భూ తగాదాలు.. అన్నను నరికి చంపిన తమ్ముడు

Man killed by brother over land dispute in Kamareddy

కామారెడ్డి: భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి తమ్ముడు అన్నను నరికి చంపిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పాపూర్ గ్రామానికి చెందిన కూచన్పల్లి రాజయ్య(58) ముగ్గురు అన్నదమ్ములు. వీరికి గ్రామంలో మూడు ఎకరాల పొలం ఉందని, భూమి విషయంలో తగాదాలు జరుగుతూ ఉండేవని గ్రామస్తులు తెలిపారు. చిన్న తమ్ముడు అయిన శంకర్ తరచూ పెద్ద అన్న రాజయ్యతో భూమి విషయంలో తగాదాపడుతూ ఉండేవాడు. రాజయ్యకు పిల్లలు లేకపోవడం వలన ఆస్తిపై కన్నేసిన శంకర్ అన్నతో ఎప్పుడూ గొడవలు జరిగినా నిన్ను ఏ రోజైనా చంపేస్తానంటూ బెదిరించినట్లు కుటుంబికులు తెలిపారు.

బుధవారం రోజు తన భార్యను అత్తవారి ఇంటిలో వదిలిపెట్టి తిరిగి తిప్పాపూర్‌కు రాత్రి సమయంలో చేరుకున్న రాజయ్యతో ఇదే అదనుగా భావించిన తమ్ముడు శంకర్ రాత్రి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ గొడవలో కోపోద్రిక్తుడైన తమ్ముడు శంకర్ కొడవలితో అన్న రాజయ్య మెడపై వేటు వేయడంతో అక్కడిక్కడే పడి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతని భార్యకు సమాచారం అందించడంతో ఆమె వెంటనే తిప్పాపూర్ గ్రామానికి చేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో జిల్లా డిఎస్పీ లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల వివరాలను పరిశీలించారు. అనంతరం శవాన్ని కామారెడ్డి ప్రభుత్వ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Man killed by brother over land dispute in Kamareddy

The post భూ తగాదాలు.. అన్నను నరికి చంపిన తమ్ముడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.