బంద్‌కు మిశ్రమ స్పందన

పెట్రోల్ ‘మంటలకు’ నిరసన, కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణం న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు లీటర్‌కు రూ. 90 దశకు చేరుకుంటున్న దశలో నిరసనలు పెల్లుబికాయి. రోజురోజుకీ పెరుగుతోన్న పెట్రో డీజిల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా జరిగింది. బంద్ ప్రభావంతో ప్రత్యేకించి కేరళ, బీహార్, కర్నాటక, అసోం, ఒడిషాలలో సాధారణ జనజీవితంపై ప్రభావం పడింది. కొన్నిచోట్ల ప్రత్యేకించి బిజెపి పాలిత రాష్ట్రాలలో బంద్‌కు మిశ్రమ స్పందన దక్కినా మొత్తం మీద బంద్ విజయవంతం […]

పెట్రోల్ ‘మంటలకు’ నిరసన, కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు లీటర్‌కు రూ. 90 దశకు చేరుకుంటున్న దశలో నిరసనలు పెల్లుబికాయి. రోజురోజుకీ పెరుగుతోన్న పెట్రో డీజిల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా జరిగింది. బంద్ ప్రభావంతో ప్రత్యేకించి కేరళ, బీహార్, కర్నాటక, అసోం, ఒడిషాలలో సాధారణ జనజీవితంపై ప్రభావం పడింది. కొన్నిచోట్ల ప్రత్యేకించి బిజెపి పాలిత రాష్ట్రాలలో బంద్‌కు మిశ్రమ స్పందన దక్కినా మొత్తం మీద బంద్ విజయవంతం అయింది. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఐక్యత ప్రస్ఫుటం అయింది. మరోవైపు ఇంధన ధరల పెంపుదల అంశం ప్రపంచ స్థాయి పరిణామం అని, కేంద్రం చేసేది ఏమీ లేదని బిజెపి పేర్కొంది. ప్రతిపక్షాల రాజకీయ ఆందోళనకు ప్రజా మద్దతు లేనేలేదని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్‌కు పిలుపు నివ్వగా 21 పార్టీలు మద్దతు తెలిపాయి. బంద్ ప్రభావంతో అనేక ప్రాంతాలలో సాధారణ జనజీవితంపై ప్రభావం పడింది.

బంద్ మొత్తం మీద ప్రశాంతంగా ముగిసింది. అయితే అక్కడక్కడ స్వల్పస్థాయి హింసాత్మక ఘటనలు జరిగాయి. బీహార్‌లో ఆందోళనకారులు రోడ్లపై భైఠాయించడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ జాం ఏర్పడటంతో ఒక చిన్నారి మృతి చెందింది. పలు ప్రాంతాల్లో విద్యా వ్యాపార వాణిజ్య సంస్థలపై బంద్ ప్రభావం పడింది. దేశ రాజధానిలో రామ్‌లీలా మైదానంలో కాం గ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన నిరసన సభలో పలువురు నేతలు ప్రసంగించారు. ప్రధాని మోడీపై ఆయన ప్రభుత్వ వైఖరిపై రాహుల్ తమ ప్రసంగంలో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బంద్ ప్రభావంతో అనేక ప్రాంతాలలో వాహనాలకు ఆటంకం ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో పెట్రో ఇబ్బందులకు నిరసనగా వాహనదారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణ జనజీవితం కొంత మేరకు ఇబ్బంది ఏర్పడింది. సోమవారం కార్యాలయాలకు, విద్యాసంస్థలకు, వాణిజ్య వ్యాపార కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు పలు ఇబ్బందులు పడ్డారు. దీనితో ఎందరో సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపొయ్యారు. అయితే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు పెద్దగా స్పందన లేదని, సాధారణ జనజీవితం మామూలుగానే సాగిందని బిజెపి వర్గాలు తెలిపాయి.

యుపిలో బందోబస్తు నడుమ బంద్‌కు గండి
ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసింది. భద్రతా ఏర్పాట్ల మధ్య వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు యధావిధిగా నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేక ఆదేశాలతో ప్రధాన నగరాలలో పట్టణాలలో బంద్ ప్రభావం లేకుండా చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ప్రతిపక్షాల తిరోగమన ఆలోచనా విధానంతో చివరికి వారిని ఉన్న స్థానం నుంచి కూడా ఊడగొడుతుందని ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో బంద్ ప్రశాంతంగా జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పంజాబ్ హర్యానాలలో దుకాణాలను మూసివేశారు. బంద్‌కు సంఘీభావం ప్రకటించారు.

గుజరాత్‌లో మిశ్రమ స్పందన
బిజెపి పాలిత గుజరాత్‌లో బంద్‌కు మిశ్రమ స్పందన దక్కింది. బంద్ విజయవంతం అయిందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే ప్రభావం ఏమీ లేదని బిజెపి తిప్పికొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో గుజరాత్ పిసిసి అధ్యక్షులు అమిత్ ఛావ్డా, గుజరాత్ పార్టీ ఇన్‌చార్జీ రాజీవ్ సతావ్ ఉన్నారు. మహారాష్ట్రలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు నేతలు బస్సులను ఇతర వాహనాలను నిలిపివేశారు. ముంబైలో మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం కల్పించారు. పలువురు కాంగ్రెస్ నేతలను రాష్ట్రంలో అరెస్టు చేశారు. గోవాలో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసనలకు దిగారు. నేతలు పలు చోట్ల పెట్రోలు పంపుల వద్దకు వెళ్లి ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు తెలిపారు. ఎఐసిసి కార్యదర్శి ఎ చెల్లాకుమార్ విలేకరులతో మాట్లాడారు. గోవాలో గణేష్ చతుర్థి సన్నాహాలు జరుగుతూ ఉండటంతో తాము బంద్‌కు పిలుపు నివ్వలేదని, నిరసనలు చేపట్టామని వివరించారు.

పశ్చిమ బెంగాల్‌లో రైళ్లు రద్దు
పశ్చిమ బెంగాల్‌లో పది రైళ్లు రద్దు అయ్యాయి. పలు రైళ్లు క్రమబద్ధీకరణ అయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో బంద్ పిలుపుతో ముందు జాగ్రత్త చర్యగా రైళ్లను నిలిపివేశారు. పలు ప్రాంతాలలో బస్సులు, రైళ్లు, ఆటోరిక్షాలూ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

బీహార్‌లో హింసాకాండ
భారత్ బంద్ సందర్భంగా బీహార్‌లో కొన్ని చోట్ల హింసాకాండ చెలరేగింది నిరసనకారులు విధ్వంసకాండకు దిగారు. రైలు వాహనాలను నిలిపివేశారు. జెహనాబాద్ జిల్లాలో ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న బాలిక ఆసుపత్రికి సకాలంలో చేరుకోలేక చనిపోయినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. స్కూళ్లు వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. అసోంలో సాధారణ జీవితం దెబ్బతింది. బిజెపి పాలిత రాష్ట్రం అయిన అసోంలో బంద్ ప్రభావం ఎక్కువగా కనబడింది. కాంగ్రెస్ కార్యకర్తలు పలు చోట్ల రైళ్లను నిలిపివేశారు. రైల్వే ట్రాక్‌పై పడుకుని నిరసనలకు దిగారు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై అడ్డంకులు కల్పించారు. దీనితో ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడింది. తెలంగాణలో బంద్‌కు మిశ్రమ స్పందన లభించిం ది. అయితే సాధారణ జనజీవితం యధావిధిగా సాగింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలుప్రాంతాల్లో కొంచెం తగ్గుముఖం పట్టినా మొత్తం మీద ప్రజా రవాణా సంస్థ బస్సులు యధావిధిగా సాగాయి. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. కేరళలో రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం ఏర్పడింది. నిరసనకారులు పలు చోట్ల ముందుగానే ప్రభుత్వ ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. కర్నాటకలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచే బస్సులు రైళ్లు, ప్రైవేటు వాహనాలు, చివరికి ఆటోరిక్షాలు కూడా నడవకపోవడంతో ప్రజలు ఎక్కడివారక్కడే ఉండాల్సి వచ్చింది. దుకాణాలు, మాల్స్, ప్రైవేటు సంస్థ లు మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. పెట్రోలు బంకులు బంద్ చేశారు. అయితే మొ త్తం మీద బంద్ ప్రభావం పెద్దగా లేదని వెల్లడైంది. విజయవాడలో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఎద్దుబండ్ల ప్రదర్శనకు సారధ్యం వహించి ఆకట్టుకున్నారు.

Comments

comments

Related Stories: