కథకుల ఆవిష్కరణలో కెపి

  తెలుగు కథా సాహిత్యం, కథకుల ఆవిష్కరణలో గత నాలుగు దశాబ్దాలుగా తలమునకలై ఉన్నవారు కె.పి. అశోక్ కుమార్. వచ్చిన కథలను చదవడం, కథా ధోరణులను అవగాహన చేసుకోవడం, గతం వర్తమానంలో వచ్చిన కథల ద్వారా రావలసిన కథలను అంచనా వేయడం వంటి పనులతో, కథకులుగా అంతగా ప్రసిద్ధులు కాని కథకులను ఆవిష్కరిస్తూ కొనసాగుతున్న కథాసాహిత్యాధ్యయనశీలి కె.పి.అశోక్ కుమార్. కథావిష్కరం పేరుతో ఇటీవల 22 వ్యాసాలతో ఒక సాహిత్య విమర్శ రచన వెలువరించారు. ఇందులో ముందుమాటలు, సమీక్షలు […] The post కథకుల ఆవిష్కరణలో కెపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలుగు కథా సాహిత్యం, కథకుల ఆవిష్కరణలో గత నాలుగు దశాబ్దాలుగా తలమునకలై ఉన్నవారు కె.పి. అశోక్ కుమార్. వచ్చిన కథలను చదవడం, కథా ధోరణులను అవగాహన చేసుకోవడం, గతం వర్తమానంలో వచ్చిన కథల ద్వారా రావలసిన కథలను అంచనా వేయడం వంటి పనులతో, కథకులుగా అంతగా ప్రసిద్ధులు కాని కథకులను ఆవిష్కరిస్తూ కొనసాగుతున్న కథాసాహిత్యాధ్యయనశీలి కె.పి.అశోక్ కుమార్. కథావిష్కరం పేరుతో ఇటీవల 22 వ్యాసాలతో ఒక సాహిత్య విమర్శ రచన వెలువరించారు. ఇందులో ముందుమాటలు, సమీక్షలు ప్రత్యేకంగా ఆయా కథకులపై, ధోరణులపై వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి.
నిరంతర అధ్యయనం, నిశితమైన చూపు. నిర్మొహమాటంగా విషయాన్ని చెప్పే మనస్తత్త్వం, విభిన్న అంశాలను అధ్యయనం చేసే స్వభావం కె.పి. అశోక్ కుమార్ లో ఉన్నట్టు కథావిష్కరం లోని వ్యాసాలు నిరూపిస్తాయి. నాటకం, నవల, కథానిక వంటి వచన సాహిత్య ప్రక్రియల విశ్లేషకులుగా సమకాలీన సాహిత్య విమర్శ రంగంలో తన ముద్రను నిలుపుకున్న వ్యక్తి కె.పి. గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం వ్రాస్తున్నా తన వ్యాసాలను వెంట వెంటనే పుస్తకంగా ప్రచురించలేదు. నిరంతరం వ్రాసే వాళ్ళు తాము వ్రాసిన దాన్ని ప్రచురించడానికి వెంటనే ఉత్సాహం చూపరు. దీనికి కె.పి. కూడా అతీతం కాదు. చాలా కథా సాహిత్య విమర్శ, సమీక్షలు చేసిన కె.పి. వెలువరిస్తున్న రెండో వ్యాస సంపుటి ఇది.

కథావిష్కరంలోని తొలి వ్యాసం తెలంగాణ కథల్లో ప్రతిఫలించే సామాజిక, సాంస్కృతిక పరివర్తనలు. 1990 వరకున్న ఈ పరిస్థితులను తెలంగాణ కథ చిత్రించిన తీరును ఈ వ్యాసం చర్చించింది. సామాజిక పరిస్థితులను, వెట్టి చాకిరి, అధికారుల దోఫిడి, వ్యవసాయం, తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలు తెలంగాణ కథల్లో ప్రతిఫలించిన తీరును చెప్పారు. సాంస్కృతిక పరివర్తనలను కేవలం హిందూ ముస్లీం మత మార్పిడుల కోణంలోనే ఈ వ్యాసం చర్చించింది. ఇవ్వాళ్ల వృత్తిజీవన చిత్రణ, వృత్తి చైతన్యం, కుల సంస్కృతులను చెప్పే సాహిత్యంపై అధ్యయనం జరిగింది. అటువంటి అంశాలు తెలంగాణ కథలో ప్రస్తావితమైన తీరును ఈ వ్యాసం చెప్పి ఉండవలసింది. అయితే 2008 లో వ్రాసిన వ్యాసం కావడంవల్ల ఈదృష్టి తెలుగుసాహిత్య విమర్శలో ఇంకా బలంగా లేకసోవడం వల్ల దాన్ని ఈ వ్యాసం ప్రస్తావించలేదనిపిస్తుంది. ఈదృష్టితో మరో వ్యాసం కె.పి. వ్రాయవలసే ఉంది. సామాజిక పరివర్తనలను కథ ద్వారా తెలుసుకోవాలనే వారికి దారిదీపం ఈ వ్యాసం.

పోరంకి దక్షిణామూర్తి, అంబల్ల జనార్దన్, శశిశ్రీ, మంచికంటి, పాలకోడేటి, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, వేముల ప్రభాకర్, ఓదెల వెంకటేశ్వర్లు, ధేనువుకొండ శ్రీరామమూర్తి, సలీం, సి.వేణు, అంపశయ్య నవీన్ తో బాటు కథకులుగా ప్రసిద్ధి పొందని వల్లంపాటి వెంకటసుబ్బయ్య,కొనకళ్ల వెంకటరత్నం, యం.రామకోటి వంటి వారి కథలను వ్యాస సంపుటిలో ఆవిష్కరించారు.
సలీం ఒంటరి శరీరం కథ మన నేటివిటికీ మన ఆలోచనా విధానానికి ఒదగవు. (163)అని నిక్కచ్చిగా చెబుతారు. సలీం ఖులా కథ చదువుతుంటే నాకు హఠాత్తుగా అరుణతారలో వచ్చిన వడ్డెబోయిన శ్రీనివాస్ కథ ఆమె తలాక్ చెప్పింది ఙ్ఞాపకమొచ్చింది. సలీం కథ చదివిన తర్వాత వడ్డెబోయిన శ్రీనివాస్ కథలోని అసంబద్ధత, ముఖ్యంగా శీర్షికలోని అనౌచిత్యం కొట్టవచ్చినట్లు కనిపించింది. ఎందుకంటే మగవాళ్ళు ఇచ్చేది తలాక్‌అనీ, ఆడవాళ్ళు ఇచ్చేది ఖులా అంటారనీ చాలామంది ముస్లీమెతరులకు తెలియదు(166) అంటారు కె.పి. ఒక కథను చదివేటప్పుడు మరో కథను గుర్తు చేయడం, ఆరెండు కథల్లోనూ రచయిత ఎవరివైపు ఉన్నారో చెప్పడం చాలా వ్యాసాల్లో కనిపిస్తుంది. సలీం ఆకలి నవీన్ ఫ్రమ్ అనురాధ విత్ లవ్ కథలను పోల్చిచూడడం సలీం కథల విశ్లేషణ సందర్భంలో చూడవచ్చు. పోరంకి దక్షిణామూర్తి సారీసిస్టర్ ఇప్పుడు కాదు కథ చదువుతుంటే ప్రముఖ ఆంగ్ల రచన డాన్ క్పిక్సోట్ స్ఫురణకు వస్తుంది (22).

బీడీ కార్మిక వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధనాత్మకంగా బతుకుపోరు నవలను బి.యస్. రాములు రచించారు(54). అని అంబల్ల జనార్దన్ ఒర్ది కథ విశ్లేషణ సందర్భంలో గుర్తు చేసుకుంటారు. ఇటువంటి వాక్యాలు కథావిష్కరంలో చాలా చోట్ల తగులుతాయి. కె.పి. ప్రాపంచిక దృక్పథాన్ని పరిచయం చేస్తాయి. పాపినేని సగంతెరిచిన తలుపు కథకు కె. శివారెడ్డి ఆవలి వైపు కవిత విశ్లేషణగా చెప్పవచ్చు అన్నదీ ఇటువంటిదే. ఒక సాహిత్య ప్రక్రియ విశ్లేషణలో మరో సాహిత్య ప్రక్రియ, మరో సాహిత్యాంశం గుర్తుకు రావడం దానిని గురించి అక్కడ ప్రస్తావించడం చాలాచోట్ల కనిపిస్తుంది. కానీ సాహిత్యేతర విషయాలను, చట్టాలను, ఆ కథకు సంబంధించిన ఇతర సమాచారాన్ని కె.పి. అందివ్వడం చాలా వ్యాసాల్లో చూడవచ్చు. పాపినేని శివశంకర్ సముద్రం కథ ఇంటిని గ్రంథాలయంగా మార్చుకున్న వ్యక్తి జీవితాన్ని చిత్రిస్తుంది. సముద్రం కథ వివేచనలో కె.పి. తనను తాను ఆ కథలో చూసుకోవడం గమనించవచ్చు.

బి.యస్. రాములు కథల సంపుటి కాలం తెచ్చిన మార్పు సమీక్షలో కె.పి. చేసిన ప్రతిపాదనలు ఆలోచంచదగ్గవి. ఒక కథకుడు ఒకప్పుడు వ్రాసిన కథను తర్వాతి కాలంలో మార్చి వ్రాయడం చేస్తే అందుకు కారణాలు చెప్పాలంటారు కె.పి. ఒక Text ను మరొకరు దిద్దకూడదు, మార్చకూడదు అన్నది ఎంత ప్రామాణిక విమర్శ సూత్రమో అదే రచయిత తన కథను తాను మార్చకూడదనీ మార్చినా సరైన కారణాలు చూపాలనీ చెప్పడం వర్ధమాన కథారచయితలకు కె.పి. చేసిన సూచనగా అర్థం చేసుకోవాలి. కథావిష్కరంలోని చాలా వ్యాసాల్లో కథావస్తువు విశ్లేషణ ఎక్కువగా చేసినా ఒకటి రెండు వ్యాసాల్లో కథానిర్మాణం, శిల్ప సంబంధమైన అంశాలను కె.పి. ప్రస్తావించారు. ఏ ఇతివృత్తాన్ని ఎన్నుకున్నా దాన్ని సర్వ సమగ్రంగా తీర్చిదిద్దిన తీరు ఈ కథల్లో కనిపిస్తుంది. ప్రధానంగా ఒక ఇతివృత్తం కనిపించినా కథనానికి వచ్చేసరికి రెండు మూడు ఆనుషంగిక ఇతివృత్తాలు sub Plots కనిపిస్తాయి (84) అని పాపినేని కథల విశ్లేషణ సందర్భంలో అన్నారు. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి కథలన్నీ మల్టీలేయర్సుతో కూడుకుని ఉంటాయి. చైతన్య స్రవంతి కథ లో ప్రవాహ శైలిని సాధించ గలిగారు. అది రచయిత సెన్సార్డు ఙ్ఞాపకాలలోంచి రాలేదు కాబట్టి దాన్ని పాక్షిక చైతన్య స్రవంతిగానే పేర్కొనాలి (97). గతాన్ని వర్తమానాన్ని పోల్చుకుని చెప్పడానికి చైతన్య స్రవంతి ధోరణి చాలా అనుకూలమైనది(117).

వల్లంపాటి ప్రణయసేతువు కథ వసుచరిత్ర అనే రామరాజభూషణుడి ప్రబంధాన్ని గుర్తుకు తెస్తుంది. నదిని స్త్రీగా, సముద్రుడిని పురుషుడిగా ప్రతీకల ద్వారా చెప్పడం పద్య కావ్యానికి కుదురుతుందనడం (123) ద్వారా కథానిక వస్తువు ఉండవలసిన రీతిని ప్రస్తావించినట్లైంది. కథానిక నిర్మాణం, శిల్ప విషయాలను ప్రస్తావించే కె.పికి సినిమాకళ పట్ల కూడా ఆసక్తి ఉంది. అది ఒక ఇతివృత్తం ఓకథ ఓసినిమా వ్యాసంలో కనిపిస్తుంది. పలమనేరు బాలాజీ ఏనుగుల రాజ్యం కథ దిస్సనాయకే బిందు సినిమాలను తులనాత్మకంగా ఈ వ్యాసంలో చర్చించారు.

యం.రామకోటి కథను విశ్లేషిస్తూ ప్రతీకాత్మకంగా వ్రాయడంలో వారికి వారేసాటి. కావ్యాల్లో ద్వ్యర్థి కావ్యాలున్నట్లే కథల్లో గురి కథ అలాంటిదే. కథ పూర్తిగా తాటకసంహారమనే పురాణగాథ. ఇంకో వైపు చూస్తే ఇందిరాగాంధీ ఉత్థాన పతనాలను వివరిస్తుంది (32) అన్నారు. పద్యంలో రెండు అర్థాలున్నట్లు కథలో ఉండదు. కథ పైన సూచిస్తున్నదానికి భిన్నంగా అన్యాపదేశంగా వేరొక కథ స్ఫురించడాన్ని ద్వ్యర్థి కావ్యం అని చెప్పకుండా ఎలెగొరికల్ కథ అని అనవలసి ఉండింది. తెలుగులో సీక్వెల్ కథలు వ్యాసంలో సీక్వెల్ కథల పద్ధతిని గురించి చెప్పేది. సీక్వెల్ నవలలు తెలుగులో విస్తృతంగా ప్రచారంలో ఉన్నా సీక్వెల్ కథలు అంతగా ప్రచారంలో లేవు. అటువంటి కథలపై మంచి వ్యాసం ఇది. శ్రీశ్రీ, కొకు తాము వ్రాసిన కథలకు సీక్వెల్ కథలు వ్రాస్తే కారా యఙ్ఞం కథకు అట్టాడ అప్పలనాయుడు యజ్ఞం తర్వాత కథ సీక్వెల్. నామిని పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కథలు, మిట్టూరోడి కథలు సీక్వెల్ కథలని చెప్పిన కె.పి. సలీం వ్రాసిన కథలకు భీమరాజు వెంకటరమణ సీక్వెల్ కథలను వ్రాసారన్నారు.

మూల రచయిత అర్థాంతరంగా వదిలేసిన కథలు , విషాదాంతం చేసిన కథలు పూర్తిగా ముగించిన కథలు అని భీమరాజు వెంకటరమణ సీక్వెల్ కథలను విభజించారు కె.పి.ముగింపులను మార్చడం, విషాదాంతాన్ని సుఖాంతమో, ఆలోచనాత్మకమో చేయ డం, కథ ముగింపును సూచనగా వదిలితే దా న్ని పూర్తి చేయడం సీక్వెల్ అనిపించుకోదు. ఈ వ్యాసం మొదట్లో కె.పి చూపిన సీక్వెల్ కథల ఉదాహరణకి విశ్లేషించిన భీమరాజు వెంకటరమణ కథలకి పొంతన కుదరలేదు. అందువల్ల వీటిని సీక్వెల్ కథలు అనకూడదు. ఒక రచయిత వ్రాసిన చివరి భాగాన్ని మార్చి తే అది సీక్వెల్ కథకాదు. రచయిత ఉద్దేశాన్ని పెంచుకుంటూ వెళ్ళడం సీక్వెల్ అవుతుంది. మూల రచయిత ఉద్దేశం, దృక్పథం మారకూడదు అన్నది ఇక్కడ ప్రధానంగా గుర్తించ వలసిన విషయం.కథావిష్కరంలోని వ్యాసాలన్నీ కె.పి. అశోక్ కుమార్ కు కథలపై ఉన్న అభిమానాన్ని, అభినివేశాన్ని సూచిస్తాయి. కథలను అధ్యయనం చేయడంలో, విశ్లేషించడంలో ఏ సాహిత్య దృక్పథాన్ని ఆయన ఆశ్రయించలేదు. కేవలం పాఠ్యాన్నే ఆశ్రయించారు. కథ చుట్టూ ఉన్న, కథలో ఉన్న అంశాలను విశ్లేషించడంలో దృక్పథాల జోలికి వెళ్లని పాఠ్యాధారవిమర్శకుడు కె.పి. అశోక్ కుమార్. సమకాలీన తెలుగు కథ పోకడలను, విస్మృత కథకులను తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వాళ్లందరికీ కథావిష్కరం ఒక దీపధారి.

                                                                                                                                  – లక్ష్మణ చక్రవర్తి 
A Literary criticism Writing with 22 articles by KP Ashok

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కథకుల ఆవిష్కరణలో కెపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: