ఇక కొత్త సిబ్బంది!

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసిలో కొత్త నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం
కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగానే సాధ్యమైనంత త్వరగా నూతనంగా బస్సు కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలను చేపట్టే అంశంపై దృష్టి సారించింది. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆర్‌టిసిలో ఏ ఏ కేటగిరిల్లో ఎన్ని ఉద్యోగాలను చేపట్టాలనే ఫైల్‌ను సిద్దం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం. రెండు రోజుల్లో అధికారులు ఈ నివేదికను రూపొందించి సిఎంకు అందించనున్నారు. దీనిని సమీక్షించి సిఎం కెసిఆర్ కొత్త కొలవులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కార్మికులు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరడంతో ప్రభుత్వం ప్రత్యామ్నయమార్గాలను మరింత శరవేగంగా అమలు చేసే పనిలో ఉంది.

ఇందులో భాగంగానే కొత్త ఉద్యోగులను చేర్చుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించినట్లుగా వినిపిస్తోంది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం బస్సులను పోలీసు ఎస్కార్టుతో తిప్పుతున్నప్పటికీ అవి ప్రజల సమయానికి అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యమైన రూట్లలోనే కొంతమంది కండక్టర్లను, డ్రైవర్లను తాత్కాలికంగా నియమించి ప్రభుత్వం బస్సులను నడుపుతోంది. దీంతో ప్రయాణికులకు సమస్యలు తప్పడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే కొత్త నియామకాలపై ఆర్‌టిసి ముఖ్య కార్యదర్శి సునీశర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాలు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా రిక్రూట్ చేసుకునే కండక్టర్లు, డ్రైవర్ల విషయంలో ఉండాల్సిన విధి విధానాలు, ఇతర నిబంధనల విషయంలో అధికారులు తలమునకలైనట్టుగా తెలుస్తోంది.

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు

ఆర్‌టిసి కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భంది చర్యలు తీసుకుందని, ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్‌టిసి బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని, టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరుగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం అన్ని జిల్లాల ఆర్‌టిసి అధికారులు, ఈడీలు, రీజనల్, డివిజనల్ మేనేజర్లు, ఆర్‌టిఒలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు తిప్పుతామన్నారు. అయితే కొన్ని చోట్ల టికెట్ రేట్ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బస్సులు ఆయా రూట్లలో ఉంటే ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్ శాఖ నుంచి డిఎస్‌పి స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో డ్రైవర్ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని, టికెట్ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు. అదే విధంగా ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామన్నారు. ప్రతి డిపోలో ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్‌ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు.

ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన బస్సులను నడుపుతామన్నారు. ఇక ఆర్‌టిసి బస్సులన్నింటా బస్‌పాస్‌లను యదావిధిగా అనుమతించాలని ఆదేశాలిచ్చామన్నారు. విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్‌పాసులన్నీ అనుమతించాలని, బస్‌పాస్‌లు అనుమతించడం లేదనే ఫిర్యాదు రావద్దని మంత్రి పువ్వాడ ఆదేశించారు. నాలుగు రోజులుగా ఆర్‌టిసి, ప్రైవేట్ బస్సులతో పాటు వివిధ వాహనాలను తిప్పి, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఇదే రీతిన తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక సర్వీసుల సేవలన్నీ వినియోగించుకుంటున్నట్లు మంత్రి  పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ దిశా నిర్ధేశంతో ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజా రవాణా స్థితిగతులన్ని పరిశీలిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమ్మె కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రవాణా సదుపాయాలు కల్పించామన్నారు. బుధవారం ఆర్‌టిసి బస్సులు 3116, అద్దె బస్సులు 1933తో పాటు ప్రైవేట్ వాహనాలు తిరిగాయన్నారు. ఈ రెండు రోజులు ప్రయాణీకుల రద్దీని బట్టి మరిన్ని వాహనాలను తిప్పుతామన్నారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్ల రాకపోకలను పెంచారని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి పువ్వాడ వివరించారు.

Minister Puvvada Ajay video conference with RTC Officials

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇక కొత్త సిబ్బంది! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.