కాంగ్రెస్ అడుగు జాడల్లో బిజెపి!

Congress-BJP

 

2014, 2019 ఎన్నికల ప్రచార సభలలో కాంగ్రెస్ పార్టీని అవినీతికి మారు పేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘాటైన విమర్శలు చేశారు. 2014లో ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన లోక్‌సభలో తొలిసారిగా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. 16 రాష్ట్రాలలో బిజెపి అధికారం చేపట్టడంతో పాటు, రెండు నెలలుగా అధ్యక్షుడు ఎవ్వరో తెలియని దిక్కుతోచని స్థితిలోకి కాంగ్రెస్ పార్టీని నెట్టి వేశారు.

భారత రాజకీయాలలో కాంగ్రెస్ నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం ఇప్పట్లో లేదనే భరోసా బిజెపి శ్రేణులకు కలిగించారు. అవినీతిపై యుద్ధం ప్రకటించిన మోడీ పాలనలో అవినీతిపరులైన కాంగ్రెస్ వారంతా – ఆ పార్టీకి చెందిన నేతలలో సగం మందిని జైళ్లలోకి నెట్టివేస్తారని బిజెపి కార్యకర్తలు భావించారు. కానీ ఇప్పుడు అవినీతికి, అక్రమ పాలనకు మారుపేరైన నేతలు కాంగ్రెస్, ఇతర పార్టీల నుండి భారీగా చేరడం ద్వారా బిజెపిని కాంగ్రెస్ మయం చేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు సహించలేక పోతున్నారు. తాజాగా బిజెపి మద్దతుదార్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఒక ఫొటోలో బిజెపిని కాంగ్రెస్ మయం చేస్తున్నారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎంఎల్‌ఎలలో 10 మందిని బిజెపిలో విలీనం చేసుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో బిజెపికి పటిష్ఠమైన పునాది ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ‘మా నాన్న ఉన్న బిజెపి పార్టీ ఇప్పుడు లేదు’ అంటూ చాలా నిర్వేదంగా పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో విజయోత్సాహంతో కర్ణాటకలో గతంలో పలుసార్లు విఫలమైన ‘ఆపరేషన్ కమల్’కు అత్యుత్సాహంతో తెర తీశారు. దానితో ఏకంగా 16 మంది ఎంఎల్‌ఎలు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించారు. అదే సమయంలో గోవాలో సహితం కాంగ్రెస్‌ను కుప్ప కూల్చారు. ఇక తమ తదుపరి లక్ష్యం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ అంటూ బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ రెండు ప్రభుత్వాలను కూలగొట్టేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీలో వృద్ధతరం, యువతరం మధ్య రచ్చ కెక్కుతున్న విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బిజెపి పావులు కలుపుతుంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగి, 114 సీట్లకు పరిమితమైంది. బిజెపి 109 స్థానాలను సంపాదించింది.

ఎస్‌పి, బిఎస్‌పి సహకారంతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసినా, బిజెపికి కూడా 109 సీట్లు ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనైతే మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ఉంది. పైగా, ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరో కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా మధ్య సయోధ్య అంతగా లేదు. మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌కు ఒక్క సీటు దూరంలో ఉండిపోయింది. 99 స్థానాలు గెలుచుకొని ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటు బిజెపికి 73 స్థానాలు రావడంతో రాజస్థాన్‌లో గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టడం తేలిక కాకపోవచ్చు.

అయితే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు బిజెపిలో ఉత్సాహం కలిగిస్తున్నది. మరో రెండు నెలల్లో ప్రభుత్వం కూలడం ఖాయం అంటూ బిజెపికి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. రాహుల్ రాజీనామా తర్వాత గెహ్లాట్ అభద్రతకు గురవుతున్నారని బిజెపి ఎంఎల్‌ఎ వాసుదేవ్ నాని పేర్కొన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు 40 మంది తమతో టచ్ లో ఉన్నారని స్వయంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలలో ప్రకటించారు. ఇప్పుడు బిజెపి నేత ముకుల్ రాయ్ ఏకంగా 107 మంది టిఎంసి ఎంఎల్‌ఎలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమలో ‘విలీనం’ చేసుకున్న బిజెపి ఆ పార్టీకి చెందిన 23 మంది ఎంఎల్‌ఎలలో 17 మంది తమతో టచ్‌లో ఉన్నారంటూ ప్రకటనలు చేస్తున్నది. ఎపిలో టిడిపి తుడిచి పెట్టుకుపోతుందని, బిజెపిలో చేరడానికి క్యూలు కడుతున్నారని అంటూ నిత్యం ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు బిజెపిలో చేరుతున్నారు. ఈ ప్రహసనం అంతా చూస్తే దేశంలో ‘ఏక పక్ష పాలన’ కు బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నదని స్వయంగా ఆ పార్టీ ఎంపి సుబ్రహ్మణ్యన్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం స్వామి ఒక సలహా ఇచ్చారు. గాంధీ కుటుంభం నేతృత్వంలో కాంగ్రెస్‌కు ఎట్లాగూ భవిష్యత్ లేదని, అందుకని కాంగ్రెస్ చీలిక పార్టీల అధినేతలైన మమతా బెనర్జీ, శరద్ పవర్ వంటివారు గాంధీ కుటుంబం లేని కాంగ్రెస్‌లో విలీనమై దేశంలో బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించాలని సూచించారు. అయితే అటువంటి వివేకం వీరిలో కలుగుతుందని ఆశించలేము. తమ వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఒక విధంగా బిజెపి అధినాయకత్వం తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలపైననే కాకుండా టిఎంసి, సిపిఎం, వైసిపి, టిఆర్‌ఎస్ ప్రభుత్వాల పట్ల కూడా అటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నది. తమ విధానాలు, కేంద్రంలో -రాష్ట్రాలలో తమ ప్రభుత్వాల పరిపాలన ద్వారా ప్రజల మెప్పు పొంది, ప్రజాస్వామ్యయుతంగా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఒక వంక భావోద్వేగాలు రెచ్చగొడుతూ, మరోవంక భారీ ఫిరాయింపుల ద్వారా ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నం చేస్తున్నారు.

తిరుగులేని ఆధిక్యతలో ఉన్న తెలంగాణలోని టిఆర్‌ఎస్ పాలన సహితం కూలిపోయి రెండేళ్లలో మధ్యంతర ఎన్నికలు తథ్యం అంటూ ఒకే సీట్ గల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పేర్కొనడం గమనార్హం. కర్ణాటకలో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు జరిపిన ఎంఎల్‌ఎలు అందరు సంపన్నులే. ఇద్దరు మాత్రమే రైతులు. మిగిలిన వారంతా కాంట్రాక్టుదారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర వ్యాపారాలు చేస్తున్నవారే. ప్రస్తుత ప్రభుత్వంలో తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేరడం లేదనో, బిజెపిని వ్యతిరేకిస్తే ఐటి, ఇడీ దాడులకు గురికావలసి వస్తుందనే భయంతోనే వారు రాజీనామాల అస్త్రం ప్రయోగించారని స్పష్టం అవుతుంది. ఎపిలో సహితం కేంద్ర ప్రభుత్వ సంస్థలలో వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్నవారే ఎక్కువగా బిజెపి లో ఫిరాయింపుకు క్యూ కడుతున్నారు. అవినీతికి వ్యతిరేక నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని దారిలోకి తెచ్చుకొని, బిజెపిలో చేర్చుకోవడం ద్వారా ఎటువంటి సందేశం ఇస్తున్నారు?

ముకుల్ రాయ్, సుజనా చౌదరి వంటి వారంతా బిజెపికి వ్యతిరేకంగా ఉన్నంతకాలం ఐటి, ఇడీ దాడులకు గురయ్యారు. వారి అరెస్ట్ కు రంగం సిద్ధం అంటూ వార్తలు వ్యాపించాయి. కానీ బిజెపిలో చేరగానే వారిపై ఆరోపణలే గాని కేసులు లేవుకదా అని బిజెపి నేతలు సమర్ధించుకొంటున్నారు. ఇటువంటి వారితో ప్రధాని కలలు కంటున్న ‘నూతన భారత్’ను సాధిస్తారా? భారత దేశంలో ప్రతిపక్ష ప్రభుత్వాల ఉనికిని సహించలేని ప్రవృతి ఇందిరా గాంధీ నుండి వచ్చింది. 1959లోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలద్రోసి ఒక ‘కళంకిత వారసత్వం’కు నాంది పలికారు. ఆ తర్వాత ప్రధానమంత్రి హోదాలో జమ్ము, కశ్మీర్ లో ఫారూఖ్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కూలదీశారు. అప్పటి నుండే కశ్మీర్ లోయ ప్రజలలో ఢిల్లీ పాలకుల పట్ల విశ్వాసం సన్నగిల్లడం, అక్కడ తీవ్రవాదం, ఉగ్రవాదములకు పునాదులు ఏర్పడటం జరిగింది. ఇప్పటికీ ఆ రావణ కాష్టం నుండి ఆ రాష్ట్రం బయటపడలేక పోతున్నది.

అబ్దుల్లాను గద్దె నుంచి దించి, నేషనల్ కాన్ఫరెన్స్ నుండి 13 మంది ఎంఎల్‌ఎలను ఫిరాయింపులకు గురిచేసి, అబ్దుల్లా బావ అయిన జిఎంషా ను కాంగ్రెస్ మద్దతుతో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం కర్ఫ్యూ నీడలోనే ఎక్కువగా గడిపింది. అప్పటి నుండి ప్రజాస్వామ్య ప్రక్రియకు అక్కడ మంగళం పాడినట్లు అయింది. తర్వాత రెండు, మూడు నెలలకే ఆంధ్రప్రదేశ్ లో ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని కూలదోసి ఇందిరాగాంధీ తీవ్రంగా అపఖ్యాతి పాలయ్యారు. 160 మంది ఎమ్యెల్యేలతో రామారావు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ముందు బలప్రదర్శన చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఆమె పట్ల విముఖత కలిగించారు. రాజకీయంగా ఆమె పతనానికి ఈ రెండు ప్రభుత్వాలను కూలదోయటమే దారి తీసిన్నట్లు గ్రహించాలి.

ఇందిరా గాంధీ అనుభవాల నుండైనా మోడీ గుణపాఠం గ్రహించాలి. ఆర్థిక ప్రయోజనాలు, పదవుల కోసం పార్టీలు ఫిరాయించే వారితో తమకు బలం లేని రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే, అటువంటి వారితో ఎటువంటి సుస్థిర ప్రభుత్వం అందించగలరో తెలుసుకోవాలి. దేశ ప్రజల ముందు ‘నూతన భారత్’ కలలు ఉంచుతున్న ప్రధాని రాజకీయ విలువలకు తిలోదకాలు ఇవ్వడం ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వాలి అనుకొంటున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ ద్వారా కాంగ్రెస్ కు భిన్నమైన రాజకీయ విలువలు గల పార్టీగా బిజెపి బలోపేతం కావాలని ఆ పార్టీ శ్రేణులు కోరుకొంటున్నారు. అంతేగాని బిజెపిని కాంగ్రెస్ మయం కావించాలని కోరుకోవడం లేదు. అటువంటి ప్రయత్నాలు చేయడం ఆ పార్టీకి ఆత్మహత్య సదృశ్యం కాగలదని గ్రహించాలి.

Modi Government declares war on corruption

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాంగ్రెస్ అడుగు జాడల్లో బిజెపి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.