అరుదైన సన్నివేశం

Sampadakiyam  తప్పనిసరి పరిస్థితి తల ఎత్తినప్పుడు రాజకీయాల్లో అపూర్వ కలయికలు, పొత్తులు విడ్డూరం కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌సి, బిసిల ఐక్యత ద్వారా ఒకప్పుడు నూతన శకాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత రెండేళ్లకే విడిపోయి బద్ధ శత్రువులైపోయిన ఎస్‌పి (సమాజ్‌వాదీ పార్టీ), బిఎస్‌పి (బహుజన సమాజ్ పార్టీ) 24 సంవత్సరాల తర్వాత తిరిగి మైత్రిని పెనవేసుకోడం ఒక గొప్ప పరిణామం. ఇన్నేళ్లు ఒకరి పొడ ఒకరికి గిట్టకుండా పరస్పర వ్యతిరేక ధ్రువాలుగా కొనసాగిన ఆ రెండు పార్టీల నేతలు ములాయం సింగ్ యాదవ్, మాయావతి ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడం, ఒకే స్వరంతో మాట్లాడడం మరో అపురూప ఘట్టం. గతంలో చివరి సారిగా 1995లో వీరిద్దరూ ఒకే వేదిక మీద కనిపించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో ములాయం సింగ్ యాదవ్ తరపున ప్రచారానికి మణిపురిలో ఏర్పాటైన సభకు శుక్రవారం నాడు ఆయన, ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌తోపాటు మాయావతి కూడా హాజరై చరిత్ర సృష్టించారు. ములాయం సింగే అసలు సిసలైన బిసి నేత అని, నరేంద్ర మోడీ మాదిరిగా నకిలీ బిసి నాయకుడు కాదని మాయావతి ఈ సభలో అన్నారు.

స్వాతంత్య్రానంతరం దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏకచ్ఛత్రాధిపత్యం వహించింది. అయోధ్యలో బాబరీ మసీదు కూల్చివేత, విపి సింగ్ మండల్ కమిషన్ నివేదిక దుమ్ము దులిపి దాని సిఫార్సుల అమలుకు శ్రీకారం చుట్టడం ఈ పరిణామాల నేపథ్యంలో మండల్ కమండల్ రాజకీయాలు ఉత్తరాదిని ఊపేశాయి. 1992లో బాబరీ మసీదు విధ్వంసం తర్వాత భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలను అమితంగా ప్రభావితం చేయడం మొదలైంది. దాని ఉధృతికి అడ్డుకట్టవేయడానికి ఎస్‌పి, బిఎస్‌పిలు కలిశాయి. ‘మిలే ములాయం, కాన్షీరాం హవామే ఉడ్‌గయే జై శ్రీరామ్ (ములాయం కాన్షీరాం కలిశారు, ఆ ప్రభంజనంలో జై శ్రీరామ్ కొట్టుకుపోయారు) నినాదం ఊపందుకున్నది. ఈ స్ఫూర్తితో 1993 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి, బిఎస్‌పిలు సహకరించుకున్నాయి. 425 స్థానాల అప్పటి ఉమ్మడి యుపి అసెంబ్లీలో 177 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది.

109 సీట్లు కైవసం చేసుకొన్న సమాజ్ వాదీ పార్టీ , 69 సాధించుకున్న బహుజన సమాజ్ పార్టీ కలిసి బయటి నుంచి కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ ముచ్చట రెండేళ్లకే తెల్లారిపోయింది. తమ ఓటు పునాదిని ఎస్‌పి కొల్లగొడుతున్నదని ఆరోపిస్తూ ప్రభుత్వం నుంచి మాయావతి తప్పుకున్నారు. ఆ మరుసటి రోజు బిజెపి మద్దతుతో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో 1995 జూన్ 2వ తేదీ అర్ధరాత్రి లక్నో గెస్ట్ హౌస్‌లో భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనకు సమావేశమైన మాయావతిపై ఎస్‌పి కార్యకర్తలు దాడి చేశారు. ఆమెకు ప్రాణ హాని కలగకుండా బిజెపి నేత బ్రహ్మదత్ ద్వివేది కాపాడారు. ఆ క్షణం నుంచి ఎస్‌పి, బిఎస్‌పి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయి ఉప్పూ నిప్పు మాదిరిగా మారాయి. ఆ తర్వాత బిజెపి మద్దతుతో మాయావతి మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. తిరిగి ఇంతకాలానికి బిజెపి ఉరవడిని ఆపడానికి ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయి.

గత లోక్‌సభ ఎన్నికల్లో యుపిలోని 80లో 78 స్థానాలు గెలుచుకుని బిజెపి ఎదురులేని శక్తిగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ములాయం సింగ్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చొరవ తీసుకొని మాయావతి పార్టీతో మైత్రికి దారులు వేశారు. ఎస్‌పి, బిఎస్‌పిలతో కూడిన మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోట వంటి గోరఖ్‌పూర్ సహా మూడు ఉప ఎన్నికల్లో బిజెపిని మట్టికరిపించగలిగింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడీ ఎన్నికల్లో ఈ రెండు బహుజన పార్టీల మధ్య మళ్లీ సఖ్యత ఏర్పడింది. ములాయం, మాయావతి ఒకే వేదికను అలంకరించిన అరుదైన ఘట్టం చోటుచేసుకున్నది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అసలు సిసలైన సామాజిక న్యాయ లక్ష సాధన అనేది ఇంకా నెరవేరని కలగానే, బహుదూరపు లక్షంగానే కొనసాగుతున్నది.

మండల్ కమండల్ ఘర్షణ బహుజన సమాజాన్ని ఒక్క త్రాటి మీదికి తెచ్చింది అనుకున్న దశలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడంలో ఆ వర్గాలు విఫలయ్యాయి. ఆ వైఫల్యాన్ని ఎస్‌పి, బిఎస్‌పిల సుదీర్ఘ శత్రుత్వం సందేహాతీతంగా రుజువు చేసింది. కేవలం బిజెపి భయంతోనే ఈ రెండు పార్టీలు ఏకం కావడం జరుగుతున్నది. దానివల్ల కలుగుతున్న ప్రయోజనం పరిమితమే. దేశ ప్రజల్లో మెజారిటీగా ఉన్న బహుజనుల రాజ్యాధికార సాధనను లక్షం చేసుకొని పటిష్ఠమైన మైత్రిని ఏర్పరచుకొని దానిని దేశమంతటికీ విస్తరించడానికి ఈ రెండు పార్టీలు కృషి చేసినప్పుడే అది సాధ్యపడుతుంది.

Mayawati turns mulayam for SP in joint rally in Mainpuri

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అరుదైన సన్నివేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.