మహా అధ్యయనం

ring-road
భూసమీకరణ పథకం అమలు తీరు పరిశీలనకు అహ్మదాబాద్, నవీముంబైలకు ప్రత్యేక బృందం

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం శివారు ప్రాంతాల్లో భూ సమీకరణ పథకంను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావాలని పురపాలక విభాగం నిర్ణయించింది. ఈమేరకు అహ్మదాబాద్(గుజరాత్), ముంబై(మహారాష్ట్ర) నగరాల్లో భూ సమీకరణ పథకం అమలుతో సత్ఫలితాలు వచ్చినట్టు గ్రహించిన మంత్రి కెటి రామారావు ఆ నగరాలను సందర్శించి పథకం అమలు తీరును అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

దీంతో హెచ్‌ఎండిఎకు చెందిన 5 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అహ్మదాబాద్, ముంబై నగరాలకు పురపాలక విభాగం పంపిస్తున్నది. ఈ రెండు నగరాల్లో ఈ పథకం కార్యరూపంలోకి రావడంవల్ల నగర విస్తరణ వేగంగానూ, ప్రణాళికాబద్దంగానూ జరిగినట్టు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. అయితే, ఈ బృందం వచ్చే వారంలో హైదరాబాద్ నుంచి ముందుగా ముంబై, అనంతరం అహ్మదాబాద్, అటు నుంచి వదోధర నగరాలకు చేరుకోనున్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అధ్యయనం..

భూ సమీకరణ పథకానికి దేశంలోనే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర గుజరాత్‌గా పేరున్నది. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉన్నది. అయితే, అహ్మదాబాద్ మహానగరంలో 76 కి.మీ.లు పొడవు 60 మీ.ల వెడల్పుతో రింగ్ రోడ్ అభివృద్ధి కోసం భూ సమీకరణ పథకంను అమలు పరిచి వేగంగా రింగ్ రోడ్‌ను పూర్తిచేయడం, ఆ పరిసరాలను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి జరిగినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. గుజరాత్‌లో 1920లోనే భూసమీకరణ పథకాన్ని 270 హెక్టార్లతో ప్రారంభమై 2012 నాటికి 1200 హెక్టార్లకు చేరుకున్నట్టు, ప్రస్తుతం అక్కడ ప్రతిపాదనల్లో 1126 ప్రతిపాదనలున్నాయని, ఇప్పుడు రాబోయే కాలంలో 600 స్కీంలను అమలుచేయాలనే ప్రతిపాదనతో టౌన్ ప్లానింగ్ స్కీంలున్నాయని అధికారులు సూచన ప్రాయం గా వెల్లడిస్తున్నారు. ముంబై మహానగరం శివారులోని నవీముంబై ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణం నవీ ముంబై ఎయిర్‌పోర్టు ఇన్‌ఫ్లూయెన్స్ నోటిఫైడ్ ఏరియాను భూసమీకరణ పథకం ద్వారా విస్తరించడంతో పాటు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి పరిచినట్టు పురపాలక విభాగం అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇదీ బృందం : హెచ్‌ఎండిఎలో ప్లానింగ్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలను నిర్వహించి పదవీ విరమణ చేసిన శీష్టా విశ్వనాథం, ప్లానింగ్ డైరెక్టర్ కె శ్రీనివాస్, ప్లానింగ్ అధికారి వికాస్, సహాయక ప్లానింగ్ అధికారి సురేష్, కార్యదర్శి రాంకిషన్‌లు అధ్యయనం బృందంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనూ భూ సమీకరణ పథకం అమలులో విశ్వనాథం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. హెచ్‌ఎండిఎలోనూ ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో భూసమీకరణ పథకం అమలులోనూ ఆయన పాత్రపోషించారు.

Minister ktr focus on Land mobilization scheme

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహా అధ్యయనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.