రాష్ట్రమంతటా మార్మోగిన శివనామస్మరణ

Maha Shivratri

 

నీలకంఠుడికి నీరాజనం

శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు

తెలుగు రాష్ట్రాల్లో సంతరించుకున్న మహాశివరాత్రి శోభ
ఉపవాస దీక్షలు, జాగారాలతో స్వామికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
దర్శనాని అర్థరాత్రి నుంచే బారులుతీరిన భక్తులు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారు మోగాయి. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు, శివాలయాలకు చేరుకొని మహా శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయించారు. ఉపవాస దీక్షలు, జాగారాలతో స్వామికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడల్లో భక్తులు అర్థరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీశైలంలోని స్వయంభుగా వెలసిన మల్లికార్జునస్వామి -భ్రమరాంబదేవీల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణ చేస్తూ కోరికలు తీర్చాలంటూ ఆ భోళా శంకరుడిని భక్తిప్రవత్తులతో కొలిచారు. పలు ప్రధాన దేవాలయాల్లో పరమ శివుడి దర్శనం కోసం భక్తులు 4 గంటల నుంచి 6 గంటల పా టు క్యూలైన్లలో బారులు తీరారు. శుక్రవారం రోజున ఈ పండుగ రావడం, ముస్లింలకు శుక్రవారం పవిత్రమైన రోజు కావడంతో మతసామరస్యానికి ప్రతీకగా శివరాత్రి నిలిచిందని చెప్పవచ్చు.

రుద్రేశ్వరాలయానికి తరలివచ్చిన భక్తులు..
వరంగల్‌లోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వర్తించి వేడుకలను ప్రారంభించారు. వేయి స్తంభాలగుడి, సిద్ధేశ్వర ఆలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయం, కోటి లింగాలు, రామప్ప తదితర ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

నిర్విరామంగా రాష్ట్రాభివృద్ధి జరగాలి- ఎంపి సంతోష్‌కుమార్
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాభివృద్ధి నిర్విరామంగా జరగాలని కోరుకున్నట్లు వెల్లడించారు.

పట్టువస్త్రాల సమర్పించిన మంత్రులు..
దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. శివరాత్రి నేపథ్యంలో అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులకు మహాలఘు దర్శనం కల్పించారు. ఉదయం 7 గంటలకు టిటిడి తరఫున రాజరాజేశ్వరస్వామి వారికి అధికారులు పట్టువస్త్రాలు సమర్పించగా, 8 గంటలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పిం చారు. సాయంత్రం 4 గంటలకు శివదీక్ష పరులకు అధికారులు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. రాత్రి 11.30 గంటలకు గర్భగుడిలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అలంపూర్ క్షేత్రంలోనూ మహాశివరాత్రి ఉత్సవాలు జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా చేతుల మీదుగా వైభవంగా ప్రారంభ మయ్యాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో మహాశివరాత్రి మహోత్సవాలు శాస్రోక్తంగా, సంప్రదాయ పద్ధతిలో అర్చకులు నిర్వహించారు. ఉదయం 7:30 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరణం, అఖండ దీపస్థాపన, మహాకలశ స్థాపన, రుద్ర హోమం మొదలగు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

పురాతన శివాలయానికి భక్తుల తాకిడి..
భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ 400 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన శివాలయంలో భక్తులు శివుడికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు బూర్గంపాడు మండలం మోతె గ్రామంలో పవిత్ర గోదావరి నదిమధ్యలో కొలువైన వీరభద్ర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు చేశారు.

వనదుర్గా మాతకు మంత్రి పట్టు వస్త్రాలు
పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి ఏడుపాయల వనదుర్గా మాతకు మంత్రి హరీష్‌రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరి వెంట ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు ఉన్నారు. ఏడుపాయల మంజీరా నదిలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. బాసరలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఉప ఆలయం శ్రీ సురేశ్వరాలయం, శ్రీ వ్యాసేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాతసేవతో సంతతధార అభిషేకాలు మొదలయ్యాయి. శివలింగానికి ఆలయ అర్చకులు, వేదపండితులు బిల్వార్చనతో పూజలు చేశారు.

బాన్సువాడ మండలంలో స్పీకర్ పూజలు
బాన్సువాడ మండలం సోమేశ్వర్‌లోని సోమలింగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరాలయంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్‌లతో కలిసి శాసనమండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘కీసరగుట్ట తన నియోజకవర్గ పరిధిలో ఉండటం పూర్వ జన్మ సుకృతమని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు పాడిపంటలతో, సుఖ,శాంతులతో వర్థిల్లాలని ఆ రామలింగేశ్వరస్వామిని ప్రార్ధించానని మల్లారెడ్డి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రయ శుక్రవారం భైరవ దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు.

శ్రీశైలంలో స్వామివార్లకు ప్రభోత్సవం
శ్రీశైలంలోని స్వయంభుగా వెలిసిన మల్లికార్జునస్వామి -శ్రీభమరాంబదేవి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో శుక్రవారం సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, లిగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం జరిగింది. రాత్రి 12 గంటలకు శ్రీభమరాంబదేవీ- మల్లికార్జునస్వామి వార్ల బ్రహోత్సవ కల్యాణం నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు ఎపి ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు.

Maha Shivratri Celebrations in Telugu States

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాష్ట్రమంతటా మార్మోగిన శివనామస్మరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.