అత్యవసరమైతేనే పేషెంట్లను హైదరాబాద్‌కు పంపించాలి: ఈటల

అక్కడ కూడా కరోనా వైద్యం అందాలి
టిమ్స్, కింగ్‌కోఠి, మెడికల్ కాలేజీల్లోనూ చికిత్సను ఇవ్వాలి
జిల్లాల్లో అత్యవసరమైతేనే పేషెంట్లను హైదరాబాద్‌కు పంపించాలి
వైద్యాధికారులను అదేశించిన మంత్రి ఈటల రాజేందర్

Minister Etela Review Meeting with Health Officials

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా పేషెంట్లకు వేగంగా వైద్యం అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హాస్పిటల్స్ వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన టిమ్స్, కింగ్‌కోఠి, మెడికల్ కాలేజీల్లోనూ కోవిడ్ చికిత్స జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై బిఆర్‌కే భవన్‌లో శనివారం మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ..రోజురోజుకి కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాల్లోనూ వ్యాప్తి పెరుగుతుందని, ఈక్రమంలో అక్కడి అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పాజిటివ్ వచ్చిన రోగులను గాంధీ ఆసుపత్రికే కాకుండా టిమ్స్, కింగ్‌కోఠిలతో పాటు మెడికల్ కాలేజీల్లోనూ చేర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న మల్లారెడ్డి, మమత, ఆర్‌విఎమ్, ఎంఎన్‌ఆర్, అపోలో, కామినేని మెడికల్ కాలేజీల్లోనూ కోవిడ్ పేషెంట్లకు పూర్తిస్థాయిలో వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

దీంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉన్న హస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా కోవిడ్ రోగులను చేర్చాలని మంత్రి అన్నారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను మాత్రమే హైదరాబాద్‌కు పంపాలని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు లక్షణాలు లేని రోగులను హోంఐసోలేషన్‌లో ఉంచాలని, ఆ అవకాశం లేని వారికి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేశామని, కావున మైల్డ్ సింప్టమ్స్, శ్వాస సమస్యలు కలిగిన రోగులకు అక్కడే వైద్యం అందించాలని మంత్రి చెప్పారు. ఎలాంటి సౌకర్యాలు అవసరమైనా, ఇబ్బందులు వచ్చిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆసుపత్రి అధికారులు పేషెంట్లకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు.

Minister Etela Review Meeting with Health Officials

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అత్యవసరమైతేనే పేషెంట్లను హైదరాబాద్‌కు పంపించాలి: ఈటల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.