వేదనను మరిచిపోతుంది. ఆటాపాటా, ఆనందం అన్నీ తానవుతుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిచయం చేసేది మాతృమూర్తే. అందుకే అమ్మే ఆదిగురువు. ప్రత్యేకించి ప్రతి యేటా ప్రపంచదేశాలన్నిటా అమ్మను తలుచుకుంటూ అమ్మ పేరిట ఒక రోజును ‘మదర్స్‌డే’ అంటూ కేటాయించారు. అమ్మ చేసిన సేవలను, త్యాగాలను స్ఫురణకు తెచ్చుకుంటూ ఆ రోజంతా అమ్మ జ్ఞాపకాలతోనే గడుపుతారు. ఉద్యోగరీత్యా కానీ మరే కారణాల వల్ల కానీ అమ్మకు దూరంగా ఉండేవారు ప్రతి ఏటా మే రెండో ఆదివారం వచ్చే మదర్స్‌డే రోజున అమ్మ దగ్గరకు వెళ్లి, ఆమెతో గడిపి ఆశీస్సులందుకుంటారు.

నిద్ర లేచింది మొదలు ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా అమ్మ చేసే సేవలు అపురూపం. తన బిడ్డ ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తుంది తల్లి. బిడ్డకు నలతగా ఉంటే చాలు కలత చెందుతూ… ఆ బిడ్డ ఆరోగ్యం కుదుట పడేవరకూ అన్నం తినకుండా వేయి దేవుళ్లకు మొక్కుకుంటుంది. బిడ్డ ఏ పదవిలో ఉన్నా తల్లికి మాత్రం తన కంటిపాపే. అందుకే ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే అంటారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్దజేసిన అమ్మను వృద్ధాప్యంలో ఆదరించకుండా, ఏ అనాథాశ్రమంలోనే వదిలేయడమనేది క్షమించరాని నేరం. ఆ పాపం మనల్ని జన్మజన్మలకు వెంటాడుతూనే ఉంటుంది.

అమ్మ రుణం తీర్చుకోవాలంటే కన్నతల్లికి వృద్ధాప్యంలో పట్టెడు మెతుకులు పెట్టి , ఆమె బాగోగులు చూసుకుంటే చాలు. మనకు ఆమె ఎన్ని సేవలు చేసిందో, మన అభివృద్ధికి ఎంతగా పాటుపడిందో, ఎన్ని కన్నీళ్లు దిగమింగుకుందో ఒక్క సారి గుర్తుచేసుకుంటే చాలు.. అమ్మను నిరాదరణకు గురిచేయలేం. ఎంత బిజీగా ఉన్నా ‘అమ్మా బాగున్నావా..’ అంటే చాలు తన బిడ్డ తన గురించి ఎప్పుడూ పట్టించుకుంటాడంటూ మురిసిపోతుంది పిచ్చితల్లి.
బట్టీల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే తల్లులు కూడా తమ బిడ్డల్ని నడుముకు గుడ్డలో కట్టుకుని, పక్కనే పడుకోబెట్టుకుని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తల్లి ఏ స్థితిలో ఉన్నా బిడ్డను మహారాజులాగానే చూసుకుంటుంది. ఆమెకు డబ్బుతో పనిలేదు. అంత ప్రేమ కురిపిస్తుంది. సృష్టిలో అత్యంత నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారంటే.. అది కచ్చితంగా అమ్మనే.

International Mothers day

మదర్స్‌డే ఎందుకంటే…

పిల్లలను, భర్తను, మొత్తంగా కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పోషించే పాత్ర పైనే సమాజ విలువలు ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ ఆమె శ్రమకు తగిన గుర్తింపు మాత్రం ఇప్పటికీ దక్కడం లేదు. అయితే ’మదర్స్ డే’ రూపంలో ఆ తల్లుల జీవితాలను తలుచుకోవడానికి ఓ రోజంటూ ఏర్పడటం కచ్చితంగా హర్షించదగ్గ విషయం. మరి ఈ మదర్స్ డే ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? అసలెవరు దీనికి నాంది పలికారో తెలుసుకుందాం.
ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. గ్రీస్‌లో షరియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్‌గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. జూలియవర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. ఆమె 1905మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. యుద్ధ్దంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ పౌరులకు నివాళులు అర్పించే రోజుగాను ఈ మదర్స్ డేను అక్కడివారు పరిగణిస్తున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డీ రూజ్ వెల్ట్ 1934లో ‘మదర్స్ డే’ మీద ఒక స్టాంపు విడుదల చేశారు. 2008 , మే నెలలో యూఎస్ ప్రతినిధుల సభ మదర్స్ డే స్మారకోత్సవ తీర్మానం కోసం రెండుసార్లు ఓటింగ్ నిర్వహించింది. మొదటి సభలో అమెరికా కాంగ్రెస్ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.


మదర్స్ డే ప్రస్థానం ప్రారంభమైన తొలి వేదిక గ్రాప్టన్స్ చర్చి. ప్రస్తుతం ప్రపంచ తల్లుల ఆలయంగా పేరుపొందింది. అంతేకాదు, జాతీయ చారిత్రక ప్రదేశంగాను చరిత్రకెక్కింది. అసలు మాతృమూర్తులకు ఎంతమేర సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం దక్కుతున్నాయన్నది ఆలోచించాల్సిన అంశం.
* మాతృదినోత్సవాన్ని ఒక్క రోజుకే పరిమితం చేయడం అసంబద్ధం. కేవలం మదర్స్ డే నాడు స్పీచులకో, వేదికల మీద ఫొటో పోజులకో ఇలాంటి కార్యక్రమాలు పరిమితమైతే.. దీని అసలు ఉద్దేశం దెబ్బతింటుంది. మహిళలకు అంతటా సమ ప్రాధాన్యం దక్కిన రోజు, హింస నుంచి వారు విముక్తి అయిన రోజు, భ్రూణ హత్యల బారి నుంచి ఆడశిశువులను రక్షించిన రోజు ..ఈ ప్రపంచానికి మరింత మంది గొప్ప మాతృమూర్తులను అందించగలం. ముఖ్యంగా పితృస్వామ్య భావజాలాన్ని విడనాడి స్త్రీ-పురుష సమానత్వం సాధించిన రోజు.. తల్లులకు నిజమైన గౌరవం దక్కినట్లు లెక్క.

వృత్తిలోనూ సమర్థవంతంగా రాణిస్తున్న పిల్లతల్లులు

వృత్తిని, పిల్లల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మహిళలు. వృత్తి పట్ల నిబద్ధ్దత కలిగిన 30 సంవత్సరాల అర్చన ఝాన్సీ కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షనిస్ట్ పోలీస్ కానిస్టేబుల్ గా 6 నెలల పసికందుతో విధినిర్వహణలో పాల్గొన్న ఫొటో చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ డి.జి.పి. ఓం ప్రకాశ్ అర్చనను ప్రశంసిస్తూ క్యాష్ రివార్డ్‌తో అభినందించడం తెలిసిందే.
*బిడ్డకు దూరంగా ఉంటూ, కుటుంబంలో, ఆఫీసులో కార్యకలాపాలను నిర్వహించడమనేది మహిళలకు సవాలే.
* తల్లులైన మహిళలు వృత్తి జీవితంలోకి అడుగు పెట్టేటపుడు కలిగే ఆలోచనలు, భావనల పట్ల కాస్తంత జాగ్రత్త పడాలి.
*బేబి మదర్స్ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ చాలామంది వారి బిడ్డ గురించి ఆలోచనలు ఎక్కువవుతూ తరచూ ఆందోళనలకు గురయ్యే మహిళలు ఉన్నారు. పక్కా ప్రణాళికతో వాటిని ఎదుర్కోవచ్చు.
* డెలివరీ జరిగిన కొద్ది రోజుల తర్వాత వృత్తి జీవితంలో అడుగుపెట్టే వారు వారం మధ్య రోజులో ప్రారంభిస్తే మానసికంగా సన్నద్దత కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మూడు రోజులు వెళ్తే వారాంతపు సెలవు లభిస్తుందనే భావన మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది.
* దూరంగా ఉంటారు కాబట్టి బిడ్డకు కావల్సిన చనుబాలు అందించడం చాలా కష్టంగా మారుతుంది. ఇటువంటి సమయాలలో బిడ్డకు కావాల్సిన పాలను తగినంతగా నిల్వ చేయాలి. బిడ్డకు ఎంత సమయమైతే దూరంగా ఉంటారో ఆ సమయాన్ని బిడ్డ కోసం కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
* కార్యాలయంలో ఉన్న సమయంలో బిడ్డను సురక్షితంగా, ప్రేమగా చూసుకునే వ్యక్తిని ఎంపిక చేయడం అనేది చాలా జాగ్రత్త అవసరం.
-డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్

పార్లమెంటులో బిడ్డకు పాలిచ్చిన ఎంపి

పార్లమెంటు ఛాంబర్స్‌లోనే తన రెండు నెలల బిడ్డకు పాలిచ్చి ఓ ఎంపీ తన మాతృత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. ఈ అరుదైన ఘటన ఆస్ట్రేలియా పార్లమెంటులో చోటుచేసుకుంది. క్వీన్ ల్యాండ్ నుంచి ఎంపీగా ఎన్నికైన లారిసా వాటర్స్ పార్లమెంటు ఛాంబర్స్‌లో తన రెండు మాసాల కూతురు అలియాజాయ్ పాలిచ్చింది.
పార్లమెంటు చాంబర్స్‌లోకి పసిబిడ్డలను అనుమతించేందుకు 2016లో ఆస్ట్రేలియా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనే కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. దీంతో ఆ పాలసీ వాడుకున్న మొదటి ఎంపీగా వాటర్స్ రికార్డ్ సృష్టించింది.
వాటర్స్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకోవడం అభినందనీయం.

అమ్మే నా మొదటి గురువు

మా అమ్మ సుమతీ దేవి. అమ్మ ఏడో తరగతి వరకు చదువుకుంది. చిన్నప్పుడు పెద్దబాలశిక్ష, బోలెడన్ని కథలు చెప్పేది నాకు. నా ప్రైమరీ చదువంతా ఇంట్లోనే అమ్మ దగ్గరే. నా మొదటి గురువు అమ్మే. అమ్మకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. అదే అలవాటు నాకు వచ్చింది. మా అమ్మ దగ్గర నుంచి అందరినీ ఆదరించడం, సమాజ సేవ చేయడం నేర్చుకున్నాను. అమ్మ, నానమ్మ పొలం పనులు చూసుకునేవారు. వారితోపాటు నేనుకూడా అప్పుడప్పుడూ వెళ్లేవాడిని. అలా వ్యవసాయం గురించి, రైతు జీవన విధానం, కష్టనష్టాలు అన్నీ తెలుసుకున్నాను. నా షష్ఠిపూర్తి అభినందన సభలో అమ్మ మాట్లాడుతూ “నా బిడ్డ నాకు గర్వకారణం” అంటూ చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటికీ పుస్తకాలు, నవలలు, కథలు చదువుతునే ఉంటుంది. ఆత్మవిశ్వాసం,ధైర్యం, మంచితనాల కలయికే మా అమ్మ.
– ప్రొఫెసర్ కె. సీతారామారావు, ఉపకులపతి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

ఒక జీవన పాఠ్య పుస్తకం మా అమ్మ..

అందరి అమ్మల్లాంటిదే మా అమ్మ కూడా..ఒక జీవన పాఠ్య పుస్తకం. చిన్నప్పుడే చనిపోయిన తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమె కళ్లల్లో ఒక ఆత్మీయమైన మెరుపును చూసాను. హాస్టల్‌లో అన్నం బాగోలేదు..అమ్మ..నాన్నలు లేకుండా నేనుండలేను అని వచ్చిన అన్నయ్యని చదువుకునేవారికి అవన్నీ అవసరం లేదు.. చదువే ప్రధానమని అర్ధరాత్రి అన్నయ్యని వెనక్కి పంపించిన అమ్మలోని దార్శనికురాలను గుర్తించాను. ‘నేను చనిపోతే ఆ క్షణమే నన్ను సాగనంపి, తిరిగి నీ హాస్పిటల్‌కి వెళ్లి నీ పని చేసుకో.. నా కోసం నిన్ను కష్టపెట్టుకోవద్దు’ అంటూ ఇప్పటికీ కర్తవ్య బోధ చేస్తున్న మాతృమూర్తి మా అమ్మ. ప్రొఫెసర్‌నైన నాకు ఏ పాఠం చెప్పగలదు ఈ ఏడో తరగతి మాత్రమే చదివిన అమ్మ. అమ్మకి ఏమీ తెలియదు అనుకునే నాకు అమ్మ తెలిసేసరికి సగానికిపైగా జీవితం అయిపోయింది. అయినా అమ్మ ఎందుకో నాకు అందరు అమ్మల్లాంటిదే అనిపిస్తుంది. అమ్మల్లందరూ ఇలాగే ఉంటారనిపిస్తుంది.
డాక్టర్ శ్రీ భూషణ రాజు, నెఫ్రాలజీ డిపార్టుమెంట్ అధిపతి, నిమ్స్ హాస్పిటల్

టైం మేనేజ్‌మెంట్ అమ్మనుంచే నేర్చుకున్నాను…

మా అమ్మ పొత్తూరి విజయలక్ష్మి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ రాయడం మొదలెట్టింది. నాకేమీ అర్థమయేది కాదు. అమ్మ రాసిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ నవల సినిమా తీశారు. దానివల్ల వచ్చిన క్రేజ్ చూసి ఆశ్చర్యపోయాను. నాన్నకు రైల్వేలో ఉద్యోగం. అందులో భాగంగా మేం బెంగాల్‌లో ఉన్నాం. అమ్మ అక్కడ బెంగాలీ, హిందీ, నేర్చుకుని అక్కడి మనిషిగా మారిపోయింది. ఆ రోజుల్లో ఊరుకాని ఊరునుంచి రాయడం మొదలుపెట్టి , ప్రముఖ రచయిత్రిగా ఎదిగిన వైనం తల్చుకుంటే ఆనందంగా ఉంటుంది. అమ్మ ఇంటిని చూసుకుంటూనే రాస్తూనే ఉండేది. ఎవరిమీదా ఆధారపడదు. టైం వేస్ట్ చేయదు. ఎన్ని పనులు చేసినా అలసట చెందేదికాదు. అవన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. బయట వాళ్లు మా ఇంటికెస్తే మేం పిచ్చివాళ్లం అనుకుంటారు. అమ్మ ఊరికే నవ్విస్తుంటుంది. జీవితాన్ని లైట్ గా తీసుకుంటే దానంత అద్భుతం మరోటి లేదని చెబుతుంటుంది. అమ్మ పుస్తకాల్లో నాకు చాలా ఇష్టమైనది ఆత్మకథ. లక్ష్మీకల్యాణం, శంకర్రావు పెళ్లి… ఇవన్నీ చాలా బాగుంటాయి.
-కడియాల శిరీష, ఇన్వెస్టర్, ఎంటర్‌ప్రెన్యూరర్

పురాణాల్లోనూ తల్లి పాత్ర అమోఘం

హిందూ పురాణాల్లోనూ చాలా మంది అమ్మలు తమ పిల్లల కోసం అనేక త్యాగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. హిడింబి, శృతకీర్తి, కర్ణుడిని పెంచినతల్లి రాధ, సీత లాంటి వాళ్లు నేటి అమ్మలకు ఆదర్శంగా నిలిచారు.  ఎవరి సహాయం లేకుండా ఘటోత్కచుని పెంచిన హిండింబి నేటి తల్లులకు ఆదర్శంగా నిలుస్తోంది. దుర్యోధునుడి కుట్ర నుంచి తప్పించుకుని అడవిలోకి చేరిన పాండవులను హిడింబాసురుడు సంహరించడానికి ప్రయత్నించి భీముడి చేతిలో మరణించాడు. అతడి సోదరి హిడింబి మాత్రం భీముడిని ప్రేమిస్తుంది. రాక్షస స్త్రీ అయిన హిడింబి ప్రేమను భీముడు అంగీకరించిన తర్వాత ఆమె జీవన విధానమే మారిపోయింది. వివాహం తర్వాత కొద్ది రోజులే కలిసున్న భీముడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఘటోత్కచుడికి జన్మనిచ్చిన హిడింబి అతడికి యుద్ధ తంత్రాలు, ఆయుధాల ప్రయోగించే విధానాన్ని ఎవరి సాయం తీసుకోకుండా నేర్పించి పరాక్రమవంతుడైన యోధుడిగా తీర్చిదిద్దింది. మహాభారతంలో ఈమె పాత్ర చిన్నదైనా తన కుమారుడికి మంచి తల్లిగా, గురువుగా, సంరక్షకురాలిగా నిలిచింది.
* శిశుపాలుని తల్లి శృత కీర్తి గురించి మహాభారతంలోని సభా పర్వంలో తెలియజేశారు. శిశుపాలుడు జన్మించినప్పుడు అతని వికృత రూపం చూసి అందరూ భయపడ్డారు. అతడి మూడు నేత్రాలు, నాలుగు చేతులతో భయంకరంగా ఉండేవాడు. అయితే శృత కీర్తి మాత్రం అతడి పట్ల అవిభాజ్యమైన ప్రేమను కురిపించింది. ఒకరోజు శిశుపాలుడిని కృష్ణుడు తన ఒడిలోకి తీసుకున్నప్పుడు అతడి వికృత రూపం అదృశ్యమవుతుంది. కానీ శిశుపాలుడు తన ప్రవర్తనతో కృష్ణుడిని అవమానించినప్పుడు శృతకీర్తి తన బిడ్డను క్షమించమని కోరుతుంది. అయితే 100 తప్పులు వరకు ఎలాంటి శిక్ష ఉండదని ఆమెకు అభయమిచ్చాడు. తల్లి అభ్యర్థన వల్ల శిశుపాలుడు బలవంతుడిగా మారాడు.
* కర్ణుడి పెంపుడు తల్లి రాధ కూడా నేటి తరానికి ఆదర్శం. సంతానం కోసం ఎదురుచూస్తున్న రాధకు నదిలో కొట్టుకుపోతూ దొరికిన బాలుడే కర్ణుడు. అందుకే కర్ణుడిని రాధేయుడు అంటారు. దుర్యోధనుడితో స్నేహం మొదలైన తర్వాత ద్రోణాచార్యుడు కర్ణుడిగా నామకరణం చేశాడు.
* జమదగ్ని భార్య రేణుక పరశురాముడికి తల్లి కూడా. తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ ప్రకారం పరుశురాముడు రేణుకకు శిరచ్ఛేదనం చేశాడు. కొడుకు చేతిలో ఆమె ఆనందంగా ప్రాణాలు వదిలింది.
* ద్రౌపది, పాండవులకు పుట్టినవాళ్లే ఉప పాండవులు. అయితే వీళ్లంతా కురుక్షేత్ర యుద్ధంలో మరణించారు. ద్రౌపది మాత్రం వీరిని విలువలతో పెంచింది. అంతే కాదు సుభద్రార్జునుల కొడుకు అభిమన్యుడు అంటే ద్రౌపదికి అమితమైన ప్రేమ.
* హిందూ పురాణాల్లో కృష్ణుడిని పెంచిన తల్లి యశోదకు ప్రత్యేక స్థానం ఉంది. కొడుకు తప్పుచేసినప్పుడు దండించడం, తర్వాత అపారమైన ప్రేమతో అతడిని ఓదార్చడంలో యశోద విలక్షణ శైలిని ప్రదర్శించింది.
* సీత జీవితం మొత్తం త్యాగాలు, కష్టాలతోనే నిండిపోయింది. నిండు చూలాలుగా ఉన్న సీతను రాముడు అరణ్యంలో వదలిపెట్టిన తర్వాత లవకుశలు జన్మించారు. వారిని త్రిలోక వీరులుగా తీర్చిదిద్దిన ఘనత సీతకే దక్కుతుంది.

మా అమ్మ లక్ష్మిసంగీతంలో నాకు స్ఫూర్తి. అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉండేది. అవన్నీ వినేవాడిని. అలా నాకూ పాడటం అలవాటయింది. నా అభిరుచిని గమనించి నాకు సంగీతం నేర్పించింది. టీవీలో నేను సంగీతం సమకూర్చిన సినిమాలు, కార్యక్రమాలను అమ్మ తప్పకుండా చూస్తుంది. ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటుంది. అసలు అమ్మ కోసం ఒక రోజు ఉండాల్సిన అవసరంలేదు. ప్రతిరోజూ అమ్మను గౌరవించాల్సిందే. ప్రేమించాల్సిందే. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, మన ఎదుగుదలకు కారణమయ్యే తల్లిదండ్రులను నిర్ధాక్షిణ్యంగా అనాథ శరణాలయాల్లో ఉంచడం దారుణం. క్షమించరాని నేరం. వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది.
ఆర్.పి.పట్నాయక్,
ప్రముఖ సంగీత దర్శకుడు

 

మల్లీశ్వరి వారణాసి

 

 

The post ప్రేమకు ప్రతిరూపం అమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.