ప్రతిపక్షాల వలలో ఆర్‌టిసి కార్మికులు

 RTC Strike

మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసిని ప్రైవేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడ చెప్పకున్నా కాంగ్రెస్, బిజెపి ప్రైవేటీకరణ అం శాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లుతుందని రాష్ట్ర పంచాయితీశాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. అర్‌టిసిని సిఎం ప్రేవేటీకరిస్తారని అసత్యఆరోపణలు చేస్తూ కాంగ్రెస్,బిజెపి కార్మికులను రెచ్చగొడుతుందన్నారు. ఆర్‌టిసి యూనియన్ నాయకులు ప్రతిపక్షాల వలలో పడి సమ్మెచేసతున్నారని ఆయన నిందించారు. ఆదివారం టిఆర్‌ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్,బిజెపిల విధానాలను తూర్పారబట్టారు. టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆర్‌టిసిని ప్రైవేటీకరిస్తామనికూడా సిఎం ఎక్కడా చెప్పలేదని వివరించారు. ఆర్‌టిసి సమ్మె రాజకీయ కుట్రగా ఉందని ఆయన ఆరోపించారు. గతంలో ఆర్‌టిసి కార్మికులు ఊహించని విధంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గత సమైక్యపాలనలో ఆర్‌టిసికి రూ.1600ల కోట్లు ప్రభుత్వం కేటాయిస్తే తెలంగాణ ఏర్పడిన అనంతరం ఐదేళ్లలో ప్రభుత్వం రూ.3వేల303 కోట్లను కేటాయించిందని ఆయన చెప్పారు.

ఆర్‌టిసి అభివృద్ధికోసం ప్రభుత్వం కృషిచేస్తుంటే కాంగ్రెస్,బిజెపి పార్టీలు ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్,టిడిపి ఆర్‌టిసిని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయలేదని ఆయన ప్రశ్నించారు. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి అక్కడ ఆర్‌టిసిని ఎందుకు బలోపేతం చేయలేదో రాష్ట్రంలోని బిజెపినాయకులు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే బిజెపి నాయకులు ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రధానితో ప్రకటన ఇప్పించాలని డిమాండ్ చేశారు. బిజెపినాయకులు రాష్ట్రాభివృద్ధికోసం కేంద్రం నుంచి ఏమైనా నిధులు ఇప్పించారాని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి గత ఐదేళ్లలో కేంద్రానికి రూ.2లక్షల 30వేల కోట్లరూపాయలు ఆదాయంగా వెళ్లాయని తెలిపారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా ఒక్కపైసాకూడా రాలేదని విచారం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు అవార్డులు, రివార్డులు వచ్చాయేకానీ ఒక్కపైసా కూడా అభివృద్ధి నిధులు రాలేదని మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు చెప్పారు.

కేంద్రం సహకరించకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని అభవృద్ధిలోకి తెచ్చిన సిఎం కెసిఆర్ ఆర్‌టిసిని కూడా దేశంలో అత్యున్నత వ్యవస్థగా తీర్చిదిద్దాలనే అలోచనలో ఉన్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్‌టిసిని ఖచ్చితంగా సిఎం కెసిఆర్ లాభాల్లోకి తీసుకువస్తారని తెలిపారు. ప్రజలంతా సిఎం కెసిఆర్ పక్షాన ఉన్నారని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్,బిజెపి ప్రజలను ఎంత రెచ్చగొట్టినా ప్రజలంతా సిఎం కెసిఆర్ పక్షానే ఉన్నారన్నారు. ఆర్‌టిసి కార్మికులను ఆత్మహత్యలవైపు రెచ్చగొట్టినవారే బాధ్యతవహించాల్సి ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ఆర్‌టిసిని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో బిజెపి,కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మంత్రి ఆరోపించారు. ఆర్‌టిసి కార్మికులు ప్రతిపక్షాల వలలోపడ్డారని నిందించారు. అభివృద్ధిని అడ్డుకునే కాంగ్రెస్, బిజెపి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆర్‌టిసి కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

Minister Errabelli Dayakar Rao Comments On RTC Strike

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రతిపక్షాల వలలో ఆర్‌టిసి కార్మికులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.