పాలమూరులో పై చేయి ఎవరిదో?

మనతెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలు ముందస్తుగానే జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్ని ప్రధాన పార్టీల్లో ఎవరూ ఊహించన విధంగా ఈ సారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ముగ్గురు కొత్త (ముఖాలు) నేతలు కావడం గమనార్హం. సంచలనాలకు కేంద్రబిందువైన మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఈ సారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు ఉద్దండులు రాజకీయ మైదానంలో తలపడనున్నారు. ప్రగతి భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర […]

మనతెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలు ముందస్తుగానే జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్ని ప్రధాన పార్టీల్లో ఎవరూ ఊహించన విధంగా ఈ సారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ముగ్గురు కొత్త (ముఖాలు) నేతలు కావడం గమనార్హం. సంచలనాలకు కేంద్రబిందువైన మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఈ సారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు ఉద్దండులు రాజకీయ మైదానంలో తలపడనున్నారు. ప్రగతి భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌లు జిల్లా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి,లకా్ష్మరెడ్డి,చిట్టెం రాంమోహన్‌రెడ్డి, సురేందర్ రెడ్డిలతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎంపి అభ్యర్ధిత్వంపై సుధీర్ఘ చర్చలు జరిగాయి. ఎమ్మెల్యేలందరూ ఎంపి జితేందర్‌రెడ్డి ప్రతిపాదనను తిరస్కరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సారి కూడా సిట్టింగ్ ఎంపి జితేందర్‌రెడ్డికే తిరిగి ఇవ్వాలని భావించినప్పటికీ ఎమ్మెల్యేల అభిప్రాయం అందుకు భిన్నంగా ఉండడంతో కొత్త నేతను తెరమీదికి తీసుకొచ్చారు.

మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రముఖ ఔషద సంస్థ యజమాని మన్నె శ్రీనివాస్ రెడ్డికి ఎంపి అభ్యర్ధిగా బరిలోకి దింపారు. శ్రీనివాస్ రెడ్డి జిల్లాలోని నవాబుపేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన వారు. గతంలో ఎంపిటిసిగా కూడా పని చేసిన అనుభవం ఉంది. ప్రముఖ ఔషధ కంపెనీలు నెలకొల్పి అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. సౌమ్యుడు, వివాద రహితునిగా పేరున్న మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరును ఎమ్మెల్యేలందరూ సూచించడంతో చివరికి సిఎం కెసిఆర్, కెటిఆర్‌లు శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.ఇక ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి బిజెపిలోకి చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డికె అరుణ ఈ సారి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి బిజెపి అభ్యర్ధిగా బరిలోకి దిగనుంది.

గతంలో బిజెపి నుంచి శాంతకుమార్‌కు అవకాశం కల్పించిన బిజెపి మారిన రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో డికె అరుణకు కేటాయించారు.ఆమె వెంట కూడా మరి కొందరు కాంగ్రెస్ నేతలు బిజెపిలోకి చేరడంతో కాంగ్రెస్‌కు ఊపిరాడని పరిస్ధితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్ నుంచి కూడా కొత్త నేతనే ఆ పార్టీ తెరమీదికి తెచ్చింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేతలు ఎవరూ ముందుకు రాని నేపథ్యంలో యువనేత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డిని తెరమీదికి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆయన మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్ధిగా ఇప్పటికే నామినేషన్ వేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు ముగ్గురు బలమైన నేతలు తెరమీదికి రావడంతో ముగ్గురు మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.
ముగ్గురు ముగ్గురే..
పార్లమెంట్ బరిలోకి దిగుతున్న ముగ్గరు నేతల రాజకీయ నేపథ్యం కూడా బలంగానే ఉంది. వీరిలో టిఆర్‌ఎస్ నుంచి పోటీ చేయనున్న మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎంపిటిసిగా పని చేసిన అనుభవంతో పాటు వ్యాపారరంగంలో పని చేసిన అనుభవం ఉంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్‌లోని నియోజకవర్గాలన్నింటిలోనూ టిఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అఖండ మెజార్టీతో గెలిపించారు. మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్‌ను ఏకంగా 57 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించగా, మఖ్తల్, జడ్చర్ల నియోజకవర్గాల్లో 40 వేల మెజార్టీ దక్కింది. ఇక నారాయణపేట, దేవరద్రలో 17 వేల పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఈ నేపధ్యంలో అందరూ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో పాటు శ్రీనివాస్ రెడ్డి గెలుపు బాధ్యతను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అప్పగించారు.దీంతో శ్రీనివాస్‌రెడ్డి గెలుపు ఖాయమైనప్పటికీ దాదాపు 4 లక్షల పై చిలుకు మెజార్టీతో టిఆర్‌ఎస్ ఎంపిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలవాలన్న పట్టుదల, కసితో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి ఇప్పటికే ప్రణాళికలు గీశారు, శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు తర్వాత ప్రచారంలో టిఆర్‌ఎస్ దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి.

ఇక బిజెపి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి డికె అరుణకు కూడా రాజకీయ అనుభవం బాగానే ఉంది. గద్వాల జిల్లాతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోనూ అమె అనుచర వర్గం భలంగా ఉంది. మూడు సార్లు ఎమ్యెల్యేగా గెలిచిన అనుభవంతో పాటు, మంత్రిగా పని చేసిన రాజకీయ అనుభవం ఉంది.కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయి నేతల్లో ఒకరుగా ఆమెకు ముద్ర ఉంది. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను శాషించిన నేతగా డికె అరుణకు పేరుంది. ఈ నేపథ్యంలో బిజెపి నుంచి బరిలోకి దిగనున్న అరుణ బలమైన పోటీ ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును బిజెపి వైపు మల్లించేందకు ఇప్పటికే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వంశీచందర్‌రెడ్డికి ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అనుంగ శిష్యునిగా పేరుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బరి నుంచి పోటీ చేస్తే ఏ మేరకు రాణిస్తారన్న అనుమానాలు కల్గుతున్నాయి.

పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే లేక పోవడంతో పాటు ముఖ్య నేతలు కూడా ఎవరూ లేని పరిస్ధితి కాంగ్రెస్‌లో నెలకొంది. చెప్పుకోదగ్గ ముఖ్య నేతలు ఎవరూ లేక పోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఇప్పటికే టిఆర్‌ఎస్, బిజెపిలు కొల్లగొట్టాయి.ముస్లిం ఓటు బ్యాంకుపై ఆధారపడిని కాంగ్రెస్‌కు ఈ సారి ముస్లింల ఓట్లు పడతాయన్న నమ్మకాలు లేవు. వంశీచందర్‌రెడ్డికి ప్రచారానికి కూడా సీనియర్ నేతలు వచ్చే పరిస్ధితులు కనిపించడం లేదు. సీనియర్ నేత జైపాల్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తారా రారా అన్నది అనుమానంగా ఉంది. మొత్తానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగనుంది.

Mahabubnagar Parliamentary Elections 2019

Related Stories: