ఖాకీ కరుకుదనంపై కెటిఆర్ ఫైర్

Minister KTR

 

కొడుకు ముందే తండ్రిని చావబాదిన కానిస్టేబుల్
విచారణకు ఆదేశించిన హోంమంత్రి, డిజిపి

వనపర్తి ఘటనను ఖండించిన మంత్రి
కొందరి వల్ల మొత్తం వ్యవస్థకు అపఖ్యాతి
వెంటనే చర్యలు, కానిస్టేబుల్ సస్పెన్షన్

మనతెలంగాణ/హైదరాబాద్ : తన తండ్రి కిందపడేసి చావగొడుతున్న పోలీసును సదరు పిల్లాడు మా డాడీని కొట్టొద్దంకుల్ అంటూ కాళ్లవేళ్ల పడుతూ కన్నీరుమున్నీరైన ఘటన గురువారం నాడు వపపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆఖరికి చెప్పులు వేసుకోవటానికి కూడా అంగీకరించని పోలీసులు పిల్లాడిని, అతడి తండ్రిని పోలీసుజీపులో కుక్కి స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో ఉంటున్న మురళీకృష్ణ అనే యువకుడు ఇటీవల నాగవరంలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో బుధవారం నాడు తన కుమారునితో కలిసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు బంధువుల బైకు తీసుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని కిరాణం షాపు దగ్గరికి రావడంతో అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.

లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ కోటేశ్వర్‌రావుతోపాటు మరో నలుగురు పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. కాగా వనపర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సిసి పుటేజి ఇంచార్జిగా పని చేస్తున్న కానిస్టేబుల్ అశోక్ కుమార్ అక్కడికి చేరుకొని బైకు నంబర్‌ను ఫోటో తీయగా ఆ బైకుపై గతంలో 13 చాలన్లు పెండింగ్‌లో ఉన్నట్లు కానిస్టేబుల్ అశోక్ కుమార్ గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మురళీకృష్ణపై దాడికి దిగాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ఆశోక్‌కుమార్ కన్న కొడుకు ముందే తండ్రిని కిందపడేసి చావగొట్టాడు. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోను మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. వీడియోను చూసిన మంత్రి కెటిఆర్ వెంటనే స్పందిస్తూ సదరు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వనపర్తి ఘటనపై మంత్రి కెటిఆర్ తీవ్రంగా స్పందిస్తూ ట్విటర్‌వేదికగా. ఇలాంటి పోలీసుల ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని తేల్చిచెప్పారు. వెంటనే హోమ్ మినిష్టర్ మహమూద్‌అలీ, తెలంగాణ డిజిపిలకు దయచేసి ఇటువంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా శ్రమిస్తున్న పోలీసులను కొనియాడుతున్న క్రమంలో కొద్దిమంది పోలీసుల వికృత చేష్టల వల్ల వేలాది మంది పోలీసులకు అపఖ్యాతి వస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు.ఇలాంటి ఘటనల వల్ల పోలీసు శాఖ మొత్తం అప్రదిష్ఠపాలవుతోందని, మంచి పోలీసులపైనా ఇలాంటి ఘటనల కారణంగా చెడు ముద్ర పడుతోందని మంత్రి అన్నారు.

ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలీసులు ప్రజల పట్ల హేయమైన రీతిలో ప్రవర్తించరాదని హితవు పలికారు. వనపర్తిలో కొడుకుతో కలిసి వెళుతున్న వ్యక్తిని పోలీసులు కిందపడేసి పోలీసులు చితకబాదిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యింది. హోంమంత్రి, డిజిపిల ఆదేశాల మేరకు వనపర్తి ఘటనపై ఎస్‌పి అపూర్వరావు స్పందించడంతో పాటు ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు కోరారు. ప్రజలపై ఇలా ఓ కానిస్టేబుల్ అశోక్‌కుమార్ దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్‌పి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి కెటిఆర్, డిజిపి మహేందర్ రెడ్డికి హామీ ఇచ్చారు.

కానిస్టేబుల్ సస్పెన్షన్
వనపర్తి ఘటనపై విచారణ చేపట్టిన ఎస్‌పి అపూర్వరావు దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్ అశోక్‌కుమార్‌ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులతో పాటు ఆదేశాలిచ్చారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాల్సిన పోలీసులు వారిపట్ల అమానుషంగా వ్యవహరిస్తే క్షమించేది లేదన్నారు. పోలీసులు ప్రజల అభిమానాలను చూరగొనాలని, వారి నుంచి వ్యతిరేకత కాదని ఎస్‌పి వివరించారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టి బాధ్యులపై శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

Minister KTR Respond on Police Action in Wanaparthy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఖాకీ కరుకుదనంపై కెటిఆర్ ఫైర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.