రియల్ ఢమాల్

 Real Estate Sector

 

వచ్చే ఏడాది వరకు స్తబ్దత, ఇళ్ల్లు కొనేవారు లేక వ్యాపారుల వ్యధ

హైదరాబాద్ : హెచ్‌ఎండిఏ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఆర్థిక మాంద్యంతో కుదేలవుతోంది. నాలుగు నెలలుగా ఇళ్లు, స్థలాల క్రయ, విక్రయాలు నిలిచిపోవడంతో రియల్ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. ఆగస్టు నుంచి డిసెంబర్ వర కు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర తగ్గినా ఈ స్థాయిలో తగ్గుదలకు ఆర్థిక మాంద్యమే కారణమని రియల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇన్వేస్టర్లు, అప్పులు ఇచ్చే వాళ్లు తగ్గిపోవడంతో పా టు ఒకే ఏడాదిలో భారీగా స్థలాల రేట్లు పెరిగిపోయా యని, సంవత్సరానికి ఒ కటి, రెండుసార్లు ధరలు పెరగాల్సి ఉం డగా, ఏకంగా నాలుగైదు రేట్లు పెరిగిపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయిన ట్టు రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సిఎంగా ప్ర మాణస్వీకారం చేసినప్పుడు రియల్ రంగం అందనంత ఎత్తుకు వెళ్లిపోయి ంది. అనంతరం ఒక్కసారిగా కుప్ప కూలిపోయిందని ప్రస్తుతం ఇప్పటి పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయని రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. భూములు, ప్లాట్ల ధరలు అనుకున్న దానికన్నా ఎక్కువగా పెరగడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రియల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. గతంలో జరిగిన ఒప్పందాల మేరకు రాష్ట్రంలో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగైదు నెలలుగా రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో తగ్గుదల కనిపిస్తోందని రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో గతేడాది ఏప్రిల్‌లో 2,200 లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,750కి పడిపోయింది. సెప్టెంబర్ విషయానికి వస్తే 2018లో 1,859 లావాదేవీలు జరగ్గా ఇప్పుడు 1,296కు పడిపోయింది. ఇక రంగారెడ్డి జిల్లాలో గతేడాది ఏప్రిల్‌లో 33,300 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 30,500 మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్‌లో అక్కడ రిజిస్ట్రేషన్ల సంఖ్య 26,200కు పడిపోయింది. అవి కూడా కొత్త కొనుగోళ్లకు సంబంధించినవి కావని, గతంలో జరిగిన ఒప్పందాల మేరకు జరిగిన రిజిస్ట్రేషన్లతో పాటు లీజ్ డాక్యుమెంట్లు ఎక్కువగా వస్తున్నాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా రియల్ కార్య కలాపాలు తగ్గిపోయాయన్న విషయం రిజిస్ట్రేషన్ గణాంకాలు చూస్తే అర్థమవుతుందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.

గతేడాది ఇదే సమయానికి 10 వేలకు పైగా అమ్మకాలు
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై ఇటీవల ఓ కన్సల్టెంట్స్ సంస్థ చేసిన అధ్యయనంలో హైదరాబాద్‌లో అమ్మకాలు తగ్గాయని వెల్లడించింది. మన రాజధానిలో ఏకంగా 32.-35 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని తేలింది. ఆ మూడు నెలల్లో (జూలై- సెప్టెంబర్) కేవలం 3వేల యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని, గతేడాది ఇదే సమయానికి 10 వేలకు పైగా అమ్మకాలు జరిగాయని ఈ సంస్థ పేర్కొంది.

హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయని, అందులో హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఎక్కువ ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురయ్యాయని వివరించింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ రెండు నగరాల్లో ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు పడిపోవడంపై రియల్ రంగం నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 9 శాతం అమ్మకాలు పడిపోగా, రెండో త్రైమాసికంలో సగటున 18 శాతానికి తగ్గింది.

గతంలో కొనుగోళ్లు, అమ్మకాలు పెద్ద స్థాయిలో..
ఔటర్ రింగ్‌రోడ్డు లోపల, బయటా, రీజనల్ రింగ్‌రోడ్డు ప్రతిపాదిత ప్రాంతాలు, ఖరీదైన నగర శివార్లుగా పేరొందిన మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి, కోకాపేట తదితర ప్రాంతాల్లో రియల్ కొనుగోళ్లు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీలు లగ్జరీ ఫ్లాట్లు అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ఆర్థిక మాంద్యం రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని, మూడో వంతు కొనుగోళ్లు తగ్గిపోయాయని ఓ అధ్యయనంలో తేల్చింది. వచ్చే ఏడాది వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ ఆర్)లో ఔటర్ రింగ్‌రోడ్డు అవతల ఉన్న గజ్వేల్, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపూర్, మర్రిగూడ, చింతపల్లి, మాల్, షాద్‌నగర్, చేవెళ్ల, కంది ప్రాంతాల్లో కొనుగోళ్లు, అమ్మకాలు పెద్ద స్థాయి లోనే జరిగాయి. కొందరు బడా కాంట్రాక్టర్లు ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌ను ఎంచుకోవడంతో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగాయి. కానీ ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ (ట్రిఫుల్ ఆర్) ప్రతిపాదన ఆగిపోవడంతో ఈ ప్రాంతాల పరిధిలో స్థలాల కొను గోలుకు, వెంచర్లు చేసేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు.

Losses with Recession in Real Estate Sector

The post రియల్ ఢమాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.