గౌరవం సంపాదించుకోని మోడీ…

  అయిదేళ్లపాటు పరిపాలించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైనా పొంది ఉండవచ్చుగాక. గౌరవాన్ని మాత్రం సంపాదించుకోలేకపోయారు. భారత దేశానికి ఇంతవరకు ప్రధానమంత్రులైన వారిలో స్వంత మెజారిటీలు సాధించిన వారున్నారు, సాధించలేనివారున్నారు. సమర్థంగా పాలించిన వారున్నారు, పాలించలేకపోయినవారున్నారు. అవినీతి ఆరోపణలకుగురికానివారున్నారు, గురైన వారున్నారు. చివరకు అవినీతి ఆరోపణలు వచ్చిన వారు కూడా గౌరవం పొందారు. కాని ప్రస్తుత ప్రధానివలె అపరిపక్వంగా వ్యవహరించి గౌరవాన్ని పొందని ప్రధానమంత్రి మరెవరూ లేరు. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా కొట్టవచ్చినట్లు కనిపిస్తున్న స్థితి ఇది. […] The post గౌరవం సంపాదించుకోని మోడీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అయిదేళ్లపాటు పరిపాలించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైనా పొంది ఉండవచ్చుగాక. గౌరవాన్ని మాత్రం సంపాదించుకోలేకపోయారు. భారత దేశానికి ఇంతవరకు ప్రధానమంత్రులైన వారిలో స్వంత మెజారిటీలు సాధించిన వారున్నారు, సాధించలేనివారున్నారు. సమర్థంగా పాలించిన వారున్నారు, పాలించలేకపోయినవారున్నారు. అవినీతి ఆరోపణలకుగురికానివారున్నారు, గురైన వారున్నారు. చివరకు అవినీతి ఆరోపణలు వచ్చిన వారు కూడా గౌరవం పొందారు. కాని ప్రస్తుత ప్రధానివలె అపరిపక్వంగా వ్యవహరించి గౌరవాన్ని పొందని ప్రధానమంత్రి మరెవరూ లేరు. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా కొట్టవచ్చినట్లు కనిపిస్తున్న స్థితి ఇది.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన కాలం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అక్కడ బిజెపి మొదటి నుంచి బలంగా ఉండటం, మోడీ హయాం వచ్చేసరికి గెలవటంలో, మోడీ వరుసగా ముఖ్యమంత్రి కావటంలో విశేషమేమీ లేదు. తనకన్న ముందు నుంచే పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రమైన గుజరాత్‌లో అదే ఆర్థిక ధోరణి తన హయాంలోనూ కొనసాగింది. ప్రత్యేకంగా ఆయన పరిపాలనా కాలం గురించి ‘నరేంద్ర మోడీ మోడల్’ అంటూ 2014 లోక్‌సభ ఎన్నికలతో ముడిపెట్టి ఒక నినాదాన్ని గట్టిగా ప్రచారంలోకి తెచ్చారు. అంతకు ముందు మనం ఆ మాటగాని, ఆ వివరాలుగాని వినలేదు. ఆయన మోడల్ అంటూ అభివృద్ధి, సమర్థవంతమైన పాలన, అవినీతి రాహిత్యం అనే మూడు మాటలకు ఆ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించారు. ఈ మోడల్ అంటున్న దానిలో ప్రచారం ఎక్కువ, వాస్తవాలు తక్కువ అని 2014 ఎన్నికల సమయంలోనే కొన్ని స్వరాలు వినిపించాయి గాని, ఎన్నికల దుమారంలో అవి ఎవరికీ వినిపించలేదు.
ముఖ్యంగా, మోడీ కాలంలో సంపన్న వర్గాలు లాభపడి సాధారణ వర్గాల పరిస్థితిలో పురోగతి లేకపోవటం, సామాజికాభివృద్ధి సూచికలు వెనుకబడే ఉండటం, అల్ప సంఖ్యాక వర్గాలతోపాటు దళిత ఆదివాసీ వర్గాలపై పెరిగిన అణచివేత అనే మూడు అంశాలను అనేక వివరాలతో పాటు పేర్కొంటూ, ‘నరేంద్ర మోడీ మోడల్’ అనేది వట్టి ప్రచారపు కల్పన అనేది ఎన్నికల తర్వాతి కాలంలో బాగా వెల్లడైంది. దానితో ఆయన పట్ల గౌరవం పోవటం అప్పుడే మొదలైంది. ఆ వెనుక ఇంకా పెరిగింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో ఏ విధంగానైనా తిరిగి గెలవాలన్న కోరికతో ఆయన వ్యవహరిస్తున్న తీరును చూసి, ఆయనపట్ల గౌరవం అడుగంటుతున్నది.
ఉదాహరణకు గత పది రోజులుగా చర్చలోకి వచ్చిన ఒక అంశాన్ని గమనించండి. అది కుల మతాలను రాజకీయ ప్రచారంలోకి తేవడానికి సంబంధించినది. యథాతథంగా ఒక వాస్తవం ఏమిటి? కులం, మతం రెండూ భారత దేశ రాజకీయాలలో, ఎన్నికలలో ఒక అంశంగా 1952 నాటి మొదటి ఎన్నికల నుంచి పని చేస్తున్నాయి. ఇది మంచి అనో చెడు అనో తీర్పు చెప్పటం లేదిక్కడ. మన సామాజిక వాస్తవాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. కాని సమాజానికి అభివృద్ధి ప్రధానం కావాలి గనుక, ఆ క్రమంలో కుల మతాల పాత్ర క్రమంగా వెనుకకు పోవాలి గనుక, వాటి ప్రసక్తి అసమానతల తొలగింపు అనే లక్షానికి పరిమితం కావాలి గనుక తొలితరం నాయకత్వాలు అటువంటి ఆరోగ్యకరమైన దృష్టితో పని చేశాయి. తర్వాత కాలంలో పరిపాలనాపరంగా విఫలమై ప్రజాదరణను కోల్పోయిన పార్టీలు అధికార సాధన కోసం కుల మతాలను ఉపయోగించుకోవటం మొదలుపెట్టాయి. అటువంటి రాజకీయ గొంగడిలో కూర్చుని తింటూ వెంట్రుకలను ఏరటానికి అర్థం లేదు.
అదే సమయంలో గుర్తించవలసింది ఒకటున్నది. ప్రధానమంత్రి హోదాలో గల వారు కుల మత రాజకీయాలను తెర వె నుక వ్యూహాలకు, కింది స్థాయి నాయకులకు పరిమితం చేశారు తప్ప తాము స్వయంగా వాటిని తెర ముందుకు తేలేదు. ఆ స్థాయికి పతనమైన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గతంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారు అయోధ్య రామ మందిరం విషయంలో తెలివైన చెలగాటాలు ఆడినా ‘సాఫ్ట్ హిందూత్వ’ ఎత్తుగడలు వేసినా, తర్వాత పి.వి నరసింహారావు బాబ్రీ కూల్చివేతపట్ల నిద్ర నటించినా, ఇపుడు రాహుల్ గాంధీ దేవాలయ సందర్శనలు పెంచినా, తాను కశ్మీరీ బ్రాహ్మణుడనని ఒక సందర్భంలో ప్రకటించినా ఇటువంటి వన్నీ పైన అన్నట్లు తెర వెనుక వ్యూహాలకో, కాకతాళీయాలతో పరిమితమై ఒక స్థాయిలో ఉండిపోయాయి.
కాని కుల మత రాజకీయాలను బాహాటంగా, ఇంచుమించు నిరంతరం అనదగ్గ రీతిలో ప్రదర్శిస్తూ ప్రచారంలోకి పెడుతున్న నాయకుడు మోడీ. ఈ ధోరణికి తనను ఆద్యుడు అనలేము గాని, దానిని ఆయన బాహాటంగా పరాకాష్ఠ స్థితికి తీసుకువెళుతున్నారు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి అందుకు పాల్పడుతున్న కారణంగా గౌరవాన్ని కోల్పోతున్నారు. అట్లా కోల్పోతుండటానికి మరొక కారణం కూడా ఉంది. ఎన్నికల కోసం కుల మత రాజకీయాలను ఇతరులు నర్మగర్భమైన రీతిలో చేయటం అనేది ఒక పార్శంకాగా, ఇతరత్రా రాజకీయాలు, పరిపాలనలో వారి వ్యవహరణ తీరులో గౌరవప్రదమైన లక్షణాలు చాలా కన్పించాయి. అందువల్ల కుల మత రాజకీయ కోణం మరీ జడలు విప్పుకుని ప్రదర్శితం కాలేదు. మోడీ కాలం వచ్చే సరికి అది మొదటి సారిగా కన్పిస్తున్నది. అందువల్లనే ఇతర ప్రధానులకు జరగని గౌరవ నష్టం ఆయనకు కలుగుతున్నది.
బిజెపి సంఘ్ పరివార్‌ల భావజాలం ఏమిటో తెలిసిందే. అయినప్పటికీ వాజపేయి ప్రధానమంత్రి స్థానానికి ఎదిగినపుడు, కొనసాగినపుడు మత రాజకీయం ఒక స్థాయిలో ముందుకు వచ్చినా కులంతో కూడా కలుపుకొని ఇంతగా జూలు విసరలేదు. ప్రతిపక్షాలు కుల రాజకీయం చేస్తున్నాయని, తాను ఆ పని ఎప్పుడూ చేయలేదన్న నరేంద్ర మోడీ, తనది ‘తేలీ’ కులమని, తాను బిసిని అని స్వయంగా బహిరంగ సభలలో చెప్పుకోవటం మొదలు పెట్టే వరకు ఈ విషయాలు దేశ ప్రజలలో అత్యధికులకు తెలియనే తెలియవు. ఆ ప్రచారాన్ని ఆయన ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. ఆ విధంగా ఒకవైపు బిసిల మద్దతు, బడుగుల మద్దతు పొందటం, ఒక బిసి ప్రధానమంత్రి అయితే ఇతర పార్టీలు సహించలేకపోతున్నాయి అంటూ వారి సానుభూతి కూడా సంపాదించటం మోడీ ఎత్తుగడ. అగ్ర వర్ణాలకు కాకుండా ఇతర వర్ణాలకు చెందిన కొంది మంది లోగడ కూడా ప్రధానులు, పార్టీ అధ్యక్షులు అయారు. కాని వారు తమ వృత్తుల గురించి మాట్లాడారు తప్ప కులాల గురించి కాదు. ఆ పని చేస్తున్న మొదటి ప్రధాని మోడీ. విచిత్రమేమంటే, ఆ పని తాను చేయటం లేదని, ఇతరులు చేస్తున్నారని వాదిస్తూ దేశాన్ని నమ్మించజూస్తున్నారాయన. అందుకే గౌరవాన్ని కోల్పోతున్నారు. మోడీ ప్రసంగాల తీరులో, భాషలో కన్పించే చిత్రవిచిత్ర విన్యాసాలు ఆయనపట్ల గౌరవాన్ని కలిగించేవి కావు. ఒకవేళ దానిని చిన్న విషయమని పక్కన ఉంచినా, ఒక బడుగువర్గానికి చెందిన వాడినని అలసట లేకుండా చెప్పుకునే ఆయన పాలనలో మొదట గుజరాత్‌లోగాని తర్వాత దేశ వ్యాప్తంగా గాని దళితులు, ఆదివాసీలపట్ల సాగుతున్న అణచివేతను బట్టి ఆయనకు తాను బడుగువాడినని చెప్పుకునే అర్హత ఏ విధంగా లభిస్తుందో అర్థం కాదు. కేవలం అధికారం కోసం చేసే కపటపు వాదన అది. ఎటువంటి దాపరికం లేకుండా బయటకు కన్పిస్తున్న కపటమది. అటువంటి వ్యక్తిని గౌరవించటం ఎలా?
ఇతర పార్టీలు మత రాజకీయాలు చేస్తున్నాయంటున్న మోడీ మాట విన్నప్పుడు ఇంతకన్న కపటం ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ దేశంలో చారిత్రకంగా కుల వ్యవస్థను సృష్టించిన వర్గాలకు, వారి భావజాలాలకు, అదే వర్గాలు భావజాలాలకు మరొక పార్శమైన మత తత్వానికి ప్రతినిధిగా మారి పాలిస్తున్న మోడీ ఈ రోజున ఇతరులను వేలెత్తి చూపుతున్నారు. అందుకు ఆయన సాహసాన్ని అభినందించాలి. కాని చరిత్రలో ఆయన స్థానం నిర్ణయమయేది ఇటువంటి సాహసం కారణంగా కాదు. కుల మత రాజకీయాలను కొత్త విధాలుగా పతన స్థాయికి తీసుకు వెళ్లిన నాయకునిగా ఆయన నిలిచిపోతారు. ఎన్నికలలో గెలుపు ఓటములు వేరు. ఒక నాయకుడిని నికరమైన రీతిలో మదింపు చేయటం వేరు. ఆ విధంగా దేశ ప్రధానులందరిలో ఆయనది అధమ స్థానమే.

Modi does not earn respect

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గౌరవం సంపాదించుకోని మోడీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: