కరీంనగర్ ఐటి టవర్‌లో కంపెనీల ఏర్పాటుపై మంత్రి గంగుల సమీక్ష

 Karimnagar IT Tower

 

హైదరాబాద్ : కరీంనగర్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐటి టవర్‌లో పలు కంపెనీల ప్రారంభానికి తీసుకోవలసిన చర్యల విషయంపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఐటి కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ బోయిన్‌పల్ల్లి వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ముందుగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరీంనగర్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత రెండవ అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు.

ఐటి టవర్ నిర్మాణం కోసం సిఎం కెసిఆర్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌తో పలుమార్లు చర్చలు జరిపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి గత సంవత్సరంలోనే టవర్ నిర్మాణం కోసం రూ. 38 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ పనులకు ఐటి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన కూడా చేశారన్నారు. ప్రారంభించిన రెండు సంవత్సరాల లోనే అత్యాధునికంగా పూర్తిస్థాయి వసతులతో కరీంనగర్ నగరానికే మణి మకుటంగా నిర్మించడం జరిగిందన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటి టవర్‌ను ఈ నెల 30వ తేదీన కెటిఆర్ చేతులు మీదుగా ప్రారంభించాలని అనుకున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రారంభ కార్యక్రమంలో వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ లోగా కంపెనీల ఏర్పాటుకు కావలసిన విధి విధానాలతో పాటు తదుపరి ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి గంగుల సంబంధిత అధికారులకు సూచించారు.. కరీంనగర్ ఇప్పటికే స్మార్ట్ సిటీ గా క్లీన్ సిటీ గా, సేఫ్ సిటీ గా పేరుతెచ్చుకుందన్నారు. దేశంలో ఐదులక్షల లోపు జనాభా కలిగిన పట్టణాలలో రెండవ నివాసయోగ్యమైన నగరంగా ఎన్నికైందన్నారు.అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, తాను లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించిన సందర్భంలోనే ఐటి టవర్ మంజూరైందన్నారు.

రాష్ట్రంలోని జిల్లాలలో ఉద్యోగాలు ఎక్కడికక్కడే కల్పించాలన్న లక్షంతో ప్రతి జిల్లాలో ఐటి టవర్ల నిర్మాణం చేయాలన్న లక్షంతోనే సిఎం కెసిఆర్ కరీంనగర్‌కు టవర్‌ను మంజూరూ చేశారన్నారు. దీంతో కరీంనగర్‌లోని యువతకు స్థానికంగానే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. భవిష్యత్తులో మరో టవర్, నైపుణ్య అభివృద్ధి శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్‌ఐ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహా రెడ్డితో పాటు15 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

 

Minister Gangula’s review in Karimnagar IT Tower

The post కరీంనగర్ ఐటి టవర్‌లో కంపెనీల ఏర్పాటుపై మంత్రి గంగుల సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.