హైదరాబాద్ టు విజయవాడ హైస్పీడ్ రైలు రావాలి

Minister KTR inaugurated Revenue Division office

 

తెలంగాణ తరుపున మా వంతు కృషి చేస్తాం
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో ప్రజల ముంగిటకు పాలన తెచ్చాం
ఆ ఘనత కెసిఆర్‌కే దక్కుతుంది
హుజూర్‌నగర్‌లో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/నల్లగొండ: హైదరాబాద్ – విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ఏర్పాటు కోసం తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రెండు నరగాల మధ్య హైస్పీడ్ రైలు వస్తే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. జాతీయ రహదారి 65 వెంట రైల్వేలైన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 43 రెవిన్యూ డివిజన్లు ఉండేవని, ఇప్పుడు 20 రెవిన్యూ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. 500 మంది గిరిజనులు ఉన్న తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

సిఎం కెసిఆర్ రాష్ట్రంలో నూతన సంస్కరణలకు తెరలేపారని చెప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మండలాల ఏర్పాటు, రెవిన్యూ డివిజన్‌లు, 33 జిల్లాలుగా విభజించి ప్రజాహిత సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. గత మూడు నెలలుగా కరోనా మహమ్మారితో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ లక్షలాది రైతులకు రైతుబంధు, పింఛన్లు, ఆర్థిక సహకారం అందిస్తూ వెనకడుగు వేయకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం జరిగిందన్నారు. 54 లక్షల 22 వేల మంది రైతులకు రూ.7 వేల కోట్లను రైతుబంధు పథకం కింద వారి వారి ఖాతాలలో జమ చేశామన్నారు. కల్యాణలక్షీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తేల్చి చెప్పారు. హైదరాబాద్, విజయవాడకు హైస్పీడ్ రైలు ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీష్‌శ్‌రెడ్డి, ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, టీఆర్‌ఎస్ నాయకులు తక్కెళ్లపల్లి రవీందర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post హైదరాబాద్ టు విజయవాడ హైస్పీడ్ రైలు రావాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.