అంతా అంతర్జాలంలోనే….!

లేఅవుట్‌ల స్వరూపాలు అంతర్జాలంలో నిక్షిప్తం పట్టణ ప్రాంత ప్రజలకు ఇంటిస్థలాలు సురక్షితం మున్సిపాలిటీల పరంగా ప్రభుత్వానికి ఆదాయం ఇంటిస్థలాల చిత్రాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: మున్సిపాలిటీల పరిధిలోని లేఅవుట్‌ల వివరాలు అన్నీ అంతర్జాలంలో నిక్షిప్తం కానున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్‌లన్నింటినీ ప్రత్యేకంగా వెట్‌సైట్‌లో పొందుపర్చి ప్రజలు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ పరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంలో […]

లేఅవుట్‌ల స్వరూపాలు అంతర్జాలంలో నిక్షిప్తం
పట్టణ ప్రాంత ప్రజలకు ఇంటిస్థలాలు సురక్షితం
మున్సిపాలిటీల పరంగా ప్రభుత్వానికి ఆదాయం
ఇంటిస్థలాల చిత్రాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి
ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: మున్సిపాలిటీల పరిధిలోని లేఅవుట్‌ల వివరాలు అన్నీ అంతర్జాలంలో నిక్షిప్తం కానున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్‌లన్నింటినీ ప్రత్యేకంగా వెట్‌సైట్‌లో పొందుపర్చి ప్రజలు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ పరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంలో ప్రజలకు లేఅవుట్‌ల పూర్తి వివరాలు తెలియజేయడంతో పాటు వాటికి సంబందించి సురక్షిత విధానాన్ని స్పష్టం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రభుత్వానికి కొత్తగా అనుమతి తీసుకునే లేఅవుట్‌ల ద్వారా ఆదాయం సమకూరనుంది. లేఅవుట్ చిత్రాలన్నింటినీ గ్లోబల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్(జిఐఎస్) విధానంలో పొందుపర్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు పాత మున్సిపాలిటీలతో పాటు మరికొన్ని కొత్త మున్సిపాలిటీల్లో అనేకానేక పురాతన లేఅవుట్‌లు ఉన్నాయి. ఈ క్రమంలోనే నల్లగొండ, సూర్యాపేట, యాదాధ్రి భువనగిరి జిల్లాల్లో ఇటీవల కాలంలో ఏర్పడిన కొత్త మున్సిపాలిటీల పరిధిలోకి పలు సమీప గ్రామాలు విలీనం కావడంతో ఆయా గ్రామాలకు సంబందించిన భూములు పురపాలక సంఘం పరిధిలోకి వచ్చాయి. అయితే వీటి పరిధిలోని లేఅవుట్‌లు చేస్తే పురపాలిక సంఘం నుంచి మున్సిపల్ పరిపాలనా శాఖ నిబందనల మేరకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక లేఅవుట్‌కు పురపాలికం నుంచి అనుమతి తీసుకోవాలంటే తప్పనిసరిగా వారు విధించే నిబంధనలు పాటించాలి.

లేఅవుట్‌లో అంతర్గత రహదారుల కోసం 33ఫీట్ల స్థలం, పార్కులు, ఇతరేతర అవసరాల కోసం 10శాతం ఖాళీగా స్థలాన్ని వదిలాయాల్సి ఉంటుంది. అదే విదంగా మార్కెట్ విలువ మేరకు 14శాతం కంట్రిబ్యూషన్ ఫీజు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) రుసుం సైతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా లేఅవుట్‌లలో భవనాలు నిర్మించాలంటే వాటికి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉండగా, వీటన్నింటికీ రూ. లక్ష వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. దీంతో చాలా వరకు అధికారికంగా అనుమతులు తీసుకునేందుకు విముఖత చూపుతూ ప్రభుత్వ అనుమతి లేకుండానే లేఅవుట్‌లు సిద్దం చేసి ఇంటి స్థలాలను విక్రయిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఇదిలా ఉండగా అనుమతి లేని లేఅవుట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న సందర్బాలు కోకొల్లలు. లే అవుట్‌లు అనుమతి తీసుకుంటేనే ప్రజలకు అవసరమయ్యే కనీస మౌళిక అవసరాలకు సంబందించి తాగునీరు, విద్యుత్, డ్రైనేజి వంటి ప్రభుత్వపరంగా అందే సౌకర్యాలు అందుతాయి.

లేఅవుట్‌ల చిత్రాలు పొందుపర్చాలి….గ్లోబల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్(జిఐఎస్) విధానం ఇప్పటికే పట్టణాలతో పాటు వాటి పరిధిలోని ఆవాస ప్రాంతాలన్నింటిలో కూడా అమలులోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబందించిన లేఅవుట్‌ల చిత్రాలన్నింటినీ వెబ్‌సైట్‌లో పొందుపర్చగా, తాజాగా జిల్లాల్లోని మున్సిపాలిటీలన్నింటిల్లో వెలిసిన లేఅవుట్‌లన్నింటి చిత్రాలను పొందుపర్చనున్నారు. దీంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండి లేఅవుట్‌ల వివరాలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చు.

విచ్చలవిడిగా వెలుస్తున్న లేఅవుట్‌లకు అనుమతులు ఉన్నాయా, లేవా అన్నది సుస్పష్టంగా సమాచారం తెలుసుకునే వెసులుబాటు వెబ్‌సైట్ ద్వారా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబందించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందగానే ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ నూతన విధానం అమలుకానుందని అధికారులు చెబుతున్నారు.

 

Lay Outs Map in Internet in Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: