‘వాల్మీకి’ బోయల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది సిఎం కెసిఆర్

Maharshi Valmiki Jayanti Celebrations at Ravindra Bharathi

మనతెలంగాణ/హైదరాబాద్ : వాల్మీకి బోయల ఆత్మగౌరవం నిలబెట్టింది సిఎం కెసిఆర్ అని ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ చరిత్రలో ఎవరూ చేయని విధంగా అనేక కులాలకు కెసిఆర్ దారి చూపారన్నారు. రాష్ట్ర కో ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ చైర్మన్‌గా సిఎం కెసిఆర్ గట్టు తిమ్మప్పకు అవకాశం కల్పించడం సంతోషకరమని తాడూరి పేర్కొన్నారు. బిసి కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా నగరం నడిబొడ్డున ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని సంకల్పించి బోయ కులానికి ఒక ఎకరం స్థలాన్ని సిఎం కేటాయించడం సంతోషించదగ్గ విషయమన్నారు.

భవన నిర్మాణాల నిమిత్తం కోటి రూపాయలను కేటాయించడం చరిత్రలో లిఖించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ సృష్టి ఉన్నన్నీ రోజులు మహర్షి వాల్మీకిని ఆయన రచించిన రామాయణ, మహాగ్రంథాన్ని ప్రజలు మరువరని ఆయన పేర్కొన్నారు. ఇంత గొప్ప మహానీ యుడి జయంతోత్సవాలను ప్రభుత్వమే గొప్పగా నిర్వహిం చడం సంతోషించదగ్గ విషయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బోయ కులస్థులు, నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ఉత్సవ కమిటీ వైస్‌చైర్మన్ గట్టు తిమ్మప్ప వ్యవహారించగా, బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, సభ్యులు వకులాభరణం కృష్ణమోహన్, ఆంజనేయులు గౌడ్, కమిషనర్ అనిత రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్టవ్యాప్తంగా వేడుకలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
వాల్మీకి జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌కే పరిమితమయ్యిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని ప్రతి జిల్లాల్లో ఈ జయంతోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ ఇలా ఎంతోమంది బహుజన నాయకుల జయంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా జరుపుతుందన్నారు. సీతారాముల చరిత్రను సమాజానికి చెప్పింది వాల్మీకని ఆయన గుర్తు చేశారు. 24 శ్లోకాలతో రామాయణాన్ని వాల్మీకి రచించారన్నారు. వాల్మీకి గొప్ప నాయకుడని, ఉన్న వాళ్ల సంపద దోచి పేదవాళ్లకు పెట్టారన్నారు.

భారతదేశం మొత్తం సీతారాములను పూజిస్తున్నారని, అలాంటి వాళ్ల చరిత్రను వాల్మీకి రచించారన్నారు. రాముడి చరిత్రను వాల్మీకి చెప్పకపోతే సీతారాములు చరిత్ర తెలిసేది కాదన్నారు. ప్రతి హిందూ సోదరులు కూడా వాల్మీకిని పూజించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి ఎస్సీ వర్గీకరణ బిల్లు, మైనార్టీ రిజర్వేషన్ బిల్లు, ఎస్టీ రిజర్వేషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందని, అయినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదించలేదన్నారు. బలహీన వర్గాల విదేశీ చదువుల కోసం ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు పెడుతుందన్నారు. వాల్మీకి సోదరులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. వాల్మీకి సోదరుల డిమాండ్లను సిఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Maharshi Valmiki Jayanti Celebrations at Ravindra Bharathi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘వాల్మీకి’ బోయల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.