అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే…టిఆర్‌ఎస్ వార్ వన్‌సైడేనా

అభివృద్ధిలో టిఆర్‌ఎస్‌దే పైచేయి సంక్షేమ పథకాలే విజయానికి సూచికలు అడ్రస్ లేని నాగర్‌కర్నూల్ ఎంపి అభివృద్ధిలో ఎంపి జితేందర్‌రెడ్డిదే పైచేయి రెండు స్థానాల్లోనూ టిఆర్‌ఎస్ విజయం ఖాయమంటున్న విశ్లేషకులు భారీ మెజార్టీ దిశగా గెలవనున్న టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో కనిపించని జోష్ టికెట్ల వ్యవహారంలో వీడని ఉత్కంఠ మహబూబ్‌నగర్: జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలలో వార్ వన్‌సైడ్ లాగానే టిఆర్‌ఎస్ వైపే ప్రజలు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా టిఆర్‌ఎస్‌కు […]

అభివృద్ధిలో టిఆర్‌ఎస్‌దే పైచేయి
సంక్షేమ పథకాలే విజయానికి సూచికలు
అడ్రస్ లేని నాగర్‌కర్నూల్ ఎంపి
అభివృద్ధిలో ఎంపి జితేందర్‌రెడ్డిదే పైచేయి
రెండు స్థానాల్లోనూ టిఆర్‌ఎస్ విజయం ఖాయమంటున్న విశ్లేషకులు
భారీ మెజార్టీ దిశగా గెలవనున్న టిఆర్‌ఎస్
కాంగ్రెస్‌లో కనిపించని జోష్
టికెట్ల వ్యవహారంలో వీడని ఉత్కంఠ

మహబూబ్‌నగర్: జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలలో వార్ వన్‌సైడ్ లాగానే టిఆర్‌ఎస్ వైపే ప్రజలు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా టిఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన జితేందర్‌రెడ్డి లోక్‌సభలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాడారు. అంతే కాకుండా తెలంగాణ బాణిని లోక్‌సభలో గట్టిగానే ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలపై టిఆర్‌ఎస్ ఎంపిలతో కలిసి ప్రస్తావించేవారు. పనిలో పనిగా మహబూబ్‌నగర్ జిల్లాకు రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై కూడా అనేక మార్లు లోక్‌సభలో ప్రస్తావించారు. కేంద్ర మంత్రులను, అధికారులను కలిసి పనుల వేగవంతానికి కృషి చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో జితేందర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. గతంలో పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి రైతులు విక్రయించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. వారి బాధలను గుర్తించిన ఎంపి మహబూబ్‌నగర్‌లో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న డబుల్ లైన్ రైల్వే నిర్మాణ పనులు వేగవంతం చేశారు. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబుల్ ట్రాక్ రైల్వే లైన్ పనులు ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నాయి. డబుల్ లైన్‌తో పాటు ఎలక్ట్రికల్ స్థంభాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగం కానుంది.

వ్యాపారస్థులకు మధ్యతరగతి ప్రైవేట్ ఉద్యోగులకు, కూలీలకు డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే గంటన్నరలో హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది. అలాగే పాస్‌పోర్టు కేంద్రాన్ని కూడా జిల్లా కేంద్రంలో ఎంపి జితేందర్‌రెడ్డి ఏర్పాటు చేయించారు. జడ్చర్ల నుండి పాలమూరు యూనివర్సిటీ దాకా డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంలో ఎంపి కృషి చేశారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సన్నిహితంగానే ఉంటూ పలు అభివృద్ధి పనులలో పాలు పంచుకున్నారు.

ఆచూకి లేని కాంగ్రెస్ ఎంపి 

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటి చేసి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపి నంది ఎల్లయ్య గెలిచినప్పటి నుంచి అభివృద్ధి పనులకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు పార్లమెంట్ అభివృద్ధి విషయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కనీసం ప్రజా సమస్యలు కూడా పట్టించుకోలేదు. తమ సమస్యలను ఎంపికి చెప్పుకుందామంటే కూడా ఆయన జాడ కనిపించడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. కొంత మంది ఎంపి జాడ లేదని పోలీస్‌స్టేషన్లో సైతం ఫిర్యాదు ఇచ్చారు. పార్లమెంట్ పరిధిలో కేంద్రంతో కొట్లాడి ఎన్నో నిధులు తీసుకురావల్సిన ఎంపి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చూపలేకపోయారనే ఆరోపణలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. వయస్సు మీద పడడంతో ఆయన హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. దీంతో ప్రజలు అక్కడ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి మినహా అన్ని నియోజకవర్గాలలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించుకున్నారు. ఈ సారి కూడా టిఆర్‌ఎస్ ఎంపిలనే గెలిపించుకోవాలనే ఉత్సాహం వారిలో కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

వీడని ఉత్కంఠ 

ఇదిలా ఉండగా పార్లమెంట్ స్థానాలలో పోటి చేసే అభ్యర్థులపై రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం లేదు. అధికార పార్టీ టిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి జితేందర్‌రెడ్డికే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రకటన వెలువడకపోవడంతో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంపి జితేందర్‌రెడ్డికి లభించకపోతే ప్రముఖ ఔషధ కంపెనీ యజమాని నవాబ్‌పేట మండల గురుకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (ఎస్‌ఆర్)కు దక్కవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఎంపి సీటు తనకే దక్కుతుందని సిట్టింగ్ ఎంపి జితేందర్‌రెడ్డి భరోసాతో ఉన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉంటూ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటున్న తనకే టికెట్ లభిస్తుందనే ఆశతో ఉన్నారు. తనకు టికెట్ రాదని కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెబుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో సిఎం కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ క్లారిటీపై నేడు కాని 16న కాని ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎంపికపై ఢిల్లీలో మంతనాలు తీవ్రంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి డికె అరుణ ఎంపిగా పోటి చేయించాలని ఎఐసిసి భావిస్తున్నప్పటికీ ఆమె అందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. ఇక మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వయస్సు మీద పడడంతో పోటికి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ విషయంలో కూడా కాంగ్రెస్ నిర్ణయానికి రాలేకపోతోంది. టిఆర్‌ఎస్ నుండి రాములుకు క్లీన్‌చిట్ లభించినట్లే అని చెబుతున్నారు. ఇటు బిజెపి నుంచి మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు రాష్ట్ర కార్యదర్శి శాంతకుమార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇందుకు బిజెపి అధిష్టానం కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

Lok Sabha Elections 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: