ఏది గొప్ప!

ఇంకొల్లు అనే ఊరిలో ఒక ఇంటి ముందు పెళ్లి జరగబోతున్నది. దానికి గాను పెళ్లిపందిరి వేయడానికి కావాల్సిన కొబ్బరి మట్టల్ని కొట్టుకొచ్చి అక్కడ పడేశారు. ద్వారాలకు తోరణాలు కట్టడానికి మామిడాకుల కొమ్మల్ని తెచ్చారు. ఇంకో పక్కన మధ్యాహ్నం భోజనానికి అవసరమని విస్తరాకులు, అరిటాకుల కట్టలు ఉన్నాయి. పెళ్లిపందిరి వేయడానికి వెదురు బొంగులు పాతి, కొబ్బరాకుల్ని కప్పుతూ చక్కగా పందిరి వేస్తున్నారు కొంతమంది. మరొకతను మామిడాకుల్ని కొమ్మల నుంచి వేరు చేసి వాకిళ్లకు తోరణాలుగా గుచ్చుతున్నాడు. ఇంకొకతను అరిటాకులు వడలిపోకుండా నీళ్లు చల్లుతున్నాడు. అన్నిటినీ చూస్తున్న కొబ్బరాకు, ‘ ఇక్కడున్న ఆకులన్నింటిలో నేనే పెద్దగా ఉన్నాను. అసలు నేను లేకపోతే పెళ్లికూతురూ, పెళ్లికొడుకూ ఎక్కడ కూర్చుంటారు. నేనే లేకపోతే పెళ్లి జరగదు’ అనుకుంది మనసులో. చుట్టూ చూసింది. చిన్న చిన్న మామిడాకులు, దాని కన్నా కొంచెం పెద్దగా విస్తరాకులు, అరిటాకులు కనిపించాయి. ఓహో ఇక్కడ నాకంటే పెద్దగా ఉన్నవాళ్లెవరూ లేరు’ అనుకోగానే కొంచెం గర్వం కలిగింది.

పక్కనే మూటలో నుంచి కొద్దిగా తల బయటకు పెట్టి తొంగి చూస్తున్న ఓ చిన్న మామిడాకును బెదిరించింది.
“ఏయ్! కొంచెం దూరంగా ఉండు. నాకు ఎక్కువ స్థలం కావాలి. నేను చాలా పెద్దగా ఉంటాను కదా! దూరం జరుగు! దూరం జరుగు!అన్నది.  చిన్న ఆకు భయపడి తల లోపలకి పెట్టుకుంది. పెద్ద ముదురు మామిడాకు “ ఓయ్! ఏంటి ఇందాకట్నుంచీ చూస్తున్నా పిల్లను బెదిరిస్తున్నావు? ఊరుకుంటున్నానని ఇంకా మీది మీదికొస్తున్నావు. నా గొప్పతనం తెలుసుకోకుండా మాట్లాడు తున్నావు? నేనే లేకపోతే ఈ పెళ్లే జరగదు తెలుసా? మంగళకరమైన నన్ను గుమ్మానికి కట్టకుండా ఏ పనీ చేయరు. నేనంత శుభసూచకం” అంటూ చెప్పుకున్నది.

దీనితో కొబ్బరాకుకు చాలా కోపం వచ్చింది. ఇదేమిటి మామిడాకు ఇలా గొప్పలు చెప్పుకుంటుంది. నేను కదా గొప్ప. నా పందిరి లేకపోతే గదా పెళ్లి ఆగిపోయేది? మరేంటి మామిడాకు ఇలా అంటోంది అనుకుని, “ఏయ్! నేనే ఎక్కువ. నా పందిరి లేకపోతే పెళ్లి ఎక్కడ జరుగుతుందని!” అన్నది కొబ్బరాకు.

వీళ్లిద్దరి మాటలూ వింటూ వరండాలో అటుపక్కనున్న విస్తరాకులూ, అరిటాకులూ ముందుకొచ్చాయి. “ఏంటీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. పెళ్లంటే మీరే ఉండాలని అనుకుంటున్నారు. అసలు మేం లేనిదే పెళ్లి ఎలా జరుగుతుంది. వచ్చిన వాళ్లంతా భోజనాలు ఎలా చేస్తారు. విందుభోజనం లేని పెళ్లి ఉంటుందా? అతిథులంతా భోజనం చేస్తేనే కదా ! అన్నదాతా సుఖిభవా అని దీవించేది! ఇంతమంది మనుష్యుల ఆకలి తీరుస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంటుంది” అన్నాయి.
ఇదంతా వినగానే కొబ్బరాకు పకపకా నవ్వి“ ఏం చెప్పుకుంటున్నారు. వీళ్లేదో పల్లెటూరు వాళ్లు కాబట్టి అరిటాకులు, విస్తరాకుల్లో భోజనం పెడుతున్నారు. పట్నాల్లో అయితే ప్లేట్లతోనే పెడతారు. మీ అవసరమే ఉండదు” అన్నది.

“ ఏయ్ కొబ్బరాకూ! పల్లెటూరూ, పట్నం అంటున్నావు పట్నంలో నీ అవసరమూ లేదు. షామియానాలు వేస్తారు. నీ పందిరిలో కన్నాల్లోంచి ఎండ వస్తుంది. షామియానాకు ఎండ రానేరాదు. నువ్వేం ఎగతాళి చేయనక్కరలేదు” అన్నది అరిటాకు పకపకా నవ్వుతూ! అప్పుడే ఆ ఇంటి స్త్రీలు ఓ మూల చిన్న తడిగుడ్డలో చుట్టి ఉన్న తమలపాకుల కట్టని తీశారు. ఆకు, వక్క, అరటిపండు పెట్టి తాంబూలాలుగా అమరుస్తున్నారు. అందులో ఒక స్త్రీ జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దను తెచ్చి రెండు తమలపాకుల్లో పెట్టింది. “ వదినా! ఈ తమలపాకులు జాగ్రత్త. పెళ్లి సమయంలో ప్రధానమైనవి. పిల్లలకు అందనీయకు ఎక్కడైనా పడేస్తారు. ఏదున్నా లేకున్నా జీలకర్ర, బెల్లం పెట్టే తమలపాకులు లేకపోతే పెళ్లి ఆగిపోతుంది. ముహూర్తం సమయానికి అందించాలి” అంటూ ఒకావిడ ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్లింది.

ఈ మాటల్ని కొబ్బరాకులు, మామిడాకులు, విస్తరాకులు, అరిటాకులు అన్నీ విన్నాయి. ఒకరి మొహం ఒకరు చూసుకొని సిగ్గుపడ్డాయి. “మనందరికన్నా ఆకారంలో చిన్నదై ఉండి కూడా ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. పెళ్లికి ప్రధానమైనది అయి ఉండీ తన గొప్పను చెప్పుకోలేదు. మనమేమో మన గొప్పలు చెప్పుకుంటూ వాదులాడుకుంటున్నాం. ఇలా ఉండడం తప్పు. ఇక మీదట మనందరం కలిసే ఉందాం! చిన్నదైనా తమలపాకు మౌనంగా ఉండి మన కళ్లు తెరిపించింది. ఐకమత్యమే మహాబలం. మనమంతా కలిసి ఉంటేనే పెళ్లి చక్కగా జరుగుతుంది. ఒక మంచి వివాహ బంధంలో మనం అందరం పాలుపంచుకుంటున్నందుకు సంతోషించాలి. నేను గొప్ప! నేను గొప్ప! అని మనం అనుకోకూడదు” అంటూ మూడు రకాల ఆకులూ కలిసి ఒక దానినొకటి కౌగిలించుకున్నాయి!

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఏది గొప్ప! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.