లక్కంపల్లి సెజ్ ప్రారంభమయ్యేదెప్పుడో?

Agro

 

మనతెలంగాణ/నందిపేట: నందిపేట మండల కేంద్రానికి సమీపంలోని లక్కంపల్లి శివారులో ఏర్పాటు కానున్న ప్రత్యేక ఆర్థిక మండలి( సెజ్) లో పరిశ్రమల ఏర్పాటుకు సంబందించి నిర్మాణ పనులు పూర్తి కావడంతో పాటు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది. కాంట్రాక్టర్లకు అప్పగించిన నిర్మాణ పనులను పూర్తిచేసి సంబందిత అధికారులకు పూర్తయిన విషయమై నివేదికను కూడా పంపించడం జరిగింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రావడమే ఆలస్యంగా ఉన్న ఈ పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంత రైతాంగానికే కాకుండా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాది అవకాశాలు దొరకనున్నాయి.

78 ఎకరాల్లో నిర్మాణ పనులు: గత ఎనిమిది సంవత్సరాల క్రితం లక్కంపల్లి శివారులోని 379 ఎకరాలను అప్పటి ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు పేరుతో రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకుంది. ఇందులో సాగు భూములకు ఎకరాకు లక్షా50వేలు, పడావు భూములకు ఎకరాకు 65 వేల రూపాయల పరిహారాన్ని అందజేసి భూములను స్వాధీనం చేసుకుంది. ఇందులో నుంచి గత ఐదేళ్ళ క్రితం మీట్ ఫాం ఏర్పాటు కొరకు 78 ఎకరాలు కేటాయించి గొర్రెలు, మేకల పెంపకం యూనిట్‌ను ప్రారంభించారు. కానీ ఇది ఏడాదికి మించి కొనసాగలేదు.

కాగా గత మూడేళ్ళ క్రితం స్మార్ట్ ఆగ్రో పుడ్ పార్క్ ఏర్పాటు కొరకు మరో 78 ఎకరాలను కేటాయించారు. వెంటనే కోటి రూపాయలతో ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేశారు. 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమల్లో అనుభవనాన్ని బట్టి ఒక్కో కంపెనికీ ఒక పనిని కేంద్రం టెండర్ల ప్రక్రియ ద్వారా అప్పజెప్పింది. ఇప్పటికే 2 వేర్ హౌజ్‌లు(ఫినిష్‌డి, రా మెటీరియల్), కోల్డ్‌స్టోరేజి (ఢీఫ్రీజర్) , ఎస్‌డిఎఫ్( స్టాండర్డ్ డిజైన్ ప్యాక్టరీ) చిన్నపాటి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్యాక్టరీల నిర్మాణం లతో పాటు ప్రధానంగా టిసియు యూనిట్ అనేది పసుపు నుంచి రసం వేరు చేయు యూనిట్ , స్పైసీ యూనిట్( కారం, దనియాలు) తదితరాలకు సంబందించినది అలాగే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్( ఇందులో ట్రైయినింగ్ సెంటర్‌తో పాటు క్యాంటీన్, విఐపిలకు విడిది చేసేందుకు గదులు ఏర్పాటు చేయబడ్డాయి.), అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలతో పాటు నీటి వసతులు, ఇటిపి ఎస్టీపి ప్లాంట్ల నిర్మాణం, క్యూసి ల్యాబ్ , రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. పరిశ్రమల చుట్టూ ప్రహారీ నిర్మాణంతో పాటు పచ్చని చెట్లు పెంచి సుందరంగా తీర్చిదిద్దారు.

agro

టిసి ప్లాంట్‌లో ట్రయల్స్ పార్రంభం: ప్రస్తుతానికి టిసి ప్లాంట్ (టర్మరిక్ కర్కుమిన్ ప్లాంట్) లో నెలరోజులుగా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. దీని సామర్థాన్ని పరీక్షించేందుకే నెలరోజులుగా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు అదికారులు తెలిపారు. 5 టన్నుల కర్కుమిన్ ( పసుపు నుండి రసం వేరుచేయడానికి) 72 గంటల పాటు మిషన్ పని చేస్తుందని ఎంత కావాల్సి వస్తే అంత పెంచుకోవచ్చని అదికారులు తెలిపారు. ఇందులో నుండి వేరుపడిన రసాన్ని ఆయుర్వేద మందుల్లో, ఇతర కాస్మోటిక్స్ తయారీలో వాడతారు. వీటితో పాటు టమాటా జ్యూస్ తయారీ, ఇతరత్రా పరిశ్రమల ఏర్పాటు కొరకు గోదాములు సిద్ధం చేశారు.

కవిత ఓటమితో: లక్కంపల్లి భూముల్లో సెజ్ ఏర్పాటు కొరకు మాజీ ఎంపి కవిత ఎంతో కృషి చేసారు. ఇద్దరు కేంద్ర మంత్రులను తీసుకువచ్చి శంకుస్థాపన చేయించిన ఘనత ఆమెకే దక్కింది. అలాగే ఈ ప్రాంతంలో పండించే పసుపు పంటను గురించి యోగా గురువు రాందేవ్‌బాబాకు వివరించి ఇక్కడ పసుపుకు సంబందించిన పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంతో ప్రయత్నించి వారిని ఒప్పించారు. కానీ ప్రస్తుతం ఎంపి కవిత ఓటమిపాలు కావడంతో సెజ్ ప్రారంభం ఆలస్యం కానుందనే సందేహం కలుగుతుంది. ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. నిర్మాణ పనులు పూర్తయ్యి రెండు నెలలకు పైనే అయింది ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదు. పరిశ్రమల ఏర్పాటు కేంద్రం పరిదిలోనిది. మళ్ళీ కేంద్రంలో మోడీ ప్రభుత్వమే అదికారంలోకి రావడం, మళ్ళీ హరిసిమ్రత్‌కౌర్‌కు అదే మంత్రిత్వ శాఖ రావడంతో ఆమెకు ఈ పరిశ్రమ పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. ఇది కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ పరిశ్రమల ప్రారంభాన్ని వేగిరం చేయడానికి కొత్తగా ఎన్నికైన జిల్లా ఎంపితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద కనబరిస్తే తొందరగానే సెజ్ ప్రారంభానికి నోచుకునే అవకాశాలు ఉన్నాయి.

నిరుద్యోగుల ఎదురుచూపు: ఈ ప్రాంత రైతులకు మేలు చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. అయితే పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చిన వారికే ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుందని అప్పట్లో నాయకులు తెలిపారు. భూములు కోల్పోతున్నా తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువైనా రైతులు భూములను ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రస్తుతం పరిశ్రమల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పరిశ్రమలు రావడమే ఆలస్యంగా ఉంది. దీంతో భూములు కోల్పోయిన రైతులు తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు భూములు కోల్పోయిన వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చి అర్హతబట్టి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి కాంట్రాక్టర్ల వద్ద ఇదే ప్రాంతానికి చెందిన సుమారు 150 మంది వరకు ప్రస్తుతం ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటయితే ఈ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధర లభించడం, నిరుద్యోగులకు ఉపాది అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. రైతుల, నిరుద్యోగుల ఆశలు తీరేందుకు ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందో అని స్థానికులు వాపోతున్నారు.

 
Lakampalli SEZ Inauguration in Nizamabad

 

Lakkampally AgroSez Inauguration in Nizamabad  

The post లక్కంపల్లి సెజ్ ప్రారంభమయ్యేదెప్పుడో? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.