వివాదాస్పద పాలన

Modi Controversial Administration

 

నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్‌డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో బిజెపి, మోడీ గణనీయమైన ఘనతను మూటగట్టుకున్నట్టే. ప్రభుత్వంలో ఉండి తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో కలిగించిన మంచి చెడులను బట్టి చూస్తే ఇందుకు భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ప్రధాని మోడీ తొలి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆర్థికరంగంలో తీసుకున్న నిర్ణయాలు ఎటువంటి దుష్ఫలితాలకు దారి తీశాయో తెలిసిందే. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అవకతవకలు ప్రజలకు చిన్న, మధ్య తరహా పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు అనేక కష్టనష్టాలను కలిగించాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల హద్దూ ఆపూ లేకుండా ప్రబలాయి, ఇంకా విజృంభిస్తున్నాయి. ప్రస్తుత కరోనా లాక్‌డౌన్ వల్ల కలిగిన అనూహ్య, అసాధారణమైన ఆర్థిక పతనాన్ని మినహాయించి మామూలు రోజుల్లో పరిస్థితిని గమనించినా ఈ రెండు రంగాలు ఎప్పుడూ ఆశాజనకంగా లేవు.

గత ఫిబ్రవరిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 9.3 శాతంగా నమోదయినట్టు భారత ఆర్థిక పర్యవేక్షక కేంద్రం (సిఎంఐఇ) ప్రకటించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటా కలిపి నిరుద్యోగం పెరుగుదల 7-8 శాతంగా రికార్డయింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత స్థాయికి నిరుద్యోగం పేట్రేగిపోయింది. అదే సమయంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అసంఖ్యాక కుటుంబాలు పేదరికంలోకి, నిరుపేదరికంలోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఆహార ధరలు మిగతా అన్ని ధరల కంటే పైకి చేరుకున్నాయి. 2019 ఫిబ్రవరిలో 2.5 శాతంగా ఉన్న సాధారణ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరికి 7.59 శాతానికి ఉరికింది. అత్యవసర ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఇదే కాలంలో 0.07 శాతం నుంచి 11.79 శాతానికి పాకిపోయింది. ప్రధాని మోడీ ప్రభుత్వం మొదటి ఐదేళ్ల హయాంలో స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియాలకు విశేష ప్రచారం కల్పించారు.

కాని అందుకు అనుగుణమైన ఫలితాలు మాత్రం సాధించలేకపోయారు. మేకిన్ ఇండియా ఒక విధంగా ఇంకా ప్రాణం పోసుకొనేలేదనడం అసత్యం కాబోదు. ఆర్థిక రంగంలో, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విషయంలో ఆశించిన పురోగతిని సాధించకపోడమేగాక వ్యతిరేక దిశలో అడుగులు పడినప్పటికీ మోడీ పార్లమెంటులో గతం కంటే ఎక్కువ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి రాగలిగారు. ఎన్నికల చేరువైన సమయంలో పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ వ్యాన్‌పై జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది జవానులు దుర్మరణం పాలైన ఘటన, అందుకు ప్రతిగా మన వైమానిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోని టెర్రరిస్టు స్థావరాలపై మెరుపు దాడులు జరిపిన ఘట్టం ప్రజల్లో పాక్ వ్యతిరేక, టెర్రరిస్టు ప్రతికూల భావోద్వేగాలను విశేషంగా పెంచింది. దేశాన్ని కాపాడగల సమర్థుడైన నాయకుడు మోడీయేననే అభిప్రాయాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రజల్లో కలిగించగలిగాయి.

ఆ విధంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అసాధారణంగా పెరుగుతున్న నిరుద్యోగం నుంచి అధిక ధరల నుంచి ప్రజలను కాపాడడమే కర్తవ్యంగా అడుగులు వడిగా వేసి ఉండవలసింది. కాని అలా జరగలేదు. అందుకు విరుద్ధంగా ప్రజలను విభజించే వ్యూహాలకు పదును పెట్టింది. ముస్లిం మైనార్టీలను మరింతగా అభద్రతా భావంలోకి నెట్టివేయడానికి రాజ్యాంగాన్ని కూడా లెక్కచేయకుండా తీవ్ర నిర్ణయాలను గత ఏడాది కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకున్నది. అసోంలో విదేశీయులను గుర్తించి దేశ జనాభా చిట్టా నుంచి తొలగించే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అదే సమయంలో పొరుగు దేశాల నుంచి వచ్చి స్థిరపడిన హిందువులకు మాత్రమే పౌరసత్వాన్ని కట్టబెట్టే సరికొత్త నిర్ణయం తీసుకున్నది. ఆ విధం గా రాజ్యాంగం అనుమతించని మత ప్రాతిపదిక పౌరసత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. మరోవైపు జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

తలాఖ్ చెప్పడం ద్వారా ముస్లిం మహిళలకు విడాకులిచ్చే సంప్రదాయాన్ని రద్దు చేస్తూ చట్టాన్ని చేసింది. ఇప్పుడు కొనసాగుతున్న కరోనా లాక్‌డౌన్ సంక్షోభంలో కోట్లాది మంది వలస కార్మికులు వందల, వేల కిలోమీటర్ల దూరంలోని స్వస్థలాలకు చేరుకోడానికి పడుతున్న ఇక్కట్లు, అకాల మరణాలకు గురి అవుతున్న తీరు వారిని సకాలంలో సరైన రీతిలో ఆదుకోడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. అలాగే దేశ ఆర్థిక రంగాన్ని మరింతగా ప్రైవేటుకు అప్పజెప్పే నిర్ణయాలను ఆ దారిలో ప్రభుత్వ రంగంలోని కీలక విభాగాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునే చర్యలను ముమ్మరం చేసింది. ప్రధాని మోడీలో ఇప్పటికైనా ఆత్మవిమర్శ చోటు చేసుకొని ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాల పంథా నుంచి ఆయన ప్రభుత్వం దూరమవుతుందని ఆశిద్దాం.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వివాదాస్పద పాలన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.